twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీరామ్‌ చుట్టూ అల్లిన కథ

    By Staff
    |

    Sriram
    మూడు వరుస విజయాలతో గిరాకీ పెంచుకున్న హీరో ఉదయకిరణ్‌. ఆ విజయాల పరంపర ఆయనకు హీరో వర్షిప్‌ను ఇచ్చింది. ఆ హీరో వర్షిప్‌ను ప్రధానంగా చేసుకుని వచ్చిన సినిమా 'శ్రీరామ్‌' అని పేరును బట్టే అర్థం చేసుకోవచ్చు. శ్రీరామ్‌కు ముందు వచ్చిన చిత్రాలు ఉదయకిరణ్‌కు ప్రాధాన్యం ఇచ్చిన సినిమాలు కావు. కథకు, కథనానికి, సన్నివేశ కల్పనకు, పాటలకు, సంగీతానికి, ఇతరేతర అంశాలకు ప్రాధాన్యం ఇచ్చిన సినిమాలవి. ఈ మూడు సినిమాలు విజయం సాధించడంతో ఉదయ్‌కిరణ్‌ హీరోగా గుర్తింపును పొందాడు. శ్రీరామ్‌ ఒక హీరో సినిమా.

    శ్రీరామ్‌ జీవితంలో సంభవించిన ఒక అనూహ్యమైన సంఘటన వల్ల అతని జీవితం మలుపులు తిరుగుతూ కథను నడిపిస్తుంది. ఆ అనూహ్యమైన సంఘటన టూ టౌన్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌తో గొడవ పడడం. అతని గొడవ పడినప్పుడు ఒక పోలీసాఫీసరుతో తలపడుతున్నాననే విషయం శ్రీరామ్‌కు తెలియదు. బీచ్‌లో అమ్మాయిని అల్లరి పెడుతున్న ఒక తాగుబోతుకి బుద్ధి చెప్తున్నానని మాత్రమే అనుకున్నాడు. దీంతో కక్ష పెంచుకున్న సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీరామ్‌పై పగ పెంచుకుని అతన్ని ప్రతిచోటా అడ్డు తగులుతుంటాడు; ఇబ్బందులకు గురి చేస్తుంటాడు. ఉదయ్‌ కిరణ్‌ హీరో వర్షిప్‌ కోసమే అన్నట్లు వాయ్‌లెన్స్‌ ఈ సినిమాలో కొంచెం ఎక్కువే అనిపిస్తుంది.

    సినిమాలో కొన్ని గ్యాప్స్‌ వున్నాయి. శ్రీరామ్‌కు ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగం వచ్చిందా? అతని దరఖాస్తును త్రోసిపుచ్చి కేసు నమోదు చేయాలని ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలేమయ్యాయి? ఈ ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోతాయి. అయితే ఇది ప్రేక్షకుల ఊహాశక్తికి వీటిని వదిలేశారని సరిపెట్టుకుంటే సరిపోతుంది. ఇంకో సమస్య కూడా ఉంది. అకస్మాత్తుగా శివకృష్ణ ఎక్కడి నుంచో ఊడిపడి శంకర్‌ను షూట్‌ చేయడం ఏమిటని ప్రేక్షకులకు అనిపించకమానదు.

    హీరో అనిత క్యూట్‌గా కనిపిస్తుంది. శంకర్‌గా ఆశిష్‌ విద్యార్థి బాగా చేశాడు. పరుచూరి వెంకటేశ్వర రావు హెవీ క్యారెక్టర్‌లో కనిపించాడు. తనికెళ్ల భరణి విలన్‌ తరహా పాత్రను కొట్టిన పిండిలా చేసి చూపించాడు. అవనీతి పేరుకుపోయిన పోలీసాఫీసరుగా శివకృష్ణ నటించాడు. ఆర్‌.పి. పట్నాయక్‌ స్వరపరిచిన ''పెదవుల్లో పెప్సీకోలా...'' పాట ప్రేక్షకులను అలరిస్తుంది. ఆదిత్య దర్శకత్వం వహించిన సినిమాను బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మించారు.

    మూడు చిత్రాల విజయం తర్వాత ఉదయకిరణ్‌ ఇటీవలే తన బర్త్‌డే జరుపుకున్నారు. దీని తర్వాత విడుదలయిన చిత్రం శ్రీరామ్‌. శ్రీరామ్‌ పాత్రలో ఉదయ్‌కిరణ్‌ను ఎలివేట్‌ చేసే ప్రయత్నం జరిగింది. అతనికి ఒక మాస్‌ అప్పీల్‌ను ఇచ్చే ప్రయత్నం ఈ సినిమా ద్వారా చేశారు. రాను రాను ఉదయకిరణ్‌ మాస్‌ హీరోగా ఎదుగుతారా, లేదా అనేది వేచి చూడాల్సిందే. శ్రీరామ్‌ చిత్రం మాత్రం సూపర్‌ డూపర్‌ కాదు, ఒక యావరేజీ చిత్రమని చెప్పక తప్పదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X