Salaam Venky Review గుండెను పిండేసే కథ.. కాజోల్, అమీర్ ఖాన్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి ఎలా చేశారంటే?
నటీనటులు: కాజోల్, అమీర్ ఖాన్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, రేవతి, రాహుల్ బోస్, రాజీవ్ ఖండేల్‌వాల్, అనంత్ మహదేవన్, కమల్ సాద్నా తదితరులు
దర్శకత్వం: రేవతి
కథా, రచన: శ్రీకాంత్ మూర్తి (ది లాస్ట్ హుర్రే పుస్తకం ఆధారంగా)
డైలాగ్స్: కౌసర్ మునీర్
సినిమాటోగ్రఫి: రవివర్మన్
మ్యూజిక్: మిథున్
ఎడిటింగ్: మనన్ సాగర్
బ్యానర్: బీలైవ్ ప్రొడక్షన్, ఆర్ టేక్ స్టూడియోస్
రిలీజ్ డేట్: 2022-02-09
ఓటీటీ రిలీజ్: ZEE5

సలాం వెంకీ కథ ఏమిటంటే?
కొలవెన్ను సుజాత ( కాజోల్) కుమారుడు వెంకటేష్ కృష్ణన్ (విశాల్ జెత్వా) ప్రాణాంతక వ్యాధితో బాధపడుతుంటాడు. కుమారుడు ప్రాణాలకు కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేసే సుజాతను వదిలేసి కూతురును తీసుకొని భర్త (కమల్ సాద్నా) వెళ్లిపోతాడు. అయితే తాను ఎంతో కాలం బతకలేనని తెలిసిన వెంకీ కారుణ్య మరణాన్ని (Euthanasia) కోరుకొంటాడు. అయితే కారుణ్య మరణాన్ని కోరుకొంటున్న కొడుకు కోరికను తొలుత తల్లి సుజాత ఏ మాత్రం అంగీకరించదు కానీ.. చివరకు తన కుమారుడు చనిపోయేందుకు అనుమతి ఇవ్వమని కోర్టును ఆశ్రయిస్తుంది.

తొలి భాగం ఎలా ఉందంటే?
ఆంధ్రప్రదేశ్‌లో 2004లో కొలవెన్ను వెంకటేష్ అనే యువకుడి వాస్తవ జీవితం ఆధారంగా ది లాస్ట్ హుర్రే అనే పుస్తకం ఆధారంగా నటి, దర్శకురాలు రేవతి Salaam Venky అనే సినిమాను తెరకెక్కించింది. వెంకీ, సుజాత క్యారెక్టర్‌ను రాసుకొన్న విధానం, సమీర్ అరోరా అనుసరించిన స్క్రీన్ల్ ప్లే సినిమాను మరింత ఎమోషనల్‌గా మార్చిందని చెప్పవచ్చు. రెండు గంటలపైగా సినిమాలో తొలి గంటలో పాత్రల మధ్య సంఘర్షణ, భావోద్వేగాలు గుండెను మెలిపెట్టేలా ఉంటాయి.

సెకండ్ పార్ట్‌లో ఎమోషనల్ సీన్లతో
Salaam Venky సినిమా కథ రెండో గంట విషయానికి వస్తే.. కోర్టులో డ్రామా అద్బుతంగా పండింది. లాయర్లు పర్వేజ్‌గా రాహుల్ బోస్, మిస్ కుమార్‌గా ప్రియమణి పోటాపోటిగా నటించారు. ప్రాణాంతక వ్యాధితో బాధపడే యువకుడికి మరణించే హక్కు కల్పించండి అని రాహుల్ బోస్ కోర్టుతో మొరపెట్టుకొంటే.. ఒక వ్యక్తి చివరి శ్వాస వరకు జీవించాలి.. అలా జీవించకుండా చేస్తే అది హత్యే అవుతుందని ప్రియమణి వాదించే సన్నివేశాలు భావోద్వేగానికి గురిచేస్తాయి. డబ్బు కోసమే సుజాత తన కొడుకు ప్రాణాలు తీయొచ్చుగా అని లాయర్ ప్రియమణి వాదించే సన్నివేశాల సమయంలో కాజల్ నటన అద్బుతంగా ఉంది. న్యాయమూర్తిగా ప్రకాశ్ రాజ్ మరింత భావోద్వేగానిక కథకు జోడించారు. క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలు కంటతడి పెట్టించేలా ఉంటాయి.

