twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sarpatta Movie Review.. గురి తప్పిన పా రంజిత్ పంజా.. ఆర్య నాకౌట్ పంచ్!

    |

    Rating:
    2.5/5
    Star Cast: ఆర్య, దుషారా విజయన్, పశుపతి, జాన్ కొక్కెన్, జాన్ విజయ్
    Director: పా రంజిత్

    సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కాలా, కబాలి లాంటి చిత్రాలను తీసిన పా రంజిత్ సరైన విజయాన్ని ఖాతాలో వేసుకోలేకపోయాడు. ఆ తర్వాత భారతీయ స్వాతంత్ర్య చరిత్రలో గిరిజన తెగ కోసం పోరాటం చేసిన యోధుడు బిర్సా ముండా కథను బాలీవుడ్‌లో తీయాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆ తర్వాత హీరో కార్తీని దృష్టిలో పెట్టుకొని సర్పట్టా పరంపర కథను రాసుకొన్నాడు. కానీ కార్తీతో వీలు కాకపోవడంతో ఆర్యతో ఈ చిత్రాన్ని రూపొందించాడు. సర్పట్టా పరంపర కథకు ఆర్య న్యాయం చేశాడా? పా రంజిత్ కమర్షియల్ సక్సెస్ అందుకొన్నాడా అనే విషయాలను తెలుసుకొందాం...

    సర్పట్టా పరంపరం కథ...

    సర్పట్టా పరంపరం కథ...

    బాక్సింగ్ అంటే ఇష్టపడే సమర అలియాస్ సామ్రాజ్యం (ఆర్య) తల్లి కోరిక మేరకు ఆ క్రీడకు దూరంగా ఉంటాడు. కానీ బాక్సింగ్‌లో గురువు రంగ (పశుపతి) అంటే చెప్పలేనంత ఇష్టం, గౌరవం. బాక్సింగ్ క్రీడకు మారుపేరైన సర్పట్టా పరంపర ఓ దశలో వరసగా ఓటమి పాలవుతుంది. తన గ్రామ పరంపర బ్రష్టుపడుతున్న సమయంలో తన గురువు ఓటమి, పరువు పోవడాన్ని చూసి తట్టుకోలేక తన తల్లి మాటను పక్కన పెట్టి.. చాంఫియన్‌ వేటపులి( జాన్ కొక్కెన్)తో పోటీకి దిగుతాడు.

    కథలో మలుపులు

    కథలో మలుపులు

    బాక్సింగ్ పోటీలకు సమరను తల్లి ఎందుకు దూరం చేసింది? ఏ పరిస్థితుల్లో తల్లి మాటను సమర జవదాటాడు? సర్పటా పరంపర కోసం బాక్సింగ్ బరిలోకి దూకిన సమరకు ఎలాంటి ప్రతికూల పరిస్థితులయ్యాయి? తన ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే గురువు రంగా కోసం ఎలాంటి సాహసాన్ని చేశాడు. ఛాంపియన్ వేటపులిని ఎదుర్కొనేందుకు సమర ఎలాంటి కసరత్తులు చేశాడు. భార్య నుంచి ఎలాంటి వ్యతిరేకతను సమర ఎదుర్కొన్నాడు? ఈ కథకు ఎమర్జెన్సీకి సంబంధం ఏమిటి? బాక్సింగ్ పోటీలోకి దిగిన సమర జైలుకు ఎందుకు వెళ్లాడు? జైలు జీవితం తర్వాత మళ్లీ సమర బాక్సింగ్ క్రీడలోకి దూకాడా? అనే ప్రశ్నలకు సమాధానం సర్పట్టా పరంపర సినిమా కథ.

