twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యావరేజ్‌ 'సాంబ'

    By Staff
    |

    Samba
    చిత్రం: సాంబ
    నటీనటులు: ఎన్టీఆర్‌, భూమిక, జెనాలియా, ప్రకాష్‌రాజ్‌, తదితరులు
    కథ: జి.ఎస్‌.రావు
    సంగీతం: మణిశర్మ
    నిర్మాత: కొడాలి నాని
    స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి వి వినాయక్‌

    హీరో ఎన్టీఆర్‌కు 'సాంబ' తొమ్మిదో చిత్రం. 'సింహాద్రి' వంటి భారీ విజయం తర్వాత, వినాయక్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం అలరించడంలో విఫలమైంది. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో 'ఆది' వచ్చింది. కానీ 'సాంబ'లో వినాయక్‌ పూర్తిగా ఎన్టీఆర్‌పైనే ఆధారపడ్డాడు. అదే సినిమాకు పెద్ద దెబ్బ. 'కౌబోయ్‌' చిత్రాలు ఒక పద్దతిలో సాగినట్లే..'ఫ్యాక్షన్‌' చిత్రాలు కూడా ఒక 'మూస'లో ఒదిగిపోయినట్లు కన్పిస్తోంది.

    ఏదో ఒక హీరోకి పారిపోయి వేరే విధంగా బతకడం సడెన్‌గా మధ్యలో వేరే క్యారెక్టర్‌తో హీరో ఫ్లాష్‌బ్యాక్‌ చెప్పించడం, అప్పుడు హీరో తన మాతృభూమి రాయలసీమకు వచ్చిన తన 'లక్ష్యాన్ని' పూర్తి చేయడం.. ఇదీ ఫ్యాక్షన్‌ చిత్రాల వరుస. ఈ మూస నుంచి 'సాంబ' ఏ మాత్రం బయటపడలేదు.

    సినిమాను ఓ డాక్యుమెంటరీలా చూపించడం, మితిమీరిన హింసాత్మక దృశ్యాలు మామూలు ప్రేక్షకులకు జుగుప్సతో పాటు విపరీతమైన బోర్‌ను కొట్టించడం ఖాయం. ఎన్టీఆర్‌కున్న మాస్‌ ఇమేజ్‌ను దర్శకుడు వినాయక్‌ సోది కథతో హైలెట్‌ చేసేందుకు అష్టకష్టాలు పడ్డాడు. వినోదం అసలు లేదు.

    సినిమా టైటిల్‌ సీక్వెన్సింగ్‌లోనే (ఇది మాత్రం చాలా అద్భుతంగా చేశాడు) 'రాయలసీమలో ఫ్యాక్షన్‌కు నిరాక్ష్యరాస్యతే' కారణమని, అక్షరాస్యత పెరగాలని ఈ సినిమా ఉద్దేశమని చెపుతారు. కానీ ఉద్దేశం బాగున్నా, దాన్ని చెప్పే విధానం బాగుండాలి కదా! (హీరో విద్య కోసం అందర్నీ నరుకుతాడట, తను చదువును గంగలో కలిపి..కానీ రాయలసీమలో అందరూ చదువుకోవాలని మధ్యమధ్యలో డైలాగ్స్‌ వల్లిస్తాడు)

    సింహాద్రి సినిమాకు కథ అందించిన జి.ఎస్‌.రావు అందించిన ఈ సోది కథ ఏమిటంటే.. సాంబశివనాయుడు (ఎన్టీఆర్‌) కంచీపురంలో చీరలు అమ్ముకుంటుంటాడు. ఆగస్ట్‌ పదిహేనుకి తన లక్ష్యాన్ని నెరవేర్చాలని చెపుతూ మధ్యమధ్యలో స్థానిక విలన్‌లను (మన్సూర్‌ఖాన్‌)లను చితగ్గొడుతుంటాడు. చదువు కోసం ప్రాణాలిచ్చే సాంబ హీరోయిన్‌ (జెనాలియా )కు తన ఇంట్లో ఆశ్రయం ఇస్తాడు. ఆమెకు సాంబ అసలు కథ కొద్దిగా తెలుసు.

    సో..హీరో తిరిగి తన రాయలసీమకు వెళ్ళగానే, ఆమె హీరో ప్లాష్‌బ్యాక్‌ను తెలుసుకుంటుంది. ఆ ప్లాష్‌బ్యాక్‌ ఏమిటంటే, సాంబ తండ్రి (విజయకుమార్‌) రాయలసీమలో అందరికీ చదువుచెప్పించేందుకు తన పొలంలో ఉన్న గ్రానైట్‌ క్యారీని పేదలకు పంచేందుకు ప్రయత్నిస్తుంటాడు. దీనిపైన కన్ను వేసిన ఆయన అల్లుడు వర్గం (ప్రకాష్‌రాజు) వీరిని అడ్డుకుంటుంది. కుటుంబాన్ని మట్టుపెడుతుంది. సో..హీరో ప్రకాష్‌రాజు కుటుంబాన్ని మట్టుపెట్టి, రాయలసీయలో అందరికీ చదువుచెప్పించడమే మిగతా కథ.

    నరసింహనాయుడు, ఆది, సింహాద్రి, ఇంద్ర... ఈ సినిమాలన్నీ చూసిన వారు మళ్ళీ సాంబ చూడాల్సిన అవసరం లేదు. అన్నింటిలోని కొంత భాగం తీసుకొని వండిన ఈ సినిమాలో ప్రథమార్థంలో వేణుమాధవ్‌ మాటలు, ద్వితీయార్థంలో కృష్ణభగవాన్‌ డైలాగ్‌లలో తప్ప ఎక్కడా రిలీఫ్‌ ఉండదు, వినోదం కలగదు. దీనికి తోడు మణిశర్మ స్వరపర్చిన పేలవమైన సంగీతం.

    హీరో ఎన్టీఆర్‌ మాత్రం చాలా బాగా చేశాడు. నిజానికిది వన్‌ మ్యాన్‌ షో. లావుగా ఉన్నా, డాన్స్‌లు ఈజీగా చేయడంలోనూ, నటన ప్రదర్శించడంలోనూ చాలా పరిణితి కన్పించింది. కానీ లావు తగ్గితేనే మంచిది. భూమిక పాత్ర స్వల్పం, అనవసరం. జెనాలియా అందాల ప్రదర్శన కోసమే. వినాయక్‌ టేకింగ్‌ మీద దృష్టిపెట్టినట్లే కథ మీద కూడా పెడితే బాగుండేది. ఎన్టీఆర్‌ వీరాభిమానులకు నచ్చుతుందోమోగానీ, సామాన్యులకు కష్టమే.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X