The GOAT Life Review పృథ్వీరాజ్ సుకుమారన్ వన్ మ్యాన్ షో.. కానీ సహనానికి పరీక్షే.. ఆడుజీవితం సినిమా సమీక్ష
Rating: 2.75/5
నటీనటులు: పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్, జిమ్మీ జీన్ లూయిస్, కేఆర్ గోకుల్ తదితరులు
దర్శకత్వం: బ్లెస్సీ
నిర్మాతలు: బ్లెస్సీ, జిమ్మీ జీన్ లూయిస్, స్టీవెన్ ఆడమ్స్
మ్యూజిక్: ఏఆర్ రెహ్మాన్
సినిమాటోగ్రాఫర్: సునీల్ కేఎస్
ఎడిటర్: ఏ శ్రీకర్ ప్రసాద్
రిలీజ్: మైత్రీమూవీ మేకర్స్
రిలీజ్ డేట్: 2024-03-28
పేదరికంతో బాధపడుతుండే నజీబ్ (పృథ్వీరాజ్ సుకుమారన్), హకీం (కేఆర్ గోకుల్) గల్ఫ్‌కు వెళ్లి బాగా డబ్బు సంపాదించాలని అనుకొంటారు. గర్బిణితో ఉన్న భార్య సైను (అమలాపాల్) వదిలి తన స్నేహితుడు హకీంతో గల్ఫ్ చేరుకొంటారు. ఆఫీస్‌లో హెల్పర్ ఉద్యోగం అని వెళ్లిన నజీబ్‌ను తీసుకెళ్లి ఎడారిలో ఒంటెలు, గొర్రెల కాపరి ఉద్యోగం ఇస్తారు. అయితే తాను కాపరి ఉద్యోగం కోసం రాలేదు. నేను నా దేశానికి వెళ్లిపోతాన వాదనకు దిగితే.. యజమాని చిత్ర హింసలు పెడుతారు.

అయితే ప్రాణాలు తీస్తారను భయంతో నజీబ్ ఎడారిలో అయిష్టంగా జీవితాన్ని కొనసాగిస్తూ, యజమాని గురి చేసే ఎలాంటి క్షోభకు భరించాడు. నీళ్లు, సరిగా ఆహారం లభించక కష్టాలను పడుతున్న నజీబ్ ఎడారి నుంచి తప్పించుకొని ఎలా ప్రయత్నాలు చేశారు? ఎడారి నుంచి బయట పడటానికి ఎవరి సహాయం తీసుకొన్నారు? ఎడారి నుంచి బయటపడే క్రమంలో ఎలాంటి కష్టాలు అనుభవించాడు? గల్ఫ్‌లో స్నేహితుడు హకీం పరిస్థితి ఏంటి? ఎడారి నుంచి తప్పించుకొన్న తర్వాత నజీబ్ మూడు నెలల జైలుశిక్షను ఎలా అనుభవించాడు? చివరకు ఎలాంటి పరిస్థితుల్లో నజీబ్ ఇంటికి చేరాడనేది ఈ సినిమా కథ.
విదేశాల్లో డబ్బు సంపాదన మోజుతో వలస వెళ్లే కార్మికుల అస్థిత్వం, వారు అనుభవించే కష్టాలు అనే పాయింట్‌తో గోట్ లైఫ్ (ఆడు జీవితం) తెరకెక్కింది. మలయాళంలో అత్యధికం అమ్ముడుపోయిన ఆడు జీవితం అనే నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే సింగిల్ పాయింట్, సింగిల్ క్యారెక్టర్‌పై సినిమా నడిపించడం వల్ల కథలో పెద్దగా వేరియేషన్స్ కనిపించవు. ఒకే పాయింట్‌ను సాగదీసి సాగదీసి చెప్పినట్టు అనిపిస్తుంది. సినిమా మొత్తం నజీబ్ అనుభవించిన కష్టాలే కనిపించడంతో సినిమా అంతా సీరియస్‌గా సాగుతుంది.

