‘ద డర్టీ పిక్చర్’ రివ్యూ...
నటీనటులు: విద్యా బాలన్, ససీరుద్దీన్ షా, ఇమ్రాన్ హస్మి, తుషార్ కపూర్ తదితరులు
దర్శకత్వం: మిలన్ లూథ్రియా
నిర్మాణం : ఎక్తా కపూర్, శోభాకపూర్
స్ర్కీన్ ప్లే : రజత్ అరోరా
సంగీతం : విశాల్ శేఖర్
సినిమాటో గ్రఫీ : బాబీ సింగ్
ఒకప్పటి దక్షిణాది సెక్సీ ఐటం గర్ల్ సిల్క్ స్మిత జీవితం ఆధారంగా రూపొందిన సినిమా 'డర్జీ పిక్చర్"....అప్పట్లో ఓ వెలుగు వెలిగిన స్మితా జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, వివాదాలు ఉన్నాయి. ఆమె ఆత్మహత్యకు కారణం కూడా ఎవరికీ అంతు పట్టకుండా ఉంది ఇప్పటికీ. ఈ నేపథ్యంలో ఆమె జీవితంపై నిర్మించిన డర్జీ పిక్చర్ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.
సినిమా కథలోకి వెళితే...
రేష్మా(విద్యా బాలన్) ఓ చిన్న పట్టణం నుంచి పెద్ద సినిమా స్టార్ కావాలనే తన డ్రీమ్‌ను సాకారం చేసుకోవడానికి చెన్నయ్ వస్తుంది. తిరస్కరణలు, చీదరింపులు తర్వాత చివరకు ఓ సినిమాలో ఐటం గర్ల్ గా అవకాశం దక్కించుకుంది రేష్మా. ఆ ఒక్క అవకాశంతో అందరి దృష్టిని ఆకర్షించిన తిరుగులేని ఐటం సాంగుల తారగా ఎదుగుతుంది రేష్మా. ఆమె లేకుండా సినిమా లేదు అనే చందంగా ఉంటుంది పరిస్థితి. 80ల్లో పరిశ్రమను ఓ వూపు ఊపిన స్టార్ హీరో సూర్యకాంత్(నసీరుద్దీన్ షా) మూలంగా ఆమె జీవితంలో కొన్ని అనుకోని మార్పులు చోటు చేసుకుంటాయి. అవేమిటో తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ..
దర్శకుడు మిలన్ లూథ్రియా మరోసారి ఓ యాదర్థ జీవిత కథను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. గతంలో 'వన్స్ అప్ అన్ ఎ టైమ్ ఇన్ ముంబై" చిత్రంతో తన టాలెంట్ చూపెట్టిన మిలన్ ఈ సినిమా ద్వారా రియల్ స్టోరీలను తెరకెక్కించడంలో తనకు తానే సాటి అని చాటి చెప్పాడు. 80వ దశకంలో ఉన్న వాతావరణాన్ని తెరపై పర్ ఫెక్ట్ గా ఆవిష్కరించారు. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి. కాస్టూమ్స్, నృత్యాలు బాగా కుదిరాయి. సినిమా తొలి సగ భాగం కమర్సియల్ గా సరదాగా సాగుతుంది. రెండో సగ భాగం సినిమాలోని ప్రధాన పాత్ర యొక్కచీకటి కోణాన్ని ఆవిష్కరించారు. బ్యాగ్రౌండ్ స్కోరు ఫర్వాలేదు. సంగీతం ఆకట్టుకుంది. ఇప్పటికే బప్పీ లహరి పాడిన ఊ లాలా పాట సూపర్ హిట్టయింది కూడా. సినిమాటో గ్రఫీ బాగుంది. మొత్తం మీద సినిమాకు నటీనటుల పెర్ఫార్మెన్స్, మాటలు, సంగీతం ప్లస్సవగా....రెండో భాగంలో కొన్ని సీన్లలో ఎమోషన్స్ డోస్ కాస్త ఎక్కువయింది.
పెర్ఫార్మెన్స్..
సిల్మ్ స్మిత పాత్రలో విద్యాబాలన్ అద్భుతంగా నటించింది. ఆ పాత్రకు విద్యా తప్ప మరెవరూ సూట్ కారు అనే రేంజ్ లో విద్యా తన పెర్ఫార్మెన్స్ కనబరిచింది. అయితే కొన్ని ఎక్స్ ప్రెషన్స్ లో మాత్రం సిల్క్ స్మితను అందుకోలేకపోయింది. మొత్తానికి అందాల ఆరబోత, యాక్టింగ్ పరంగా విద్యా సూపర్. స్మితను ప్రేమించే రచయిత పాత్రలో తుషార్ కపూర్ డీసెంట్ గా బాగా నటించాడు. ఇమ్రాన్ హస్మి ఇదివరకెన్నడూ చేయని విభిన్నమైన పాత్రలో, ఆకట్టుకునే డైలాగ్ డెలివరీలతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇక నసీరుద్దీన్ షా యాక్టింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇతర నటీనటులు వారి వారి పాత్రల మేరకు రాణించారు.
కొసమెరుపు...
చిత్రంలో స్మిత జీవితానికి సంబంధించి పూర్తి వాస్తవాలు చూపెట్టారు. ఈ సినిమాలో ఓ డైలాగ్ లో ఉన్నట్లు సినిమా మొత్తం ఎంటర్‌టైన్మెంట్, ఎంటర్‌టైన్మెంట్, ఎంటర్‌టైన్మెంట్.....


Click it and Unblock the Notifications











