Stolen Movie Review: స్టోలెన్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: అభిషేక్ బెనర్జీ, శుభమ్ వర్ధన్, మియా మేల్జర్, హరీష్ ఖన్నా, బేబీ తన్యా, లవ్‌కుష్ కుందు తదితరులు
రచయితలు: కరణ్ తేజ్‌పాల్, గౌరవ్ డింగ్రా, స్వాప్నిల్ సల్కర్
దర్శకత్వం: కరణ్ తేజ్‌పాల్
నిర్మాత: గౌరవ్ డింగ్రా
సహ నిర్మాతలు: నిఖిల్ అద్వానీ, అభిషేక్ బెనర్జీ, అనురాగ్ కశ్యప్, కిరణ్ రావు, స్వాప్నిల్ సల్కర్, విక్రమాదిత్య మోత్వానీ తదితరులు
కో ప్రొడ్యూసర్: నిరంజన ఉన్నికృష్ణన్
సినిమాటోగ్రాఫర్: ఇషాన్ ఘోష్, సచిన్ పిల్లై
ఎడిటర్: శ్రేయాస్ బెల్టాంగ్డీ
బ్యానర్: జంగిల్ బుక్ స్టూడియో
ఓటీటీ రిలీజ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
ఓటీటీ రిలీజ్ డేట్: 2025-06-04
ఓ రైల్వే స్టేషన్‌లో జంపా ( మియా మేల్జర్) అనే మహిళ కొద్ది రోజుల క్రితం పుట్టిన తన బిడ్డ చంపా (బేబీ తన్యా)తో ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ నిద్రలోకి జారుకొంటుంది. ఆ సమయంలో తన ఒడిలో నుంచి ఎవరో తన కూతుర్ని దొంగిలిస్తారు. నిద్ర నుంచి లేచి చూసే సరికి బిడ్డ కనిపించకపోవడంతో ఏడుపు మొదలు పెడుతుంది. ఆ సమయంలో రైల్వే స్టేషన్‌లో ఉన్న సోదరులు గౌతమ్ భన్సాల్ (అభిషేక్ బెనర్జీ), రామన్ భన్సాల్ (శుభమ్ వర్ధన్) ఆమె బిడ్డ కోసం వెతుకుతారు. పోలీసులు వచ్చి అందర్నీ అనుమానిస్తారు. కానీ బిడ్డను ఫలానా వాళ్లు దొంగిలించారని ఓ హింట్ జంపా ఇవ్వడంతో ఆమెకు సహాయం చేయాలని పోలీసులు, భన్సాల్ సోదరులు బయలుదేరుతారు.

రైల్వే స్టేషన్‌లో దొంగిలించబడిన బిడ్డ చంపా అసలు జంపా కూతురేనా? ఎవరో తెలియని జంపా కోసం భన్సాల్ సోదరులు ఎందుకు సహాయం చేయాలనుకొంటారు? బిడ్డను భన్సాల్ సోదరులు దొంగిలించారని ప్రతీ గ్రామంలోని పౌరులు వారిని ఎందుకు తరిమి తరిమి చంపాలని వేటాడుతారు? భన్సాల్ సోదరులను జంపా మోసగించిందా? చంపాను ఎవరు దొంగిలించారు? గ్రామస్థుల చేతిలో చావు దెబ్బలు తిని ప్రాణాలు కోల్పోయే దశకు చేరుకొన్న భన్సాల్ సోదరులు పరిస్థితి ఏమిటి? చివరకు జంపాకు తన బిడ్డ చంపా దొరికిందా? ఈ ముగ్గురి మధ్య జరిగిన కథకు ముగింపు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే స్టోలెన్ (Stolen) సినిమా కథ.
బాలీవుడ్‌లోని ప్రముఖ దర్శకులు నిఖిల్ అద్వానీ, అభిషేక్ బెనర్జీ, అనురాగ్ కశ్యప్, కిరణ్ రావు, స్వాప్నిల్ సల్కర్, విక్రమాదిత్య మోత్వానీ తదితరులు ఈ సినిమాకు సహ నిర్మాతలుగా వ్యహరించారు. కరణ్ తేజ్‌పాల్, గౌరవ్ డింగ్రా, స్వాప్నిల్ సల్కర్ రచనా సహకారం అందించగా.. కరణ్ తేజ్‌పాల్ దర్శకత్వం వహించారు. చిన్నారి చోరికి గురి కావడం అనే చిన్నపాయింట్ చుట్టూ అల్లుకొన్న కథనం, ట్విస్టులు, వాటి బ్యాక్ డ్రాప్‌లో జొప్పించిన సన్నివేశాల్లోని భావోద్వేగాలు కొన్నిసార్లు అతలాకుతలం చేస్తాయి. ఛేజింగ్, యాక్షన్ డ్రామాను నడిపించిన విధానం దర్శకుడు టాలెంట్‌కు అద్దం పట్టిందనే చెప్పాలి. గంటన్నర నిడివి ఉన్న సినిమాలో ఒక్క సన్నివేశం కూడా దృష్టిని పక్కకు మరల్చకుండా చిత్రీకరించిన విధానానికి హ్యాట్సాఫ్ చెప్పాలి. ప్రేక్షకుడిని కూడా కథతో డ్రైవ్ చేసేందుకు రాసిన స్క్రీన్ ప్లే అద్బుతంగా ఉంటుంది.
స్టోలెన్ సినిమాలో నటించిన ప్రతీ పాత్ర నూటికి నూరు శాతం తమ టాలెంట్‌ను ఎక్స్‌ప్లోడ్ చేశారు. జంపాగా మియా మేల్జర్ తన పాత్రలో జీవించారు. గౌతమ్‌గా అభిషేక్ బెనర్జీ, రమన్‌గా శుభమ్ తమ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశారు. మానసిక సంఘర్షణ, ఎమోషన్స్, హ్యుమానిటీ లాంటి అంశాలను తమ పాత్రల ద్వారా ఈ ముగ్గురు అద్బుతంగా తెర మీద పలికించారు. ఈ సినిమాలో కనిపించిన వారంతా తమ మార్క్ చూపించారు.
యాక్షన్, ఛేజింగ్, ఎమోషనల్ అంశాలతో సాగే ఈ సినిమాకు ఇషాన్ ఘోష్, సచిన్ పిల్లై అందించిన సినిమాటోగ్రఫి స్పెషల్ ఎట్రాక్షన్. కారు, బైక్ ఛేజింగ్ సీన్లు, అలాగే గొడవలు, కొట్లాటలను అత్యంత సహజంగా కెమెరాలో బంధించాడని చెప్పాలి. శ్రేయాస్ బెల్టాంగ్డీ సినిమాను ఎడిట్ చేసిన తీరు.. మూవీని పరుగులు పెట్టించింది. మూవీలో ఒక్క ఫ్రేమ్ కూడా పనికి రాదు అని ఎక్కడ అనిపించకుండా ఎడిట్ చేశాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రాణంగా నిలిచింది. గౌరవ్ డింగ్రా అనుసరించిన నిర్మాణ విలువలు సూపర్‌గా ఉండటమే కాకుండా.. హై స్టాండర్డ్స్ చూపించాయి.
స్టోలెన్ మూవీ అరుదుగా వెండితెర మీద ఆవిష్కృతమయ్యే గొప్ప కంటెంట్, యాక్టర్ల ఫెర్ఫార్మెన్స్ ఉన్న మూవీ. ఈ సినిమా కోసం రూపొందించిన స్క్రీన్ ప్లే, ఎంచుకొన్న యాక్టర్లు, సాంకేతిక విభాగాల పనితీరు ప్లస్ పాయింట్స్. మైనస్ అని చెప్పడానికి ఏమీ లేవు. 90 నిమిషాలపాటు ఏకధాటిగా సాగే ఎమోషనల్ డ్రైవ్. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. తగినంత టైమ్, మూడ్ సెట్ చేసుకొని.. ఒకే స్ట్రెచ్‌లో సినిమాను చూసేయండి.. ఈ సినిమా చూసిన తర్వాత కాసేపు ఓ అనుభూతి గురి.. ఆ మూవీ కలిగించే ఇంపాక్ట్ నుంచి బయటపడటానికి తప్పకుండా కొంత సమయం తీసుకొంటారు. అలాంటి ఫీలింగ్‌ను ఈ సినిమానే కాదు.. నటీనటులు కల్పిస్తారు. డోంట్ మిస్.. తప్పకుండా చూడండి..


Click it and Unblock the Notifications











