Spark life Review ‘మైండ్’ కంట్రోల్ తప్పిన సైంటిఫిక్ థ్రిల్లర్.. స్పార్క్ మూవీ రివ్యూ
నటీనటులు: విక్రాంత్, మెహ్రీన్ పిర్జాదా, రుక్సర్ దిల్లాన్,నాజర్, సుహాసిని మణిరత్నం,వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, శ్రీకాంత్ అయ్యాంగర్, చమ్మక్ చంద్ర,అన్నపూర్ణమ్మ, రాజా రవీంద్ర తదితరులు
రచన, కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత: విక్రాంత్
మ్యూజిక్: హేషమ్ అబ్దుల్ వహబ్
సినిమాటోగ్రఫి: ఏఆర్ అశోక్ కుమార్
ఎఢిటింగ్: ప్రవీణ్ పూడి
ఆర్ట్: ఎస్ రాం ప్రసాద్
స్టంట్స్: జాగ్వర్ కృష్ణన్
రిలీజ్ డేట్: 2023-11-17
మెడికల్ స్టూడెంట్ జైదీప్ (విక్రాంత్) తన కాలేజీలో చదివే అనన్య (రుక్సర్ ధిల్లాన్) ప్రేమించుకొంటారు. జీవితాంతం కలిసి ఉండాలని ఇద్దరు కోరుకొంటారు. కొన్ని కారణాల వల్ల జై దీప్‌కు అనన్య దూరం అవుతుంది. ఈ క్రమంలో వరుసగా అనుమానాస్పద మరణాలు సంభవిస్తుంటాయి. ఆరాధన (అషురెడ్డి), మమత, హర్షిత (లహరి షారి), ఇంకా కొందరు విచిత్ర పరిస్థితుల్లో మరణిస్తారు. ఆ మరణాల వెనుక కారణాలను అన్వేషిస్తున్న సమయంలో లేఖ (మెహ్రీన్)తో ఆర్య పేరుతో జైదీప్ ప్రేమలో పడుతాడు. ఈ క్రమంలో ఓ కేసులో జైదీప్ అరెస్ట్ కావడంతో లేఖ ఫ్యామిలీ ఆయనను అనుమానిస్తారు.

జైదీప్‌కు అనన్య ఎలా దూరమైంది? అనన్య దూరం కావడంతో జైదీప్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. సినీ హీరోయిన్ ఆరాధన, మమత, హర్షిత అనే అమ్మాయిల మరణాలకు కారణాలు ఏమిటి? రుద్ర (గురు సోమసుందరం) అనే సైనిక అధికారి ప్రారంభించిన స్పార్క్ ప్రాజెక్ట్ వెనుకు అసలు గుట్టు ఏమిటి? నోబెల్ పురస్కార గ్రహీత, డాక్టర్ (సుహాసిని) స్పార్క్ ప్రాజెక్టుకు సంబంధం ఏమిటి? స్పార్క్ ప్రాజెక్టు వెనుక సాగుతున్న అక్రమాలను జైదీప్ ఎలా బయటపెట్టాడు. ఆర్య, జైదీప్ రెండు పేర్లతో ఆర్య జైదీప్ చెలామణి కావడానికి అసలు కారణం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే స్పార్క్ లైఫ్ సినిమా కథ.
ఆరాధన అనే సినిమా హీరోయిన్ తన తండ్రిని చంపి.. తాను చనిపోవడమనే సన్నివేశంతో సినిమా చాలా ఇంట్రెస్టింగ్‌గా స్టార్ట్ అవుతుంది. కానీ కథలో మంచి పాయింట్ ఉన్నా.. తెర మీదకు దానిని తీసుకు రావడంలో తడబాటు కనిపిస్తుంది. సినిమాలో చాలా మంది స్టార్ నటులు ఉన్నప్పటీకి వారికి సరైన ప్రాధాన్యం కథలో లేకపోవడం వల్ల సినిమా తేలిపోయినట్టు కనిపిస్తుంది. ఇక కథలో ట్విస్టులు సరిగా కుదరకపోవడంతో బలమైన కథ కూడా నాసిరకంగా కనిపిస్తుంది. ఓవరాల్‌గా ఈ సినిమా పేలవంగా ఉడికి ఉడకని వంటకంలా మారిందని చెప్పవచ్చు.

ఇక నటీనటుల ఫెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే..హీరో విక్రాంత్‌కు తొలి సినిమా అయినప్పటికీ.. అనుభవం లేకున్నా సినిమా భారాన్నంత తనపైనే వేసుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. నటనపరంగా ఇంకా మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఉంది. హీరోగా బలమైన, భారమైన పాత్రతో తెర మీదకు రావడం సినిమాపై ఆయనకు ఉన్న తపన తెలియజేసింది. ఇక మెహ్రీన్ గ్లామర్ పరంగా ఆకట్టుకొన్నది. రుక్సర్ ఫెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలో కనిపించింది. రుద్రగా సోమసుందరం, కీలక పాత్రలో సుహాసిని ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. వెన్నెల కిషోర్, సత్య కామెడీ పెద్దగా వర్కవుట్ కాలేదు. మిగితా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు.
స్పార్క్ సినిమాలో స్క్రిప్ట్ పరంగా, ఆర్టిస్టుల ఫెర్ఫార్మెన్స్ విషయంలో పలు లోపాలు కనిపించినా.. టెక్నికల్‌గా బ్రిల్లియెంట్‌గా కనిపించింది. సినిమాటోగ్రఫి, మ్యూజిక్, ఆర్ట్ విభాగాలు పనితీరు ఎక్సలెంట్‌గా ఉంది. అందమైన లోకేషన్లలో పాటలు చిత్రీకరణ, హేషమ్ అబ్దుల్ అందించిన పాటలు బాగున్నాయి. ఈ సినిమాకు ప్రొడక్షన్ వ్యాల్యూస్ అత్యంత బలంగా ఉన్నాయి. ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను చాలా రిచ్‌గా నిర్మించారు.

మెడికల్ స్కామ్ బ్యాక్ డ్రాప్‌తో లవ్, ఎమోషన్స్ ఆధారంగా రూపొందించిన చిత్రం స్పార్క్ లైఫ్. మైండ్ కంట్రోల్ అనే కథను తెరపైకి తీసుకు రావడంలో అనేక లోపాలు ఉండటం వల్ల సైంటిఫిక్ థ్రిల్లర్ పర్పస్ నెరవేరలేదనిపిస్తుంది. నటీనటుల కూర్పు, సాంకేతిక విలువలు, బడ్జెట్ పరంగా భారీ తనం కనిపించింది. కథ, కథనాలపై మరింత కసరత్తు చేసి ఉంటే బెటర్ రిజల్ట్స్ వచ్చి ఉండేవనిపిస్తుంది. మీకు తగినంత సమయం, ఓపిక ఉంటే ఈ సినిమాపై ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











