Srikanth OTT Review: శ్రీకాంత్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: రాజ్ కుమార్ రావు, జ్యోతిక, ఆలయ ఎఫ్, శరద్ కేల్కర్, జమీల్ ఖాన్ తదితరులు
దర్శకత్వం: తుషార్ హిరానందానీ
రచయిత: జగదీప్ సిద్దూ, సుమిత్ పురోహిత్
నిర్మాతలు: భూషణ్ కుమార్, కిషన్ కుమార్, నిధి పర్మార్ హిరానందానీ
సినిమాటోగ్రఫి: ప్రథమ్ మెహతా
ఎడిటింగ్: దెవస్మిత మిత్రా
మ్యూజిక్: ఆనంద్ మిలింద్ తదితరులు
బ్యానర్: చాక్ అండ్ చీజ్, టీ సిరీస్ ఫిల్మ్స్
ఓటీటీ స్ట్రీమింగ్: నెట్‌ఫ్లిక్స్
రిలీజ్ డేట్: 2024-05-10
శ్రీకాంత్ బొల్ల ( రాజ్‌కుమార్ రావ్) అంధత్వంతో పుడుతాడు. అయితే గుడ్డివాడు కావడంతో దేవుడు ప్రసాదించిన బిడ్డను భగవంతుడికే ఇచ్చేయండి అంటూ చంపేయాలని కుటుంబ సభ్యులు సూచిస్తారు. అయితే తల్లి నిరాకరించి అలానే పెంచి.. బ్లైండ్ స్కూల్‌లో చేర్పిస్తుంది. అక్కడ టీచర్ దేవిక (జ్యోతిక) ప్రోత్సాహంతో చదువుల్లో స్కూల్ టాపర్‌గా వస్తుంటాడు. ఈ సమయంలో రాష్ట్రపతి అబ్దుల్ కలాం మెప్పు పొందుతాడు. అయితే 10వ తరగతిలో అత్యధిక మార్కులతో టాప్‌గా నిలిచి.. ఇంటర్‌లో సైన్స్ చదువుకోవాలనుకొంటాడు. కానీ కాలేజీ యాజమాన్యం గుడ్డి వాళ్లకు సీట్ ఇవ్వమని నిరాకరిస్తారు. దాంతో నాకు చదువుకొనే హక్కు కల్పించమని కోర్టును ఆశ్రయిస్తాడు.

ముక్కుసూటి వ్యక్తిత్వం కలిగిన శ్రీకాంత్‌కు బ్లైండ్ స్కూల్‌లో ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? కాలేజీలో అనుమతించక పోవడంతో కోర్టులో తనకు తాను ఎలా వాదించాడు? కోర్టు నుంచి ఎలా అనుమతి తెచ్చుకొన్నాడు? అమెరికాలోని బోస్టన్‌లో ఉన్న ఎంఐటీ (MIT) యూనివర్సీటీలో ఎలా ఫ్రీ సీట్ కొట్టాడు? ఆ యూనివర్సిటీలో చదువుకొనే టైమ్‌లో స్వాతి (అలయ ఎఫ్) ప్రేమలో ఎలా పడ్డాడు? ఏ పరిస్థితుల్లో బొల్లాంట్ అనే పరిశ్రమను స్థాపించి ఉత్తమ పారిశ్రామిక వేత్త అవార్డు అందుకొన్నాడు? ఈ ప్రయాణంలో రవి మంతా (శరద్ కేల్కర్) ఎలాంటి సహాయం అందించారు? రాజకీయాల్లో రెడ్డి పార్టీ ఎలా చీట్ చేసింది? తన ప్రాణ స్నేహితుడైన రవి మంతాతో ఎందుకు విభేధించాడు అనే ప్రశ్నలకు సమాధానమే శ్రీకాంత్ సినిమా కథ.
గుడ్డి వాళ్లంటే రోడ్లపైన అడ్డుక్కొనేందుకే పనికి వస్తారు అనే భావించే వారికి.. ప్రోత్సహిస్తే వాళ్లు ఏదైనా సాధించగలరు.. పట్టుదల ఉంటే ఎలాంటి శారీరక వైకల్యాలు అడ్డు కావు అనే స్పూర్తిని, ప్రేరణను కలిగించే పాయింట్‌తో ఈ సినిమా రూపొందింది. శ్రీకాంత్ బొల్ల సమాజంలోని ప్రతీ ఒక్కరికి ఇన్సిపిరేషన్ ఇచ్చే వ్యక్తిగా కనిపించే ఆయన జీవిత కథలో ఎన్నో మలుపులు, ఎన్నో అవమానాలు కనిపిస్తాయి. వాటిని అధగమించి అత్యున్నత స్థాయికి ఎలా చేరగలిగాడు. రాష్ట్రపతి అబ్దుల్ కలాం లాంటి స్థాయి వ్యక్తిని ఎలా ఆకట్టుకోలిగాడు అనేది అత్యంత ఎమోషనల్ పాయింట్‌గా కనిపిస్తాయి.

