Romancham Review: ఏడుగురు ఫ్రెండ్స్ దెయ్యంతో ఆట ఆడితే? రోమాంచం రివ్యూ
రేటింగ్: 2.75/5
టైటిల్: రోమాంచం
నటీనటులు: సౌబిన్ షాహిర్, అనంతరామన్ అజయ్, సజిన్ గోపు, అబిన్ బినో, సిజు సన్నీ, అఫ్జల్ పీహెచ్, జగదీష్ కుమార్, అర్జున్ అశోకన్ తదితరులు
సినిమాటోగ్రఫీ: సను తాహిర్
దర్శకత్వం: జితు మాధవన్
సంగీతం: సుషిన్ ష్యామ్
నిర్మాతలు: జాన్ పాల్ జార్జ్, గిరీష్ గంగాధరన్, జోబి జార్జ్
థియేటర్ విడుదల తేది: ఫిబ్రవరి 3, 2023
ఓటీటీ విడుదల తేది: ఏప్రిల్ 7, 2023
ఓటీటీ వేదిక: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
ఈ మధ్య కాలంలో అతి చిన్న సినిమాగా విడుదలై కోట్లు కొల్లగొట్టి ఆశ్చర్యపరిచాయి కొన్ని సినిమాలు. వాటిలో కన్నడ నుంచి కాంతార, తమిళంలో లవ్ టుడే చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసుళ్లు రాబట్టాయి. ఇలాంటి కోవకు చెందినదే రోమాంచం. మలయాళల సినిమాలకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుందన్న విషయం తెలిసిందే.

ఈ మాలీవుడ్ మూవీ కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద రూ. 75 కోట్లు కొల్లగొట్టింది. హారర్ కామెడీ జోనర్ లో వచ్చిన ఈ రోమాంచమ్ మూవీని ఇటీవల ఇతర భాషల్లో డబ్ చేసి ఓటీటీలోకి వదిలారు. ఏప్రిల్ 7 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ: జీవన్ (సౌబిన్ షాహిర్), రవి (అనంతరామన్ అజయ్), నీరజ్ (సజిన్ గోపు), ముఖేష్ (సిజు సన్నీ), కార్తీక్ (అఫ్జల్ పీహెచ్), సోమరాజు (జగదీష్ కుమార్), శివాజీ (అబిన్ బినో) ఏడుగురు మంచి ఫ్రెండ్స్. బ్యాచ్ లర్స్ అయిన వీళ్లందరు కలిసి ఒక ఇంట్లో అద్దెకు ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కో పని చేస్తూ ఉంటారు. అందరూ కలిసి జీవితంలో బాగా సెటిల్ అయ్యేందుకు ట్రై చేస్తూ జాలీగా గడుపుతుంటారు. రెగ్యులర్ గా రోజు రాత్రి వాలీ బాల్ ఆడటం వీళ్లకు అలవాటు. కానీ వీరిలో కొత్త గేమ్ ఆడదామని క్యారమ్ బోర్డుతో ఓజా (ఆత్మలను రప్పించే స్పిరిట్ బోర్డ్) బోర్డ్ తయారు చేస్తాడు జీవన్.

ఆత్మ ఎవరిదీ: ఓజా గేమ్ తో ఒక ఆత్మను రప్పిస్తారు. రోజు ఇలా చేసి కొద్దిరోజులకు భయంతో ఆ గేమ్ ఆపేస్తారు. ఓజా గేమ్ ఆడటం ఆపేసాకా వాళ్లు ఉంటున్న ఇంట్లో ఎలాంటి సంఘటనలు జరిగాయి? వాళ్లు ఎదుర్కున్న ఇబ్బందులు ఏంటీ? గేమ్ తర్వాత వాళ్ల ఇంటికి వచ్చిన మరో ఫ్రెండ్ శీను (అర్జున్ అశోకన్) ఏం చేశాడు? శీను ప్రవర్తను గల కారణాలు ఏంటీ? ఓజా బోర్డ్ పిలిచిన ఆత్మ ఎవరు? జీవన్ ఆసుపత్రిపాలు ఎందుకయ్యాడు? వంటి ఆసక్తికర అంశాలను కామెడీ జోడించిన సినిమానే రోమాంచమ్.
విశ్లేషణ: రోమాంచం అంటే తెలుగులో గూస్ బంప్స్ అని అర్థం. సినిమాలో ఏడుగురు ఫ్రెండ్స్ కు ఎదురైన సంఘటనల ద్వారా వాళ్ల రోమాలు నిక్కబొడుచుకుంటాయన్న మీనింగ్ లో ఈ టైటిల్ పెట్టినట్లు ఉన్నారు. ఇక ఈ సినిమా ఒక రియల్ స్టోరీ. 2007లో బెంగళూర్ సిటీ ఔట్ కట్స్ లో నివాసం ఉంటున్న ఏడుగురు బ్యాచ్ లర్ ఫ్రెండ్స్ కు ఎదురైన సంఘటనలతో ఈ మూవీ తెరకెక్కించారు. రియల్ స్టోరీ కాబట్టి సన్నివేశాలు కూడా పూర్తిగా అలాగే ఉంటాయి. ఒరిజనల్ సినిమాటిక్ తరహాలో చూపించకపోవడం కాస్తా బోరింగ్ అనిపిస్తుంది. ఇక రియల్ లైఫ్ లో ఫ్రెండ్స్ రిలేషన్స్, సరదాలు అన్నీ బాగా చూపించారు.

