Thug Life Review: థగ్ లైఫ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: కమల్ హాసన్, త్రిషా, శింబు, ఐశ్వర్య లక్ష్మీ, అశోక్ సెల్వన్, జోజు జార్జ్, నాజర్, పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, మహేష్ మంజ్రేకర్, తనికెళ్ల భరణి తదితరులు
దర్శకత్వం: మణిరత్నం
నిర్మాతలు: కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్, మణిరత్నం, శివ అనంత్, ఉదయనిధి స్టాలిన్
కథ, రచన: మణిరత్నం, కమల్ హాసన్
మ్యూజిక్: ఏఆర్ రెహ్మాన్
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
సినిమాటోగ్రఫి: రవి కే చంద్రన్
బ్యానర్: రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్
రిలీజ్ డేట్: 2025-06-05
ఢిల్లీ కేంద్రంగా నడిచే మాఫియా సామ్రాజ్యానికి రంగరాయ శక్తిరాజు ( కమల్ హాసన్) అధిపతి. తనపై జరిగిన ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకోవడానికి అమర్ (శింబు) అనే బాలుడ్ని తీసుకెళ్లి పెద్ద చేస్తాడు. కన్న కొడుకును మించిన ప్రేమను చూపిస్తాడు. ఓ హత్య కేసులో జైలుకు వెళ్లాల్సి రావడంతో అమర్‌ను మాఫియాకు బాస్‌గా ప్రకటిస్తాడు. అయితే పవర్ మత్తును ఒంటికి పట్టించుకొన్న అమర్.. ఏకంగా శక్తిరాజును చంపడానికి కుట్రపన్ని.. మానస సరోవరం యాత్రకు వెళ్లిన సమయంలో ఎటాక్ చేస్తారు. కానీ అదృష్టవశాత్తు చావు నుంచి బతికి బయటపడి రెండేళ్ల తర్వాత ఢిల్లీకి తిరిగి వస్తాడు.

ఢిల్లీ ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకోవడానికి అమర్‌ను శక్తిరాజు ఎందుకు వాడుకొన్నాడు. అమర్ తండ్రికి కారణం ఎవరు? అమర్‌ను ఎలా పెంచాడు? అమర్‌కు చిన్నతనంలో శక్తిరా జ్ ఇచ్చిన మాట ఏంటి? భార్య లక్ష్మీ (అభిరామి)తో లైఫ్ ఎలా సాగింది. తన ఉంపుడుగత్తెగా పెట్టుకొన్న ఇంద్రాణి (త్రిష) ఎవరు? ఇంద్రాణిపై అమర్ మనసు ఎందుకు? ఎలా ప్రేమించాడు? శక్తిరాజ్ మరణించాడనే భావించిన ఇంద్రాణి ఎలాంటి నిర్ణయం తీసుకొన్నది. తనపై కుట్ర చేసిన మాణిక్యం (నాజర్), పత్రోస్ (జోజు జార్జ్) ఇతరులపై శక్తిరాజ్ ప్రతీకారం ఎలా తీర్చుకొన్నాడు? చిన్నతనంలో అమర్‌కు ఇచ్చిన మాటను శక్తిరాజ్ తీర్చుకొన్నాడా? చివరకు శక్తిరాజు లైఫ్ ఏమైంది? అనే ప్రశ్నకు సమాధానమే థగ్ లైఫ్ సినిమా కథ.
ఢిల్లీలో శక్తిరాజు గ్యాంగ్‌పై ఎన్‌కౌంటర్‌తో నాయకుడు సినిమాకు కొనసాగింపుగా సినిమాను మొదలుపెట్టినట్టు చిన్న హింట్ ఇస్తూనే సినిమాను ఆసక్తికరంగా, సెంటిమెంట్‌తో మణిరత్నం తాను ఏం చెప్పబోతున్నాడో ముందే చెప్పకనే చెప్పాడు. అమర్, శక్తిరాజు బంధాన్ని ఫస్టాఫ్‌లో ఎస్టాబ్లిష్ చేస్తూనే... రెగ్యులర్, రొటీన్ డ్రామాను నడపడంతో సినిమాలో ఏం లేదనే విషయం అర్ధమవుతుంది. ట్రైలర్‌లోనే కథ చెప్పడంతో మణిరత్నం ఆ స్టోరీని ఎలా చెప్పాడు. సాదాసీదా కథకు ఎలాంటి ఫ్లేవర్‌తో కోటింగ్ ఇస్తాడనే ఆసక్తి మధ్య సినిమా నడుస్తుంది. కథ మాత్రం అంతా ఊహించిన విధంగానే సాగడంతో ఎక్సైట్‌మెంట్ పెద్దగా కలగదు. దాంతో ఫస్టాఫ్‌లో మానస సరోవరం ఎపిసోడ్‌ను మంచి ఫీల్,లుక్‌తో గ్రాండియర్ ముగించడం కొంత ఊరట మాత్రమేగా ఉంటుంది.
