Tuk Tuk Movie Review: టుక్ టుక్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Rating: 2.75/5
నటీనటులు: హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, శాన్వీ మేఘన, నిహాల్ కోధాటి, దయానంద్ రెడ్డి తదితరులు
కథ, దర్శకత్వం: సీ సుప్రీత్ కృష్ణ
నిర్మాతలు: రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీ వరుణ్, శ్రీరాముల రెడ్డి, సుప్రీత్ సి కృష్ణ
సమర్పణ: హిమబిందు రెడ్డి
సినిమాటోగ్రఫి: కార్తీక్ సాయికుమార్
మ్యూజిక్: సంతు ఓంకార్
ఎడిటింగ్: అశ్వత్ శివకుమార్
ప్రొడక్షన్ డిజైన్: శివ మచా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: లక్ష్మణ్ స్వామి
బ్యానర్: చిత్రవాహిని ప్రొడక్షన్స్, ఆర్‌వైజీ సినిమాస్
రిలీజ్ డేట్: 2025-03-21
చిత్తూరు జిల్లాలోని ఓ గ్రామంలో ముగ్గురు కుర్రాళ్లు (హర్ష రోషన్, కార్తీకేయ దేవ్, స్టీవెన్ మధు) బూతు వీడియోలు చూస్తూ జల్సాగా జీవితం గడుతుంటారు. ఊరిలో ఆడవాళ్లు స్నానం చేస్తుంటే దొంగచాటుగా చూస్తుంటారు. ఆ ముగ్గురికి అలాంటి వీడియోలు తీసి డబ్బులు సంపాదించాలనుకొనే ఆలోచన వస్తుంది. డబ్బు కోసం తండ్రిని అడిగితే.. వినాయక చవితి వేడుకను నిర్వహించి.. వచ్చే డబ్బుతో కెమెరా కొనుక్కోమని సలహా ఇస్తాడు. ఆ క్రమంలో మూలన పడిన బజాజ్ చేతక్ స్కూటర్‌ను బయటకు తీసి రిపేర్ చేయిస్తారు. దాంతో వారి జాతకం ఉన్నట్టుండి మారిపోయి విపరీతంగా డబ్బు చేతికి వస్తుంది. అయితే ఆ స్కూటర్ మనిషిలా సైగల్ చేయడంతో వారు ఓ రకమైన విషయంలో ఇరుక్కొంటారు.

ముగ్గరు కుర్రాళ్ల జీవితంలో స్కూటర్ తెచ్చిన మార్పు ఏమిటి? స్కూటర్ మనిషిలా తల ఊపడం వెనుక మర్మం ఏమిటి? ముగ్గురు జీవితాలను ప్రభావితం చేసిన నవీన్ (నిహాల్ కోదాటి), శిల్ప (శాన్వీ మేఘన) ప్రేమ కథ ఏమిటి? శిల్పకు ఎలాంటి చేదు అనుభవం ఎదురైంది? గ్రామంలో ఎదురైన సమస్యను శిల్ప ఎలా డీల్ చేసింది? శిల్ప తండ్రి (దయానంద్ రెడ్డి) ఎలాంటి సమస్యలో ఇరుక్కొన్నారు? ముగ్గురు కుర్రాళ్ల జీవితాలను స్కూటర్ ఏ విధంగా మలుపుతిప్పిందనే ప్రశ్నలకు సమాధానమే టుక్ టుక్ సినిమా కథ.
గ్రామంలో మహిళల పట్ల అనుసరించే ధోరణిని పాయింట్‌గా తీసుకొని ఓ భావోద్వేగమైన కథను అల్లడానికి దర్శకుడు సుప్రీత్ చేసిన ప్రయత్నం బాగుంది. ఆ ఎమోషనల్ పాయింట్‌ను ముగ్గురు కుర్రాళ్ల జీవితానికి ముడిపెట్టి కథను నడిపించాలనే ఆలోచన కూడా బాగుంది. కానీ సెకండాఫ్‌లో ఉండే భావోద్వేగమైన కథను చెప్పడానికి ఫస్టాఫ్‌ను మరీ సాగదీసినట్టు అనిపిస్తుంది. ఉద్దేశపూర్వకంగానే ఇంటర్వెల్ వరకు సినిమా మొదటి భాగాన్ని లాగించాడనే ఫీలింగ్ కలుగుతుంది.
