Salaar Movie Review ప్రభాస్ నట విశ్వరూపం.. గూస్‌బంప్ యాక్షన్ సీన్లు.. సలార్ సమీక్ష
Rating: 3.5/5
నటీనటులు: ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్, జగపతిబాబు, సప్తగిరి, బాబీ సింహా, ఈశ్వరీ రావు, శ్రీయారెడ్డి, జాన్ విజయ్, ఝాన్సీ, పృథ్వీరాజ్, టిను ఆనంద్ తదితరులు
రచన, దర్శకత్వం: ప్రశాంత్ నీల్
నిర్మాత: విజయ్ కిరంగదూర్
సినిమాటోగ్రఫి: భువన్ గౌడ
ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి
మ్యూజిక్: రవి బస్రూర్
బ్యానర్: హోంబలే ఫిలింస్
రిలీజ్ డేట్: 2023-12-22
Recommended Video

దేవా అలియాస్ సలార్ (ప్రభాస్) అసోంలోని ఓ ప్రాంతంలోని బొగ్గు గనిలో పనిచేస్తుంటాడు. ఆ ప్రాంతానికి ఆధ్యను (శృతిహాసన్) కిడ్నాప్ చేసి తీసుకు రావడంతో గందరగోళం మొదలవుతుంది. అక్కడే టీచర్‌గా పనిచేస్తున్న ఆమెను కొందరు ఎత్తుకెళ్లడానికి ప్రయత్నిస్తే దేవా కాపాడుతాడు. ఆ తర్వాత తన స్నేహితుడైనా దేవాను 25 ఏళ్ల తర్వాత వెతుక్కొంటూ ఆ ప్రాంతానికి వరదరాజ మన్నార్ (పృథ్వీరాజ్ సుకుమారన్) వస్తాడు.

అసోంలో తన తల్లి (ఈశ్వరీరావు)తో కలిసి దేవా ఎందుకు ఉన్నాడు. ఆ ప్రాంతానికి ఆధ్యను ఎందుకు తీసుకొస్తారు? భారత సరిహద్దులోని ఖాన్సార్ ఆటవీ ప్రాంతం ఓ రాజ్యంగా ఎలా మారింది. ఆ ప్రాంతాన్ని శాసించే మన్నార్ వంశానికి ఎలాంటి సవాల్ ఎదురైంది. ఖాన్సార్ ప్రాంతంలో యుద్ధ విరమణ (CeaseFire) ఒప్పందాన్ని ఎత్తివేయడానికి ఎందుకు ఓటింగ్ పెట్టారు? ఓటింగ్ సమయంలో దేవాను వెతుక్కొంటూ వరదరాజ మన్నార్ ఎందుకు వచ్చాడు? వరదరాజ తండ్రి రాజమన్నార్ (జగపతిబాబు) తన ప్రాంతాన్ని వదిలి ఎందుకు వెళ్లాడు? యుద్ద విరమణ ఓటింగ్ సమయంలో దేవా కాలాంతకుడిగా ఎందుకు మారాడు? ఓటింగ్‌లో ఎవరు గెలిచారు? శౌర్యంగ పర్వానికి దేవాకు ఉన్న లింకు ఏమిటి? దేవాకు సలార్ అని పేరు ఎందుకు పెట్టారు అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.
దేవా, వరదరాజ మన్నార్ బాల్యంతో మంచి పవర్‌ఫుల్ ఎపిసోడ్‌తో సలార్ సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత అసోంలోని బొగ్గు గనుల్లో దేవా అండర్ డాగ్ క్యారెక్టర్‌ను ఎస్టాబ్లిష్ చేయడం, అలాగే ఆధ్య కిడ్నాప్ వ్యవహారం చకచకా జరిగిపోతాయి. ఫస్టాఫ్‌లో దేవా అండర్ డాగ్ క్యారెక్టర్ నుంచి ఓ నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేసిన విధానం ప్రశాంత్ నీల్ ప్రతిభకు అద్దం పట్టింది. ఇక ఫస్టాఫ్ చివర్లో దేవా లైఫ్ గురించి చెప్పడంతో అసలు కథ మొదలవుతుంది.

