Don't Miss!
- Sports
INDvsNZ : తొలి టీ20లో గిల్ ఆడతాడు.. పృథ్వీ షాకు ఛాన్స్ లేదు: హార్దిక్ పాండ్యా
- News
వందే భారత్ పట్టాలకు ఫెన్సింగ్: రైల్వే సంచలన నిర్ణయం: 620 కి.మీ. పొడవు..!!
- Finance
upi limit: UPI తో ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసా ? అంతకు మించి పంపాలంటే..
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Gargi Movie Review: సాయి పల్లవి నటించిన గార్గి సినిమా ఎలా ఉందంటే?
చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది సాయి పల్లవి.ఈమధ్య విరాటపర్వం అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఆమె ఇప్పుడు గార్గి అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళ భాషలో తెరకెక్కిన ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో కూడా ఏకకాలంలో విడుదల చేశారు. జూలై 15వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాకి ముందు రోజే ప్రీమియర్స్ కూడా కొన్ని ప్రాంతాల్లో వేశారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది అనే విషయాన్ని ఇప్పుడు రివ్యూలో చూద్దాం

గార్గి కథ ఏమిటంటే
గార్గి (సాయి పల్లవి) ఒక స్కూల్లో టీచర్ గా పని చేస్తూ ఉంటుంది సెక్యూరిటీ గార్డ్ గా పనిచేసే తండ్రి బ్రహ్మానందం(ఆర్ఎస్ శివాజీ) ఇంట్లో దోశ పిండి వేసి అమ్ముతూ ఉండే తల్లి, స్కూలుకు వెళ్లి చదువుకునే చిన్న చెల్లితో కలిసి జీవిస్తూ ఉంటుంది. తండ్రికి చేదోడువాదోడుగా ఉండేందుకు ఇంట్లోనే ట్యూషన్స్ కూడా చెబుతూ ఉంటుంది. అయితే తండ్రి బ్రహ్మానందం పనిచేస్తున్న అపార్ట్మెంట్లో ఒక తొమ్మిదేళ్ల బాలిక మీద గ్యాంగ్ రేప్ జరుగుతుంది. ఆ గ్యాంగ్ రేప్ కేసులో గార్గి తండ్రి బ్రహ్మానందాన్ని కూడా అరెస్ట్ చేస్తారు. అయితే తన తండ్రి అలాంటి తప్పు చేయడు అని నమ్మిన గార్గి తన తండ్రిని బయటికి తీసుకువచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంది. అదే సమయంలో తనకు బాగా కావాల్సిన ఒక లాయర్ దగ్గర జూనియర్గా పనిచేస్తున్న గిరీశం(ఖాళీ వెంకట్)తో కలిసి తన న్యాయపోరాటాన్ని కొనసాగిస్తుంది. ఇక ఈ క్రమంలో ఒక రేపిస్ట్ కుమార్తెగా ఆమె ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి? తన తండ్రిని గార్గి కాపాడుకోగలిగిందా? చివరికి ఈ కేసులో ఎవరు గెలిచారు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఫస్ట్ ఆఫ్
సినిమా ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే పెద్దగా ఆలస్యం చేయకుండా కథలోకి తీసుకువెళ్లిపోయాడు దర్శకుడు. మొదటి భాగంలో ఎక్కువగా గార్గి అనే పాత్రను పరిచయం చేయడానికి ఆసక్తి చూపించారు. అయితే ఆమె తల్లిదండ్రులు వారి బ్యాగ్రౌండ్ ఏమిటంటే అనే విషయాన్ని మాత్రం పెద్దగా టచ్ చేయలేదు. నేరుగా కథలోకి తీసుకెళ్లిన దర్శకుడు ముందు నుంచి కూడా కథ మీద ఆసక్తి రేకెత్తించే విధంగా ప్లాన్ చేసుకున్నాడు. రేప్ కేసులో అరెస్ట్ అయిన గార్గి తండ్రి బ్రహ్మానందం బెయిల్ పై విడుదల అవుతాడు అనే నమ్మకం కలిగించడంతో ఫస్ట్ ఆఫ్ ముగుస్తుంది.

సెకండ్ హాఫ్
సెకండ్ హాఫ్ విషయానికి వస్తే తన తండ్రిని ఎలా అయినా కాపాడుకోవాలని గార్గి పడిన తపన సెకండ్ హాఫ్ లో చూపించారు. దాని కోసం అత్యాచారం జరిగిన అమ్మాయి దగ్గరికి వెళ్లి మాట్లాడడం ఆ తర్వాత ఆమెకు అనుకోని నిజం తెలియడంతో సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఎవరు ఊహించని విధంగా సాగుతుంది. ప్రేక్షకులు రేప్ చేసిన ఐదో వ్యక్తి ఎవరు అనే విషయం మీద అనేక అంచనాలతో ఉంటారు. కానీ సెకండ్ హాఫ్ చివరిలో ఎవరు ఊహించని విధంగా ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు. బహుశా ఇది ఎవరూ కూడా ఊహించి ఉండకపోవచ్చు కానీ సినిమా ఆద్యంతం ఆకట్టుకోవడానికి ఆ ట్విస్ట్ కారణమైందని కూడా చెప్పొచ్చు.

