Showtime Review ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫ్యాక్షన్.. మూవీ రివ్యూల మాయాజాలం.. షోటైమ్ సినిమా రివ్యూ!
Rating: 2.5/5
నటీనటులు: ఇమ్రాన్ హష్మీ, మహిమ మాక్వానా, మౌనీ రాయ్, నసీరుద్దీన్ షా, రాజీవ్ ఖండేల్‌వాల్, శ్రీయ సరన్, విశాల్ వశిష్ట, బెనెడిక్ట్ గ్యారెట్, విజయ్ రాజ్ తదితరులు
దర్శకత్వం: మిహిర్ దేశాయ్, అర్చిత్ కుమార్
క్రియేటర్: సుమిత్ రాయ్
నిర్మాతలు: కరణ్ గుప్తా, మిహిర్ దేశాయ్, ఆనంద్ రైచురా, కరణ్ జోహర్, అపూర్వ మెహతా, సోమెన్ మిశ్రా
సినిమాటోగ్రఫి: వివేక్ షా
ఎడిటింగ్: మనన్ మెహతా, సర్వేశ్ కుమార్ సింగ్
మ్యూజిక్: రిషి గిరిధర్, ప్రథమేష్, క్రినా షా
బ్యానర్: ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్
ఓటీటీ రిలీజ్: డిస్నీ+హాట్ స్టార్
ఓటీటీ రిలీజ్ డేట్: 2024-03-88
బాలీవుడ్‌లో అగ్ర సినీ నిర్మాణ సంస్థ విక్టరీ స్టూడియోస్ అధినేత విక్టర్ ఖన్నా (నసీరుద్దన్ షా). తండ్రి నిర్వహించే స్టూడియో వ్యవహారాలను కుమారుడు రఘు ఖన్నా (ఇమ్రాన్ హష్మీ) చూస్తుంటాడు. విక్టర్ మనవరాలు మహిక నందీ ( మహిక మాక్వానా) సినీ క్రిటిక్. స్టూడియో తరఫున తీసే సినిమాలు, కథలపై తండ్రితో రఘు విబేధిస్తుంటాడు. అయితే తమ సినిమా లవ్ డేంజరస్ రిలీజ్ సమయంలో మంచి రేటింగ్ ఇవ్వాలని మహికను రఘు కోరుతాడు. కానీ ఆ సినిమాను మహిక ఏకి పారేస్తుంది. దాంతో వారిద్దరి మధ్య పచ్చగడ్డి కూడా మండేలా విభేదాలు నెలకొంటాయి. మేనమామ రఘుకు పోటీగా తాత వారసత్వాన్ని చేతిలోకి తీసుకొని సినిమాలు నిర్మించాలని మహిక ప్లాన్ చేస్తుంది. తాత డ్రీమ్ ప్రాజెక్ట్ 1857 సినిమా నిర్మాణంలో రఘు, మహిక మధ్య ఘర్షణ భారీగా చోటుచేసుకొంటుంది.

తండ్రి విక్టర్ ఖన్నాతో రఘు ఖన్నా ఎందుకు విభేదిస్తాడు? సినిమాకు మంచి రేటింగ్ ఇవ్వమంటే మహిక ఎందుకు నిరాకరించింది? తాత ప్రొడక్షన్ కంపెనీలోకి మహిక ఎందుకు అడుగు పెట్టాలనుకొంది? 1857 సినిమాలో నటించడానికి స్టార్ హీరో అర్మాన్ సింగ్ (రాజీవ్ ఖండేల్‌వాల్)ను రఘు ఎలా ఒప్పించాడు. తన ప్రియురాలు ఐటమ్ గర్ల్ యాస్మిన్ అలీ (మౌనీ రాయ్)తో రఘు లవ్ రిలేషన్ ఎలా కొనసాగింది. నటి మందిరా సింగ్ (శ్రీయా సరన్) పాత్ర ఏమిటి? రచయిత పృథ్వీ (విశాల్ వశిష్ట)తో మహిక లవ్, ప్రొఫెషనల్ రిలేషన్ ఎలా సాగింది? 1857 సినిమా పూర్తయిందా? ఆ సినిమా ఎలాంటి చికాకులను పెట్టిందనేది షో టైమ్ సినిమా కథ.
షో టైమ్ (ShowTime) సినిమా పాయింట్ చూడటానికి ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. కానీ పూర్తి స్థాయి కథగా, బలమైన సన్నివేశాలను డిజైన్ చేయడంలో చాలా లోపాలు కొట్టిచ్చినట్టు కనిపిస్తాయి. కథలో కాన్‌ఫ్లిక్ట్ బలంగా లేకపోవడంతో సినిమా చివరి ఎపిసోడ్స్ తేలిపోయినట్టు అనిపిస్తుంది. ఈ వెబ్ సిరీస్‌లో అక్కడక్కడ సన్నివేశాలు బాగుంటాయి. ఓవరాల్‌గా థ్రిల్లింగ్‌గా అనిపించేంతగా, ఫుల్ ఇంపాక్ట్ చూపించడంలో విఫలమైందనే చెప్పాలి.

ఇక ఇమ్రాన్ హష్మీ తన పాత్ర వరకు బాగా చేశాడు. తండ్రితో విభేదించ సీన్లలోను, అలాగే మహికతో వైరం తదితర సన్నివేశాల్లో అతడి యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ పాత్ర పరంగా బాగుంది. ఇమ్రాన్‌తో పోటీపడి నటించడంలో మహిక వెనకబడిందని చెప్పవచ్చు. ఇమ్రాన్ హష్మీ లవర్‌గా మౌనీ రాయ్, అర్మాన్ సింగ్ భార్యగా శ్రీయా సరన్ తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించడమే కాకుండా హాట్ హాట్ సన్నివేశాల్లో గ్లామర్ పంట పండించారు.
సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి, మ్యూజిక్, నిర్మాణ విలువలు ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్.. కథ, కథనాలు, బలహీనమైన సన్నివేశాలు ఈ సినిమాకు మైనస్ పాయింట్స్. వివేక్ షా చిత్రీకరించిన సన్నివేశాలు రిచ్‌గా ఉన్నాయి. పలు సన్నివేశాలను మ్యూజిక్ ఎలివేట్ చేసింది. సినిమాను ఉన్నత ప్రమాణాలతో రూపొందించడంలో ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్ సఫలమైంది.

సినిమా ప్రొడక్షన్స్, మూవీ రివ్యూలు అనే అంశాలతో తెరకెక్కిన చిత్రం షోటైమ్. నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు ఈ సిరీస్ చూసేలా చేస్తాయి. సినిమా ఇండస్ట్రీలో కుటుంబ కలహాలు, ఫ్యాక్షన్ అంశాలతో రూపొందిన చిత్రం పక్కా టైమ్ పాస్ మూవీ. గ్లామర్, ఎమోషనల్ సీన్లు కట్టిపడేస్తాయి. తీరిక వేళలో తగినంత సమయాన్ని వెచ్చించి.. ఈ వెబ్ సిరీస్ చూస్తే నచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











