Thandel Movie Review: తండేల్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: నాగచైతన్య, సాయిపల్లవి, ప్రకాశ్ బెలవాడీ, రావు రమేష్, కరుణాకరన్, బబ్లూ పృథ్వీరాజ్, మహేష్ ఆచంట, దివ్య పిళ్లై, ఆడుక్కాలమ్ నరేన్ తదితరులు
దర్శకత్వం: చందూ మొండేటి
నిర్మాత: బన్నీ వాసు
సమర్పణ: అల్లు అరవింద్
మ్యూజిక్: దేవీ శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫి: శ్యామ్ దత్
ఎడిటర్: నవీన్ నూలీ
సాహిత్యం: శ్రీ మణి
ఆర్ట్: నాగేంద్ర
బ్యానర్: గీతా ఆర్ట్స్
రిలీజ్ డేట్: 2025-02-07
జాలరి కుటుంబాలకు చెందిన రాజు (నాగచైతన్య), సత్య (సాయిపల్లవి) చిన్నతనం నుంచి ప్రేమించుకొంటారు. ప్రతీ ఏటా కొన్ని నెలలు పాటు వేటకు రాజు తన గ్రామస్థులతో కలిసి వెళ్తుంటారు. అలా కొన్ని నెలలపాటు రాజు కోసం ఎదురు చూస్తూ ఆయన ప్రేమకై పరితపిస్తుంటుంది. ఈ క్రమంలో భారీ తుఫాన్‌లో చిక్కుకొన్న రాజు బృందం భారతీయ సముద్ర జలాల సరిహద్దు దాటి పాకిస్థాన్‌లోకి ప్రవేశిస్తారు. ఇక ఇదిలా ఉండగా, తన ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన రాజును కాదనుకొని వేరే వ్యక్తితో సత్య పెళ్లికి సిద్దపడుతుంది.

రాజు, సత్య మధ్య ప్రేమ వ్యవహారం ఎలా సాగింది? సత్యకు ఇచ్చిన మాటను రాజు ఎందుకు తప్పాడు? సత్యకు ఏం మాట ఇచ్చాడు? ఎందుకు మాటను తప్పాల్సి వచ్చింది? మాట తప్పిన రాజుకు శిక్ష విధించేందుకు సత్య ఎలాంటి నిర్ణయం తీసుకొన్నది? పాకిస్థాన్ పోలీసులకు పట్టుబడిన రాజు బృందానికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? తండేల్ అంటే లీడర్‌గా తనతో పాటు వచ్చిన 22 మంది జాలర్ల కోసం ఎలాంటి తెగింపుకు పాల్పడ్డాడు. పాకిస్థాన్ జైలు నుంచి విడుదలకు అనుమతి లభించినా రాజు బృందం ఎందుకు బయటకు రాలేకపోయింది? వేరే వ్యక్తితో సత్య పెళ్లికి సిద్దపడిన విషయం తెలిసిన రాజు రియాక్షన్ ఏమిటి? చివరకు పాక్ జైలు నుంచి ఎలాంటి కండీషన్ల మధ్య రాజు బృందం విడుదలైంది? సత్య, రాజు ప్రేమ కథకు ముగింపు ఏమిటనేది ఈ సినిమా కథ.
ఉత్తరాంధ్రలో జరిగిన యదార్థ సంఘటనను ఆధారంగా చేసుకొని దర్శకుడు చందూ మొండేటి ఎంచుకొన్న పాయింట్ బాగుంది. స్టోరీ పాయింట్ చుట్టు రాసుకొన్న లవ్ ట్రాక్ సినిమాకు ప్రాణంలా నిలిచేలా చేశాడు. కానీ కథ చెప్పడంలోను సాగదీసి సాగదీసి విసిగించేలా కొన్ని సీన్లు పెట్టుకోవడం పంటి కింద రాయిలా అనిపిస్తుంది. ఇక సాయిపల్లవి, నాగచైతన్యను బాగా నమ్ముకొని.. మిగితా క్యారెక్టర్లకు బీ గ్రేడ్ యాక్టర్లను ఎంచుకోవడం వల్ల సినిమాకు రావాల్సిన ఫీల్, స్టేటస్ మిస్ అయిందనే ఫీలింగ్ కలుగుతుంది. సాయిపల్లవికి పెళ్లి చేసుకోవాలనుకొన్న వ్యక్తిని నాసిరకమైన యాక్టర్ పెట్టడం వల్ల మూవీకి కనెక్టివిటీ మిస్ అయిందనిపిస్తుంది. కాకపోతే సాయి పల్లవి, చైతూ కోసం రాసుకొన్న సన్నివేశాలు ఫస్టాఫ్‌కు ప్లస్ పాయింట్‌గా మారాయి.

