Shiva 4K Pre Release Review: శివ 4K మూవీ రీ రిలీజ్ రివ్యూ
తెలుగు సినిమా పరిశ్రమలో ప్రఖ్యాత సినీ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్, ఎస్ఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన చిత్రం శివ. ప్రస్తుత ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ డైరెక్టర్‌గా పరిచయం అవుతూ రూపొందించిన చిత్రంలో నాగార్జున అక్కినేని, అమల జంటగా నటించారు. ఈ చిత్రంలో రఘువరన్, జేడీ చక్రవర్తి, మురళీ మోహన్, తనికెళ్ల భరణి, కోటా శ్రీనివాసరావు, శుభలేఖ సుధాకర్, గొల్లపూడి మారుతిరావు, బ్రహ్మజీ, ఉత్తేజ్, రామ్ జగన్, నిర్మలమ్మ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు తనికెళ్ల భరణి మాటలు, ఎస్ గోపాల్ రెడ్డి సినిమాటోగ్రఫి, మ్యూజిక్ ఇళయరాజా అందించారు. రామ్ గోపాల్ వర్మ కథ, మాటలు అందించిన ఈ చిత్రం అక్టోబర్ 5వ తేదీ 1989 సంవత్సరంలో రిలీజైంది. అయితే దాదాపు 36 ఏళ్ల తర్వాత మళ్లీ లేటేస్ట్ టెక్నాలజీతో 4K, డాల్బీ అట్మాస్‌తో నవంబర్ 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన కథ, కథనాల గురించిన వివరాల్లోకి వెళితే..

సోదరుడు శరత్ (మురళీమోహన్) కుటుంబంతో హైదరాబాద్‌కు షిఫ్ట అయిన శివ (నాగార్జున అక్కినేని) స్థానికంగా వీఏఎస్ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో చేరుతాడు. నగరంలో మాఫియా సామ్య్రజ్యాన్ని నిర్మించుకొన్న భవానీ చౌదరీ (రఘువరన్) తన అనుచరుడు గణేష్ (విశ్వనాథ్) సహాయంతో సీనియర్ స్టూడెంట్ జే దుర్గారావు అలియాస్ జేడీ (జేడీ చక్రవర్తి) అండతో ఆ కాలేజీలో అరాచకాలు చేస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో కాలేజీ ఎన్నికలు రావడంతో జేడీని పోటీ లేకుండా ప్రసిడెంట్ చేయాలని ప్లాన్ వేస్తారు. కానీ జేడీకి వ్యతిరేకంగా నరేష్ (రామ్ జగన్)ను పోటీకి పెడుతారు. అయితే భవానీ మనుషులు బెదిరింపులకు పాల్పడి అతడిపై దాడి చేస్తారు. ఆ తర్వాత శివ ఫ్రెండ్స్ బృందంలోని ఒక్కొక్కరిని మట్టుబెట్టే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో భవానీని వ్యతిరేకించే కార్మిక నేత కృష్ణా రెడ్డి అండతో జేడీకి వ్యతిరేకంగా శివనే స్వయంగా పోటికి దిగుతాడు.
కాలేజీలో జేడీ అరాచకాలు ఏలా సాగాయి? కాలేజీ ఎన్నికల్లో చోటు చేసుకొన్న తీవ్రమైన పరిణామాలు ఏమిటి? ఆశా(అమల)తో శివ లవ్ ట్రాక్ ఎలా సాగింది? తన సోదరుడి ఇంటి నుంచి శివ బయటకు వెళ్లి స్నేహితుడి హాస్టల్‌లో ఎందుకు ఉన్నాడు? తన అన్న కూతురిని కిడ్నాప్ వ్యవహారం శివలో ఎలాంటి మార్పుకు దారి తీసింది? భవానీ ముఠాను శివ ఎలా ఎదురించాడు? భవానీ మాఫియా సామ్రాజ్యాన్ని శివ ఎలా కూలదోశాడు అనే ప్రశ్నలకు సమాధానమే శివ సినిమా కథ.
హాలీవుడ్ సినిమా గాడ్‌ఫాదర్ ప్రభావంతో ఎలాంటి దర్శకత్వ అనుభవం లేకుండా రాంగోపాల్ వర్మ చేసిన ప్రయత్నమే శివ. తన టాలెంట్‌తో సంప్రదాయంగా సినిమాలను నిర్మించే అన్నపూర్ణ బ్యానర్ అధినేతను ఒప్పించి తెలుగు సినిమా రంగంలో కొత్త ఒరవడి సృష్టించేందుకు రాసుకొన్న కథ, కథనాలు ప్రతీ ప్రేక్షకుడినే కాకుండా, ఆ తర్వాత ఇండస్ట్రీలొకి వచ్చిన నిర్మాత, దర్శకులు, నటీనటులకు స్పూర్తిగా నిలిచింది. శివ సినిమాకు ముందు.. శివ సినిమాకు తర్వాత అనే విధంగా ఈ మూవీ సంచలన విజయం సాధించింది. తెలుగు సినిమా నిర్మాతల అభిరుచిని మార్చిన చిత్రంగా ఘనతను సాధించుకొన్నది.
అప్పటి వరకు అంతంత మాత్రంగానే ఇమేజ్ ఉన్న నాగార్జునను మాస్ హీరోగా మార్చేసింది. శివ తర్వాత నాగ్ చేసిన సినిమాలు, ప్రయోగాలన్నింటికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అమల తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. సినిమా రంగానికి జేడీ, ఉత్తేజ్, రామ్ జగన్, బ్రహ్మాజీ లాంటి పరిచయం అయ్యారు. తనికెళ్ల భరణి స్టార్ రైటర్‌గా మారారు. అప్పటి వరకు సాదాసీదా క్యారెక్టర్లతో నెట్టుకొస్తున్న రఘువరన్.. పవర్‌ఫుల్ విలన్‌గానే కాకుండా విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకొన్నారు. కృష్ణవంశీ, పూరీ జగన్నాథ్, తేజ లాంటి యువ టాలెంట్ తెలుగు సినిమాకు దర్శకులుగా మారి టాప్ డైరెక్టర్లు అయ్యేలా చేసింది. శివ గురించి ఎలా ఎన్ని చెప్పుకొన్నా.. అన్ని సంచలనాలుగానే మిగిలిపోతాయి.
1989 సంవత్సరంలో దసరా కానుకగా రిలీజైన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. సెన్సార్ యూఏ (U/A) సర్టిఫికెట్‌తో 145 నిమిషాల నిడివితో అంటే.. 2 గంటల 15 నిమిషాల రన్‌టైమ్‌తో రిలీజైన ఈ చిత్రం నేటి జనరేషన్‌కు స్పూర్తిగా నిలిచింది. ఇలాంటి సంచలన చిత్రం మళ్లీ నవంబర్ 14న రిలీజ్ కాబోతున్నది. ఈ సినిమాను ప్రీమియర్లు కూడా ముందుగానే ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోసారి శివ తెలుగు సిల్వర్ స్క్రీన్ షేక్ చేస్తుందనే విషయంపై ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. మరోసారి 36 ఏళ్ల క్రితం పొందిన అనుభూతిని మరోసారి పొందేందుకు సిద్దంకండి.


Click it and Unblock the Notifications











