Sharathulu Varthisthai Review మిడిల్ క్లాస్ బయోపిక్.. కామన్ మ్యాన్ కష్టాలు.. షరతులు వర్తిస్తాయి మూవీ రివ్యూ!
Rating: 2.75/5
నటీనటులు: చైతన్య రావు మందాడి, నంద కిషోర్, భూమిశెట్టి, పెద్దింటి అశోక్ కుమార్, మల్లేష్ బలాస్ట్, ఆర్జే అవినాష్ తదితరులు
దర్శకత్వం: కుమారస్వామి (అక్షర కుమార్)
రచన: పెద్దింటి అశోక్ కుమార్, కుమారస్వామి (అక్షర కుమార్)
నిర్మాత: నాగార్జున్ సామల
మ్యూజిక్: అరుణ్ చిలువేరు, ప్రిన్స్ హెన్నీ (బీజీఎం)
సినిమాటోగ్రఫి: శేఖర్ పోచంపల్లి, ప్రవీణ్ వనమాలి
ఎడిటింగ్: గజ్జల రక్షిత్‌శెట్టి కుమార్, వంశీ కృష్ణ
బ్యానర్: స్టార్ లైట్ స్టూడియోస్
రిలీజ్ డేట్: 2023-03-15
మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన చిరంజీవి (చైతన్యరావు) తండ్రి చిన్నతనంలోనే మరణించడంతో కుటుంబ బాధ్యతలన్నీ అతడిపైనే పడుతాయి. తమ్ముడు, చెల్లెలు, తల్లిని జాగ్రత్తగా చూసుకొంటూ నీటిపారుదల శాఖలో చిన్న ఉద్యోగం చేస్తుంటాడు. బాల్యం నుంచి ప్రేమించిన విజయశాంతిని పెళ్లి చేసుకొని హ్యాపీగా జీవితాన్ని లీడ్ చేస్తున్న వారికి ఊహించని విధంగా ఆర్థిక సమస్య వస్తుంది.

మధ్య తరగతి సాధక బాధలు తెలిసిన చిరంజీవికి ఎలాంటి సమస్యలను ఎదురయ్యాయి. పెళ్లికి ముందు చిరంజీవికి విజయశాంతి ఎలాంటి సహకారం అందించింది? పెళ్లి తర్వాత వారు దాంపత్య జీవితాన్ని ఎలా కొనసాగించారు? శంకరన్న (సంతోష్ యాదవ్) చేసిన ఆర్థిక మోసం ఏమిటి? చంద్ర ప్రతాప్ వల్ల శంకరన్న, చైతన్య రావు ఫ్యామిలీ, ఇతర గ్రామస్థులు ఎలాంటి కష్టాలను ఎలా ఫేస్ చేశారు? గ్రామస్థులకు ఎదురైన సమస్యలను చిరంజీవి ఎలా పరిష్కరించారు. చంద్రప్రతాప్‌కు చిరంజీవి ఎలాంటి గుణపాఠం నేర్పాడు అనే ప్రశ్నలకు సమాధానమే షరతులు వర్తిస్తాయి సినిమా కథ.
మధ్య తరగతి జీవితాల్లో ఉండే కష్టాలు సుఖాలు బేస్ పాయింట్‌గా తీసుకొని పాత్రలను పరిచయం చేసిన విధానం బాగుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, చిన్న క్యూట్ లవ్ స్టోరీతో కథను ముందుకు తీసుకెళ్లాడు. ఎలాంటి తొందరపాటు లేకుండా తన పాత్రల ద్వారా కథను చెప్పే ప్రయత్నం చేయడం కొత్తగా ఉంది. మనీ చైన్ స్కీమ్‌లో ఉండే మోసాలను చెప్పడం ద్వారా కథను మలుపు తిప్పిన తీరు బాగుంది. అలాగే ప్రీ క్లైమాక్స్ నుంచి రూరల్ పాలిటిక్స్ డీల్ చేసిన విధానం ఇంట్రెస్టింగ్ ఉంది. కాకపోతే చిన్న పాయింట్ పట్టుకొని చాలా సాగదీశారనే విషయం ఇబ్బందిగా ఉంటుంది.

