Ugly Story Movie Review: అగ్లీ స్టోరి తెలుగు మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: శ్రీ నందు, అవికా గోర్, రవితేజ మహాదాస్యం, శివాజీ రాజా, ప్రగ్యా తదితరులు
రచన, దర్శకత్వం: ప్రణవ స్వరూప్
నిర్మాతలు: జేఎస్ సుభాషిణి, కొండా లక్ష్మణ్
సహ నిర్మాతలు: రాజ్, అశ్వినీ శ్రీ కృష్ణ
మ్యూజిక్: శ్రవణ్ భరద్వాజ్
సినిమాటోగ్రఫి: శ్రీ సాయికుమార్ దారా
ఎడిటింగ్: మిథున్ సోమ, శ్రీకాంత్ పట్నాయక్ ఆర్
ఆర్ట్: విఠల్ కోసనమ్
కొరియోగ్రఫి: ఈశ్వర్ పెంటి
బ్యానర్: రియా జియా ప్రొడక్షన్స్
రిలీజ్ డేట్: 2026-05-22
చిన్నతనంలో అనాథగా మారిన నేహ (అవికా గోర్)ను తన మేనమామ (శివాజీ రాజా) పెంచి పెద్ద చేస్తాడు. నేహా అంటే తన మేనమామ కొడుకు కార్తీక్ (శ్రీ నందు)కు చెప్పలేనంత ప్రేమ. నేహా ప్రేమ కోసం కార్తీక్ పరితపిస్తుంటాడు. కానీ నేహాకు మాత్రం గౌతమ్ (రవితేజ మహాదాస్యం) పై పీకల్లోతు ప్రేమ ఉంటుంది. గౌతమ్ మాత్రమే తన ప్రపంచం అని బతుకుతుంది. అదే సమయంలో నేహానే తన ప్రపంచమని బతుకుతుంటాడు. అయితే ఓ ఎమోషనల్ సిట్యుయేషన్‌లో బలవంతంగా కార్తీక్‌ను నేహా పెళ్లి చేసుకొంటుంది. కానీ శారీరకంగా, మానసికంగా కార్తీక్‌కు నేహా దూరంగా ఉంటుంది. అయితే ఎలాగోలా నేహా ప్రేమను పొందాలని ఆమెను కార్తీక్ టార్చర్ చేస్తుంటాడు.
నేహా ఎలా అనాథగా మారింది? నేహాపై కార్తీక్ ఎందుకు, ఎలా ప్రేమను పెంచుకొన్నాడు? నేహా అమితంగా ఇష్టపడి ప్రేమించే గౌతమ్ ఎవరు? గౌతమ్ కోసమే నేహా ఎందుకు పరితపిస్తుంది? ఇష్టం లేకుండా కార్తీక్‌ను నేహా ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కార్తీక్‌ను పెళ్లి చేసుకొనే విషయంలో నేహా రాజీ పడటానికి దారి తీసిన భావోద్వేగమైన సంఘటన ఏమిటి? నేహాను కార్తీక్ ఎలాంటి టార్చర్‌కు గురి చేశాడు? నేహా, కార్తీక్ బంధానికి ముగింపు ఏమిటి? గౌతమ్‌కు నేహా చేరువైందా? కార్తీక్ పిచ్చి ప్రేమకు ముగింపు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.

సెంటిమెంట్, ఎమోషన్స్, మ్యాడ్ లవ్ లాంటి అంశాలతో దర్శకుడు ప్రణవ్ స్వరూప్ ఎంచుకొన్న పాయింట్ బాగున్నది. సినిమాను మొదలు పెట్టిన పాయింట్ కూడా ఆడియెన్‌ను కథలోకి తీసుకెళ్లేలా చేసింది. కానీ ఒకే పాయింట్ చుట్టే కథ, అక్కడక్కడే తిరగడం వల్ల ఇక ముందు ఏం జరుగుతుందనే ఆసక్తిని, క్యూరియాసిటీని కలిగించలేకపోయింది. కానీ కథ, కథనాల్లో వేరియేషన్ లేకపోయినప్పటికీ.. శ్రీ నందు, అవికా గోర్ నుంచి దర్శకుడు రాబట్టుకొన్న పెర్ఫార్మెన్స్ వల్ల ఈ సినిమా కొంత మేరకు గ్రిప్పింగ్‌గా సాగుతుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి చివరకు వరకు క్రియేట్ చేసిన టెంపో బాగుంది. కానీ కథను హడావిడిగా ముగించారా? అనిపిస్తుంది. శ్రీ నందు క్యారెక్టర్‌కు డిఫరెంట్‌గా ముగింపు ఇచ్చి ఉంటే డెఫినెట్‌గా కొత్త జోనర్ అయి ఉండేది. డైరెక్టర్ ప్రణవ్ విజన్, ఐడియా బాగుంది. ఇంకా బెటర్‌గా ప్రజెంట్ చేసి ఉండాల్సిందనే అభిప్రాయం, ఫీలింగ్ కలిగింది.
