The Kerala Story review ఎమోషనల్ రైడ్‌గా లవ్ జిహద్ కథ.. ది కేరళ స్టోరి ఎలా ఉంది? ఆదాశర్మ ఎలా చేసింది?
నటీనటులు: అదా శర్మ, యోగితా బిహాని, సోనియా బలానీ, సిద్ది ఇద్నానీ, దేవదర్శిని, విజయ్ కృష్ణ, ప్రణయ్ పచౌరీ, ప్రణవ్ మిశ్రా తదితరులు
దర్శకత్వం: సుదిప్టో సేన్
రచన: సూర్యపాల్ సింగ్
నిర్మాత: విపుల్ అమృత్ లాల్ షా
ఎడిటింగ్: సంజయ్ శర్మ
మ్యూజిక్: విరేష్ శ్రీవాల్స, బిషఖ్ జ్యోతి
బ్యానర్: సన్‌షైన్ పిక్చర్స్
రిలీజ్ డేట్: 2023-05-05
ది కేరళ స్టోరి కథ: కేరళలోని కాసర్గాడ్‌లోని నర్సింగ్ కాలేజీలో షాలిని ఉన్నికృష్ణన్ (అదా శర్మ), నిమా (యోగితా భిహాని), గీతాంజలి (సిద్ది ఇద్నానీ) చదువుకొనే స్టూడెంట్స్. అసీఫా (సోనియా బలానీ)తో కలిసి హాస్టల్‌లో రూమ్ షేర్ చేసుకొంటారు. ఐసీస్ (ISIS)లో అండర్ కవర్‌గా పనిచేసే ఆసీఫా అమ్మాయిలకు మాయ మాటలు చెప్పి ఇస్లాం మతంలోకి మార్చే మిషన్‌లో పనిచేస్తుంటుంది. తన మిషన్‌లో బాగంగా ఇద్దరు ముస్లిం అబ్బాయిలను రంగంలోకి దించి గీతాంజలి, షాలినితో లవ్ జిహాద్ ఉచ్చులోకి దించుతుంది.

రమీజ్ అనే అబ్బాయి ప్రేమలో పడిన షాలిని గర్బవతి అవుతుంది. పెళ్లి చేసుకోమని రమీజ్‌ను అడిగితే ఇస్లాం మతంలోకి మారితే వివాహం చేసుకొంటానని చెబుతాడు. దాంతో చేసేదేమీ లేక రమీజ్‌ను పెళ్లి చేసుకొని ఇస్లాంలోకి మారి సిరియాకు వెళ్లేందుకు ప్రయత్నిస్తూ అఫ్ఘనిస్థాన్‌లో అరెస్ట్ అవుతుంది.
ది కేరళ స్టోరి మూవీలో ట్విస్టులు: అమ్మాయిలను ఇస్లాం మతంలోకి మార్చడానికి అసీఫా ఎలాంటి వ్యూహాలు అమలు చేసింది? అసీఫా ఉచ్చులో షాలిని ఎలా పడింది. పెళ్లి కాకుండా గర్బవతి అయిన షాలిని ఎలాంటి మానసిక సంఘర్షణకు గురైంది? ఇస్లాం మతంలోకి మారాలని ప్రియుడు కండిషన్ పెట్టిన సమయంలో షాలిని పడిన మానసిక సంఘర్షణ ఏమిటి? అఫ్ఘనిస్థాన్‌లో అరెస్ట్ అయిన తర్వాత షాలిని అలియాస్ ఫాతీమా బా ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే ది కేరళ స్టోరి సినిమా కథ.

మూవీ ఎలా సాగిందంటే?: ఫాతీమా బా గా మారిన షాలిని అఫ్ఘనిస్థాన్‌లో ఎదురైన చేదు అనుభవాలను తన ఇద్దరు స్నేహితులు నిమా, గీతాంజలికి చెప్పడం ద్వారా ఫ్లాష్ బ్యాక్‌లో కథ సాగుతుంది. స్థానిక రాజకీయ పరిస్థితులు, రాజకీయ నేతల తీరు సినిమాటిక్‌గా అనిపించినప్పటికీ.. మంచి ఎమోషన్స్ పండించాయని చెప్పవచ్చు.
కథకు సుదీప్టా సేన్ ఇచ్చిన ట్రీట్‌మెంట్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక ఎజెండా ప్రకారం ఈ సినిమాను రూపొందించారనే విషయం స్పష్టమవుతుంది. ఇస్లాంలోకి మత మార్పిడి, కమ్యూనిజం, హిందూ, క్రిస్టియన్ అంశాలు అనేక రాజకీయ కోణాలను తెర మీద ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.

