Space Gen: Chandrayaan Web Series Review: స్పేస్ జెన్ చంద్రయాన్ వెబ్ సిరీస్ రివ్యూ
Web Series: Space Gen: Chandrayaan
నటీనటులు: శ్రీయ సరన్, నకుల్ మెహతా, ప్రకాశ్ బేలావాడీ, ప్రతీక్ గాంధీ, డానిష్ సెయిత్, అమృతా ఖాన్‌విల్కర్, గోపాల్ దత్, మియాంగ్ ఛాంగ్, ఇషితా శర్మ తదితరులు
దర్శకత్వం: అనంత్ సింగ్ భాటు
నిర్మాతలు: ప్రేమ్ శీలాకుమార్, ఎన్ కుమార్
క్రియేటర్: అరుణాబ్ కుమార్
రచన: శుభం శర్మ, నితిన్ తివారీ
మ్యూజిక్: రోహన్-రోహన్
సినిమాటోగ్రఫి: శ్రీదత్తా నామ్‌జోషి
ఎడిటర్: ఫారుఖ్ హుండేకర్
ఓటీటీ రిలీజ్: జియో హాట్‌స్టార్
ఓటీటీ రిలీజ్ డేట్: 2026-01-23
చంద్ర మండలంలోకి చంద్రయాన్ 2 ల్యాండర్‌ను ప్రయోగించాలని ఇండియన్ స్సేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) శాస్త్రవేత్తలు ప్రాణం పెట్టి పనిచేస్తారు. చంద్రయాన్ 2 మిషన్‌ను సక్సెస్ చేయాలని శాస్త్రవేత్తలు యామిని ముదలియార్ (శ్రీయా సరన్), అర్జున్ వర్మ (నకుల్ మెహతా), సుదర్శన్ రామయ్య (ప్రకాశ్ బేలావాడీ), జైరామ్ శెట్టి (డానిష్ సెయిత్), ఇతర శాస్త్రవేత్తలు అన్ని రకాలుగా ప్రయత్నిస్తారు. కానీ చివరి నిమిషంలో ఆ ప్రయోగం ఫెయిల్ అవుతుంది. దాంతో రాజకీయ, మీడియా, మేధావులు, సాధారణ ప్రజల నుంచి వస్తున్న విమర్శలను శాస్త్రవేత్తలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వైఫల్యాలను సమీక్షించుకొంటూ జీఎస్‌ఎల్‌వీని ప్రయోగిస్తే.. అందులోనే వైఫల్యం. ఆ తర్వాత ఏ ఒక్కరి నుంచి కూడా కనీసం నమ్మకం లేని పరిస్థితుల్లో చంద్రయాన్ 3 ప్రయోగించాలని ప్లాన్ చేస్తారు. అంతలోనే కరోనా మహమ్మారి శాస్త్రవేత్తల ప్రయత్నాలకు ఎదురుగా నిలుస్తుంది. భారత శాస్త్రవేత్తలు ప్రయోగించిన చంద్రయాన్ 3 మిషన్‌కు రష్యా అడ్డు తగులుతుంది.

చంద్రయాన్ 2 ప్రయోగం ఎలాంటి పరిస్థితుల్లో ఫెయిల్ అయింది? అందుకు కారణం ఎవరు? చంద్రయాన్ ఫెయిల్యూర్ తర్వాత అర్జున్ వర్మ తన ఉద్యోగానికి ఎందుకు రాజీనామా చేశాడు? సుదర్శన్ రామయ్యను ఏ పరిస్థితుల్లో ఇస్రో చైర్మన్‌గా చేయాలని అనుకొంటారు? జీఎస్‌ఎల్‌వీ ప్రయోగం విఫలం తర్వాత శాస్త్రవేత్తల్లో మానసిక స్థైర్యం ఎలా ఉండింది? కరోనా వైరస్ పరిస్థితులు ఇస్రో శాస్త్రవేత్తలకు ఎలాంటి సవాల్ విసిరింది? చంద్రయాన్ 2 ప్రయోగం సమయంలో రష్యా వేసిన ఎత్తుగడలు ఏమిటి? స్సేస్ రీసెర్చ్‌లో జియో సైన్స్ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి? ఇలాంటి అడ్డంకులను ఎదుర్కొని చంద్రయాన్ 3 ప్రయోగాన్ని భారత శాస్త్రవేత్తలు సక్సెస్ అయ్యారా? అనే ప్రశ్నలకు సమాధానమే స్పేస్ జెన్ చంద్రయాన్.
