Tiger Nageswara Rao Movie Review గజదొంగగా రవితేజ మెప్పించాడా? టైగర్ నాగేశ్వరరావు రివ్యూ
Rating: 2.75/5
నటీనటులు: రవితేజ, అనుపమ్ ఖేర్, నుపుర్ సనన్, రేణు దేశాయ్, జిష్షు సేన్ గుప్తా, మురళీ శర్మ, గాయత్రి భరద్వాజ్, నాజర్, తదితరులు
రచన, దర్శకత్వం: వంశీ
నిర్మాత: అభిషేక్ అగర్వాల్
సినిమాటోగ్రఫి: ఆర్ మధి
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
మ్యూజిక్: జీవి ప్రకాశ్ కుమార్
బ్యానర్: అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
నిడివి: 182 నిమిషాలు
రిలీజ్ డేట్: 2023-10-20
స్టూవర్ట్ పురంలో నాగేశ్వరరావు (రవితేజ) దొంగతనాలు చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు సవాల్‌గా నిలుస్తాడు. దోపిడి చేయడానికి ముందు పోలీసులకు సమాచారం అందించడం నాగేశ్వరరావు స్పెషాలిటి. దొంగతనాలకు పాల్పడుతూ జీవితాన్ని కొనసాగిస్తున్న క్రమంలో మర్వాడి అమ్మాయి (నూపుర్ సనన్)తో ప్రేమలో పడుతాడు. అయితే తన జీవితంలో ఎన్నో దొంగతనాలు చేసిన ఆయన ఏకంగా ప్రధానమంత్రి ఇంటిలో దోపిడికి ప్లాన్ చేసి సెక్యూరిటీకి చెమటలు పట్టిస్తాడు. ఆ క్రమంలో నాగేశ్వరరావు మరదలు (గాయత్రి భరద్వాజ్) ఆయన జీవితంలోకి వస్తుంది.

నాగేశ్వరరావు బాల్యంలోనే ఎందుకు దొంగగా మారాడు? 8 ఏళ్ల వయసులో దొంగగా మారి తన తండ్రినే ఎందుకు చెప్పాడు? కరువు బాధితులకు ఆహారం తీసుకెళ్లే ట్రైన్‌పై నాగేశ్వరరావు టీమ్ ఎందుకు దోపిడి ప్లాన్ చేసింది. నాగేశ్వరరావు ఆంధ్రాలో దొంగతనాలకు పాల్పడుతూ తమిళనాడు పోలీసులకు ఎలా చిక్కాడు? ప్రధాన మంత్రి ఇంటిలో దొంగతనం చేయాలనే విషయం వెనుక అసలు కారణం ఏమిటి? ప్రధాన మంత్రి ఇంటిలో నుంచి నాగేశ్వరరావు ఏం దొంగతనం చేశాడు? ప్రధాని ఇంటిలో దొంగతనం చేసిన తర్వాత నాగేశ్వరరావు జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది. నాగేశ్వరరావు టైగర్ నాగేశ్వరరావుగా ఎలా మారాడు? టైగర్ జీవితంపై హేమలత లవణం (రేణుదేశాయ్) ప్రభావం ఎలా ఉంది? మరదలిని పెళ్లి చేసుకొన్న తర్వాత నాగేశ్వరరావుకు ఎలాంటి కష్టాలు వచ్చాయి? చివరకు నాగేశ్వరరావు జీవితానికి ముగింపు ఏమిటి? నాగేశ్వరరావు జీవిత లక్ష్యం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానం టైగర్ నాగేశ్వరరావు సినిమా కథ.
ప్రధాన మంత్రి సెక్యూరిటీ ఆఫీసర్ (అనుపమ్ ఖేర్)తో ఆంధ్రా పోలీస్ అధికారి (మురళీ శర్మ) సమావేశంతో టైగర్ నాగేశ్వరరావు మూవీ హై నోట్‌లో మొదలవుతుంది. మురళీ శర్మ చెప్పే విషయాలతో కథ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తుంది. ట్రైన్ ఎపిసోడ్ యాక్షన్ పరంగా, ఎమోషనల్‌గా బాగున్నప్పటికీ.. గ్రాఫిక్ వర్క్ నాసిరకంగా, పేలవంగా ఉంది. సినిమా తొలి 20 నిమిషాలు గడిచిన తర్వాత నుపూర్ సనన్‌తో లవ్ ట్రాక్ సినిమా వేగానికి బ్రేక్ వేయడంతో మూవీలో ఉండే ఫ్లో దెబ్బతిన్నట్టు అనిపిస్తుంది. అలాగే స్టోరిని ఫ్లాట్‌గా నడిపించడం వల్ల మూవీ రెగ్యులర్‌గా సాగినట్టు అనిపిస్తుంది. ఓ ఎమోషనల్ సీన్‌తో మూవీ ఫస్టాఫ్‌ను ముగించడం జరుగుతుంది. అయితే ఫస్టాఫ్ విషయానికి వస్తే.. స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసినప్పటికి.. సన్నివేశాల్లో బలం కనిపించకపోవడంతో సాదాసీదా మూవీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది.

సెకండాఫ్‌లో కథను ఎమోషనల్‌గా చూపించే ప్రయత్నంతో మూవీ సరైన ట్రాక్‌పైకి వచ్చినట్టు అనిపిస్తుంది. రెండో భాగంలో కూడా కొన్ని సీన్లు బాగుంటే.. వెంటనే మరికొన్ని సీన్లు బలహీనంగా కనిపిస్తాయి. సెకండాఫ్‌లో రిపీట్ షాట్స్ వేయడం నిడివి పెరిగి ఎమోషనల్ కనెక్ట్ మిస్ అయిందనిపిస్తుంది. అయితే ఈ సినిమాలో హేమలత లవణం బలమైన పాత్ర అంటూ అంచనాలు పెంచారు. తీరా చూస్తే.. ప్రీ క్లైమాక్స్‌కు ఆ పాత్ర వచ్చి.. పెద్దగా ప్రభావం చూపించలేకపోయిందనే చెప్పాలి. నాలుగైదు సీన్లతో రేణుదేశాయ్ పాత్రను సరిపెట్టే ప్రయత్నం జరిగింది. ఓవరాల్‌గా సినిమా ఎమోషనల్ పాయింట్‌తో, హై ఎనర్జీతో ముగించడం వల్ల అప్పటి వరకు ఉన్న అసంతృప్తిని తగ్గించడానికి దోహదపడింది.
దర్శకుడు వంశీ ఎంచుకొన్న పాయింట్.. ఆ పాయింట్ కథగా విస్తరించిన తీరు.. రాసుకొన్న స్క్రీన్ ప్లే ఈ సినిమాకు బలంగా మారిందని చెప్పవచ్చు. రైటింగ్ పార్ట్ ఇంకా బెటర్‌గా ఉండి ఉంటే మరింత ఎమోషనల్‌గా కనెక్ట్ అయి ఉండేదనిపిస్తుంది. ఎలమంద క్యారెక్టర్ కోసం హరీష్‌ను కాకుండా మరోకరిని ముఖ్యంగా తెలుగు యాక్టర్‌ను తీసుకొని ఉంటే ఇంకా బెటర్ కనెక్ట్ విటీ ఉండేది. విలనిజం బలంగా ఎస్టాబ్లిష్ కాకపోవడంతో రివేంజ్ డ్రామా పెద్దగా ఆకట్టుకోలేకపోయిందనే ఫీలింగ్ కలుగుతుంది. మిగితా పాత్రల్లో తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న నటీనటులు లేకపోవడం మరో మైనస్‌గా అనిపిస్తుంది. ఓవరాల్‌గా కథను కథగా చెప్పాలనే దర్శకుడి ప్రయత్నాన్ని అభినందించాల్సిందే.

