ఎమోషనల్ 'జర్నీ'(రివ్యూ)
నటీనటులు:శర్వానంద్,జై ,అంజలి,అనన్య తదితరులు
సంగీతం: సత్య
ఫొటోగ్రఫీ: వేల్‌రాజ్
సమర్పణ: 3కె ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి.
నిర్మాత: సురేష్ కొండేటి
సహ నిర్మాత: సిహెచ్.ప్రద్యుమ్న
దర్శకత్వం: శరవణన్.ప్
తమిళ డబ్బింగ్ చిత్రాలను తెలుగులో నిషేధించాల్సిన అవసరం గ్యారెంటీగా ఉంది. ఎందుకంటే జర్నీ లాంటి సినిమాలకు తెలుగు జనం అలవాటు పడితే అస్సలు కమర్షియల్ ముసుగులో తీస్తున్న మూస తెలుగు సినిమా కనపడకుండా పోయే అవకాసం ఉంది. చిన్న బడ్జెట్ తో తీసిన ఈ సినిమా చక్కటి సందేశంతో పాటు,సగటు ప్రేక్షకుడు తనను తాను ఐడింటిఫై చేసుకునే పాత్రలతో నిండి ఎంటర్టైన్మెంట్ తో కూడిన ఓ మంచి చిత్రం చూసిన ఫీల్ కలగ చేస్తుంది.
ఒకే సమయంలో విజయవాడ నుంచి హైదరాబాద్ కు వచ్చే ఆర్టీసి బస్సు,హైదరాబాద్ నుంచి విజయవాడుకు వెళ్తున్న ప్రెవేట్ బస్సు లో ఉన్న ప్రయాణీకులు ఎమోషనల్ జర్నీనే ఈ చిత్రం కథ.చిత్రమైన పరిస్ధితిల్లో విజయవాడనుంచి హైదరాబాద్ వచ్చిన అమృత(అనన్య)తో పరిచయమై ప్రేమలో పడతాడు గౌతమ్(శర్వానంద్).ఆమెతో విడిపోయి విజయవాడ వెళ్లిపోయాక రియలైజైన గౌతమ్ ఆమెను వెతుక్కుంటూ బయిలు దేరుతాడు. అదే సమయంలో ఆమె కూడా ఎదురుగా వచ్చే బస్సులో గౌతమ్ ని వెతుక్కుంటూ హైదరాబాద్ వస్తూంటుంది. ఇక మరో జంట కృష్ణ(జై),మధుమతి(అంజలి) హైదరాబాద్ లో ప్రేమలో పడి విజయవాడ వెళ్ళే బస్సు ఎక్కి తమ పెద్దలను కలవటానకి బయిలుదేరతాడు. ఈ లోగా బస్సు ఏక్సిడెంట్ అవుతుంది. అప్పుడు ఈ ప్రేమ జంటలు ఏమయ్యాయి.వీరి ప్రేమకథ ఏమైంది అనేది మిగతా కథ.
టైటానిక్ చిత్రాన్ని గుర్తు చేసే ఈ చిత్రం నిజానికి ఇది రెండు ప్రేమ కథలను అడ్డం పెట్టుకుని చెప్పిన ఓ సందేశాత్మక కథ. బస్సులో ఎంతో మంది,ఎన్నో ఎమోషన్స్ తో ప్రయాణిస్తూంటారు. తమని నమ్మి ఎక్కినందుకు బస్సు యాజమాన్యం,డ్రైవర్ వారిని క్షేమంగా చేర్చే భాద్యత వారిదే. సెల్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం, తాగి వాహనాలు నడపడం,వంటి వాటి వల్ల ఎన్నో ప్రాణాలు,జీవితాలు రోడ్డు పాలవుతాయి. ఎన్నో కుటుంబాలు కన్నీటి సముద్రాలు అవుతాయి. ఈ విషయాన్ని చాలా నేర్పుగా ఎక్కడా మెసేజ్ చెప్తున్న ఫీల్ రాకుండా కథనం నపడగలిగాడు దర్శకుడు. అలాగే సినిమాకు హైలెట్ రెండు ప్రేమ కథల్లో తీసుకున్న పాత్రల క్యారెక్టరైజేషన్. నర్సు గా కాస్త డామినేషన్ గా కనిపించే అంజలి పాత్ర జనాలకి బాగా నచ్చుతోంది. ఆమె చెప్పే డైలాగులకు జనం టప్పుట్లు కొడుతున్నారు. బస్సులో కలిసిన ఓ అబ్బాయి,అమ్మాయి అప్పటికప్పుడు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగ ప్రేమలో పడి ఫోన్ నెంబర్లు ఇచ్చుకోవటం కూడా ప్రతీ ఒక్కరికీ జీవితంలో అనుభవమే.
అలా మనకి తెలిసిన పాత్రలతో,సంఘటనలతో సినిమాని నల్లేరుమీద నడకలా చాలా స్మూతుగా నడిపించటమే సినిమాకు ప్లస్ అయ్యింది. అయితే క్లైమాక్స్ లో మాత్రం కాస్త తమిళ వాసనతో ఎక్కవ ఎమోషనల్ గా లాగినట్లు అనిపిస్తుంది. ఇక డైలాగులు రాసిన పాటలు రచయిత సాహితి గారు తన కలానికి రెండో వైపు కూడా మంచి పదును ఉందని నిరూపించుకున్నారు. డబ్బింగ్ చాలా ఫెరఫెక్ట్ గా కుదిరింది. శర్వానంద్,జై,అంజలి ఇలా ఎవరికి వారే తమ పాత్రల్లో మంచి పరిణితి చెందిన నటననే ప్రదర్శించాడు. ఇక దర్శకుడు గతంలో తెలుగులో రామ్ తో గణేష్ వంటి ప్లాప్ చిత్రం తీసాడంటే నమ్మబుద్ది కాదు. అలాగే మిగతా డిపార్టమెంట్ లు కూడా సినిమా విజయానికి తమవంతు సాయిం చేసాయి.ఇక మురగదాస్ వంటి మెగా దర్శకుడు నిర్మించిన చిత్రం అంటే ఓ రకమైన క్రేజ్ ఉంటుంది. అదే నిజానికి ధియోటర్స్ లోకి లాక్కొచ్చే అంశం. దాన్ని దర్శకుడు నిలబెట్టి మనం పెట్టే డబ్బుకు న్యాయం చేసాడనిపిస్తుంది. అలాగే సినిమా అయ్యిపోయాక టప్పట్లు కొట్టించాడు అంటే అది దర్సకుడు ప్రతిభే.
అసభ్యత,హింస,ముఖ్యంగా బోర్ లేని ఈ చిత్రాన్ని ఫ్యామిలీలతో నిస్సహందేహంగా చూడవచ్చు. హృదయాన్ని తాకే ఈ చిత్రంలో హీరోయిజం,ఫైట్స్,ఐటం సాంగ్స్ వంటి రెగ్యులర్ మశాలాలు ఎక్సపెక్ట్ చేస్తే మాత్రం ఈ సినిమాకు వెళ్లకపోవటమే బెస్ట్.


Click it and Unblock the Notifications