కామెడీ-హారర్: ఆత్మలను పిలిచే ఓజా బోర్డ్ గేమ్ ఆడాకే అసలు కథ ప్రారంభం అవుతుంది. ఆ బోర్డ్ తో ఆత్మలను పిలిచి దానితి పిచ్చి పిచ్చి ప్రశ్నలకు సమాధానాలు వెతకడం కామెడీగా, కాస్తా థ్రిల్ ఫీల్ ఉంటుంది. దెయ్యం పేరుతో ఆట ఆడుకునే సీన్లు నవ్వించేలా ఉన్నాయి. ఎప్పుడైతే నిజంగానే ఆత్మ వచ్చిందని తెలుసుకోవడం, బోర్డ్ పగులకొట్టడం, తర్వాత శీను అనే ఫ్రెండ్ రావడం, అతని ప్రవర్తన కారణంగా వచ్చే భయం నుంచి హారర్ టచ్ ఇవ్వడం పర్వాలేదనిపించింది. అందులో నుంచి కామెడీని పండించే ప్రయత్నం చేశారు. అది ఒక్కడక్కడ వర్కౌట్ అయింది. సినిమాలో పెద్దగా ఊహించినంతగా ఏం జరగదు. క్లైమాక్స్ సాదాసీదాగా కన్విన్సింగానే ఉంటుంది. ఎక్కువ ఆశిస్తే మాత్రం నిరాశ తప్పదు.
ఎవరెలా చేశారంటే: సౌబిన్ షాహిర్ నటనపరంగా సత్తా ఉన్న యాక్టర్. ట్రాన్స్, భీష్మ పర్వం, సీబీఐ 5, ఆండ్రాయిడ్ కట్టప్ప వంటి చిత్రాలు చూసిన తెలుగు ప్రేక్షకులు గుర్తు పట్టొచ్చు. ఇంతకుముందు సినిమాలతో పోలిస్తే ఈ మూవీలో తన నటనతో పర్వాలేదనిపించాడని మాత్రమే అనిపిస్తుంది. ఇక మిగతా క్యారెక్టర్లు తెలుగువారికి పెద్దగా తెలియకపోవడంతో తమ యాక్టింగ్ తో ఆకట్టుకున్నట్లు తోస్తుంది. వీరిలో శీనుగా చేసిన అర్జున్ అశోకన్ యాక్టింగ్ మాత్రం కామెడీ, భయం రెండు తెప్పిస్తుంది. అతని నటనకు మాత్రం ఫిదా కావాల్సిందే.

ఫైనల్ గా చెప్పాలంటే: ఇక సుషిన్ ష్యామ్ అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో బీజీఎమ్ బాగా క్లిక్ అయింది. సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే, నిర్మాణ విలువలు, దర్శకత్వం అంతా బాగున్నాయి. దెయ్యాన్ని చూపించకుండా భయపెట్టడం, కామెడీని పండించవచ్చని నిరూపించారు. ఫైనల్ గా చెప్పాలంటే వీకెండ్ లో ఫ్రెండ్స్ కలిసి కామెడీ హారర్ చూస్తూ చిల్ కావాలంటే రోమాంచం మూవీని కచ్చితంగా ట్రై చేయవచ్చు.


Click it and Unblock the Notifications











