Prem Kumar Review పెళ్లిపీటలపై నుంచి పెళ్లికూతురు లేచిపోతే.. వరుడి పరిస్థితి ఏంటి?.. ప్రేమ్ కుమార్ రివ్యూ
నటీనటులు: సంతోష్ శోభన్, కృష్ణ చైతన్య, రాశీ సింగ్, రుచిత సాధినేని, కృష్ణ తేజ, అశోక్ కుమార్ తదితరులు
దర్శకత్వం: అభిషేక్ మహర్షి
రచన: అభిషేక్ మహర్షి, అనిరుధ్ కృష్ణమూర్తి
నిర్మాత: శివ ప్రసాద్ పన్నీరు
ఎడిటర్: గ్యారీ బీ హెచ్
సినిమాటోగ్రాఫర్: రాంపీ నందిగం
మ్యూజిక్: అనంత్ శ్రీకర్ ఎస్
బ్యానర్: సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్
రిలీజ్ డేట్: 2023-08-18
పీటల మీద పెళ్లి ఎత్తిపోవడంలో పవన్ కుమార్ అలియాస్ పీకే (సంతోష్ శోభన్)కు ఓ రికార్డు ఉంటుంది. తాళి కట్టే ముందే ఏదో కారణంతో పవన్ కుమార్ పెళ్లి ఆగిపోతుంటుంది. పెళ్లి జరగడం లేదని జీవితంపై ఓ రకమైన విసుగు తెచ్చుకొన్న ప్రేమ్ కుమార్ తన స్నేహితుడు సుందర్ లింగం (కృష్ణ తేజ) ఏకంగా డిటెక్టివ్ ఏజెన్సీని పెడుతాడు. ప్రేమ, పెళ్లిళ్లను భగ్నం చేయడమే లక్ష్యంగా పెట్టుకొంటారు. ప్రేమ్ కుమార్ మిషన్‌కు నేత్ర (రాశీ సింగ్) అడ్డుపడుతుంది.

పవన్ కుమార్‌కు పెళ్లిళ్లు ఏ కారణంగా ఎత్తిపోయాయి. పవన్ కుమార్‌కు నేత్రకు ఉన్న సంబంధమేమిటి? పవన్ కుమార్ పెళ్లి ఆగిపోవడానికి రైజింగ్ స్టార్ రోషన్ (కృష్ణ చైతన్య) ఎలా కారణమయ్యారు. నేత్రను ప్రేమించిన రోషన్ ఎందుకు మనసు మార్చుకొన్నాడు? ఆ తర్వాత అంగన (రుచితా సాదినేని)ని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకొన్నాడు? ఇంతకు ప్రేమ్ కుమార్ పెళ్లి జరిగిందా? పెళ్లి గండం నుంచి ప్రేమ్ కుమార్ ఎలా గట్టెక్కాడు అనే ప్రశ్నలకు సమాధానమే ప్రేమ్ కుమార్ సినిమా కథ.
తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పటి వరకు ప్రేమించిన అమ్మాయిని వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయడం, తాళి కట్టే చివరి క్షణంలో ప్రేమికుడు వచ్చి పెళ్లికూతురుకు తాళి కట్టడం లాంటి కథలు బోలెడు చూశాం. కానీ పెళ్లి పీటల మీద పెళ్లి ఎత్తిపోయిన పెళ్లి కొడుకు పరిస్థితి ఏమిటనే విషయం ఎవరూ పట్టించుకోరు. అయితే ప్రేమ్ కుమార్ సినిమాలో ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని విధంగా దర్శకుడు అభిషేక్ మహర్షి.. పెళ్లి ఆగిపోయిన వరుడు పాయింట్ ఆఫ్ వ్యూలో కథను నడిపించే ప్రయత్నం చేయడం ఇంట్రెస్టింగ్ పాయింట్ అనిపిస్తుంది.