    తొలిభాగం విశ్లేషణ

    తొలిభాగం విశ్లేషణ

    సర్పట్టా పరంపర కథ 70, 80వ దశకం నేపథ్యంగా సాగుతుంది. బాక్సింగ్ క్రీడ నేపథ్యంగా ఇందిరా గాంధీ హాయంలోని ఎమర్జెన్సీ సంఘటనలతో పా రంజిత్ అల్లుకొన్న కథ అత్యంత ఆసక్తికరంగా సాగుతుంది. తొలి భాగంలో బాక్సింగ్ గ్రామ ప్రతిష్ట కోసం ప్రాణాలుపణంగా పెట్టే యువకుడిగా సమర కథ సాగుతుంది. ఆ ప్రాంతంలో బాక్సింగ్‌లో అరివీర భయంకరుడు వేటపులితో పోటీకి సమర దిగడంతో కథ మరో మలుపు తిరుగుతుంది. సమర బాక్సింగ్ రింగులోకి దిగిన తర్వాత వేటపులిని మట్టికరిపించే సమయంలో అనూహ్యమైన పరిణామం జరగడంతో కథ మరో మార్గం పడుతుంది. ఊహించని పరిస్థితుల్లో సమర జైలుకు వెళ్లడంతో సమర బాక్సింగ్ జీవితానికి తెరపడిందనే విషయం ఖాయవుతుంది.

     రెండో భాగంలో సాగదీత

    రెండో భాగంలో సాగదీత

    ఇక సెకండాఫ్‌లో బాక్సింగ్ క్రీడ నుంచి తన అలవాటులో పొరపాటు మాదిరిగా కథకు రాజకీయ రంగును పూయడంతో కథ గాడితప్పినట్టు కనిపిస్తుంది. ఈ క్రమంలో సమర, తన భార్య మధ్య, తల్లితో చోటుచేసుకొనే సన్నివేశాలు భావోద్వేగంగా కనిపిస్తాయి. ఓ దశలో నా తల్లి ఆశపడ్డ కొడుకును కాలేకపోయాను. నా భార్య ఆశపడ్డ భర్తను కాలేదు. నా గురువు ఆశపడ్డ క్రీడాకారుడిని కాలేదు. ఇంతకు నేను ఎవరినీ అంటూ వేటపులితో బరిలోకి దిగడంతో మళ్లీ కథపై ఆశలు చిగురిస్తాయి. జైలు జీవితంతో శరీరంలో మార్పులు సంబంధించి బాక్సింగ్ క్రీడకు పనికిరాని వాడిగా మారిన సమర తన ప్రతికూలతలను ఎలా అధిగమించాడనే విషయాలను దర్శకుడు పా రంజిత్ తన శైలికి భిన్నంగా తెరకెక్కించాడు. కత్తి మీద సాము లాంటి కథను చాలా నెమ్మదిగా, సాగదీసినట్టు చెప్పిన పా రంజిత్ తన మార్కును చాటుకొన్నాడు. ప్రీ క్లైమాక్స్‌కు ముందు కథ నత్త నడకన నడవడం సహనానికి పరీక్ష పెట్టినట్టు అనిపిస్తుంది.

    దర్శకుడు పా రంజిత్

    దర్శకుడు పా రంజిత్

    సర్పట్టా పరంపర సినిమా విషయానికి వస్తే.. కాలా, కబాలి సినిమాలకు భిన్నంగా పా రంజిత్ కథ కథనాలు కనిపిస్తాయి. అయితే సామాజిక అంశాలను టచ్ చేస్తూ కథ చెప్పే విషయంలో డీటైల్ ఎక్కువ కావడంతో సాగదీసినట్టు అనిపిస్తుంది. తొలి భాగాన్ని ఫర్‌ఫెక్ట్‌గా కథ చెప్పిన పా రంజిత్ సెకండాఫ్‌లో తడబాటుకు గురైనట్టు కనిపిస్తాడు. పాయింట్‌ను సరిగానే ఎంచుకొన్నప్పటికీ.. కథను ప్రభావవంతంగా చెప్పడంలో విఫలమయ్యాడని చెప్పవచ్చు. కథలో ఎమోషనల్ అంశాలను జొప్పించి కథను సరిగా నడిపించడంలో ట్రాక్ మిస్ అయ్యాడనిపిస్తుంది. అయితే ఈ కథ కోసం బాగా రీసెర్చ్ చేశాడనే విషయం ఎండ్ టైటిల్‌లో స్పష్టం అవుతుంది.