అగ్లీ స్టోరి సినిమా రెండు క్యారెక్టర్ల మధ్య సాగే మానసిక సంఘర్షణ. నేహాగా అవికాగోర్, కార్తీక్‌గా శ్రీ నందూ మెచ్యుర్డ్ పెర్ఫార్మెన్స్‌ను చూపించారు. ఇలాంటి క్యారెక్టర్లు పండించడం ఇద్దరికి కొట్టిన పిండే. అయితే ఇటీవల కాలంలో శ్రీ నందు చేస్తున్న క్యారెక్టర్లు, వాటి ద్వారా నిజాయితీగా డెలివరీ చేస్తున్న పెర్ఫార్మెన్స్ ది బెస్ట్‌గా ఉంటుంది. కానీ శ్రీ నందును యాక్టర్‌గా నెక్ట్స్ లెవెల్‌కు ప్రమోట్ చేసే పాత్రలు సరిగా పడటం లేదనిపిస్తుంది. కార్తీక్‌గా తన వంతు లోపం లేకుండా యాక్టింగ్‌తో ఇరుగదీశాడు. శివాజీ రాజా ఎమోషనల్ పాత్రలో కనిపించారు. ప్రగ్యా, ఇతరు ఫర్వాలేదనిపించారు. గౌతమ్ క్యారెక్టర్‌లో కనిపించిన రవితేజ మహాదాస్యం పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోయింది.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. మ్యూజిక్, సినిమాటోగ్రఫి, ఆర్ట్ వర్క్ విభాగాల పనితీరు బాగుంది. మ్యూజిక్ విషయానికి వస్తే.. పాటలకు పెద్దగా స్కోప్ లేకపోయింది. ఉన్న పాటలు కూడా కథను ఎలివేట్ చేసేలా కనిపించలేదు. కానీ శ్రవణ్ భరద్వాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఈ సినిమా వరకు విఠల్ ఆర్ట్ వర్క్, సాయికుమార్ సినిమాటోగ్రఫి వర్క్ స్పెషల్ మెన్షన్ చేయొచ్చు. మిథన్ సోమ, శ్రీకాంత్ పట్నాయక్ ఆర్ ఎడిటింగ్ విషయంలో కత్తి మీద సామే అనే విషయం అర్ధమైంది. పెద్దగా వేరియేషన్ లేని కథను ఇంట్రెస్టింగ్ కూర్పు చేయడంలో తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. డైలాగ్స్ సెన్సిబుల్‌గా ఉన్నాయి. జేఎస్ సుభాషిణి, కొండా లక్ష్మణ్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
అగ్లీ స్టోరి.. ట్రాయంగిల్ లవ్ స్టోరి. అయితే లవ్ స్టోరిని నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లే మ్యాడ్‌నెస్ లోపించిందనే చెప్పాలి. ఈ సినిమాకు శ్రీ నందు, అవికా గోర్ పెర్ఫార్మెన్స్ పాజిటివ్ అంశాలు. కొత్తగా కథను చెప్పాలనే ప్రయత్నం విషయంలో దర్శకుడిని అభినందించాలి. ఈ పాయింట్‌తో ఇంకా బెటర్‌గా ప్రజెంట్ చేసి ఉంటే.. తెలుగులో మరో డర్, అగ్ని సాక్షి లాంటి ఫ్లేవర్ ఉన్న సినిమాగా మారి ఉండేదనిపిస్తుంది. పెర్ఫార్మెన్స్ బేస్ లవ్ స్టోరీలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications