Skanda Review సత్యం రామలింగ రాజు కథతో.. ఊరమాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్.. స్కంధ సమీక్ష
నటీనటులు: రామ్ పోతినేని, శ్రీలీల, శ్రీకాంత్, సాయి మంజ్రేకర్, కాలకేయ ప్రభాకర్, ప్రిన్స్, శరత్ లోహితాస్వ, దగ్గుబాటి రాజా, పృథ్వీరాజ్, గౌతమి, ఇంద్రజ, ఊర్వశి రౌటేలా తదితరులు
దర్శకత్వం: బోయపాటి శ్రీను
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
సమర్పణ: పవన్ కుమార్
సినిమాటోగ్రఫి: సంతోష్ డేటేక్
ఎడిటింగ్: తమ్మిరాజు
మ్యూజిక్: ఎస్ థమన్
బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్, జీ స్టూడియోస్
రిలీజ్ డేట్: 2029-09-28
స్కంద కథ ఏమిటంటే?: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాయుడు (అజయ్ పుష్కర్) కుమార్తెను పెళ్లి పీటల మీద నుంచి తెలంగాణ సీఎం రంజిత్ రెడ్డి (శరత్ లోహితాస్వ) కొడుకు కిడ్నాప్ చేస్తాడు. ఇక తెలంగాణ సీఎం రంజిత్ రెడ్డి కూతురు శ్రీలీల (శ్రీలీల)ను గోదావరి జిల్లాకు రుద్రరాజపురానికి చెందిన రుద్రకంటి భాస్కర్ (రామ్ పోతినేని) ప్రేమిస్తుంటాడు. శ్రీలీల వెంట పడినట్టు నటిస్తూ.. తెలంగాణ సీఎం ఇంటిలో ఉన్న ఆంధ్రా ముఖ్యమంత్రి కూతురును కిడ్నాప్ చేయడానికి ప్లాన్ వేస్తాడు. అయితే తన ప్లాన్‌లో భాగంగా తెలంగాణ సీఎం కూతురు శ్రీలీలతోపాటు ఏపీ ముఖ్యమంత్రి కూతురును కిడ్నాప్ చేసి నేరుగా రుద్రరాజపురానికి తీసుకొస్తాడు.

స్కంద మూవీలో ట్విస్టులు: తెలంగాణ సీఎం కూతురు శ్రీలీలను లవ్ పేరుతో భాస్కర్ ఎందుకు ట్రాప్ చేయాలని అనుకొన్నాడు? ఇద్దరు సీఎం కూతుళ్లను భాస్కర్ ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది? ఇద్దరు సీఎంలో రుద్రకంటి మణికంఠ రాజు (దగ్గుబాటి రాజా)కు వైరం ఏమిటి? తండ్రి మణికంఠ రాజు కోసం భాస్కర్ ఏకంగా సీఎంల కూతుళ్లను కిడ్నాప్ చేయాలనే సాహోసోపేతమైన నిర్ణయం తీసుకొన్నాడు? మణికంఠ రాజు, భాస్కర్ కుటుంబానికి ప్రపంచంలోనే టాప్ సాఫ్ట్‌వేర్ కంపెనీ అధినేత రుద్రకంటి రామకృష్ణ రాజు (శ్రీకాంత్)కు ఉన్న సంబంధం ఏమిటి? తమ కూతుళ్లను కిడ్నాప్ చేస్తే ఏపీ, తెలంగాణ సీఎంలు ఏం చేశారు? ఇద్దరు సీఎంలకు భాస్కర్ ఫ్యామిలీ ఎందుకు గుణపాఠం చెప్పాలని అనుకొన్నారు అనే ప్రశ్నలకు సమాధానమే స్కంద సినిమా కథ.