అయితే సెకండాప్‌ను ఎమోషనల్‌గా డీల్ చేసిన విధానం మూవీకి హైలెట్‌గా మారిందని చెప్పాలి. శాన్వీ మేఘన క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథలో వేగం పెరగడంతోపాటు జోష్ కూడా కనిపిస్తుంది. హార్ట్ టచింగ్‌గా ఉండే కథలో లీనమైన శాన్వీ నటించిన తీరు ఆకట్టుకొంటుంది. చివర్లో మనసును భారంగా మార్చే ప్రయత్నం కూడా బాగుంది. ముగ్గురు కుర్రాళ్లను పెట్టి సినిమాను ఫీల్ గుడ్‌గా మార్చి సుప్రీత్ తన ప్రతిభను చాటుకొన్నారనే చెప్పాలి.
సలార్, కోర్టు సినిమాలతో బాలనటుడిగా మంచి ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొంటున్న హర్ష రోషన్ మరోసారి ఈ సినిమాను తన భుజాల మీద మోశాడు. తనతోపాటు ఇద్దరి క్యారెక్టర్లను బ్యాలెన్స్ చేస్తూ మెచ్యురిటీతో కూడిన నటనను ప్రదర్శించాడు. చిన్న వయసులోనే సినిమా భారాన్ని మోసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకొన్నాడు. ఇక శాన్వీ మేఘన సెకండాఫ్‌ను ఎమోషనల్‌గా మార్చడమే కాకుండా తన వంతు బాధ్యతగా సినిమాకు పరిపూర్ణతను తెచ్చిపెట్టింది. తండ్రి పాత్రలో దయానందరెడ్డి మరోసారి భావోద్వేగమైన నటనతో ఆకట్టుకొన్నాడు. ఇతర నటీనటులు తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి, మ్యూజిక్ అంశాలు ప్లస్ పాయింట్స్‌గా చెప్పుకోవచ్చు. కోనసీమ వాతావరణాన్ని కార్తీక్ సాయికుమార్ అందంగా కెమెరాలో బంధించాడు. పచ్చటి వాతావరణం, పల్లెలోని మట్టి వాసనను చూపించేలా సీన్లను చిత్రీకరించాడు. సన్నివేశాలకు తగినట్టుగా, కథను ఎలివేట్ చేసే విధంగా సంతూ ఓంకార్ మ్యూజిక్ పరంగా న్యాయం చేశారు. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లపై ఎడిటర్ అశ్వత్ శివకుమార్ కత్తెర వేయాల్సి ఉండేదనిపిస్తుంది. రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీ వరుణ్, శ్రీరాముల రెడ్డి, సుప్రీత్ సి కృష్ణ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఈ సినిమా తెరపైన రిచ్‌గా, ఫీల్ గుడ్‌గా కనిపించేందుకు చేసిన ప్రయత్నం బాగుంది.
లవ్, ఫ్యామిలీ భావోద్వేగాలు, రూరల్ ప్రాంతాల్లో ప్రజల్లో ఉండే అమాయకత్వం లాంటి అంశాలను కలిపి రూపొందించిన ఎమోషన్స్ డ్రామా టుక్ టుక్. మంచి కంటెంట్ ఉన్న సినిమాను ఆడియెన్స్ వద్దకు తీసుకెళ్లడంలో టైటిల్ కీలకం. ఈ సినిమాకు మరేదైనా టైటిల్ పెట్టి ఉండి ఉంటే మరింత కనెక్టివిటీ ఉండేదేమో అనిపిస్తుంది. రోషన్, మరో ఇద్దరు బాల నటుల ఫెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు బ్యూటీ. శాన్వీ గెస్ట్ అప్పీయరెన్స్ సినిమాకు బలంగా నిలిచింది. సాంకేతిక అంశాలు మరో స్పెషల్ ఎట్రాక్షన్. ఫస్టాఫ్ సాగదీసినట్టు ఉండటం, ముగ్గురి పిల్లలపైనే కథ నడిపించేందుకు చేసిన ప్రయత్నం కొంత బోర్‌గా ఉంటుంది. సెకండాఫ్‌లో సినిమా ఫీల్‌తో, ట్విస్టులతో ఆహ్లాదకరంగా సాగుతుంది. హ్యుమన్ ఎమోషన్స్ తరహా సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. ఈ వారం ఏదైనా రూరల్ నేటివిటీ సినిమా చూడాలనుకొంటే టుక్ టుక్‌ను నిస్సందేహంగా ఎంచుకోవచ్చు.


Click it and Unblock the Notifications