    సమరగా ఆర్య

    సమరగా ఆర్య

    బాక్సింగ్ కోసం పరితపించే యువకుడిగా, తల్లి మాటను జవదాటని కొడుకుగా... భార్య ఎమోషన్స్‌కు దూరంగా ఉండే భర్త లాంటి పలు రకాల వేరియేషన్స్ సమర పాత్రలో కనిపిస్తాయి. ప్రతీ వేరియేషన్‌లో ఆర్య తన పాత్రలో జీవించాడని చెప్పవచ్చు. సమర పాత్ర కోసం సిక్స్ ప్యాక్ బాడీతో ఆర్య ఆకట్టుకొన్నాడు. తన పాత్రకు పూర్తిస్థాయి న్యాయం చేయడానికి బాగా శ్రమించారనే విషయం ప్రతీ సన్నివేశంలోను కనిపిస్తుంది. తన కెరీర్‌లో ది బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తుంది.

    పశుపతి, ఇతర నటీనటుల ఫెర్ఫార్మెన్స్

    పశుపతి, ఇతర నటీనటుల ఫెర్ఫార్మెన్స్

    సర్పట్టా పరంపర సినిమాలో అందర్నీ ఆకట్టుకొనే పాత్ర రంగా. ఈ పాత్రను నటుడు పశుపతి అద్భుతంగా పోషించాడని చెప్పవచ్చు. స్క్రీన్ మీద పది మంది ఉన్న ప్రేక్షకుడిని దృష్టిని తనపై నిలుపుకొనేంతగా పశుపతి తన పాత్రలో జీవించాడు. ఈ సినిమాకు పశుపతి స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు. ఇక ఆర్యకు భార్యగా నటించిన దుషారా విజయన్ అద్బుతమైన హవభావాలు ప్రదర్శించింది. సహజసిద్దమైన నటనతో ఆకట్టుకొన్నది. వేటపులిగా జాన్ కొక్కెన్ ఆకట్టుకొన్నాడు. బలమైన విలనిజాన్ని జాన్ కొక్కెన్ ప్రదర్శించాడు. డాడీ పాత్రలో జాన్ విజయ్ కామెడీని పండించాడు. మిగితా పాత్రధారులు తమ పాత్రల పరిధి మేరకు రాణించారు.

     టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్స్

    టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్స్

    సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే... సినిమాటోగ్రఫి స్పెషల్ ఎట్రాక్షన్. మురళీ జీ సన్నివేశాలను అద్బుతంగా తెరకెక్కించారు. సంతోష్ నారాయణ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కానీ పాటలు తెలుగు నేటివిటికి దూరంగా ఉండటంతో ఆకట్టుకోలేకపోయాయని చెప్పవచ్చు. ఈ సినిమాకు ప్రధానమైన లోపం ఎడిటింగ్. సెల్వా ఆర్కేకు ఇంకా చాలా పని ఉందనే విషయం సాగదీతతో అర్ధమవుతుంది. కథలో వేగం తగ్గడానికి, సినిమా ఎమోషనల్ గ్రాఫ్ పడిపోవడానికి సినిమా నిడివి ప్రధాన కారణంగా మారింది.

