For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సీక్రెట్ సూపర్‌స్టార్ రివ్యూ: అమీర్ ఖాన్ మ్యాజిక్.. 5/5 రేటింగ్ ఇచ్చే సినిమా

By Rajababu
|

Rating:
4.5/5
Star Cast: జైరా వసీమ్, అమీర్ ఖాన్, మెహర్ విజ్, రాజ్ అర్జున్, తీర్థ్ శర్మ
Director: అద్వైత్ చేతన్

ప్రేక్షకులకు ముక్కు ముఖం తెలియని నటీనటులతో అద్భుతమైన సినిమాలు తీయడం బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్‌కు వెన్నతో పెట్టిన విద్య. అందుకు సాక్ష్యంగా తారే జమీన్ పర్, పీప్లీ లైవ్, దంగల్ చిత్రాలు నిలిచాయి. అదే కోవలో ఎలాంటి హడావిడి ప్రచార ఆర్భాటం లేకుండా అక్టోబర్ 19న విడుదలైన చిత్రం సీక్రెట్ సూపర్‌స్టార్.

భారతీయ సినిమా ప్రపంచంలో ఈ చిత్రాన్ని అత్యున్నత శిఖరంపైన నిలబెట్టడానికి సీక్రెట్ సూపర్‌స్టార్లుగా మారిన వారిలో అమీర్ ఖాన్‌నే కాకుండా వసీమ్ జైరా (దంగల్ ఫేం), ఆమె తల్లిదండ్రులుగా నటించిన మెహర్, రాజ్ అర్జున్, దర్శకుడు అద్వైత్ చందన్ ఉన్నారు. ఇండియన్ సినిమా కమర్షియల్, మసాలా ఫార్ములా అడ్డంకులను చీల్చుకుంటూ బయటకు వచ్చిన భావోద్వేగ చిత్రం సీక్రెట్ సూపర్‌స్టార్.

గ్రాఫిక్స్, ఫార్మూలాకు దూరంగా

గ్రాఫిక్స్, ఫార్మూలాకు దూరంగా

సీక్రెట్ సూపర్‌స్టార్‌ చిత్రంలో పాపులారిటీ ఉన్న నటీనటులు కనిపించరు. బాహుబలి చిత్రంలా గ్రాఫిక్స్ ఉండవు. స్పైడర్ సినిమా మాదిరిగా భారీ బడ్జెట్ చిత్రం కాదు. పాపులారిటీ ఉన్న విలన్ కనిపించడు. కేవలం కథ, కథనం, ఎమోషనల్ సన్నివేశాలు, పాత్రధారుల అద్భుతమైన నటన ఈ సినిమాకు స్టార్ స్టామినా. సినిమా చూస్తున్నంత సేపు కొన్ని పాత్రలను ప్రేమిస్తాం. మరో కొన్ని పాత్రలను ద్వేషిస్తాం. పాత్రలతోపాటు కన్నీరు పెట్టుకొంటాం. నవ్వుతాం. సినిమాలో లీనం అవుతాము. కథలో కుటుంబ సభ్యుడిగా భాగమైపోతాం. అంతటి గొప్ప సినిమాగా రూపొందిన సీక్రెట్ సూపర్‌స్టార్ కథ గురించి నాలుగు ముక్కలు మాట్లాడుకుందాం..

బరోడా ముస్లిం అమ్మాయి కథగా..

బరోడా ముస్లిం అమ్మాయి కథగా..