ఫస్టాఫ్‌లో రెగ్యులర్ మాస్ ఎలిమెంట్స్: సాఫ్ట్‌వేర్ కంపెనీ అధినేత రుద్రకంటి రామకృష్ణరాజుకు కోర్టులో ఉరిశిక్ష విధించడం, హాస్పిటల్‌లో ఆయన కూతురు పరిణిత (సాయి మంజ్రేకర్) చావుతో పోరాటం చేయడం లాంటి అంశాలతో కథ ఎమోషనల్ నోట్‌తో మొదలవుతుంది. ఆ తర్వాత ఏపీ సీఎం కూతురును తెలంగాణ సీఎం కిడ్నాప్ చేయడం లాంటి ఓ డ్రామాతో కథ మాస్ టర్న్ తీసుకొనేలా చేస్తుంది.
ఇక హైదరాబాద్‌లో సదర్ ఉత్సవ ఎపిసోడ్‌లో దున్నపోతులతో రామ్ పోతినేని ఎంట్రీ మాస్, కమర్షియల్ అంశాలతో కేక పెట్టించేలా చేశాడు. ఫస్టాఫ్ రొటీన్, రెగ్యులర్ అంశాలు, పాటలతో కొంత ఇబ్బందిగానే సాగిపోతుంది. రొటీన్, రెగ్యులర్‌గా సాగే కథకు పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌తో ఇంటర్వెల్ ఎపిసోడ్ డిజైన్ చేసి మూవీ సెకండాఫ్‌పై అంచనాలు పెంచేలా చేశారు.

సెకండాఫ్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో: ఇక అప్పటి వరకు ఫస్టాఫ్‌తో కొంత రొటీన్, ఫార్మూలా సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ కలిగిన వారికి.. సెకండాఫ్‌లో ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో క్లాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడానికి చేసిన ప్రయత్నం బాగుంది. సెకండాఫ్‌లో డాటర్ సెంటిమెంట్, తల్లిదండ్రుల గురించి రామ్‌తో చెప్పించే సన్నివేశాలు హార్ట్ టచింగ్‌గా ఉన్నాయి. ఇక శ్రీకాంత్, దగ్గుబాటి రాజా మధ్య ఫ్రెండ్ షిప్ ఎపిసోడ్, అప్పగింతల సీన్‌లో పచ్చడి జాడీలు ఇచ్చే సీన్ కథలో ఎమోషన్ డెప్త్‌ను చూపించింది.
ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సన్నివేశం వరకు ఊరమాస్ ఎలిమెంట్స్‌తో మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకొనే పక్కా ఫార్మూలా, రెగ్యులర్, రొటీన్ కథతో బోయపాటి కేక పెట్టించిన తీరు బాగుంది. వెరైటీ కోసం చూసే ప్రేక్షకులకు ఈ సినిమాలో కొత్తదనం ఎక్కడ కనిపించదు. మాస్, కమర్షియల్, బిల్డప్ షాట్స్‌తో మాస్ ఆడియెన్స్‌కు పండగలా అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టు మాత్రం ఓ రేంజ్‌లో మాస్ ఆడియెన్స్‌ను ఉర్రూతలూగిస్తుంది.

రామ్ పోతినేని వన్ మ్యాన్ షో.. శ్రీలీల గ్లామర్: ఇక నటీనటుల విషయానికి వస్తే.. స్కంద సినిమాకు రామ్ పోతినేని కర్త, కర్మ, క్రియ. మాస్, యాక్షన్, కమర్షియల్, లుక్, బాడీ లాంగ్వేజ్, డ్యాన్సులు, ఫైట్స్ అని కలిపి భాస్కర్ పాత్రతో సినిమా భారాన్నంతా తన భుజాలపై మోశారు. మాస్ సీన్లలో ఓ రకమైన బాడీ లాంగ్వేజ్, ఫ్యామిలీ ఎపిసోడ్‌లో పలికించిన హావభావాలు రామ్‌లోని మెచ్యుర్డ్ యాక్టర్‌ను చూసేలా చేసింది.
ఇక శ్రీలీలతో కలిసి పాటలు, డ్యాన్స్‌తో ఇరగదీశాడు. నీ చుట్టూ చుటూ.. కల్ట్ మామ, గండరభాయి పాటలు మాస్ ప్రేక్షకులను ఓ రేంజ్‌లో రంజింప చేసేలా రామ్, శ్రీలీల రంజింప చేశారు. శ్రీకాంత్ కథకు ఇంపార్టెంట్‌గా మారిన పాత్రలో హుందాగా కనిపించారు. చాలా రోజుల తర్వాత దగ్గుబాటి రాజా ఎమోషనల్ రోల్ ఆకట్టుకొన్నారు. మిగితా పాత్రల్లో కనిపించిన వారు వారి పాత్రలకు న్యాయం చేశారు.