కాజల్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్
నటీనటులు విషయానికి వస్తే.. ఇప్పటి వరకు గ్లామర్ తారగా మన మనసులో ముద్ర వేసుకొన్న కాజోల్ సుజాతగా అద్బుతమైన ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొంటుంది. చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న కొడుకు ప్రాణాలు నిలబెట్టుకొనేందుకు తాపత్రయ పడే తల్లిగా కాజోల్ తన నటనతో గుండెను పిండేస్తుంది. భర్త వేధింపులను తట్టుకొని భార్యగా ఆ పాత్రలో ఒదిగిపోయింది. స్వయంగా నా ప్రాణాలు తీసి మరో ఐదుగురికి జీవితాన్ని ఇచ్చేలా నాకు మరణాన్ని ప్రసాదించమనే కొడుకు కోరికను తట్టుకొలేని పాత్రను కాజోల్ తప్ప మరొకరు చేయలేరనే విధంగా నటించింది. ప్రతీ సన్నివేశంలోనే జీవించిందా? అనే విధంగా సుజాత్ పాత్రతో మెప్పిస్తుంది.

సలాం వెంకీలో ప్రకాశ్ రాజ్, ప్రియమణి
సలాం వెంకీ సినిమాలో మిగితా పాత్రల విషయానికి వస్తే.. ఎవరికి వారే పోటీ పడినట్టు నటించారు. వెంకీగా విశాల్ జేత్వా సినిమాకు వెన్నుముకగా మారాడు. కాజోల్‌తో పోటీపడి నటించే ప్రయత్నం చేశాడు. వెంకీ చెల్లెలుగా నటించిన బాలనటి, వెంకీ స్నేహితురాలు అంధురాలిగా నటించిన అమ్మాయి తమ పాత్రల్లో జీవించారు. కోర్టు సన్నివేశాల్లో ప్రకాశ్ రాజ్, రాహుల్ బోస్, ప్రియమణి తమ పాత్రలకు గౌరవం తెచ్చేలా నటించారు. కొడుకు వైద్యానికి ఖర్చు డెడ్ ఇన్వెస్ట్‌మెంట్ అనే తండ్రి పాత్రలో కమల్ సాద్నా, న్యాయమూర్తిగా ప్రకాశ్ రాజ్ విభిన్నమైన నటనను ప్రదర్శించారు.

టెక్నికల్‌గా ఎలా ఉందంటే?
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. మిథున్ అందించిన మ్యూజిక్ బాగుంది. అద్బుతంగా సన్నివేశాలను ఎలివేట్ చేయడమే కాకుండా తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో సీన్లను ఎమోషనల్‌గా మార్చాడు. ఇక రవి వర్మన్ ఆర్టిస్టుల మూడ్‌ను బాగా క్యాప్చర్ చేశాడు. లైటింగ్ వాడుకొన్న విధానం బాగుంది. మనన్ సాగర్ ఎడిటింగ్ బాగుంది. సూరజ్ సింగ్, శద్దా అగర్వాల్, వర్ష కుక్రేజా నిర్మాణ విలువలు బేషుగ్గా ఉన్నాయి.

Salaam Venky ఫైనల్‌గా ఎలా ఉందంటే?
సలాం వెంకీ చిత్రం Duchenne muscular dystrophy (DMD) అనే కండరాల వ్యాధితో బాధపడే యువకుడు తనకు కారుణ్య మరణం ప్రసాదించండి అంటూ.. మరో నలుగురికి అవయవదానం చేయాలనే కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. కథలో ఇంటెన్సిటీకి తగినట్టుగా నటీనటులందరూ పోటీపడి నటించడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. గుండెను పిండేసే కథ, కండ్లు తిప్పుకోకుండా చేసే కథనం, భావొద్వేగానికి గురిచేసే సన్నివేశాలు ఈ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లాయి. జీ5 ఓటీటీలో ప్రసారం అవుతుంది. ఈ సినిమా ప్రతి ఒక్కరి గుండెను తప్పక కదలిస్తుందనే ఫీలింగ్ ఉన్న చిత్రమని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











