Sing Geetham Movie Twitter Review: సింగ్ గీతం మూవీ ట్విట్టర్ రివ్యూ
భారతీయ చిత్ర పరిశ్రమలో విభిన్నమైన కథలతో ప్రయోగాలు చేసి ప్రేక్షకులను అలరించిన లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన మూవీ సింగ్ గీతం. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా బ్యానర్‌లపై ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అహిల్య బమ్రూ, అయాన్, షాలినీ కొండెపూడి, శివ నారాయణ, బెనర్జీ, వామ్కీ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. అంకుర్ సీ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.
టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. సింగీతం శ్రీనివాసరావు ఈ వయసులోనూ పడిన కష్టం, పలువురు సినీ ప్రముఖులు సైతం ఈ సినిమాపై కురిపిస్తున్న ప్రశంసలు హైప్ తీసుకొచ్చాయి. వరల్డ్ వైడ్‌గా జూన్ 12వ తేదీన సింగ్ గీతం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై సోషల్ మీడియాలో నెటిజన్లు, క్రిటిక్స్ అభిప్రాయాలను పరిశీలిస్తే..

సింగ్ గీతం ఒక విలక్షణమైన భావన, ఇందులో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మంచి ప్రయత్నం. అయితే నిలదొక్కుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. సంగీతం మొదట్లో బాగానే ఉన్నా.. మధ్యలో సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ఇక కామెడీ కూడా అక్కడక్కడా మాత్రమే పండుతుంది. అయితే సినిమా అసలు సారం మాత్రం ఎమోషనల్ కంటెంట్‌తో కూడిన ద్వితీయార్ధంలోనే ఉంది. ఫ్లాష్‌బ్యాక్ నుంచి క్లైమాక్స్ వరకు, భావోద్వేగభరితమైన సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి.
ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రధాన బలం. ఇది ఇటీవలి కాలంలో ఆయన అందించిన అత్యుత్తమ బాణీ. ఇలాంటి విభిన్నమైన ఇతివృత్తాన్ని ప్రయత్నించినందుకు సింగీతం శ్రీనివాసరావు, వైజయంతి బృందాన్ని అభినందించాలి. ఈ సినిమా అందరికీ నచ్చకపోవచ్చు.. కానీ ప్రత్యేకత, ఎమోషన్ కారణంగా తప్పక చూడదగ్గ మంచి చిత్రంగా నిలబెడతాయని ఓ యూజర్ అభిప్రాయపడ్డాడు.
ఇది లెజెండరీ సింగీతం సార్ నుంచి వచ్చిన క్లాసిక్. సింగీతం శ్రీనివాసరావు సార్‌కి ఇది సాలీడ్ కమ్‌బ్యాక్. సెకండాఫ్‌లో వచ్చిన ఎమోషనల్ సీన్స్ అదిరిపోయాయి. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు గుండెకాయ వంటి వాడు. బీజీఎం నెక్ట్స్ లెవల్‌లో ఉంది. పాటలు కూడా బాగున్నాయి. ఈ సినిమాతో నిర్మాత నాగ్ అశ్విన్‌కు మరో బ్లాక్‌బస్టర్. వైజయంతి ఫిల్మ్స్ ప్రొడ్యక్షన్ వాల్యూస్ బాగున్నాయి. థియేటర్‌లో ఖచ్చితంగా చూడండి అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.
పాటలతో కొత్త ప్రయోగం. సెకండాఫ్‌లో కొన్ని సెన్సిబుల్ సీన్స్ బాగున్నాయి. సింగీతం గారు ఈ సినిమా ద్వారా మంచి సందేశం ఇచ్చారు. క్లైమాక్స్ సూపర్. 94 ఏళ్ల వయసులో సింగీతం శ్రీనివాసరావు గారు తన సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆయన ఆలోచన, డిఫరెంట్ కథను సినిమాగా మార్చడానికి తోడ్పడిన నాగ్ అశ్విన్‌ను అభినందించాలి. సింగీతం గారి మీద గౌరవంతో ఆయన చేసిన ఈ ప్రయోగం ఓసారి చూసేయండి అని ఓ క్రిటిక్ రివ్యూ ఇచ్చాడు.
