The Kerala Story Movie Review: ది కేరళ స్టోరి మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: అదా శర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ది ఇద్నానీ, దేవదర్శిని, విజయ్ కృష్ణ, ప్రణవ్ పచౌరీ, ప్రణవ్ మిశ్రా, ప్రణాళి ఘోగరే తదితరులు
దర్శకత్వం: సుదీప్టో సేన్
కథ: విపుల్ అమృత్ లాల్ షా, సూర్యపాల్ సింగ్
నిర్మాత: విపుల్ అమృత్ లాల్ షా
సినిమాటోగ్రఫి: ప్రశాంతు మహోపాత్ర
ఎడిటింగ్: సంజయ్ శర్మ
మ్యూజిక్: విరేష్ శ్రీవల్స, బిషాఖ్ జ్యోతి
బ్యానర్: సన్‌షైన్ పిక్చర్స్
రిలీజ్ డేట్: 2023-05--02
కేరళలోని వివిధ పట్టణాలకు చెందిన హిందూ అమ్మాయిలు షాలిని ఉన్నికృష్ణన్ (అదాశర్మ), గీతాంజలి (సిద్ది ఇద్నానీ), క్రిస్టియన్ అమ్మాయి నిమా మ్యాథ్యూస్ (యోగితా బిహానీ), ముస్లిం అమ్మాయి అసిఫా బా (సోనియా బలానీ) నర్సింగ్ విద్య కోసం ఓ పట్టణంలో హాస్టల్‌లో చేరడం ద్వారా ఒకరికొకరు పరిచయం అవుతారు. ఇస్లా జిహాదీ గ్రూప్ ఐసీస్‌లో సీక్రెట్ ఏజెంట్‌గా పనిచేస్తున్న అసిఫా తన గ్రూపులోని రమీజ్ (ప్రణయ్ పచౌరీ), అబ్దుల్ (ప్రణవ్ మిశ్రా)కు పరిచయం చేస్తుంది. హిందూ మతంపై అపోహలు సృష్టించి, అభూత కల్పితాలతో వారికి అసీఫా విద్వేషం కలిగిస్తుంది. ఆ తర్వాత షాలిని, గీతాంజలిని రమీజ్, అబ్దుల్ ట్రాప్ చేస్తారు. ఈ క్రమంలో షాలిని గర్బవతి అవుతుంది. దాంతో ఇస్లాం మతంలోకి మారితే రమీజ్ పెళ్లి చేసుకొంటాడని ముస్లిం పెద్దలు షాలినిని బలవంతంగా మత మార్పిడి చేస్తారు. అయితే పెళ్లికి ముందు షాలిని మోసం చేసి దుబాయ్‌కి పారిపోతాడు. దాంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇషాక్ (విజయ్ కృష్ణ) అనే మరో జిహాదితో షాలిని పెళ్లి చేసి గుట్టు చప్పుడు కాకుండా సిరియాకు చేర్చే క్రమంలో అఫ్ఘనిస్థాన్‌కు చేరుస్తారు.
షాలిని, గీతాంజలిని ఇస్లాం జిహాదీ గ్రూప్ సభ్యులు ఎలా ట్రాప్ చేశారు? షాలిని, గీతాంజలి మతం మార్చుకోవాలని నిర్ణయం తీసుకోవడంతో వారి తల్లిదండ్రుల రియాక్షన్ ఏమిటి? షాలిని గర్బవతి అయిన తర్వాత జిహాదీ గ్రూప్ ఎలాంటి కుట్రలు పన్నారు? అసిఫా హిందూ అమ్మాయిలను ఎలా ట్రాప్ చేస్తుంది? క్రిస్టియన్ అమ్మాయి నిమా వారి కుట్రలను పసిగట్టింది? ప్రెగ్నెంట్ షాలిని రమీజ్ ఎలా మోసం చేశాడు? గీతాంజలిని ప్రేమ పేరుతో మోసం అబ్దుల్ ఎలా మోసం చేశాడు? గీతాంజలి చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకొన్నది.. నిమాను ఓ జిహాదీ ట్రాప్ చేసి 15 మందికి పైగా జిహాదిలతో ఎందుకు రేప్ చేయించాడు? ఫాతిమాగా కన్వర్ట్ అయిన తర్వాత ఇషాక్‌తో బలవంతం పెళ్లి చేసి షాలినిని ఎందుకు సిరియా పంపించాలని ప్లాన్ చేశారు? అఫ్ఘనిస్థాన్‌లో షాలిని ఎలాంటి పరిస్థితులను చవి చూసింది? అఫ్ఘన్‌లో అమెరికా దళాలకు పట్టుబడిన తర్వాత షాలిని పరిస్థితి ఏమిటి? చివరకు షాలిని, గీతాంజలి, నిమా జీవితాలకు ముగింపు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే ది కేరళ స్టోరి సినిమా కథ.