ఇక సినిమా అంతా గల్ఫ్‌లో జరగడం వల్ల అరబ్ క్యారెక్టర్లు మాట్లాడిన భాష అర్ధం కాకపోవడం ఈ సినిమాకు మైనస్. అయితే కొన్ని సన్నివేశాల్లో సబ్ టైటిల్స్ వేశారు. కానీ కీలక సన్నివేశాల్లో సబ్ టైటిల్స్ లేకపోవడం వల్ల పాత్రల మధ్య ఏం జరుగుతుంది. వాటి మధ్య ఎమోషన్స్ ఏంటి? అనే విషయం చాలా కన్‌ఫ్యూజన్‌గా చికాకుగా ఉంటుంది. ఇలాంటి గందరగోళం, కన్‌ఫ్యూజన్ మధ్య అమలాపాల్‌తో పృథ్వీరాజ్ సుకుమార్ లవ్ ట్రాక్, వారిద్దరి మధ్య శృంగారం కొంతలో కొంత ఊరట కలిగిస్తుంది.
ఇక నటీనటుల గురించి చెప్పాల్సి వస్తే.. పృథ్వీరాజ్ సుకుమారన్ ముందు మరో క్యారెక్టర్ కనిపించదు. నజీబ్ పాత్రలో అంతా ఆయన వన్ మ్యాన్ షో. పృథ్వీరాజ్ తప్ప నజీబ్ కనిపిస్తారనేంతగా నటించాడు. స్నేహితుడు హకీంగా తన వంతు పాత్రను పోషించాడు. అమలాపాల్ రోల్ చాలా చిన్నది. ఉన్నంతలో గ్లామర్, రొమాన్స్ భారీగా పండించింది. మిగితా పాత్రల్లో నటించిన వారు ఒకే అనిపించారు.

గోట్ లైఫ్ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్, సునీల్ కేఎస్ సినిమాటోగ్రఫి ప్రాణంగా నిలిచాయి. పెద్దగా వేరియేషన్ లేని సన్నివేశాలను కూడా బీజీఎంతో బాగా ఎలివేట్ చేశారు. సినిమా కోసం జోర్డాన్ వెళ్లి షూట్ చేశారు. అయితే ఎడారి సెట్ వేసి షూట్ చేయవచ్చు. కానీ సహజసిద్దమైన వాతావరణం, అలాగే ఇసుక తుఫాన్లు, అక్కడ ఉండే ప్రాణాంతక జీవులు కథ మూడ్‌ను బాగా ఎలివేట్ చేస్తాయి. అలాంటి మూడ్‌ను సునీల్ తన కెమెరాలో బాగా క్యాప్చర్ చేశారు. మిగితా సాంకేతిక విభాగాలు మంచి అవుట్‌పుట్ ఇచ్చాయి. నిర్మాణ విలువలు టాప్ క్లాస్ లెవెల్‌లో ఉన్నాయి.
బతుకుతెరువు కోసం ప్రాణం కన్నా ప్రేమించే కుటుంబాన్ని వదలివెళ్లిన నజీబ్ ఎలాంటి ప్రతికూల పరిస్థితుల చిక్కొకొని ఎలా బయటపడ్డారనేది ది గోట్ లైప్ (ఆడు జీవితం) కథ. అయితే కథలో ఆ వ్యక్తి కష్టాలు తప్పా.. ఎలాంటి వైవిధ్యం కనిపించదు. కథలో క్యారెక్టర్ డెస్టినేషన్ ఏంటని తెలిసినా తర్వాత ఆ పాత్ర ట్రావెల్ ఎంత బాగా జరిగిందనేది ఆ సినిమాకు ప్లస్ అవుతుంది. అయితే ఈ కథలో ట్రావెల్ బాగా ఉంది. కానీ మనసుకు హత్తుకొనేలా కనిపించదు. నజీబ్‌కు ఎడారిలో మూడేళ్ల కఠోర జీవితం.. గల్ఫ్‌లో మూడు నెలలల జైలుశిక్ష..ప్రేక్షకుడికి మూడు గంటల కఠిన పరీక్ష. చాలా సహనం, ఓపిక ఉన్నవారికి గోట్ లైఫ్ చిత్రం తప్పకుండా నచ్చుతుంది.
ట్యాగ్ లైన్: ఎడారిలో మూడేళ్ల జీవితం.. మూడు నెలల జైలుశిక్ష.. థియేటర్‌లో సహనానికి మూడు గంటల పరీక్ష


Click it and Unblock the Notifications