ఇక సెకండాఫ్ విషయానికి వస్తే.. పాకిస్థాన్ ఎపిసోడ్ విషయంలో స్క్రిప్టుపరంగా చాలా లోపాలు కనిపించాయి. సినిమాటిక్ లిబర్టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల కథలో ఉండే ఇంటెన్సిటీ, జెన్యూనిటీ తేలిపోయింది. ఇక సెకండాఫ్‌లో కొన్ని సీన్లు ఎమోషన్స్‌ను బ్రేక్ చేశాయనిపిస్తుంది. ఇలాంటి లోపాలన్నింటిని సాయిపల్లవి తన ఫెర్ఫార్మెన్స్, ప్రజెన్స్‌తో సరిదిద్దిందనే చెప్పవచ్చు. ఇక కీలక సన్నివేశాల్లో ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుంచి వచ్చే కొన్నీ ఎపిసోడ్స్‌లో నాగచైతన్య యాక్టింగ్ హైలెట్‌గా అనిపిస్తుంది. కొన్ని సీన్లు సాగదీసినట్టు, మరికొన్ని సీన్లు ఎమోషనల్ ఉండటంతో మిక్స్‌డ్ ఫీలింగ్స్‌తో ఎట్టకేలకు సినిమా ముగిసిందనే ఫీలింగ్ కలుగడం సహజంగానే అనిపిస్తుంది.
తండేల్ సినిమాను ఆద్యంతం సాయిపల్లవి మెట్టు ఎక్కించే ప్రయత్నం చేసింది. కథాపరంగా ఉన్న కొన్ని లోపాలను కూడా తన పెర్ఫార్మెన్స్‌తో కనిపించకుండా చేసేలా నటించింది. సత్య పాత్రలో జీవించింది. చాలా సన్నివేశాల్లో ఉద్వేగభరితమైన నటనతో ప్రేక్షకుడిని కంటతడి పెట్టించేలా చేస్తుంది. నాగచైతన్య విషయానికి వస్తే.. తన కెరీర్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. రాజు పాత్రను ఓన్ చేసుకొని నటించిన విధానం బాగుంది. యాక్షన్, ఎమోషన్స్, లవ్ ట్రాక్‌లో చైతూ, సాయిపల్లవి జోడి ఇరగదీసిందనే చెప్పొచ్చు. మిగితా పాత్రల్లో దివ్య పిళ్లై, బబ్లూ పృథ్వీరాజ్, తమిళ నటులు కరుణాకరన్, ఆడుక్కాలమ్ నరేన్, పాకిస్థాన్ జైలర్ పాత్రలో ప్రకాశ్ బేలవాడి, మహేష్ ఆచంట తన పాత్రలకు తగినట్టుగా నటించారు.

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ఈ సినిమాకు సినిమాటోగ్రఫి, మ్యూజిక్, ఆర్ట్ వర్క్ స్పెషల్ ఎట్రాక్షన్. చాలా చోట్ల పేలవమైన సన్నివేశాలకు దేవీ శ్రీ ప్రసాద్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో బాగా ఎలివేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. పాటలు సినిమాకు నెక్ట్స్ లెవెల్ అనే విధంగా ఉన్నాయి. పోర్టు సీన్లు, సముద్ర మీద సన్నివేశాలు, పాకిస్థాన్, వాఘా బోర్డర్ సీన్లను సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దత్ బాగా చిత్రీకరించాడు. నాగేంద్ర ఆర్ట్ వర్క్ బాగుంది. బన్నీ వాసు అనుసరించిన నిర్మాణ విలువలు క్లాస్‌గా ఉన్నాయి.
జాలర్ల కుటుంబాల్లో ఉండే వెతలు, సాధకబాధకాల బ్యాక్ డ్రాప్‌తో ఎమోషనల్ లవ్ స్టోరి, దేశభక్తి అంశాలను కలిపి రూపొందించిన చిత్రం తండేల్. నటీనటుల పెర్ఫార్మెన్స్ ఈ సినిమాను నిలబెట్టాయని చెప్పాలి. సాయిపల్లవి పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు బ్యాక్ బోన్ కాగా.. నాగచైతన్య యాక్టింగ్ సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్. టెక్నికల్ అంశాలు సినిమాలో డామినేట్ చేసే అంశాలుగా కనిపిస్తాయి. కథ, కథనాల పరంగా చందూ మొండేటి ఇంకా బాగా వర్క్ చేసి ఉండాల్సిందనిపిస్తుంది. లాజిక్స్, స్క్రిప్టుపరంగా లోపాలను వెతక్కుండా సినిమా చూస్తే.. సినిమా తెగ నచ్చేస్తుంది. లవ్ సీన్లు, యాక్షన్ ఎపిసోడ్స్ కొత్త అనుభూతిని పంచుతాయి. ఈ సినిమా పక్కాగా థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ సినిమా. సాయిపల్లవి, చైతూ యాక్టింగ్ కోసం ఈ సినిమాను చూడండి.. డోంట్ మిస్.


Click it and Unblock the Notifications