షాలినిని అమెరికా దళాలు అరెస్ట్ చేసిన తర్వాత యూఎస్‌లో జరిగే ఇన్వెస్టిగేషన్ ద్వారా దర్శకుడు సుదీప్టో సేన్ కథలోకి తీసుకెళ్లిన తీరుతోనే ఆడియెన్స్ కనెక్ట్ అయ్యేలా చేశారు. షాలిని తన వ్యధ భరిత కథను చెప్పే విధానం, అనుసరించిన స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్‌గా సాగడంతో కథతోపాటే ట్రావెల్ అయ్యేలా తన ప్రతిభను చాటుకొన్నాడు. కేరళలో మత మార్పిడి ఎలా జరుగుతుందనే విషయాన్ని కళ్లకు కట్టినట్టు చూపించడంలో టీమ్ సక్సెస్ అయింది. కేరళలోని హిందూ అమ్మాయిలను ఎలా ట్రాప్ చేస్తారు. వారిని మానవ బాంబులుగా మార్చి సిరియాకు పంపించే కుట్ర ఎలా సాగుతున్నదనే విషయాన్ని ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా పాత్రలను, సన్నివేశాలను డిజైన్ చేసిన తీరు ఈ సినిమాకు హైలెట్.
ఇక షాలిని, గీతాంజలి, నిమాలను అసిఫా, రమీజ్, అబ్దుల్ ట్రాప్ చేసిన తీరు చూస్తుంటే హృదయాన్ని మెలిపెట్టినట్టు అనిపిస్తుంటుంది. ప్రేమ పేరుతో లవ్ జిహాదీని అమలు చేసే కుట్ర భయంకరంగా ఉంటుంది. హిందూ మతాన్ని, దేవుళ్లపై విద్వేషాలు నింపే స్ట్రాటజీ, వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన విధానం, చేసిన రీసెర్చ్ ఈ సినిమాను ఎమోషనల్‌గా మార్చింది. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందని విమర్శలు వచ్చినప్పటికీ.. కథగా, సినిమాగా, బాధితుల భావోద్వేగమైన జీవిత ప్రయాణం కొన్నిసార్లు గుండెను పిండేసేలా చేస్తుంది.
షాలినిగా అదాశర్మ, గీతాంజలిగా సిద్ది ఇద్నానీ, నిమాగా యోగితా, అసిఫాగా సోనియా తమ పాత్రల్లో జీవించారు. లవ్ జిహాద్ బాధితులుగా ఈ ముగ్గురు అద్బుతంగా పెర్ఫార్మ్ చేశారు. అసిఫాగా సోనియా పాత్రలో పరకాయ ప్రవేశం చేసిందా? అనేంతగా నటించింది. రమీజ్, అబ్దుల్ పాత్రలను పోషించిన ఇద్దరు తమ పాత్రలను యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకొన్నారు. దేవదర్శిని, ఇతర నటీనటులు ఈ సినిమాను సజీవంగా మార్చడంలో తమ ప్రతిభను చాటారు.
ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అత్యంత బలంగా నిలిచాయి. సాంకేతిక విభాగాల్లో సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, మ్యూజిక్ తమ వంతు పాత్రను నెక్ట్స్ లెవెల్‌లో పోషించాయి. అఫ్గనిస్థాన్‌లో సీన్లను ప్రశాంతు మహోపాత్ర అద్బుతంగా చిత్రీకరించారు. ఈ సినిమాకు ఎడిటింగ్ మరో బ్యూటీ. విపుల్ షా అనుసరించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. కథను చెప్పాలనే తపన కనిపించింది. ఈ సినిమాను ప్రేక్షకుల వద్దకు తీసుకు రావాలనే విషయంలో నిర్మాత, దర్శకులు ఎలాంటి రాజీ పడలేదనే విషయాన్ని సినిమా చూస్తే అర్ధమవుతుంది.
ఎజెండా, ప్రాపగండా సినిమా అనే విమర్శలను పక్కన పెడితే.. కథగా, వాస్తవ సంఘటనలతో రూపొందించిన ఈ సినిమా ఓ ఎమోషనల్ జర్నీ. మత మార్పిడి, లవ్ జిహాద్ అంశాలను తెర మీద చూపించి.. సమాజాన్ని అలర్ట్ చేసే ప్రయత్నం కనిపించింది. వాస్తవాలు, అవాస్తవాలు పక్కన పడితే.. రెండున్నర గంటలు ఈ సినిమా భావోద్వేగాలు రేకెత్తిస్తుంది. ది కేరళ స్టోరి 2 సినిమా ఫిబ్రవరి 27 తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా రివ్యూను అందించే ప్రయత్నం ఫిల్మీబీట్ చేస్తున్నది. జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నది. తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. ది కేరళ స్టోరి 2 ఎక్స్‌కూజివ్ అప్ డేట్స్, రివ్యూ కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