గుజరాత్‌లోని బరోడాలో ఎనిమిదో తరగతి చదువుకునే ముస్లిం అమ్మాయి ఇన్సియా (జైరా వసీం)కు జీవితంలో ఓ గొప్పగా సింగర్ కావాలనే కల ఉంటుంది. తన కల వెనుక మత పరమైన అడ్డంకులు ఉంటాయి. ఆ అమ్మాయి కలను గెలిపించడానికి తల్లి నజ్మా ( మెహర్)విశేష పోరాటం ఉంటుంది. ఓ నాలుగేళ్ల తమ్ముడి (కబీర్) ఆరాటం ఉంటుంది. అమ్మాయి కలను సాకారం చేసేందుకు ఓ పదిహేను ఏళ్ల ప్రేమికుడు (చింతన్) అహర్నిశలు ప్రయత్నిస్తుంటాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. మరో వైపు ఆ అమ్మాయి కలను చిధ్రం చేయడానికి విలన్ రూపంలో తండ్రి (రాజ్ అర్జున్) ప్రయత్నిస్తుంటాడు. మధ్య తరగతిలో ఉండే ఆర్థిక ఇబ్బందులు కనిపిస్తాయి. ఇలాంటి పాత్రల మధ్య జరిగే భావోద్వేగ సంఘర్షణకు వెండి తెర రూపమే సీక్రెట్ సూపర్‌స్టార్.

మధ్య తరగతికి సాక్ష్యంగా

మధ్య తరగతికి సాక్ష్యంగా

భర్త గృహ హింసకు గురయ్యే ఓ తల్లి (మెహర్) పాత్రతో సినిమా ప్రారంభమవుతుంది. స్కూల్ టూర్‌కు వెళ్లి వచ్చిన కూతురును స్టేషన్‌లో రిసీవ్ చేసుకోవడానికి వెళ్లిన తల్లి బలమైన దెబ్బ కారణంగా కన్ను కమిలిపోయి ఉండటం చూసి బాధపడటం మొదలవుతుంది. ఓ మధ్య తరగతి కుటుంబంలో ఉండే ఇబ్బందులు, వారి మనస్తత్వాలు కళ్లకు కట్టినట్టు కనిపిస్తాయి. భార్యభర్తల మధ్య తగాదాలు గుండెను పిండివేస్తాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య ఓ అమ్మాయిని కల వెంటాడుతుంటుంది. లక్ష్యాన్ని చేరుకోవడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది అలా సినిమా మొదటి భాగం పూర్తవుతుంది.

సీకెట్ర్ సూపర్‌స్టార్‌గా

సీకెట్ర్ సూపర్‌స్టార్‌గా

ఇక రెండో భాగంలో అమ్మాయి ఏ విధంగా తన డ్రీమ్‌ను నెరవేర్చుకున్నది. అందుకు మ్యూజిక్ డైరెక్టర్ శక్తి కుమార్ ఏ విధంగా తన సహకారం అందించాడు. కూతురు కలను సాకారం చేయడానికి తల్లి ఓ తీవ్రమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వస్తుంది. తన కలను గెలిపించడం వెనుక ఉన్న సీక్రెట్ సూపర్‌స్టార్ గురించి ఇన్సియా చెప్పే ఓ బలమైన సన్నివేశంతో కథ ముగిస్తుంది. అసలు ఈ చిత్రంలో సీక్రెట్ సూపర్‌స్టార్ ఎవరన్నది ప్రేక్షకుడి జడ్జిమెంట్‌కు వదిలేయాల్సిందే...

అద్వైత్ చేతన్ అమోఘం

అద్వైత్ చేతన్ అమోఘం

సీక్రెట్ సూపర్‌స్టార్ కథను రాసుకున్న విధానం, దానిని ఎగ్జిక్యూటివ్ చేసిన వైనం దర్శకుడు అద్వైత్ చేతన్ ప్రతిభకు అద్ధంపట్టింది. మధ్య తరగతి కుటుంబంలో కనిపించే పాత్రలను దర్శకుడు అల్లుకొన్న విధానం హ్యాట్సాఫ్ అనేలా ఉంటుంది. ఓ పక్క అమీర్ ఖాన్ నటుడిని అతిథి పాత్రకు పరిమితం చేసి అమ్మాయిని సీక్రెట్ సూపర్‌స్టార్‌ను చేయడం అద్వైత్ చేతన్ గట్స్‌కు జేజేలు పలుకాల్సిందే.

