ఫర్వాలేనిస్టూడెంట్!

చిత్రం: స్టూడెంట్ నెం.1
నటీనటులు: ఎన్టీఆర్, గజాలా, రాజీవ్ కనకాల
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
స్క్రీన్ ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ, నిర్మాత: రాఘవేంద్రరావు
దర్శకత్వం: రాజమౌళి
ప్రథమార్థం చక్కగా ప్రారంభమై, సెకండ్ హాఫ్ పాత రూట్ లోనే సాగే ఈ చిత్రం మొత్తమ్మీద ఫర్వాలేని చిత్రం. కాలేజ్ నేపథ్యానికి సెంటిమెంట్ జోడించి తీసిన చిత్రం ఇది. ఇంటర్వెల్ వరకూ సీన్స్ చకాచకా సాగిపోతూ హాయిగా ఉంటుంది. కానీ ఆ తర్వాతే రాఘవేంద్రరావు వెనకటి సినిమాల మాదిరిగా సెంటిమెంట్, ఫైటింగ్ సీన్స్ కలిసి కొంత చికాకుగా ఉంటుంది. కీరవాణి సంగీతం ఈ చిత్రానికి ఎస్సెట్.
ఎన్టీఆర్ లా కాలేజ్ లో చేరుతాడు. లాయర్ కావడం ఆయన జీవితాశయం. ఇదే కాలేజ్ లో చదువుకునే రాజీవ్ కనకాల ఓ చిన్నపాటి రౌడీ. ఎవర్నీ చదవనివ్వకుండా అల్లరి చేస్తుంటాడు. గజాలా కూడా ఇదే కాలేజ్ లో చదువుకుంటుంది. అమాయకంగా ఉంటూ ఎన్టీఆర్ చేష్టలు చూసి ఆమె ప్రేమలో పడుతుంది. రాజీవ్ ను అడ్డుకునేందుకు ఎన్టీఆర్ ప్రేమ పాఠాలు నేర్పుతాడు. గజాలా ప్రేమలో పడ్డ రాజీవ్ మారిపోతాడు. కానీ గజాలా తనను ప్రేమించడం లేదని తెలవడంతో ఆమెపై యాసిడ్ పోసేందుకు ప్రయత్నిస్తాడు. అప్పుడు హీరోగారు అడ్డుకొని తన ఫ్లాష్ బ్యాక్ చెప్పుతాడు.
ఫ్లాష్ బ్యాక్ లో హీరోగారు ఓ అమ్మాయిని కాపాడబోతుంటే, యాక్సిడెంటల్ గా ఒక వ్యక్తి చనిపోతాడు. హత్యానేరం కింద ఎన్టీఆర్ ను జైల్ కు పంపిస్తారు. తండ్రి ఆశయం నేరవేర్చేందుకు- జైల్లో ఉంటూనే లా చదువుతుంటాడు. చివరికి లాయరై ఏం చేస్తాడనేది క్లైమాక్స్.
ఎన్టీఆర్ శరీరాకృతి లావుగా ఉన్నా గొంతు పీలగానే ఉంది. ఆయనతో ఆవేశమైన డైలాగ్ లు చెప్పించడం ఎందుకో! వాళ్ళ తాత పోలికలున్నందున దాన్ని క్యాష్ చేసుకునేందుకు దర్శక, నిర్మాతలు ప్రయత్నించారు. ఎన్టీఆర్ నటన సాధారణం. గజాలా బాగుంది. రాఘవేంద్రరావు పాటలకు తగ్గట్లే ఉంది. ఈ చిత్ర దర్శకుడు రాజమౌళి ఐనా, స్టైల్ అంతా రాఘవేంద్రరావుదే. కీరవాణి పాటలు ఈ చిత్రానికి ప్రాణం. హరి అనుమోల్ ఫోటోగ్రఫీ ఓకే. మొత్తమ్మీద ఫర్వాలేని చిత్రం.


Click it and Unblock the Notifications