ఇక సెకండాఫ్‌లో ఖాన్సార్ ఆటవీ ప్రాంతం దేశంగా మారడం.. దానికి అధినేతగా మారిన రాజమన్నార్ కొంత మంది సామంత దొరలను నియమించడంతో కథ ఇంటెన్స్‌గా మారుతుంది. అయితే ఓ పని మీద రాజమన్నార్ దేశాన్ని వదలిపోవడంతో సామంతుల కుట్రలు మొదలవుతాయి. ఖాన్సార్ రాజపీఠం గురించి మొదలైన అంతర్గత కలహాల నేపథ్యంలో వరదరాజ మన్నార్‌తో కలిసి దేవా రావడంతో స్టోరీ పీక్స్‌కు వెళ్తుంది. సెకండాఫ్‌లో కాటేరమ్మ ఎపిసోడ్‌లో విష్ణును, ఆయన తండ్రితో ఉండే రెండు ఎపిసోడ్ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లాయి. సెకండాఫ్‌లో ప్రభాస్ నట విశ్వరూపం చూసే అవకాశం ఆయన అభిమానులకు దక్కిందనే చెప్పాలి.
ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్ విషయానికి వస్తే.. మరోసారి అద్బుతమైన స్క్రిప్టుతో రకకాల వేరియేషన్స్ ఉన్న పాత్రలతో తెరకెక్కించిన విధానం బాగుంది. ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలను మలిచిన విధానంతో మరోసారి అందర్నీ ఆకట్టుకొనేలా చేశాడు. ఆయన డిజైన్ చేసిన స్క్రీన్ ప్లే సినిమాను మరింత పవర్‌ఫుల్‌గా మార్చింది. కేజీఎఫ్‌ను మించిన పరిణతితో సలార్‌ను రూపొందించారని చెప్పవచ్చు.
దేవాగా ప్రభాస్ మరోసారి ఛత్రపతి, బాహబలి పాత్రలను మించిన యాటిట్యూడ్‌ను, ఫైర్‌ను ప్రదర్శించాడు. ఫస్టాఫ్‌లో అండర్ డాగ్‌గా కనిపించినా ఆ పాత్ర.. సెకండాఫ్‌కు వచ్చే సరికి ఊహకు అందని విధంగా కనిపిస్తుంది. కాటేరమ్మ ఎపిసోడ్, విష్ణు తండ్రితో ఉండే రెండు ఎపిసోడ్‌లు మళ్లీ పాత ప్రభాస్‌ను గుర్తు చేస్తాయి. ఇక వరదరాజ మన్నార్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్ అదరగొట్టాడు. శృతిహాసన్ కథను డ్రైవ్ చేసే పాత్రలో కనిపించింది. ఈశ్వరీరావు, జగపతిబాబు, తదితరులు బలమైన పాత్రలతో గుర్తుండిపోతారు.

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. భువన్ గౌడ సినిమాటోగ్రఫి, రవి బస్రూర్ మ్యూజిక్ సినిమాను ఊహించని విధంగా ఎలివేట్ చేశాయి. ముఖ్యంగా రవి బస్రూర్ బీజీఎం సెకండాఫ్‌లో చింపేసిందనే చెప్పాలి. కేజీఎఫ్ మాదిరిగానే కలర్ టోన్‌తో సీన్లను మరింత ఎమోషనల్‌గా భువన్ గౌడ చూపించాడు. యాక్షన్ సీన్లను చిత్రీకరించిన తీరు సినిమాకు మరో హైలెట్. హోంబలే బ్యానర్ ప్రమాణాలకు తగినట్టుగా నిర్మాణ విలువలు ఉన్నాయి.
స్నేహం, రాజ్యంలో అంతర్గత రాజకీయాలు, అధికార దాహం లాంటి అంశాలతో తెరకెక్కిన మోస్ట్ పవర్‌ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ సలార్. సెకండాఫ్‌లో మితిమీరిన హింస, సీన్లలో రక్తపుటేరులు పారడం కొంత ఇబ్బందిగా ఉంటుంది. అలాగే ప్రభాస్ చెలరేగిపోయి చేసే రెండు యాక్షన్ సీన్లు సినిమాను బ్లాక్‌బాస్టర్‌గా మార్చాయి. క్లైమాక్స్ సాగదీసి.. సాగదీసి విసుగు తెప్పించేలా చేయడం ఓ మైనస్. కానీ కథలోను, సన్నివేశాల్లోను భావోద్వేగాలు అభిమానులకు పండుగ వాతావరణం కలిగిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సలార్ బాక్సాఫీస్ వద్ద ప్రకంనాలు సృష్టిస్తుండనడంలో ఎలాంటి డౌట్స్ లేవు. ఈ సినిమాను థియేటర్‌లోనే చూడాలి. ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్. సాధారణ ప్రేక్షకులకు పైసా వసూల్.


Click it and Unblock the Notifications