 ఫార్మూలా సినిమాలకు చెంపపెట్టు

ఫార్మూలా సినిమాలకు చెంపపెట్టు

కమర్షియల్, ఫార్మూలా సినిమాకు చెంపపెట్టుగా నిలిచే విధంగా బాలీవుడ్ తెరపైకి దూసుకొచ్చిన దర్శకుడిగా అద్వైత్ ఓ ఉదాహరణగా నిలుస్తాడు. కడుపులో పెరుగుతున్న పిండం అమ్మాయి అని తెలిసిన ఓ తండ్రి.. దానిని తీసివేయమని చెప్పే సంఘటనతో దర్శకుడి సామాజిక స్ఫృహ అర్థం అవుతుంది. సామాన్యంగా సమాజంలో కనిపించే ఎన్నో కోణాలు ఈ సినిమాలో కనిపిస్తాయి.

జైరా వసీమ్ మెరుపులు

జైరా వసీమ్ మెరుపులు

దంగల్‌ చిత్రంలో అద్భుతమైన నటనను ప్రదర్శించిన జైరా వసీమ్ మరోసారి వెండితెరపై మెరుపులు మెరిపించింది. ఓ వైపు తన కల, మరో వైపు కుటుంబ పరిస్థితుల మధ్య నలిగిన పదిహేను ఏళ్ల అమ్మాయి పాత్రలో వసీమ్ నటన అమోఘం. ఈ సినిమాకు సీక్రెట్ సూపర్‌స్టార్‌గా మారిన వారిలో ఆమెదే ప్రధాన భూమిక. ఈ చిత్రాన్ని తన నటనతో మరోస్థాయికి తీసుకెళ్లిందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

మెహర్ విజ్ నటన అదుర్స్

మెహర్ విజ్ నటన అదుర్స్

భర్త ఆగడాలను భరిస్తూ కూతురును ఉన్నత స్థానంలో చూడాలనే తల్లి పాత్రలో మెహెర్ విజ్ నటన అద్భుతం. పాత్రలో నటించారు అనే కన్నా జీవించారనే చెప్పవచ్చు. ప్రతీ ఇంటిలో కనిపించే తల్లి మాదిరిగా తెర మీద కనిపిస్తారు. మహిళా చైతన్యానికి ప్రతీకగా మలిచిన పాత్రలో చక్కగా ఒదిగిపోయారు.

తండ్రి పాత్రలో రాజ్ అర్జున్

తండ్రి పాత్రలో రాజ్ అర్జున్

ఇక దుష్టుడిగా తండ్రి పాత్రలో రాజ్ అర్జున్ కనిపించారు. ఎప్పుడూ పిల్లల మీద అసహనం, భార్యపై శారీరక దాడికి చేసే పాత్ర తెర మీద కనిపిస్తే ‘వీడు కనిపించకుండా ఉంటే బాగుండు' అనే ఫీలింగ్ కలుగుతుంది. ల్యాప్ టాప్ పగులకొట్టే సీన్, గిటార్‌ తీగలను తెంచే సన్నివేశంలో ‘ఛీ ఇలాంటి తండ్రి కూడా ఉంటాడా) అనే కోపం, ద్వేషం కలుగుతుంది. అలా సహజమైన నటనను చూపించిన రాజ్ అర్జున్‌ను అభినందించాల్సిందే.

క్లాస్‌మేట్‌గా చింతన్

క్లాస్‌మేట్‌గా చింతన్

పదిహేనేళ్ల వయసులో ఎనిమిదో క్లాసులో ఇన్సియాకు క్లాస్‌మేట్‌గా చింతన్ (తీర్థ్ శర్మ) నటించాడు. ఇన్సియా, చింతన్ మధ్య నడిచే స్వచ్ఛమైన ప్రేమకథ ఈ చిత్రానికి ప్రాణం. టీనేజ్ లవ్ అంటే శారీరక ఆకర్షణ అనే భావనకు అర్థం మార్చేలా కనిపిస్తుంది వీరి మధ్య ప్రేమ. తనకు ఇష్టమైన ఇన్సియా ఆనందం కోసం తపించే చింతన్ పాత్ర ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ. ఇలాంటి పాత్రలు సీక్రెట్ సూపర్‌స్టార్ చిత్రంలో మరెన్నో కనిపిస్తాయి. హృదయాన్ని తట్టిలేపుతాయి.