స్పేస్ జెన్ చంద్రయాన్ వెబ్ సిరీస్ విషయానికి వస్తే.. పూర్తిగా టెక్నికల్ అంశాలతో కూడుకొన్నప్పటికీ.. వాటి చుట్టూ దర్శకుడు అనంత్ సింగ్ అల్లిన డ్రామా, జొప్పించిన ఎమోషన్స్ అత్యంత బలంగా మారాయనిపిస్తుంది. అయితే సాంకేతిక విలువలు స్ట్రెంగ్త్‌గా నడిచే ఈ సిరీస్‌లో ఆర్టిస్టులను ఎంచుకొన్న తీరు విషయంలో చిత్ర యూనిట్‌ను అభినందించాలి. శ్రీయా సరన్ లాంటి టాప్ హీరోయిన్‌ను గ్లామర్ కోణంలో కాకుండా పెర్ఫార్మెన్స్ యాంగిల్‌లో ఆమెను యామిని అనే శాస్త్రవేత్త పాత్రలో ఒద్దికగా కూర్చోబెట్టిన విధానంతోనే ఈ సిరీస్‌కు సగం బలం కనిపించింది. ఆ తర్వాత మరో శాస్త్రవేత్త అర్జున్‌గా నకుల్ మెహతాను ఎంచుకోవడం, అలాగే ప్రకాశ్, డానిష్ సెయిత్ లాంటి ఆర్టిస్టులతో డ్రామాను రక్తికట్టించడానికి రాసిన సన్నివేశాలు చాలా బాగుంటాయి.
స్సేస్ రీసెర్చ్, రోదసి ప్రయోగాలు అనేవి చాలా టఫ్ సబ్జెక్ట్. కానీ అలాంటి సబ్జెక్ట్‌ను కూడా సాధారణ ప్రేక్షకులకు అర్ధమయ్యేలా కంటెంట్ డిజైన్ చేయడం ఈ సిరీస్‌కు ప్లస్ పాయింట్. అలాగే రాజకీయాలు, బ్యూరోకసి పాలిటిక్స్, రకరకాల ఇగోలను సమపాళ్లలో చూపించే ప్రయత్నం బాగుంది. అందుకు దర్శకుడు అనంత్ సింగ్, నిర్మాతలు ప్రేమ్ శీలాకుమార్, ఎన్ కుమార్ అభినందించాలి. ఇక మొదటి రెండు ఎపిసోడ్స్, చివరి రెండు ఎపిపోడ్‌ను అత్యంత ఎమోషనల్‌గా చూపించిన విధానం ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది.
ఇక చంద్రయాన్ 2, జీఎస్ఎల్వీ, చంద్రయాన్ 3 ప్రయోగాలకు ప్రాజెక్టు డైరెక్టర్‌గా నటించిన శ్రీయాసరన్ పాత్ర యామిని చుట్టే కథ తిరుగుతుంది. గ్లామర్‌గా కనిపిస్తూనే రియల్ సైంటిస్ట్‌గా ఆమె బిహేవ్ చేసింది. తన పాత్రను అర్ధం చేసుకొని దాని ద్వారా పెర్ఫార్మ్ చేసిన తీరు నటిగా ఆమె అనుభవాన్ని గుర్తు చేసింది. ఇక నకుల్ మెహతా బ్యాక్ స్టోరి గుండెను పిండేసేలా ఉంటుంది. భావోద్వేగమన పాత్రలో ఆయన ఆకట్టుకొన్నారు. ఒడిదుడుకుల ప్రయాణంలో నలిగిపోయే ఇస్రో చైర్మన్‌గా ప్రకాశ్ బేలావాడి డీసెంట్‌గా నటించాడు. జైరామ్ శెట్టిగా డానిస్ సెయిత్ సీరియస్‌గా సాగే కంటెంట్‌లో వినోదాన్ని అందించారు. ఈ చిత్రంలో నటించిన ప్రతీ ఒక్కరు గుర్తుండిపోయేలా పెర్ఫార్మ్ చేశారు.
ఇక ఈ వెబ్ సిరీస్ హైలీ టెక్నికల్. చంద్ర మండలం సెటప్, ఇస్రో బిల్డింగ్, వర్క్ ఎన్వీరాన్‌మెంట్‌ను చక్కగా డిజైన్ చేశారు. క్రియేటర్ అరుణాబ్ విజన్, రోహన్ మ్యూజిక్, శ్రీదత్తా నామ్‌జోషి సినిమాటోగ్రఫి, ఫారుఖ్ హుండేకర్ ఎడిటింగ్ సామర్థ్యం అన్నీ బ్యాలెన్స్‌గా కనిపిస్తాయి. ప్రేమ్ శీలాకుమార్, ఎన్ కుమార్ అనుసరించిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్‌లో ఉన్నాయి. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది. 5 ఎపిసోడ్స్ వెబ్ సిరీస్ ఓ సినిమాలా కాకుండా ఇస్రో ప్రయోగ శాలలో రాకెట్ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా చూసిన అనుభవాన్ని అందిస్తుంది. స్క్రిప్టు పరంగా, మేకింగ్ పరంగా కొన్ని లోపాలు ఎలాగు కనిపిస్తాయి. వాటిని కప్పిపుచ్చేలా దర్శకుడు ప్రతిభ కొట్టిచ్చినట్టు కనిపిస్తుంది. తగినంత సమయాన్ని కేటాయించి ఒకేసారి చూసేయండి.. డెఫినెట్‌గా మంచి ఎక్స్‌పీరియెన్స్ అందిస్తుంది.


Click it and Unblock the Notifications