నటీనటులు
నటీనటులు విషయానికి వస్తే గార్గి అనే ఒక సాధారణ టీచర్ పాత్రలో సాయి పల్లవి జీవించింది. ఈ పాత్రలో సాయి పల్లవిని తప్ప మరో హీరోయిన్ ని ఊహించుకోలేము ఏమో అనే అంతలా ఆమె తన నటనా ప్రభావాన్ని చూపింది. మరీ ముఖ్యంగా జైల్లో తండ్రిని కలిసే సీన్స్ లో ఆమె కళ్ళతోనే నటించి ఆకట్టుకుంది. ఆమె తరువాత ఈ సినిమాలో ఎక్కువ కనిపించే క్యారెక్టర్లు శివాజీ, కాళీ వెంకట్. ఆర్ఎస్ శివాజీ పోషించిన పాత్ర చాలా కొంచెం చాలెంజింగ్ రోల్ అనే చెప్పాలి. అయినా ఆయన తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక నత్తి లాయర్ గా ఖాళీ వెంకట్ అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఈయన్ని గతంలో చాలా సినిమాల్లో చూస్తాం కానీ ఈ సినిమాలో తనదైన పాత్రలో నటించి మెప్పించాడు. సహ నిర్మాతగా వ్యవహరించిన ఐశ్వర్య లక్ష్మి ఒక మీడియా రిపోర్టర్ పాత్రలో కనిపించింది కనిపించింది కొన్ని సీన్లలోనే అయిన సినిమాని మలుపు తిప్పే క్యారెక్టర్ లో నటించింది. ఇక మిగిలిన వారంతా తెలుగు వారికి పెద్దగా పరిచయం లేని వారైనా తమ తమ పాత్రల పరిధి మీద నటించి ఆకట్టుకున్నారు.

టెక్నికల్ టీం విషయానికి వస్తే
టెక్నికల్ టీం విషయానికి వస్తే సినిమా ఆద్యంతం కూడా ఆసక్తికరంగా నడిపించడానికి దర్శకుడు పక్కాగా ప్లాన్ చేసుకున్నట్లు కనిపించింది. తాను స్వయంగా లాయర్ అని పలు ఇంటర్వ్యూలలో చెప్పిన దర్శకుడు బహుశా ఏదైనా రియలిస్టిక్ కథ నుంచి ఇన్స్ పైర్ అయ్యి ఈ కథ రాసుకున్నాడేమో అనిపిస్తుంది. మొత్తం మీద ఎవరు ఊహించని విధంగా సినిమాని ముగించి ఆకట్టుకున్నాడు దర్శకుడు అలాగే తెలుగు డైలాగ్స్ రాసిన వారు కొన్ని డైలాగ్స్ సూటిగా గుచ్చుకునేలా రాశారు. ట్రాన్స్ జెండర్ జడ్జ్ చెప్పే మాటలు ఒక్కసారి ఆలోచింపచేస్తాయి. అలాగే మీడియా మీద కూడా వేసిన కొన్ని సెటైర్లు ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. సినిమాలో పాటలు లేవు కానీ నేపథ్య సంగీతంతో ఆకట్టుకున్నాడు గోవింద్ వసంత. సినిమాని మరో లెవల్ కి తీసుకువెళ్లడానికి ఆయన నేపథ్య సంగీతం బాగా ప్లస్ అవుతుంది. ఇక ఎడిటింగ్ సహా కెమెరా వర్క్ వేటికీ వంకలు పెట్టే పనిలేదు. సినిమా ఎంతవరకు ఉంటే బాగుంటుంది అనే విషయాన్ని కొలతలతో సహా క్లారిటీగా కట్ చేసినట్లు అనిపిస్తుంది. ఇక సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్ గా
గార్గి ఫ్యామిలీతో కలిసి చూడగలిగిన సందేశాత్మక చిత్రం. తప్పు చేసింది మనవాళ్ళైనా వదిలిపెట్టకూడదనే సందేశాన్ని ఇచ్చి ప్రేక్షకులను ఆలోచింపజేస్తూ బయటకు పంపిస్తుంది.
నటులు:సాయి పల్లవి,కాళీ వెంకట్,ఆర్ఎస్ శివాజీ,ఐశ్వర్యా లక్ష్మీ
దర్శకుడు: గౌతమ్ రామచంద్రన్
సంగీతం: గోవింద్ వసంత
నిర్మాత: ఐశ్వర్యా లక్ష్మీ