సింగ్ గీతం.. మాస్టర్ పీస్ ఐడియా. లెజెండ్ రిటర్న్ అయ్యాడు. వినూత్నమైన, ప్రభావవంతమైన సినిమాల మాస్టర్ తిరిగి వచ్చారు. 94 ఏళ్ల వయసులో దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు 40 ఏళ్ల కలల ప్రాజెక్ట్‌కు ఎట్టకేలకు ప్రాణం పోశారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించబడుతున్న సింగ్ గీతం.. ఆయన దార్శనికతకు, కథ చెప్పడంలో ఆయనకున్న అంతులేని అభిరుచికి నిదర్శనంగా నిలుస్తోంది.
కుబేర పురం అనే ఒక రహస్య గ్రామం నేపథ్యంలో సాగే ఈ కథ. అస్తిత్వ, ఆర్ధిక సంక్షోభాలను ఆశ, కఠోర శ్రమ వంటి అంశాలతో అద్భుతంగా మిళితం చేస్తుంది. అత్యాశపరుడైన గని యజమాని వల్ల గ్రామస్తులు ఊహించని పరిస్ధితులను ఎదుర్కొంటున్నప్పటికీ, చివరికి మానవత్వమే అన్నింటికంటే గొప్పగా నిలుస్తుంది. ఇది నిజానికి ఒక అందమైన, హృదయానికి హాయినిచ్చే కథ. ఫస్టాఫ్‌లో దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఒక అద్భుతమైన పాట నుంచి సంగీతానికి సున్నితంగా మారుతూ.. ఆ తర్వాత ఉత్సాహభరితమైన నేపథ్య సంగీతంతో పతాక సన్నివేశాన్ని మరింత ఉన్నతంగా నిలబెడుతుంది.
ప్రతిభావంతులైన కొత్త నటీనటులను, తెరపైకి నిజమైన తాజాదనాన్ని తీసుకొచ్చే అనుభవజ్ఞులైన హాస్యనటులతో కలపడం ద్వారా ఈ నటీనటుల ఎంపిక బ్యాలెన్స్ చేసింది. వీఎఫ్ఎక్స్.. నిర్మాణ రూపకల్పన వాస్తవికతకు కట్టుబడి ఉంటూ, ముఖ్యంగా సినిమా ద్వితీయార్ధంలో మరింత ఆకట్టుకునేలా ప్రభావవంతంగా ఉంటాయి. ఆదిత్య 369లోని అద్భుతమైన సైన్స్ ఫిక్షన్ అంశాల నుంచి పుష్పక విమానంలోని మూకీ కథను, బైరవ ద్వీపంలోని ఫాంటసీ ప్రపంచం వరకు సింగీతం శ్రీనివాసరావు గారు ఎప్పుడూ తమ కాలం కంటే ముందున్న దర్శకుడిగా నిలిచారు. సింగ్ గీతం ద్వారా బలమైన కథాంశాన్ని, హృదయానికి హత్తుకునే భావోద్వేగాలను మేళవిస్తూ, పాటలే సంభాషణలుగా సాగే ఒక అద్భుతమైన కొత్త విధానాన్ని ఆయన పరిచయం చేస్తున్నారు.
ఈ అద్భుతమైన దృక్పథానికి అత్యంత అంకితభావంతో అండగా నిలిచి, ఆర్ధిక సహకారం అందించి, ప్రచారం కల్పించిన నాగ్ అశ్విన్, వైజయంతీ మూవీస్ గురించి కచ్చితంగా ప్రస్తావించాలి. మాకు అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని కల్పించిన నాగ్ అశ్విన్, వైజయంతి మూవీస్, స్వప్న సినిమాకు కృతజ్ఞతలు అని నెటిజన్ రివ్యూ ఇచ్చాడు.
సింగ్ గీతం అనేది ఆలోచనాత్మక సందేశాన్ని అందించే ఉద్దేశంతో కూడిన సంగీత ప్రపంచం. కథ వేగంలో కొన్ని లోపాలు, నిరాశపరిచే ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ ఈ చిత్రం ఎన్నో హృద్యమైన, భావోద్వేగభరితమైన క్షణాలను అందిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.. కథతో సహజంగా కలిసిపోయింది. నటీనటులందరి పర్ఫార్మెన్స్‌తో ఈ సినిమా మంచి అనుభూతిని కలిగిస్తుందని ఓ యూజర్ కామెంట్ పెట్టాడు.


Click it and Unblock the Notifications