twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సంగీతాభిమానులకు నచ్చే స్వరాభిషేకం

    By Staff
    |

    Swaraabhishekam
    -జోశ్యుల సూర్యప్రకాష్‌
    చిత్రం: స్వరాభిషేకం
    నటీనటులు: కె.విశ్వనాథ్‌, ఊర్వసి, శ్రీకాంత్‌, లయ, శివాజీ,
    ఆముక్త మాల్యద, శివాజీరాజా, సురేఖ, ఎవిఎస్‌,
    గుండు హనుమంతరావు, ఎంఎస్‌ నారాయణ
    సంగీతం: విద్యాసాగర్‌
    కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.విశ్వనాథ్‌
    మాటలు: రమేష్‌, గోపీ

    సుదీర్ఘ విరామం తర్వాత (సుమారు ఏడేళ్ళు) కళాతపస్వి కె.విశ్వనాథ్‌ తనదైన బాణిలో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి చేసిన ప్రయత్నం 'స్వరాభిషేకం'. సఖ్యంగా ఉండే అన్నదమ్ముల మధ్య కానీ స్నేహితుల మధ్య కానీ మూడో వ్యక్తి ప్రవేశిస్తే స్పర్ధలు రావడం సహజం. సంగీతాన్ని నమ్ముకుని, అమ్ముకుని (సినిమా మ్యూజిక్‌ డైరెక్షన్‌) జీవిస్తున్న శ్రీరంగం బ్రదర్స్‌లో చిన్నవాడైన శ్రీరంగాచార్యులుకి (శ్రీకాంత్‌) సురేఖ (లయ)తో రెండో పెళ్ళి అవుతుంది. తన భర్త మీద అపార విశ్వాసం గల ఆమెకు బావగారితో కలిసి డబ్బు, కీర్తి పంచుకోవడం ఇష్టం ఉండదు. దానితో ఆమె వంకర మాటలు మాట్లాడుతూ ఉంటుంది.

    బాధ పడిన బావగారు(విశ్వనాథ్‌) తాను ఉన్నంత వరకు తన విలువ తెలిసిరాదని ఉద్దేశపూర్వకంగా తగాదా పెట్టుకుని హరిద్వార్‌ వెళ్ళిపోతాడు. దానితో షాక్‌ తిన్న తమ్ముడికి నోరు పడిపోతుంది. సంగీత దర్శకత్వం చేయలేకపోతాడు. పశ్చాత్తాపంతో అన్నగారిని వెదుక్కుంటూ హరిద్వార్‌ వెళ్ళిపోతాడు. హోమియో వైద్యుడు కూడా అయిన విశ్వనాథ్‌ తమ్ముడికి వైద్యం చేసి స్వరం తెప్పించడంతో కథ సుఖాంతమవుతుంది.

    ఈ చిన్న కథలో కథకు సంబంధం లేని ఎన్నో ట్రాకులు వచ్చి పోతూ ఉంటాయి. శివాజీ, ఆముక్తలది ప్రేమ ట్రాక్‌. శివాజీ గాయకుడు కావాలని శ్రీరంగం బ్రదర్స్‌ వెనుక తిరుగుతూ ఉంటాడు. వేరే పనులు, ఇతర ప్రయత్నాలు లేకుండా అదే పనిగా వీళ్ళ వద్దకు వస్తుంటాడు. శ్రీరంగం బ్రదర్స్‌కి ప్రారంభంలో (ఫ్లాష్‌బ్యాక్‌) అమెరికాకు ఆహ్వానం తెప్పించి వారి జీవితాలను నిలబెట్టిన జంటది మరో ట్రాక్‌. శ్రీరంగం బ్రదర్స్‌చే సంగీత చికిత్స చేయించుకున్న జంట (శివాజీరాజా, సురేఖ)ది మరో ట్రాక్‌. శ్రీకాంత్‌ మొదటి భార్య పిల్లలది మరో ట్రాక్‌. నరేష్‌, సన లయ తలిదండ్రులుగా మరో ట్రాక్‌. వీళ్ళు లేకపోయినా కథకు వీసమంత కూడా హాని జరగదు.

    శివాజీ తల్లి మీద సెంటిమెంట్‌ బాగా పండింది. మరణించిన భర్త రాసి పోయిన పాటలను కొడుకు స్వరం ద్వారా వినాలన్నది ఆమె ఆకాంక్ష. కానీ శివాజీ ఆ లక్ష్యం కోసం సీరియస్‌గా ప్రయత్నించినట్టు ఎక్కడా కన్పించదు. కె.విశ్వనాథ్‌ సినిమాల్లో రెగ్యులర్‌గా శాస్త్రీయ సంగీతం కోసం తపన పడే పాత్రలు ఉంటాయి. సంగీత ప్రధానంగా చెప్పుకుంటున్న ఈ సినిమాలో అటువంటి పాత్రలు కన్పించవు. కొద్ది పరిచయంతోటే తాను దేవుడిలా కొలిచి తిరిగే శ్రీకాంత్‌ని శివాజీ చాలా చనువుగా పలకరించడం అసహజంగా ఉంటుంది.

    శ్రీకాంత్‌- లయ ప్రేమ సన్నివేశాలు కృతకంగా ఉన్నాయి. సంగీత విధ్వాంసుడు ప్రేమ సాగరంలో మునిగిపోకూడదనుకుని తీసిన సన్నివేశాల్లా ఇవి ఉన్నాయి. టీవీ యాంకర్‌గా పరిచయమైన లయ ఎప్పుడూ యాంకరింగ్‌ చేసినట్టు కన్పించదు. పెళ్ళికి ముందు పాష్‌గా స్పీడ్‌గా ఉండే లయ మాటలు, చేతలు పెళ్ళి కాగానే హఠాత్తుగా ముత్తయిదువులా మారిపోతాయి. పాష్‌గా తిరిగిన లయ యశోద కృష్ణ పద్యాలు రాగయుక్తంగా పాడి శ్రీకాంత్‌ మనసు దోచుకుంటుంది. ఇంగ్లీషు మీడియం పిల్ల పద్యాలు ఎలాపాడుతుంది? సంగీత పరిచయం లేని లయ విశ్వనాథ్‌ ఎదుట పాట పాడి ఆయన అభిమానం చూరగొంటుంది. చివరి సీన్‌కు వచ్చేసరికి కచేరిలో వీణ వాయించి ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తుంది.

    సనాతనంగా కన్పించే విశ్వనాథ్‌ లయ తల్లి ఒప్పుకోకపోయినా తమ్ముడి పెళ్ళిని ఆమెతో జరిపించేయడం పాత్రోచితంగా అన్పించదు. శ్రీకాంత్‌ తన మొదటి భార్య పిల్లలతో కలవడం ఎక్కడా కన్పించదు. ఆ పిల్లల పాత్రలు గానీ, మొదటి భార్య కేరక్టర్‌గానీ కథకు సంబంధం లేనట్టు కన్పిస్తాయి. రమేష్‌-గోపీల మాటలు ఏ ప్రత్యేకతా లేకుండా సాదాసీదాగా ఉన్నాయి. విశ్వనాథ్‌ సినిమాకు జంధ్యాల మాటలు లేని లోటు కన్పించింది. పాటలు, సంగీతం బాగున్నాయి.కెమెరా వర్క్‌ కూడా ఆహ్లాదకరంగా ఉంది. ఈ సినిమా కుర్రకారును ఆకర్షించకపోయినా వృద్ధులకు ఒక మంచి సినిమా చూశామన్న అనుభూతిని కలిగిస్తుంది. ఆముక్తమాల్యద నటన హైలైట్‌.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X