నటీనటుల విషయానికి వస్తే.. రవితేజ యాక్టింగ్, ఫెర్ఫార్మెన్స్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు. నాగేశ్వరరావు నుంచి టైగర్ నాగేశ్వరరావుగా మారిన పాత్రలో ఒదిగిపోయాడు. ఎమోషనల్ సీన్లలో తన మార్కు ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నాడు. అయితే డైలాగ్ డెలివరీ విషయంలో డబ్బింగ్ పరంగా ఏదో తేడా కొట్టినట్టు అనిపిస్తుంది. యాక్షన్ పార్ట్ విషయానికి వస్తే.. కొంత రక్తపాతం మోతాదు మించిందనిపిస్తుంది. ఇక నూపుర్ సనన్ తన పాత్ర పరిధి తగినట్టుగా ఫెర్ఫార్మ్ చేసింది. గాయత్రి భరద్వాజ్ తన పాత్ర ద్వారా క్లైమాక్స్‌లో మంచి ఫెర్ఫార్మెన్స్ ద్వారా ఎమోషనల్‌గా మార్చింది. హరీష్ పేరడి, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ ఇతరుల తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు.
సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి, మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. పిరియాడిక్ బ్యాక్ డ్రాప్‌తో ఉండే ఈ కథకు ఫీల్ కలిగించడానికి ఉపయోగించిన కలర్ టోన్ బాగుంది. కొన్ని సన్నివేశాలను బీజీఎం బాగా ఎలివేట్ చేసింది. జీవీ ప్రకాశ్ కొన్నిసార్లు అవసరం లేకున్నా కొన్నీ సీన్లలో సౌండ్ పెల్యూషన్‌కు కారణమయ్యాడనిపిస్తుంది. ఎడిటింగ్ విభాగానికి ఇంకా చాలా పని ఉందనిపించింది. నిడివి కొత్త తగ్గించి ఉండే ఇంకా బెటర్ ఫీల్ ఉండే అవకాశం ఉండేది. అభిషేక్ అగర్వాల్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా తెర మీద రిచ్‌గా కనిపించింది.

అవినీతిపరులైన రాజకీయ నేతలు, పోలీసు అధికారుల వల్ల ప్రజల్లో తిరుగుబాటు రావడం సహజంగా జరుగుతుంది. ఆ తిరుగుబాటు వివిధ రకాలుగా ఉద్యమంగా కనిపిస్తుంది. అయితే నాగేశ్వరరావు తన ప్రాంతానికి మేలు చేయాలనే తపనతో ఎంచుకొన్న వృత్తి కొంత వివాదాస్పదమైనప్పటికీ.. ఆ ప్రాంతానికి మేలు ఎలా మేలు చేసిందనే విషయాన్ని టైగర్ నాగేశ్వరావు సినిమాగా చెప్పడం అభినందనీయం. ఆ ప్రాంతంలోని సామాజిక సమస్యలను ఇంకా బెటర్‌గా ఎలివేట్ చేసి ఉంటే.. టైగర్ నాగేశ్వరరావు ప్రేక్షకులకు మరింత చేరువయ్యేవాడనిపిస్తుంది.

రేణుదేశాయ్ పాత్ర నిడివి చాలా చిన్నగా ఉండటం అభిమానులకు నిరాశను కలిగించే విషయం. స్క్రిప్టు పరంగా కొన్ని లోపాలు, అలాగే వాస్తవాలకు దూరంగా కొంత కంటెంట్ ఉందనే వాదనలు వినిపిస్తున్పటికీ.. ఈ సినిమా ఎమోషనల్‌గా ఆకట్టుకొంటుంది. చరిత్రలో తెలియని విషయాలను చెప్పే విషయం బాగుంది. ఈ సినిమా ఎలాంటి అంచనాలతో వెళ్లినా మంచి అనుభూతిని కలిగిస్తుంది. థియేటర్‌లోనే చూస్తే బెటర్ ఫీలింగ్ ఉంటుందనేది నా అభిప్రాయం. దసరా రేసులో హిట్ రేసులో ఈ సినిమా ఉంటుందా? అనేది రెండు,మూడు రోజుల్లో స్పష్టమవుతుంది.


Click it and Unblock the Notifications