     ప్రొడక్షన్ వ్యాల్యూస్

    ప్రొడక్షన్ వ్యాల్యూస్


    కే9 బ్యానర్ నిర్మాణ విలువలు బాగా ఉన్నాయి. పిరియాడికల్ మూవీగా కావాల్సిన నేటివిటిని అందించడంలోను, చేసిన పరిశోధన, అందుకు తగిన క్యాస్టూమ్స్, వేషధారణ విషయంలో మంచి వర్క్ చేశారనిపిస్తుంది. కథ సాగదీత విషయంలో కాస్త జాగ్రత్తపడి ఉంటే డెఫినెట్‌గా నిర్మాత షణ్ముగం ధక్షన్‌రాజ్‌కు మంచి చిత్రంగా మిగిలి ఉండేది. నిర్మాణ విలువల విషయంలో ఈ యూనిట్ ఏ మాత్రం రాజీ పడలేదనే విషయం సినిమా క్వాలిటీ రుజువు చేసింది.

    తుది తీర్పు ఏంటంటే...

    తుది తీర్పు ఏంటంటే...

    సర్పట్టా పరంపర చిత్రం అనేక రకాల ఎమోషన్స్, సామాజిక కట్టుబాట్లకు అధిక స్కోప్ ఉన్న చిత్రమని చెప్పవచ్చు. కానీ దర్శకుడి ఆలోచనా తీరు సాధారణ ప్రేక్షకుడి అంచనాలకు దూరంగా ఉండటం ఈ సినిమాకు కొంత ప్రతికూలంగా కనిపిస్తుంది. ఈ చిత్రం విషయానికి వస్తే తొలి భాగంలో కథను పరుగులు పెట్టించడమే కాకుండా ఎమోషనల్‌గా మెప్పించాడు. కథలో ఇంటెన్సిటిని జొప్పించాడు. కానీ ఎప్పుడైతే సెకండాఫ్ మొదలైందో సినిమా కొంత సేపు ట్రాక్ తప్పినట్టు అనిపిస్తుంది.

    అయితే హీరో లక్ష్యం ఏమిటనే విషయం సినిమా ఆరంభమైన కొద్ది సేపటికే అర్దమవుతుంది. కానీ లక్ష్యాన్ని చేరడంలో దారి తప్పాడనిపిస్తుంది. కథ సాగదీత, కథనంలో వేగం లోపించడం ఈ సినిమాకు మైనస్ అయితే నటీనటుల ఫెర్ఫార్మెన్స్, సాంకేతిక, నిర్మాణ విలువలు ఈ సినిమాకు పాజిటివ్ అనిచెప్పవచ్చు. స్పోర్ట్స్ డ్రామాలను ఇష్టపడే వారికి సర్పట్టా పరంపరం నచ్చుతుంది. ఇటీవల వచ్చిన తుఫాన్ కంటే ఎక్కువగా.. ఆ మధ్య వచ్చిన సుల్తాన్ కంటే తక్కువ అనే ఫీలింగ్ కలుగుతుంది.

    నటీనటులు, సాంకేతి నిపుణులు

    నటీనటులు, సాంకేతి నిపుణులు

    ఆర్య, దుషారా విజయన్, పశుపతి, జాన్ కొక్కెన్, జాన్ విజయ్ తదితరులు
    కథ, రచన, దర్శకత్వం: పా రంజిత్
    నిర్మాత: షణ్ముగం ధక్షన్‌ రాజ్
    సినిమాటోగ్రఫి: మురళీ జీ
    ఎడిటింగ్: సెల్వా ఆర్కే
    మ్యూజిక్: సంతోష్ నారాయణ్
    ప్రొడక్షన్ కంపెనీలు: నీలమ్ ప్రొడక్షన్స్, కే9 స్టూడియోస్
    ఓటీటీ రిలీజ్: అమెజాన్ స్టూడియోస్
    ఓటీటీ రిలీజ్ డేట్: 2021-07-22
    నిడివి: 2 గంటల 53 నిమిషాలు

    English summary
    Pa Rajinth's latest movie is Sarpatta Parambarai. Araya, Dushara Vijayan, Pashupati in lead roles. This movie released on Amazon prime video on 2021, July 22nd. In this occassion, Telugu filmibeat brings exclusive review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X