Tourist Family OTT Review: టూరిస్ట్ ఫ్యామిలీ ఓటీటీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: సిమ్రాన్, శశికుమార్, యోగిబాబు, భగవతి పెరుమాల్, ఎంఎస్ భాస్కర్ తదితరులు
దర్శకత్వం: అభిషాన్ జీవింత్
నిర్మాతలు: నజెరాత్ పాసిల్లియన్, మంగేష్ రాజ్ పసిల్లియాన్, యువరాజ్ గణేషన్
మ్యూజిక్ డైరెక్టర్: సీన్ రోల్డాన్
సినిమాటోగ్రాఫర్: అరవింద్ విశ్వనాథన్
ఎడిటర్: భరత్ విక్రమన్
ఓటీటీ రిలీజ్: జియో హాట్‌స్టార్
ఓటీటీ రిలీజ్ డేట్: 2025-06-02
శ్రీలంకలో ఆర్థిక పరిస్థితి దారుణంగా మారి బతకడం కష్టం కావడంతో ధర్మదాస్ (శశికుమార్) తన భార్య వాసంతి (సిమ్రాన్), ఇద్దరు పిల్లలు నిథుషాన్ (మిథున్ జై శంకర్), ములి (కమలేష్ జగన్)తో కలిసి అక్రమంగా తమిళనాడులోని రామేశ్వరం ప్రాంతానికి వస్తారు. రాఘవన్ అనే స్థానిక ఇన్స్‌పెక్టర్ రాఘవన్ (భగవతి పెరుమాల్) ఇంటిలో అద్దెకు ఉంటారు. ఆ సమయంలో ఆ ప్రాంతంలో బాంబు పేలుడు సంభవిస్తుంది. దానికి కారణం శ్రీలంక వాసులే పనే అని పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తారు. రామేశ్వరంలోని శ్రీలంక తమిళల ఆచూకీ కోసం వేట ప్రారంభిస్తారు.
శ్రీలంక శరణార్థులుగా వచ్చిన ధర్మదాస్ కుటుంబం రామేశ్వరంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు? ఉద్యోగం సంపాదించడానికి ధర్మదాస్‌కు ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? తమిళులమని చెప్పుకోవడానికి ఎలాంటి ఆధారాలు సంపాదించారు? పోలీసుల వేటకు ధర్మదాస్ కుటుంబం చిక్కిందా? బాంబు బ్లాస్ట్ చేసింది ఎవరు? ఇలాంటి ఆరోపణల నుంచి ఎవరు కాపాడారనే ప్రశ్నలకు భావోద్వేగమైన సమాధానమే టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా కథ.

ఆర్థిక కష్టాలతో చితికిపోయిన ఓ కుటుంబం చట్ట వ్యతిరేకంగా వలస జీవులుగా రావడం, వారి కష్టాలు, సమస్యలు అనే పాయింట్ గొప్ప పాయింట్ కాకపోయినప్పటికీ.. దానిని దర్శకుడు అభిషాన్ జీవింత్ కథగా చెప్పిన తీరు, అలాగే సన్నివేశాల్లో ఎమోషన్స్‌ను నింపిన విధానం ఈ సినిమాకు చక్కటి బ్యూటని తెచ్చిపెట్టింది. ఇక సిమ్రాన్, శశికుమార్ నుంచి దర్శకుడు రాబట్టుకొన్న ప్రతిభ ఈ సినిమాకు మరింత బలంగా మారింది. సింపుల్ కథ, ఎమోషనల్‌గా స్టోరీ నేరేషన్ కారణంగా ప్రేక్షకుల హృదయాలను బలంగా తట్టి లేపేలా చేసింది. ఈ సినిమా కథను ఊహించుకొన్నందుకు, అలాగే తన విజన్ ప్రకారం.. ఎలాంటి కమర్షియల్ హంగులకు ప్రయత్నించకుండా నిజాయితీగా చెప్పడానికి ప్రయత్నించినందుకు డైరెక్టర్ టాలెంట్‌ను ప్రశంసించాల్సిందే.
టూరిస్ట్ ఫ్యామిలీ నటీనటుల విషయానికి వస్తే.. ఈ సినిమాలో నటించిన వారంతా యాక్టర్లుగా ఎక్కడా తమ ఉనికిని చూపించకుండా.. తెర మీద పాత్రలనే సజీవంగా చూపించగలిగారు. ఎక్కడ శశికుమార్ గానీ, సిమ్రాన్ గానీ కనిపించకుండా ధర్మధాస్, వాసంతిగా మాత్రమే తమ క్యారెక్టర్లలో జీవించారు. ఇక వారి పిల్లలుగా నటించిన ఇద్దరు కమలేష్, మిథున్ కూడా తమ పెర్ఫార్మెన్స్‌తో కట్టిపడేస్తారు. డైరెక్టర్ విజన్‌ను అర్ధం చేసుకొని నటీనటులంతా చక్కగా నటించారు. యోగిబాబు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మాత్రమే కాకుండా హుందాగా నటించి మెప్పించాడు.
సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. ఈ సినిమా కథను అర్దం చేసుకొన్న మ్యూజిక్ డైరెక్టర్ ప్రతీ ఎమోషన్‌కు తన మ్యూజిక్‌తో మరో రేంజ్ కల్పించారు. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను హెచ్చు తగ్గులు లేకుండా బ్యాలెన్స్‌గా కంపోజ్ చేశాడు. ఇక అరవింద్ విశ్వనాథన్ చిత్రీకరించిన సన్నివేశాలు, వాటికి ఉపయోగించుకొన్న లైటింగ్ అన్నీ చక్కగా కుదరడంతో .. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎన్విరాన్ మెంట్‌ను తెరపైన అద్బుతంగా చూపించగలిగాడు. భరత్ విక్రమన్ ఎడిటింగ్ కూడా సూపర్బ్‌గా ఉంది. నజెరాత్ పాసిల్లియన్, మంగేష్ రాజ్ పసిల్లియాన్, యువరాజ్ గణేషన్ అనుసరించిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్‌లో ఉన్నాయి.
ఫ్యామిలీ టూరిస్ట్ సినిమా గురించి ఫైనల్‌గా చెప్పాలంటే.. భావోద్వేగాలతో మిడిల్ క్లాస్ జీవితాన్ని చక్కగా తెర మీద ఆవిష్కరించిన చిత్రం. నటీనటుల సహజమైన నటన, దర్శకుడి రైటింగ్, స్క్రీన్ ప్లే ఈ సినిమాకు అత్యంత బలం. ఇక సినిమా స్లోగా సాగడం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కథ అక్కడక్కడే తిరగడం రెగ్యులర్ ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. కానీ విభిన్నమైన కథలను ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఈ సినిమా జీయో హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నది. మీకు తీరికగా ఉన్న సమయంలో తగినంత టైమ్ సెట్ చేసుకొని ఒకే స్ట్రెచ్‌లో చూస్తే మంచి అనుభూతి కలుగుతుంది. డొంట్ మిస్ ఇట్.


Click it and Unblock the Notifications