పెళ్లి ఎత్తిపోయిన పరిస్థితుల్లో పెళ్లి కొడుకు పరిస్థితి ఏమిటనే కోణంలో దర్శకుడు ప్రేమ్ కుమార్ ఎంచుకొన్న పాయింట్ బాగుంది. కానీ కథ, కథనాలపై పర్‌ఫెక్ట్‌గా చేసి ఉంటే ఇంకా బెటర్ రిజల్ట్ వచ్చి ఉండేది. రకరకాల క్యారెక్టర్లను ఇంకా బెటర్‌గా డిజైన్ చేసి ఉంటే బెస్ట్ ఎంటర్‌టైనర్ అయి ఉండేదనిపిస్తుంది. అయినా సంతోష్ శోభన్ ఈ సినిమాను నిలబెట్టేందుకు ఒంటరిపోరాటమే చేశాడనిపిస్తుంది. కథలో వేరియేషన్స్, కొన్ని ఎపిసోడ్స్ వేర్వేరుగా చూస్తే బాగున్నాయి. కానీ ఓవరాల్‌గా కథకు సరిగా లింక్ కాలేదా అనే ఫీలింగ్ కలుగుతుంది.
ప్రేమ్ కుమార్‌గా సంతోష్ శోభన్ మరోసారి తన పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు. కథలో సన్నివేశాలు బలంగా లేకపోవడం వల్ల శోభన్ కూడా ఏమి చేయలేకపోయాడనిపిస్తుంది. అయినా తన వంతు ప్రయత్నంతో ఆ లోపాలను కవర్ చేసేందుకు బాగానే కష్టపడ్డాడు. సాఫ్ట్ విలనిజంతో కనిపించే రైజింగ్ స్టార్ రోషన్ క్యారెక్టర్‌ను ఇంకా బెటర్‌గా డిజైన్ చేయాల్సిందనిపిస్తుంది.హీరో, హీరోయిన్లకు భారీగా సీన్లు ఉన్నా.. పెద్దగా ఎస్టాబ్లిష్ కాలేకపోయారనిపిస్తుంది. సుదర్శన్, కృష్ణ తేజ, అశోక్ కుమార్ కామెడీ ట్రాక్ కొంతలో కొంత ఉపశమనం కలిగిస్తుంది. సురభి ప్రభావతి, రాజ్ మాదిరాజు తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు.

ఇక సాంకేతిక నిపుణుల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ బెస్ట్ అవుట్ ఇచ్చారనిపిస్తుంది. సన్నివేశాల్లో బలం లేకపోవడం వల్ల మ్యూజిక్ అంతంతా మాత్రమే అనిపిస్తుంది. రోల్ రైడా పాటకు మంచి క్రేజ్ వచ్చినా పెద్దగా ఉపయోగం లేకపోయింది. గత చిత్రాల్లో గ్యారీ బీ హెచ్ ఎడిటింగ్ బాగుండేది. ఈ సినిమా విషయంలో సరిగా చేయలేదనే ఫీలింగ్ కలుగుతుంది. లెంగ్తీ డైలాగ్స్, సీన్లు కొన్ని సార్లు ఇబ్బంది పెట్టాయనిపిస్తుంది. శివ ప్రసాద్ పన్నీరు అనుసరించిన ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.
లవ్, ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామాతోపాటు డిఫరెంట్ పాయింట్‌తో సాగే మూవీ ప్రేమ్ కుమార్. అయితే కథ, కథనాలు, డైలాగ్స్, స్క్రీన్ ప్లే విషయంలో కంట్రోల్‌గా ఉండి ఉంటే డెఫినెట్‌గా మంచి ఎంటర్‌టైనర్ అయి ఉండేదనిపిస్తుంది. సంతోష్ శోభన్ యాక్టింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్. డిటెక్టివ్ ఎలిమెంట్స్‌తో ఫన్ జనరేట్ చేసే సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. పెళ్లి బ్యాక్ డ్రాప్‌తో సినిమాలను ఇష్ట పడేవారు ప్రేమ్ కుమార్ సినిమాను ట్రై చేయవచ్చు.


Click it and Unblock the Notifications