దర్శకుడు తుషార్ రాసుకొన్న కథ, స్క్రీన్ ప్లే.. ప్రతీ సన్నివేశంలో మనసులను, మనుషులను కదిలించే డైలాగ్స్ ఈ సినిమాకు ప్లస్‌గా కనిపిస్తాయి. రాజ్ కుమార్ రావ్‌ను ఈ పాత్రలో పరకాయ ప్రవేశం చేయించిన తీరు ఈ సినిమాలో ఓ అద్బుతంగా కనిపిస్తాయి. భావోద్వేగానికి గురిచేసే సన్నివేశాలు సినిమాలో లీనమయ్యేలా చేస్తాయి. స్కూల్‌లో అవినీతి ఎదురించే సీన్, ఎయిర్‌పోర్టులో విమానం ఎక్కనివ్వకపోవడం.. రెడ్డి పార్టీ అవమానించిన తీరు.. అప్పుల బారిన పడి మానసికంగా ఊగిసలాటకు గురికావడం అనే అంశాలు సినిమాను మలుపు తిప్పేలా ఉంటాయి.
శ్రీకాంత్ బొల్ల పాత్రలో ఒదిగిపోయి రాజ్‌కుమార్ రావ్ నటించిన తీరు.. పలికించిన హవభావాలు ప్రతీ ఒక్కరిని మెస్మరైజ్ చేస్తాయి. ప్రతీ సన్నివేశంలో ఆయన ప్రదర్శించిన నటన ఆద్యంతం కట్టిపడేస్తుంది. ఆయన తన ఫెర్ఫార్మెన్స్‌తో గుండెను బరువు ఎక్కించేలా చేస్తాడు. ఆద్యంతం ఈ సినిమాను మరో మెట్టు ఎక్కించే ప్రయత్నం ప్రతీ సీన్‌లోను చేశాడు. ఇక జ్యోతిక, శరద్ కేల్కర్, ఆలయా ఎఫ్ గురించి.. ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వారి నటనను తెరపైనే చూడాలనేది నా అభిప్రాయం. ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే..సినిమాటోగ్రఫి, మ్యూజిక్, ఎడిటింగ్ విభాగాల పనితీరు సినిమాకు ప్రాణం పోశాయి. ప్రథమ్ మెహతా సినిమాటోగ్రఫి పల్లె వాతావరణాన్ని, అర్బన్ మూడ్‌ను బాగా క్రియేట్ చేశాయి. రాజ్ కుమార్ రావ్ హావభావాలను కెమెరాలో బంధించిన తీరు బాగుంది. ఆనంద్ మిలింద్, తనిష్క్ బాగ్చి, సాచెత్ పరంపర, వేద్ శర్మ, ఆదిత్య దేవ్ మ్యూజిక్ పరంగా ఆకట్టుకొన్నారు. ఇషాన్ ఛాబ్రా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. టీ సీరిస్, చాక్ ఛీజ్ ఫిల్మ్స్ అనుసరించిన నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి.
శ్రీకాంత్ బొల్ల జీవిత కథ అందరికి ప్రేరణ, స్పూర్తిని కలిగించే చిత్రం. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నా.. జీవితాన్ని సక్రమ దారిలో పెట్టుకోలేని వారికి ఆయన లైఫ్ స్టోరి ఓ చెంపదెబ్బ. పట్టుదల, అంకుఠిత దీక్ష ఉంటే.. ఏదైనా సాధించగలం అనే ప్రేరణ కలిగించే ఉదాత్తమైన పాత్ర. చిన్నతనంలో దేశానికి తొలి అంధ రాష్ట్రపతి కావాలనే కోరిక ఉన్న ఓ బాలుడు.. అనేక అడ్డంకులను, సమాజం, వ్యవస్థ కలిగించే సమస్యలను, ప్రతికూల పరిస్థితులను ఎలా ఎదిరించి ఉన్నతమైన స్థాయికి చేరుకొన్నాడనే ఇన్సిరేషన్ లైఫ్ జర్నీ శ్రీకాంత్ బొల్ల. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. పెద్దలు మాత్రమే కాదు.. పిల్లలకు తప్పకుండా చూపించాల్సిన సినిమా శ్రీకాంత్.. డోంట్ మిస్ ఇట్.


Click it and Unblock the Notifications











