Janaki Jaane Review: జీవితాన్ని తారుమారు చేసిన భార్య 'భయం'.. 'జానకి జానే' రివ్యూ
రేటింగ్: 2.5/5
టైటిల్: జానకి జానే
నటీనటులు: సైజు కురుప్, నవ్య నాయర్, జానీ ఆంటోనీ, కొట్టాయం నజీర్, జార్జ్ కోరా, అనార్కలి మరికర్, షరఫ్ ఉదీన్ తదితరులు
సినిమాటోగ్రఫీ: శ్యామ్ ప్రకాష్ ఎమ్ఎస్
ఎడిటర్: నౌఫల్ అబ్దుల్లా
సంగీతం: కైలాష్ మీనన్, సిబీ మాథ్యూ అలెక్స్
నిర్మాణం: ఎస్ క్యూబ్ ఫిలిమ్స్
దర్శకత్వం: అనీష్ ఉపాసన
ఓటీటీ విడుదల తేది: జూలై 11, 2023
ఓటీటీ వేదిక: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
ఇటీవలే ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ భార్యాభర్తల మధ్య 'గురక' వల్ల ఎలాంటి సమస్యలు వచ్చాయనే కథాంశంతో 'గుడ్ నైట్' సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు మళ్లీ కొంచెం అదే తరహాలో వచ్చిన చిత్రమే 'జానకి జానే' (Janaki Jaane Movie). 'గుడ్ నైట్' మూవీలో హీరోకు 'గురక' సమస్య ఉంటే.. 'జానకి జానే' సినిమాలో హీరోయిన్ కు 'భయం' అనే మానసిక ఆలోచన జీవితాన్ని ఎలా తారుమారు చేసిందో చూపించారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోన్న మలయాళ చిత్రం 'జానకి జానే' (Janaki Jaane Review Telugu) ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ: జానకి (నవ్య నాయర్) తండ్రి లేడు. అమ్మతో ఉంటూ ఓ ప్రెస్ లో పని చేస్తుంటుంది. కానీ, జానకికి విపరీతమైన భయం. ఎక్కడికివెళ్లినా ఒకరు తోడు ఉండాల్సిందే. ఒకసారి భయంతో స్పృహ తప్పి పడిపోతే రోడ్ కాంట్రాక్టర్ గా పనిచేస్తున్న ఉన్ని ముకుందన్ (సైజు కురుప్) కాపాడి ఇంటికి తీసుకెళ్తాడు. అప్పటి నుంచి జానకిని ప్రేమించిన ఉన్ని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు. హ్యాపీగా సాగుతున్న వీరి జీవితంలో ఎదురైన ఊహించని సంఘటన ఏంటీ? దాన్ని రాజకీయకంగా ప్రత్యర్థులు షాజీ (కొట్టాయం నజీర్), మార్టిన్ (జార్జ్ కోరా) ఎలా వాడుకున్నారు? ఉన్ని-జానకి పడిన ఇబ్బందులు, మానసిక సంఘర్షణ ఏంటీ? చివరికీ ఏం జరిగింది? తెలియాలంటే ఈ జానకి జానే చూడాల్సిందే.

విశ్లేషణ: భార్యకు ఉండే భయం అనే బలహీనత భార్యాభర్తల బంధంలో, ఒక కుటుంబంలో ఎలాంటి పరిస్థితులను తీసుకొచ్చిందనేదే ఈ సినిమా కథ. సాధారణంగా భయం అందరికీ ఉంటుంది. కానీ దాని తీవ్రత పెరిగితేనే ఇతరులకు అవకాశంగా మారి మనల్ని సమస్యల్లోకి నెడుతుందని చూపించారు. జానకికి భయం సమస్య, ఉన్ని ముకుందన్ మాటల తీరుతో కామెడీతో సినిమా సాగుతుంది. కానీ ఓ పెళ్లి ఫంక్షన్ లో జానకి భయం కారణంగా జరిగిన సంఘటనతో ఒక్కసారిగా సీరియస్ ట్రాక్ ఎక్కేస్తుంది.

ఆకట్టుకునే లొకేషన్స్: అక్కడి నుంచి మీడియా గోల, మార్టిన్ పై ఎలాగైన గెలవాలన్న షాజీ చేయించిన ప్రయత్నాలు ఇంటెన్స్ గా సాగుతాయి. చీకటి అనే భయం లేకుండా అన్ని సమస్యలు వచ్చేవి కాదు కదా అనిపించేలా చూపించారు. మీడియాకు, రాజకీయాలకు భయపడి దూరంగా వెళ్లిన భార్యాభర్తలకు ఎదురైన ఇద్దరు మనుషుల ద్వారా వచ్చిన మార్పు ఆకట్టుకుంటుంది. కొన్ని చోట్ల కాస్తా బోరింగ్ గా అనిపించినా.. అందమైన లొకేషన్స్ ఆకట్టుకుంటాయి.
క్లైమాక్స్ అలా..: జానకికి చీకటి అంటే ఏర్పడిన భయం, దాని నుంచి బయటపడే సీన్లు బాగానే చూపించారు. రాజకీయాలు, మీడియా తీరు, యూట్యూబర్స్ వీడియోలు ప్రస్తుత కాలానికి అద్దం పడతాయి. ఇక సినిమాలో సన్నివేశానికి తగినట్లు వచ్చే బీజీఎమ్ చాలా బాగుంది. లవ్, థ్రిల్లింగ్, భయపడే చోట హారర్ ఎఫెక్ట్ తో సౌండ్ ఇచ్చారు. క్లైమాక్స్ చాలా సాదాగా ఉన్నా యాప్ట్ అయింది. క్లైమాక్స్ ట్విస్ట్ పర్వాలేదు. ఊహించే అవకాశం కూడా ఉంది. సినిమాటోగ్రఫీ, డైరెక్టర్ స్టోరీ పాయింట్, నిర్మాణ విలువలు అంతా చక్కగా కుదిరాయి.

ఎవరెలా చేశారంటే?: సరదా మనిషిగా, భర్తగా సైజు కురుప్ నటన చాలా బాగుంది. సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసే సైజు కురుప్ కు ఈ సినిమా ప్లస్ అనే చెప్పవచ్చు. ఇక భయస్థురాలి పాత్రలో నవ్య నాయర్ ఆకట్టుకుంది. అనార్కలి మరికర్, షరఫ్ ఉదీన్ పాత్రలు అట్రాక్టివ్ గా ఉంటాయి. మిగతా అందరూ మంచి నటన చూపారు. ఫైనల్ గా చెప్పాలంటే.. భయం ఎలాంటి నష్టం కలిగిస్తుందో చూపించే 2 గంటల 'జానకి జానే' (Janaki Jaane Movie Review) సినిమాను టైమ్ పాస్ గా ట్రై చేయొచ్చు.


Click it and Unblock the Notifications











