బాపు'లవకుశ'(శ్రీరామరాజ్యం రివ్యూ)
సంస్థ: శ్రీసాయిబాబా మూవీస్
తారాగణం: నందమూరి బాలకృష్ణ, నయనతార, అక్కినేని నాగేశ్వరరావు, మాస్టర్ గౌరవ్, మాస్టర్ ధనుష్‌కుమార్, శ్రీకాంత్, సమీర్, కె.ఆర్.విజయ, వింధు దారాసింగ్, బాలయ్య, బ్రహ్మానందం తదితరులు.
ఆర్ట్:రవీందర్,కిరణ్ కుమార్
ఎడిటింగ్:జి.జి.కృష్ణారావు
ఛాయాగ్రహణం:పి.ఆర్ కె.రాజు
రచన :ముళ్ళపూడి వెంకట రమణ
సంగీతం: ఇళయరాజా
నిర్మాత: యలమంచిలి సాయిబాబు
దర్శకత్వం: బాపు
తెలిసిన కథ,గతంలో ఘన విజయం సాధించిన చిత్రం(లవకుశ రీమేక్)ని మళ్లీ తెరమీదకి కెక్కిస్తున్నారు అనగానే కొత్తగా ఇప్పుడు ఏమి చూపబోతున్నారు,ఏ మార్పులతో ఈ చిత్రాన్ని అందిస్తున్నారు..అనే ఆసక్తి,అంచనాలు సినిమా మొదలైన రోజునుంచి మొదలవ్వటం సహజం.అంతేగాక ఒరిజనల్ లవకుశతో పోల్చి చూసుకుని ఈ సినిమాని నిశితంగా పరిశీలించటం కూడా జరుగుతుంది.ఆ పోలికే ఈ సినిమాను కాస్త ఇబ్బందుల్లో పడేసిందని చెప్పాలి.బాపు ఈ చిత్రాన్ని ఓ పెయింటింగ్ లా తన సర్వ శక్తులు పెట్టి తీసినా,బాలకృష్ణ చాలా కంట్రోలుగా తన హావ భావాలను ప్రదర్శించినా,లవకుశలో ఉన్న మ్యాజిక్ ఇందులో కొరవడింది.ముఖ్యంగా లవకుశకు ప్రాణమైన పాటలు ఈ సినిమాకు మైనస్ గా మారాయి.అయితే లవకుశ తో పోల్చకుండా చూస్తే ఈ సినిమా ఓ కళా ఖండమే.
దాదాపు అందరికీ తెలిసిన ఈ కథ శ్రీరామ(బాలకృష్ణ)పట్టాభిషేకంతో మొదలవుతుంది.ఆ తర్వాత ఓ రజకుడు మాటలు విని శ్రీరామచంద్రుడు తన భార్య సీత దేవి(నయనతార)ని అడవుల్లో వదిలేసి రమ్మంటాడు.అక్కడ ఆమె వాల్మికి(అక్కినేని)ఆశ్రమంలో తలదాచుకుని ఇద్దరు కవలలు లవకుశలకు జన్మనిస్తుంది.ఆ తర్వాత అశ్వమేధయాగం కోసమని బయిలుదేరిన లక్ష్మణుడు(శ్రీకాంత్)ని లవకుశలు ఎదిరించటం..శ్రీరాముడు స్వయంగా రంగంలోకి దిగటం..తన భార్యని,పిల్లలను కలుసుకోవటంతో ముగిసే ఎమోషనల్ డ్రామా.
"ఇప్పటికీ భారతావని అంతా రామరాజ్యం రావాలి అంటూ అనుకుంటూ ఉంటుంది.ఆ రామరాజ్యం ఎలా ఉండేది.రాముని విశిష్టత ఏమిటి.. అన్న విశేషమే శ్రీరామ రాజ్యం" అంటూ శ్రీరామ రాజ్యం చిత్రం గురించి నిర్మాతలు రిలీజ్ కు ముందు చెప్పుకొచ్చారు.అయితే లవకుశ(1963)రీమేక్ గా వచ్చిన ఈ చిత్రంలో శ్రీరామ రాజ్యం ఎలా ఉండేది,ఎలా ఉండాలి వంటివేమీ కనపించవు.ఎంతసేపూ సీతా,రాముల వియోగం,విషాదం,తల్లి తండ్రులను కలిపిన లవ కుశల పాటలతో చిత్రం కథనం నడుస్తుంది.దాంతో రామాయణంలోని మరో కోణాన్ని ఆవిష్కరించబోతున్నారు ..చూద్దాం అని ఆవేశపడిన వారికి ఆశా భంగమే అయ్యింది.ఇక కొన్ని చోట్ల లాగ్ లు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా సీతాదేవిని..లక్ష్మణుడు అడవిలో విడిచిపెట్టినప్పుడు చాలా సేపు వారిద్దరి మధ్యా మెలో డ్రామా నడుస్తూ సహన పరీక్ష పెడుతుంది.అలాగే ఫస్టాప్ లో హఠాత్తుగా ఓ సీన్ ని లవకుశలిద్దరూ ఉయ్యాల ఓపెన్ చేసి నామకరణం చేస్తూండటం మీద ఓపెన్ చేస్తారు.అంతకు ముందు సీన్ కి దీనికి లింక్ ఉండక కొద్దిగా ఇబ్బంది ఎదురవుతుంది.అది ఎడిటింగ్ సమస్య కావచ్చు.స్క్రీన్ ప్లే ..ఉన్నదున్నట్లుగా లవకుశను అనుసరించారు కాబట్టి దాని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిందేమీ లేదు.
ఇలాంటి చిన్న చిన్నవి ప్రక్కన పెడితే బాపు ప్రతీ ప్రేమ్ ని ఓ పెయింటింగ్ లా తీర్చి దిద్దారు."నిజమైన రాజు ప్రజలకు దాసుడు. వారి నమ్మకాన్ని,తీర్పుని గౌరవించాలి "వంటి డైలాగులు సినిమా కంటెంట్ ని రాముడు ఎందుకు తన భార్యని ఓ వ్యక్తి మాటలు నమ్మి వదిలేసాడు వంటి వాటికి సమాదానం ఇచ్చినట్లు ఉండి అలరిస్తాయి.అంతేగాక ఈ కాలపు పాలకులకు ఓ పాఠంలాగ అనిపిస్తాయి.అలాగే లవకుశలో లేని మరో ఎలిమెంట్ ఈ చిత్రంలో ఆంజనేయ స్వామి పాత్రను..సీతాదేవికి వాల్మికి ఆశ్రమంలో సహాయంగా ఉంచటం.ఆ పాత్ర ద్వారా కథలో హాస్యాన్ని అద్దటం రచయిత చమత్కారమే.అందుకు రమణగారుకి హాట్సాఫ్.దర్సకుడు గా బాపు గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకునేదేమీ లేదు.ఆయన ఎప్పటిలాగే ఫ్రేమింగ్స్ ,క్లోజ్-అప్ షాట్స్ తో తన దైన శైలితో చాలా సీన్స్ ని రక్తి కట్టించారు.
ఇక ఈ సినిమాలో మరో ముఖ్యమైన అంశం..బాలకృష్ణ ..తన తండ్రి చేసిన పాత్రలో రాణించాడా,ఇన్నాళ్లూ తన గ్లామర్ తో ఆకట్టుకున్న నయనతార సీతగా ఏ మేరకు ఆకట్టుకుంది అనే విషయం.అయితే బాలకృష్ణ,నయనతార ఇద్దరూ తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారని చెప్పవచ్చు.అయితే వాల్మికిగా కనిపించిన అక్కినేని పాత్రలోనే ఓ మహా రుషికి ఉండాల్సిన శాంతం కనిపించకుండా పోయాయి.లవకుశలుగా,చిన్న ఆంజనేయ స్వామిగా చేసిన పిల్లలు కూడా చాలా అద్బుతంగా నటించి సినిమాకి ప్రాణం పోసారు.మిగతా విభాగాల్లో ముఖ్యంగా ఆర్ట్ ,కాస్ట్యూమ్స్ డిపార్టమెంట్ ల గురించి ప్రత్యేకంగా చెప్పుకుని అభినందించాలి.కెమెరా ఎప్పటిలాగే బాపుగారి పర్మెనెంట్ విజువల్స్ తో అలరించింది.ఎడిటింగ్ మాత్రం మరింత షార్పుగా ఉండి ఉంటే బావుండేదనిపిస్తుంది.ఇక ముందే చెప్పుకున్నట్లు ఈ సినిమాకు ప్రాణమై నిలవాల్సిన సంగీతం మాత్రం ఆ స్ధాయిలో లేదు.అదే మైనస్ అయ్యి నిలిచింది.
చివరగా శ్రీరామరాజ్యం వంటి పౌరాణిక చిత్రం ఈ కాలంలో ఇంత ఖర్చు పెట్టి తీసిన నిర్మాత అభిరుచిని మెచ్చుకుని తీరాలి.ఎందుకంటే ఈ తరానికి కూడా మన రామాయణ,మహాభారతాలు గురించి,వాటి వైశిష్టత గురించి అవగాహన కలిగించే ఇలాంటి సినిమాలు రావాల్సిన అవసరం ఉంది కాబట్టి.ఇక లవకుశ తో పోల్చి చూడకుండా ఇది బాపు లవకుశ ని అని ఫిక్స్ అయి చూస్తే ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేయగలుగుతారు.తెలిసిన కథే అయినా ఎక్కడా బోర్ కొట్టకుండా నడిచే ఈ చిత్రం ఓ మంచి చిత్రంగానే గాక కుటుంబాలని ఆకర్షించి కమర్షియల్ గానూ విజయం సాధించే అవకాశఁ ఉంది.


Click it and Unblock the Notifications