అమీర్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్

అమీర్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్

మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ నటన అద్భుతం అంటే రొటీన్ అవుతుంది. శక్తి కుమార్ అనే మ్యూజిక్ డైరెక్టర్ పాత్రలో మరోసారి వెండితెరపై తన విశ్వరూపం చూపించాడు. తొలుత ఇంత చెండాలమైన క్యారెక్టర్ వేశాడనే ముద్ర వేసినప్పటికీ.. ఆ తర్వాత క్రమక్రమంగా మన హృదయాలను గెలుచుకొంటాడు. ఈ చిత్రంలో అమీర్ ఖాన్‌ది పక్కా టపోరి క్యారెక్టర్. ఏక్ దమ్ కార్టూన్‌లా కనిపిస్తాడు. ఒక్కొసారి కమెడియన్ లేని లోటునూ తీరుస్తాడు. మరోసారి హీరో పాత్రకు నిలువెత్తు విగ్రహంలా నిలుస్తాడు. ఇక అమీర్ గురించి చాలానే చెప్పవచ్చు. అది సినిమా చూస్తే మీరే తెలుసుకొంటారు.

అమిత్ త్రివేది సంగీతం

అమిత్ త్రివేది సంగీతం

సీక్రెట్ సూపర్‌స్టార్ చిత్రానికి మరో స్పెషల్ అట్రాక్షన్ అమిత్ త్రివేది సంగీతం. భావోద్వేగ సన్నివేశాలకు రీరికార్డింగ్ ప్రాణం పోసింది. కౌసర్ మునీర్ అందించిన సాహిత్యం చాలా బాగున్నది. సినిమాట్రోగ్రఫీ, ఎడిటింగ్, క్యాస్టూమ్ ఇతర విభాగాల పనితీరు చక్కగా కుదిరాయి.

ఆణిముత్యంల్లాంటి సినిమా

ఆణిముత్యంల్లాంటి సినిమా

అమీర్ ఖాన్, కిరణ్‌రావు దంపతుల నిర్మాణ సారథ్యంలో వచ్చిన చిత్రాలు పీప్లి లైవ్, ధోబీ ఘాట్, ఢిల్లీ బెల్లీ, దంగల్ బాలీవుడ్‌లో ఆణిముత్యాలుగా నిలిచాయి. అదే కోవలో సీక్రెట్ సూపర్‌స్టార్ మరో అణిముత్యంగా నిలవడం ఖాయం. ప్రేక్షకులను మరో లోకానికి తీసుకెళ్లి కొత్త అనుభూతిని కలిగించే విధంగా సినిమాలను అందించడంలో తమకు తామే సాటి అని మరోసారి నిరూపించుకొన్నారు. ఈ చిత్ర నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి.

తుది తీర్పు

తుది తీర్పు

సీక్రెట్ సూపర్‌స్టార్ సినిమా ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురిచేసే చిత్రం. గుండెను పిండివేసే సన్నివేశాలు ఆద్యంతం కొత్త అనుభూతిని కలిగిస్తాయి. ఇటీవల కాలంలో వచ్చిన చిత్రాల్లో అత్యద్భుతంగా తెరకెక్కిన సినిమా ఇది.

తెర ముందు

తెర ముందు

నటీనటులు: జైరా వసీమ్, మెహర్ విజ్, రాజ్ అర్జున్, అమీర్ ఖాన్, తీర్థ్ శర్మ తదితరులు

కథ, దర్శకత్వం: అద్వైత్ చేతన్

నిర్మాత: అమీర్ ఖాన్, కిరణ్ రావు, బీ శ్రీనివాసరావు, ఆకాశ్ చావ్లా

సంగీతం: అమిత్ త్రివేది

సినిమాటోగ్రఫి: అనిల్ మెహతా

ప్రొడక్షన్: అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్

రిలీజ్: 19 అక్టోబర్ 2017

సినిమా నిడివి: 150 నిమిషాలు

English summary
Secret Superstar is an Indian musical drama film, written and directed by Advait Chandan and produced by Aamir Khan and Kiran Rao.The film features Zaira Wasim, Meher Vij and Aamir Khan in lead roles, and tells the story of a child who aspires to be a singer. This movie released on 19 October 2017.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more