The 100 Movie Review: ది 100 మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: ఆర్కే సాగర్, మిషా నారంగ్, విష్ణుప్రియ, ధన్య బాలకృష్ణ, తారక్ పొన్నప్ప, ఆనంద్, కల్యాణి నటరాజన్, టెంపర్ వంశీ, గిరిధర్ తదితరులు
దర్శకత్వం: రాఘవ్ ఓంకార్ శశిధర్
నిర్మాతలు: రమేష్ కరుటూరి, వెంకీ పుషదాపు, తారక్ రామ్
మ్యూజిక్: హర్షవర్దన్ రామేశ్వర్
ఎడిటర్: అమర్ రెడ్డి కుడుముల
సినిమాటోగ్రాఫర్: శ్యామ్ కే నాయుడు
బ్యానర్: KRIA ఫిల్మ్స్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్
రిలీజ్ డేట్: 2025-07-11
ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తయిన విక్రాంత్ (ఆర్కే సాగర్) ప్రొబేషనరీ ఆఫీసర్‌గా శంషాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఇన్స్‌పెక్టర్ (గిరిధర్) వద్ద చేరుతాడు. ఆ సమయంలో నగరంలో వరుస దొంగతనాలు మిస్టరీగా మారుతాయి. తాను ప్రేమించే ఆర్తి (మిషా నారంగ్)తోపాటు ఆమె కుటుంబం దారుణంగా వంచనకు గురి అవుతుంది. ఆ తర్వాత అదే పోలీస్ పరిధిలో విక్రాంత్ ఐపీఎస్ ఆఫీసర్‌గా పోస్టింగ్‌తో జాయిన్ ఆ కేసును టేకప్ చేస్తాడు. ఈ క్రమంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మధు ప్రియ (విష్ణుప్రియ) సూసైడ్ చేసుకొని ఓ నోట్ పంపిస్తుంది.
హైదరాబాద్ నగరంలో జరిగే దోపిడి, దొంగతనాలు ఎలాంటి భయాన్ని క్రియేట్ చేశాయి? ఆ దొంగతనాల వెనుక కథ ఏమిటి? ఆర్కే సాగర్ ఈ కేసును ఎలా దర్యాప్తు చేశాడు? తన ప్రేమించే ఆర్తి ఎలాంటి వంచనకు గురైంది? ఆర్తీ బాధితురాలిగా మారడం వెనుక మిస్టరీ ఏమిటి? ఆర్తిని ఎవరు టార్గెట్ చేశారు? సాఫ్ట్ వేర్ కంపెనీ ఓనర్ వల్లభ్ (తారక్ పొన్నప్ప)కు ఆర్తీ, మధు ప్రియకు ఉన్న లింకేమిటి? క్లిష్టమైన కేసు దర్యాప్తులో విద్య ( ధన్య బాలకృష్ణ) ఎలా భాగమైంది. ఈ కేసు దర్యాప్తులో ఇన్స్‌పెక్టర్ (గిరిధర్) ఎలాంటి సహాకారం అందించాడు? అసలు 100 టైటిల్‌కు జస్టిఫికేషన్ ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ మూవీ కథ.

దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ రాసుకొన్న పోలీస్ స్టోరి రెగ్యులర్ పాయింటే. ఓ పోలీస్ ఉన్నతాధికారి తన ముందుకు వచ్చిన క్లిష్టమైన కేసును ఎలా సాల్వ్ చేశాడు? బాధితులకు ఎలా న్యాయం చేశాడు అనే పాయింట్ రొటీన్‌గా ఉన్నప్పటికీ.. కథలో ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయడానికి దర్శకుడు అల్లుకొన్న కథనం బాగుంది. కథకు డెస్టినేషన్ ఏమిటో అనే పాయింట్ తెలిసినా.. ఆ జర్నీని చివరి వరకు ట్విస్టులు, టర్న్‌లతో ముందుకు తీసుకెళ్లిన విధానం బాగుంది. లవ్, ఎమోషన్స్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా, క్రైమ్, మిస్టరీ, సస్పెన్స్ లాంటి అంశాలను కలబోసి కథను డ్రైవ్ చేసిన విధానం ఆకట్టుకొనేలా ఉంటుంది. కథలో కొత్తదనం లేకపోయినా కథనం చాలా కొత్తగా ఉంటుంది. వల్లభ క్యారెక్టర్‌ను కథలోకి తీసుకొచ్చిన విధానం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. అయితే కథను సూపర్ సక్సెస్ చేయడానికి కొన్ని ఎలిమెంట్స్ సినిమాకు తప్పనిసరి. ప్రేక్షకులు బలంగా కొరుకొనే ఆ అంశాలు మిస్ కావడం వల్ల ఈ సినిమాను నెక్ట్స్ లెవెల్‌లో ఊహించుకోవడం కొంచెం కష్టమే అనిపిస్తుంద.
ఇక రెగ్యులర్ పోలీస్ కాప్ స్టోరిని నటుడు ఆర్కే సాగర్ తన పెర్ఫార్మెన్స్‌తో నిలబెట్టాడు. చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాగర్ తన సత్తాను మరోసారి తెర మీద చూపించాడు. యాక్షన్, ఎమోషనల్ సీన్లలో తన పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి.. రెగ్యులర్ స్టోరిని కూడా ఎంగేజింగ్‌గా మార్చాడు. ఆర్తిగా మిషా నారంగ్ సినిమాకు బలంగా మారిన క్యారెక్టర్‌లో జీవించింది. అన్ని రకాలుగా నటనకు స్కోప్ పాత్రలో ఒదిగిపోయింది. ఇప్పటి వరకు విష్ణు ప్రియను గ్లామర్ పాత్రల్లోనే చూశాం. కానీ ఈ సినిమాలో మధు ప్రియ పాత్ర ద్వారా తనలోని నటిని బయటకు చూపించింది. చాలా ఇంటెన్స్ పాత్రలో నటిగా తనలోని అసలు కోణాన్ని చూపించింది.
విద్యగా ధన్య బాలకృష్ణ కూడా స్టోరిని డ్రైవ్ చేసే పాత్రలో మెప్పించింది. ఇక సినిమా సెకండాఫ్‌ను గ్రిప్పింగ్‌గా మార్చే బాధ్యతను వల్లభగా తారక్ పొన్నప్ప భుజాన వేసుకొని తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. పుష్ప 2 తర్వాత మరోసారి సరికొత్త విలనిజంతో చెలరేగిపోయాడు. ఆనంద్, కల్యాణి నటరాజన్ ఎమోషనల్ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. ప్రతీ పాత్ర పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు పాజిటివ్‌గా మార్చాయి.

టెక్నికల్ విషయాలకు వస్తే.. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లస్ పాయింట్. పలు సన్నివేశాలను హర్షవర్దన్ రామేశ్వర్ తన మ్యూజిక్‌తో భారీగా ఎలివేట్ చేశారు. పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. క్రైమ్, మిస్టరీ డ్రామా మూడ్‌ను క్రియేట్ చేయడంలో సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కే నాయుడు తన వంత పనిని సక్రమంగా పూర్తి చేశాడు. సెకండాఫ్ గ్రిప్పింగ్‌గా, ఎంగేజింగ్‌గా చేయడంలో ఎడిటర్ అమర్ రెడ్డి కుడుముల తన బాధ్యతను సక్సెస్‌పుల్‌గా నిర్వర్తించారు. రమేష్ కరుటూరి, వెంకీ పుషదాపు, తారక్ రామ్ అనుసరించిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్స్‌లో ఉన్నాయి.
పోలీస్ ఆఫీసర్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసే రెగ్యులర్ కమర్షియల్ ఫార్మూలా కాప్ స్టోరి ది 100. కథలో కొత్తదనం లేకపోయినా.. కథనంలో నావెల్టీ ఉండటమే ఈ సినిమా ఇంట్రెస్టింగ్‌గా సాగడానికి ఉపయోగపడింది. క్యారెక్టర్లను కథలో జొప్పించిన విధానం సినిమాకు ఓ ప్రెష్‌నెస్ తెచ్చిపెట్టింది. ఎక్కడా బోర్ లేకుండా ఆద్యంతం సీన్లు చకచకా సాగిపోతాయి. ఓటీటీ జనరేషన్‌లో వరల్డ్ సినిమా చూస్తున్న ప్రేక్షకులకు మరింతగా ఎక్సైట్ చేసే సత్తా ఈ కథలో కనిపించకపోవడమే మైనస్. కానీ ఈ సినిమా చూస్తున్నంత సేపు ఇంట్రెస్ట్‌గానే ఉంటుంది. కాబట్టి ఈ మూవీని ఒక్కసారి థియేటర్‌లో చూడొచ్చు. ఆర్కే సాగర్, మిషా, విష్ణుప్రియ, ధన్య, తారక్ పొన్నప్ప మిమ్మల్ని నిరాశపరచరు. పోలీస్ స్టోరీ, సస్పెన్స్ క్రైమ్ స్టోరీలు ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. బీ, సీ సెంటర్లలో ప్రేక్షకుల ఆదరణ బట్టి ఈ సినిమా సక్సెస్ ఆధారపడి ఉండొచ్చు.


Click it and Unblock the Notifications