అదా శర్మ ఫెర్ఫార్మెన్స్: షాలినిగా ఫాతీమాగా రెండు వేరియేషన్స్ ఉన్న అమ్మాయి పాత్రలో అదా శర్మ అద్బుతంగా నటించింది. తన ఫెర్ఫార్మెన్స్‌తో పాత్రలో ఉండే కష్టాల ద్వారా ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురిచేస్తుంది. మలయాళీ యాసలో హిందీ మాట్లాడే తీరుతో తన పాత్రను బలంగా ఎస్టాబ్లిష్ చేయడంలో అదా శర్మ సఫలమైంది. ఇప్పటి వరకు గ్లామర్ హీరోయిన్‌గా ముద్ర వేసుకొన్న అదా శర్మను చూస్తే.. ఫాతీమాగా మారింది ఆమేనా అనే ఫీలింగ్‌ను కలిగిస్తుంది.

ఇతర పాత్రల్లో నటించింది ఎవరంటే?: నిమాగా యోగితా భిహాని, గీతాంజలిగా సిద్ది ఇద్నానీ, అసీఫాగా సోనియా బలానీ తమ పాత్రల పరిధి మేరకు రాణించారు. షాలినికీ సపోర్టింగ్ క్యారెక్టర్లుగా ఉన్నప్పటికీ.. తమ పాత్రల్లో ఒదిగిపోయారు. దేవదర్షిని, ప్రణవ్ మిశ్రా, ప్రణయ్ పచౌరీ తదితరలు తమా పాత్రల పరిధి మేరకు ఆకట్టుకొన్నారు. మిగితా పాత్రల్లో నటించిన వారు తమ నటనతో ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు.

సాంకేతిక అంశాలు ఎలా ఉన్నాయంటే?: ది కేరళ స్టోరి చిత్రంలో మ్యూజిక్ విభాగం మంచి మార్కులు కొట్టేసింది. వీరేష్ శ్రీవల్స, బిసఖ్ జ్యోతి కథ డిమాండ్ మేరకు మంచి సంగీతాన్ని అందించారు. ఆఫ్ఘన్ ఎపిసోడ్‌కు సంబంధించిన సీన్లను భారీగా మ్యూజిక్ ఎలివేట్ చేసింది. ఎడిటింగ్ విభాగానికి ఇంకా చాలానే పని ఉందనిపించింది. సంజయ్ శర్మ ఎడిటింగ్ ఫర్వాలేదనిపిస్తుంది. క్రియేటివ్ డైరెక్టర్‌గా వ్యవహరించిన విపుల్ అమృత్‌లాల్ షా అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్‌గా ది కేరళ స్టోరి గురించి: లవ్ జిహద్ అంశాన్ని బేస్ చేసుకొని అనేక రాజకీయ ఉద్దేశాలు, కొన్ని పార్టీలను టార్గెట్ చేసుకొని మరో పార్టీ రూపొందించిన ఎజెండాగా ది కేరళ స్టోరి కనిపిస్తుంది. రాబోయే ఎన్నికలు, ఓటు బ్యాంకు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఈ సినిమా రూపొందించారనే విషయం స్ఫస్టమవుతుంది.
కానీ వాస్తవంగా మత మార్పిడులతో హిందూ అమ్మాయిలను ఇస్లాం మతంలోకి మార్చే కుట్రను ఎవరూ ఆమోదించరు. హిందుత్వ వాదులు ఈ సినిమాను ఆదరించడానికి, లౌకిక వాదులు వ్యతిరేకించడానికి అనేక కారణాలు ఉంటాయి. సగటు ప్రేక్షకుడు ఇలాంటి ఎజెండాలు పట్టించుకోకుండా చూస్తే.. మంచి అనుభూతిని కలిగిస్తుంది.


Click it and Unblock the Notifications