పవర్‌ఫుల్ డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్‌తో: స్కంద మూవీ టెక్నికల్ అంశాల విషయానికి వస్తే.. రత్నం రాసిన మాటలు పవర్‌ఫుల్‌గా బోయపాటి సినిమాకు ఏ మాత్రం తగ్గకుండా ఉన్నాయి. ఇక మ్యూజిక్ పరంగా చూస్తే.. పాటలు బ్లాక్‌బస్టర్ రేంజ్‌లో హిట్ అయ్యాయి. మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సాగే యాక్షన్ ఎపిసోడ్స్‌ను తమన్ తన మ్యూజిక్‌తో ఓ రేంజ్‌లో రఫాడించాడు.
సినిమాటోగ్రఫి విషయంలో సంతోష్ డీ ఫైట్స్ ఎపిసోడ్‌ను బాగా షూట్ చేశారు. లాజిక్‌లు పక్కన పెడితే.. ఫైట్స్ కూడా బాగుంటాయి. శ్రీనివాస చిట్టూరి అనుసరించిన ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. బోయపాటి కొంత హింస, నరకడం తగ్గించి కథకు స్కోప్ ఇచ్చి ఉంటే.. డెఫినెట్‌గా ఊరమాస్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అయి ఉండేదనిపిస్తుంది.

ఫైనల్‌గా స్కంద ఎలా ఉందంటే?: స్కంద సినిమా విషయానికి వస్తే.. సాఫ్ట్‌వేర్ రంగంలో ప్రపంచంలోనే అత్యున్నత స్థాయికి ఎదిగిన సత్యం రామలింగరాజు జీవితంలోని కొన్ని సంఘటనలు తీసుకొని అల్లుకొన్న మాస్ ఎంటర్‌టైనర్. సత్యం రామలింగ రాజు పతనానికి కారణమైన ముఖ్యమంత్రి, ప్రభుత్వంపై వేసిన రాజకీయ సెటైర్ లాంటి మూవీ. లక్షలాది మందికి జీవితాలను అందించిన ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ అధినేతను బ్రష్టుపట్టించిన ఇద్దరు సీఎం కథతో ఫ్యామిలీ, మాస్, కమర్షియల్ దట్టించిన సినిమాగా స్కందను చూడొచ్చు.
బుర్రకు పనిచెప్పకుండా రెండున్నర గంటలపాటు మాస్, కమర్షియల్ సినిమాను చూడాలనే వారికి స్కంద ఫుల్ మీల్స్ లాంటింది. అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఈ సినిమాను ఫీల్‌గుడ్‌గా మార్చింది. బీ, సీ సెంటర్లలో పూనకాలు తెప్పించే విధంగా మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అవి కనెక్ట్ అయితే ఈ సినిమా రేంజ్ ఎక్కువగానే ఉంటుంది. రొటీన్, రెగ్యులర్ అంశాలతోపాటు ఓ ఎమోషన్ పాయింట్‌తో వచ్చిన స్కంద మూవీపై ప్రేక్షకులు, బాక్సాఫీస్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











