twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చూస్తే అంతే!!('నేనింతే' రివ్యూ)

    By Staff
    |

    Neninthe
    -జోశ్యుల సూర్య ప్రకాష్


    నటీనటులు:రవితేజ,సియా,సుబ్బరాజు,ముమాయిత్ ఖాన్,కృష్ణ భగవాన్,
    సురేఖా వాణి,సుప్రీత్,బ్రహ్మానందం,వేణు మాధవ్,రమా ప్రభ,
    షాయాజీ షిండే తదితరులు.
    సంగితం:చక్రి
    కెమెరా:శ్యామ్ కె.నాయుడు
    ఎడిటింగ్:వర్మ
    ఆర్ట్:చిన్నా
    ఫైట్స్:రామ్-లక్ష్మణ్
    నిర్మాత:డివివి దానయ్య
    కథ,స్క్రీన్ ప్లే,డైలాగులు,స్క్రీన్ ప్లే,దర్శకత్వం:పూరీ జగన్నాధ్
    రిలీజ్ డేట్:18 డిసెంబర్ 2008

    ఇన్నాళ్ళుగా తనను ఆదరించిన సినీ ప్రపంచాన్ని..అందులోని మంచి,చెడులను,కష్టాలను విశ్లేషిస్తూ..ఓ రివ్యూలా పూరీ రూపొందించిన చిత్రం నేనింతే. అయితే సినిమా చూడకుండా రీడర్స్ రివ్యూ చదివేటప్పుడు ఆ విశ్లేషణ ఎట్లా పూర్తిగా అర్ధం కాదో అట్లానే...సినీ పరిశ్రమ లోతుపాతులు,అక్కడి రాజకీయాలు గురించి తెలియని మామూలు ప్రేక్షకులకి ఈ నేనింతే సినిమా అర్ధంకాకుండా అసహనంగా మారి పోయింది. అందులోనూ గతంలో పూరీ-రవితేజ కాంబినేషన్ లో వచ్చిన హిట్స్ ని దృష్టిలో పెట్టుకుని వచ్చిన వారికి నేనింతే లో సరైన కథ,కథనాలు లేకపోవటం మరింత నిరాశపరిచే అంశం. అయితే ఇంత బోరు సినిమాలోనూ రవితేజ మాత్రమే కాస్త రక్షించే అంశం.

    కృష్ణానగర్ లో చాలామందిలాగానే రవి(రవితేజ) అసెస్టెంట్ డైరక్టర్ గా పనిచేస్తూ..అవకాశాలు కోసం ప్రయత్నాలు చేస్తూంటాడు. ఇక సినిమాటిక్ గా అతనికో కాన్సర్ తల్లి(రమాప్రభ),విచిత్రమైన కష్టాలున్న గర్ల్ ప్రెండ్ సంధ్య(సియా)కామన్ . ఇక రెగ్యులర్ మసాలా కోసం అతని గర్ల్ ప్రెండ్ ని వర్షం సినిమాలో విలన్ లా ఆమె బ్రోకర్ బావ(కృష్ణ భగవాన్) అమ్మేద్దామని చూస్తూంటాడు.మరో ప్రక్క ఆమెను ఎట్లా అయినా అనుభవించాలని ఓ వీధి రౌడీ యాదు(సుప్రీత్) తిరుగుతూంటాడు. వీటన్నిటితో పోరాడి ఆమెను రక్షించుతూ రవి తన జీవిత లక్ష్యమైన సినిమాని ఎట్లా తీసాడన్నది తెరపై చూసి ఆనందించాల్సిందే.

    ఇక ఈ సినిమా బోర్ కొట్టడానికి కారణం ..హీరో చుట్టూతా రకరకాల సమస్యలు తిరుగుతూంటాయి గాని, ఎక్కడా హీరో మాత్రం పొరపాటున కూడా సమస్యలో పడడు.దాంతో ఎక్కడో ప్రీ క్లైమాక్స్ లో విలన్ వచ్చి అతన్ని సమస్యలో పడేసే దాకా కథ కదలదు. ఎంత సేపు రివ్యూ రైటర్స్ పై డైలాగులు,ప్రేక్షకులు ఎలా సినిమా చూడాలనే సందేశాలు,గాసిప్స్ కాలమ్ పై విరుచుకు పడటం,హీరోయిన్ అందాలు చూపటమే సరిపోయింది. అలాగే పూరీ స్పెషలైజేషన్ అయిన క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో లోపించింది.