అమర్ మర్డర్ ఎటాక్ అనంతరం శక్తిరాజు తిరిగి ఢిల్లీకి వచ్చిన తర్వాత ఏదైనా ఆసక్తికరంగా సాగుతుందా? అనే ప్రశ్నకు అమర్ చెల్లెలు చంద్ర (ఐశ్వర్య లక్ష్మీ) ఎపిసోడ్ కొంత ఇంట్రెస్ట్‌ను భావోద్వేగాన్ని క్రియేట్ చేస్తుంది. మిగితా అంతా శక్తిరాజు పగ, ప్రతీకారంతోనే సినిమాను నడిపించడంతో మరోసారి నాయకన్, నవాబ్ సినిమాలు చూసిన ఫీలింగ్ కలుగుతుంది. కొత్తగా చూసే వారికి తప్ప ఈ కథలో కొత్తదనం ఏమీ కనిపించదు. కథలో ఎలాంటి ట్విస్టులు, టర్నులు, ఎమోషనల్ కంటెంట్ లేకపోవడంతో మణిరత్నం నిరాశపరిచాడనే ఫీలింగ్ కలగడం అత్యంత సహాజంగా ఈ సినిమా విషయంలో కలుగుతుంది.
నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. కమల్ హాసన్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఆయన కనిపించిన పాత్రలో వైవిధ్యం లేకపోయినా.. గతంలో చూసిన క్యారెక్టర్‌నే రిపీట్ చేసినప్పటికీ.. పెర్ఫార్మ్ విషయంలో రాజీ పడకుండా తన మార్క్ నటనను ప్రదర్శించాడు. కొన్ని సన్నివేశాల్లో అద్బుతంగా.. కొత్తగా కనిపించి మెప్పిస్తాడు. తనను అభిమానించే వారికి మాత్రం ఫుల్ మీల్స్ పెట్టినంత ఆనందాన్ని కలిగిస్తాడు. కమల్‌ను మరోసారి తెర మీద చూసి తరించాల్సిందే. శింబు కొత్తగా చేయడానికి తన పాత్రలో పెద్దగా స్కోప్ లేకపోవడంతో ఆ పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించాడు. కొన్ని సీన్లలో మాత్రం ఫర్వాలేదనిపిస్తాడు. కానీ వన్ మ్యాన్ షో అనిపించేంతగా మాత్రం కనిపించడు. త్రిషా కేవలం గ్లామర్ పరంగా మాత్రమే కనిపిస్తుంది. ఆమెది ఆటలో అరటిపండు లాంటి క్యారెక్టర్‌లో కనిపించింది. అభిరామి, ఐశ్వర్య లక్ష్మీ, అలీ ఫజల్, జోజు జార్జి, ఇతర పాత్రలు ఒకే అనిపిస్తాయి. మొత్తంగా కమల్ మినహాయించి అంత దమ్మున్న వేరే పాత్ర కనిపించదు.
టెక్నికల్ విషయాలకు వస్తే.. రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫి సినిమాను మరింత రిచ్‌గా చేసింది. యాక్షన్, స్టంట్ క్రేజీగా ఉంటాయి. ఢిల్లీ వాతవారణాన్ని, అందాలను బాగా ఒడిసిపట్టుకోవడం సినిమా అందంగా కనిపించేలా చేసింది. ఇక ఏఆర్ రెహ్మాన్ అంతగా మెప్పించలేకపోయాడు. అనిరుధ్, తమన్ తరం నడుస్తున్న సమయంలో ఆయన అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం అంతంతా మాత్రంగానే కనిపిస్తాయి. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ సినిమాను పరుగులు పెట్టించింది. ఏ మాత్రం కొదువ లేకుండా అందమైన లొకేషన్లలో షూట్ చేసి.. మంచి ప్రొడక్షన్ వాల్యూస్‌ను చూపించారు.
మాఫియా బ్యాక్ డ్రాప్‌తో అంతర్గత కుమ్ములాటలు, ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్, యాక్షన్ డ్రామాగా రూపొందిన థగ్ లైఫ్ రెగ్యులర్, రొటీన్ మూవీ. ఈ సినిమాలో మణిరత్నం మార్కు చూడాలని వెళితే మాత్రం నిరాశపడాల్సిందే. సన్నివేశాలు, పాత్రల చిత్రీకరణ విషయంలో ఏ మాత్రం కొత్తదనం కనిపించదు. ఈ సినిమాకు కమల్ హాసన్ ఒక్కడు మాత్రమే ప్లస్ పాయింట్. సాంకేతిక అంశాలు కొంత బెటర్‌గా ఉంటాయి. ఓవరాల్‌గా రెగ్యులర్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగానే అనిపిస్తుంది. కమల్, త్రిష, శింబు లాంటి స్టార్ వాల్యూ, మణిరత్నం, ఇతర టెక్నిషియన్స్ పెట్టిన ఎఫర్ట్స్ కోసం ఓసారి చూడొచ్చు. అంచనాలు లేకుండా వెళితే నిరాశ పడకుండా ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ మాత్రం ఉంటుంది.


Click it and Unblock the Notifications