తొలి చిత్ర దర్శకుడిగా కుమారస్వామి ఎంచుకొన్న పాయింట్ బాగుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ జీవితాలను తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో కళ్లకు కట్టినట్టు చూపించడంలో సక్సెస్ అయ్యాడు. తెలంగాణ యాస, భాష, కట్టుబొట్టు, ఆచారాలు, సంప్రదాయాలతో పాత్రలను రూపుదిద్దిన తీరు చూస్తే.. ఆ ప్రాంతానికి చెందిన జీవితాలు ప్రతిబింబించాయనే ఫీల్ కలుగుతుంది. కానీ కథను వేగంగా నడపడంలో బలమైన కాన్‌ప్లిక్ట్ ద్వారా చెప్పే విషయంలో తడబాటు కనిపిస్తుంది. కానీ పాత్రలను డిజైన్ చేసిన తీరు, వాతావరణాన్ని క్రియేట్ చేసిన విధానంలో నిజాయితీ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

నటీనటుల విషయానికి వస్తే.. కామన్ మ్యాన్ క్యారెక్టర్‌లో చైతన్య రావు మంచి ఫర్‌ఫెక్షన్ కనిపించాడు. పాత్రకు పరిధి మేరకు బాడీ లాంగ్వేజ్, గెటప్, యాటిట్యూడ్‌ను చక్కగా చూపించాడు. ప్రతీ సినిమాకు ఫెర్ఫార్మెన్స్ పరంగా బెటర్ అవుతూ కనిపించాడు. సినిమా భారాన్ని తన భుజాలపై మోసి సినిమాకు బలంగా నిలిచాడు. భూమి శెట్టి టిపికల్ రూరల్ అమ్మాయిగా ఆకట్టుకొన్నది. సహజమైన నటనతో మెప్పించింది. నందకిశోర్ డిగ్నిఫైడ్ క్యారెక్టర్‌లో, శంకరన్న నిజాయితీపరుడైనా పొలిటిషియన్, చంద్రప్రతాప్ పాత్రలో నటించిన యాక్టర్ నెగిటివ్ షేడ్స్‌తో ఆకట్టుకొన్నారు. మిగితా పాత్రల్లో నటించిన వారాంత తమ పాత్రల తగినట్టు నటించారు.
షరతులు వర్తిస్తాయి సినిమాకు మ్యూజిక్ ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫి ఆకర్షణగా కనిపించాయి. కరీంనగర్ పల్లె అందాలను సినిమాటోగ్రాఫర్ శేఖర్ పోచంపల్లి ఒడిసిపట్టుకొన్నాడు. తెలంగాణ నేటివిటి టచ్‌తో పాటలు అందించిన అరుణ్ చిలువేరు, బ్యాక్ గ్రౌండ్ స్కోరుతో ప్రిన్స్ హెన్రీ పలు సీన్లను ఫీల్‌గుడ్‌గా మార్చారు. నాగార్జున్ సామల అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

తెలంగాణ యాస, భాషతో పూర్తిస్థాయిలో రూపొందిన చిత్రం షరతులు వర్తిస్తాయి. మధ్య తరగతి జీవితాల బాధలు, ఆర్థిక సమస్యలు, చిన్న చిన్న కుటుంబ కలహాలను ఎమోషనల్‌గా చూపించిన చిత్రంగా చెప్పవచ్చు. ఈ సినిమాకు కమర్షియల్ వాల్యూస్ లేకపోవడం, కథ స్లోగా సాగడం కొంత మైనస్ అనిపిస్తాయి. కానీ పాత్రలు రూపకల్పన, నటీనటుల సహజ నటన సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. అసభ్యత, అశ్లీలతకు చోటులేని క్లీన్ అండ్ ఫెయిర్ మూవీ షరతులు వర్తిస్తాయి. అంచనాలు లేకుండా మంచి ఫీల్ ఉన్న సినిమా చూడాలనుకొనే వారికి సినిమా పర్‌ఫెక్ట్ ఛాయిస్.


Click it and Unblock the Notifications