    సీరియస్ గా పూరీ తెలుగు పరిశ్రమలోని సమస్యలను భుజాన ఎత్తుకోదలిస్తే..ముందుగా పరిశ్రమలో పాతుకుపోయిన కులవివిక్షని తెగనాడాలి. అలాగే పెద్ద హీరోలు..చిన్న వాళ్ళను డేట్స్ విషయంలో ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో చెప్పాలి.తెలుగు హీరోయిన్స్ ఎందుకు ఎంకరేజ్ చేయటం లేదో చెప్పాలి. ఎందుకు భార్గవి లాంటి వాళ్ళు ఆత్మహత్యలు లేదా హత్యలకు గురి అవుతున్నారో చెప్పాలి. హీరోయిన్స్ అవుదామని వచ్చిన చాలామంది ఎలా వ్యబిచారంలోకి నెట్టబడుతున్నారో చెప్పాలి. అసెస్టెంట్ డైరక్టర్స్ ఎలా సఫరవుతున్నారో...పెద్ద డైరక్టర్స్ ఎలా చిన్న చూపు చూస్తారో చెప్పాలి. ఓ అధ్భుతమైన కాన్సెప్ట్ ప్రేక్షకుడుని చేరే లోగా ఎలా ఖూని అవుతోందో వివరించాలి. చిన్న నిర్మాతలను పెద్ద వాళ్ళు ఎలా సఫర్ చేస్తున్నారో ..కాంటింపరరీ ఇష్యూష్ ముట్టుకోవాలి.ఇక ఈ సినిమాలో పాటుల్లో కృష్ణా నగరే అన్న పాట ఒకటి బాగుంది. కెమెరా,ఎడిటింగ్ ..డైరక్షన్ కి తగినట్లే సాగాయి.ఎప్పుడూ డైలాగులు అధ్బుతంగా రాసే పూరీ ఈ సారి బాగా బూతులను ఆశ్రయించటం చాలా దారుణం.

    ఫైనల్ గా ఈ సినిమా చివరలో రవితేజతో డైరక్టర్ "ఈ సినిమా హిట్టయినా ఫ్లాఫయినా సినిమాలు తీస్తూనే ఉంటాను" అనిపిస్తాడు. అంటే ఆయన ముందే ఫ్లాపని ఫిక్సయినట్లున్నాడు. ఇక ఆలోచించుకోవాల్సింది మనమే.

    (ఇక ఈ సినిమా ద్వారా పూరీ చాలా ప్రశ్నలు అందరికి వేశాడు..ఆసక్తి ఉన్న వారికి మాత్రమే)

    ఎన్నారైలు ఎనిమిది డాలర్లు ఖర్చవుతాయని ఆలోచించి సినిమాకి వెళ్ళకుండా రివ్యూలు చదువుతున్నారని..అయితే పూరీ కున్నంత విచ్చలవిడి డబ్బు,టైమ్ వారి దగ్గర ఉండద్దా అనేది ఆలోచించి ఈ ప్రశ్న వేస్తే బాగుండేది. అలాగే ముమాయిత్ ఖాన్ క్యారెక్టర్ ని చూపి ఆమెపై గాసిప్స్ వెబ్ సైట్స్ ,ప్రింటు మీడియా రాస్తున్నాయని,దానికోసం ఆమె ఆత్మహత్యా ప్రయత్నం దాకా వెళ్ళిందని చూపాడు. అయితే నిజంగా వాళ్ళు అంత నిక్కచ్చిగా బ్రతకుతున్నారా...అలాగే అంత ఫీలియ్యే వాతావరణం ఉందా అనేది ప్రక్కన పెడితే క్రైమ్,సెక్స్ లేకుండా ఆయనెప్పుడన్నా సినిమా తీసాడా అన్నది ప్రశ్న. ఇక నాణానికి రెండు వైపులా ఉన్నట్లే సినిమా హిట్ అని రివ్యూలు రాసినప్పుడు పూరీ లాభపడుతున్నాడుగా. ఫ్లాఫ్ అని రాసినప్పుడే ఈ భాధ అంతా. సినిమా ఓ మాదిరి హిట్ అయితే ఈ రోజు మీడియా దాన్ని సూపర్ డూపర్ హిట్ రేంజికి తీసుకెళ్ళోందన్నది అందరికీ తెలిసిన అంశమే. చివరగా రివ్యూలు రాసేవారికి అంత తెలివి ఉంటే వాళ్ళే కథలు అమ్ముకోవచ్చు కదా అన్నాడు. కరెక్టే...వాళ్ళకి తెలివిలేదు.ఆమ్లెట్ రుచి చెప్పే వాడికి కోడి గుడ్డు పెట్టడం తెలియాల్సిన పని లేదు కదా. అలాగే రివ్యూ రైటర్స్ నాలెడ్జ్ ఎంత అని ప్రశ్నించిన ఆయన్ని ఎవరన్నా...మీరేమన్నా కె.విశ్వనాధా,జార్జ్ లూకస్సా,లేక ఆదిత్యా చోప్రానా,రామ్ గోపాల్ వర్మా.. మీ నాలెడ్జ్ ఎంతఅని అడిగితే...ఒక వేలు ఎదుటి వారి వైపు చూపెడితే నాలుగు వేళ్ళు మన వైపుకే చూస్తూంటాయి. అవంతే. ఏం చెయ్యలేం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X