ఎవిఎస్ 'అదో తుత్తి' అంకుల్

దర్శకుడిగా ఫెయిల్యూర్ చవిచూసిన ఏవీఎస్ నిర్మాతగా కూడా ఫెయిల్ అయ్యాడనే చెప్పొచ్చు. నువ్వే కావాలి చిత్రంతో పాపులారిటీ సంపాదించిన తరుణ్ ను ఉపయోగించుకొని నిర్మాతగా నిలదొక్కుకోవాలన్న ఏవీఎస్ ప్రయత్నం వికటించింది. కథలో పట్టులేకుండా, అతిసాధారణంగా తీసిన ఈ సినిమా-అంకుల్-తరుణ్ అభిమానులకు నిరాశ కలిగిస్తుంది. ఏవీఎస్ స్వయంగా ఈ సినిమాకు కథను రూపొందించడం విశేషం. నువ్వేకావాలి చిత్రం ద్వారా తరుణ్ కు వచ్చిన ఇమేజ్ ను ఉపయోగించుకొనేందుకు ప్రయత్నించి కథను సాగదీసి నానా కంగాళీ చేశారు.
కథ పరంగా చెప్పాలంటే మెయిన్ కథలో మరో ఉపకథ ఉంటుంది. ఒకటి తరుణ్ కు సంబంధించినదైతే, మరొకటి అంకుల్ ఏవీఎస్ ది. తరుణ్ తన క్లాస్ మేట్ పల్లవిని ప్రేమిస్తాడు. తరుణ్ గ్యాంగ్ చేసే అల్లరికి, ప్రేమాయణాలకు ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ అంకుల్ తోడ్పాటు అందిస్తుంటాడు. ఈ అంకుల్ ఈ కాలేజ్ లో ఫ్యూన్. ఇక తరుణ్ పల్లవి ముందు చిందులు వేస్తుంటాడు. కానీ పాపం ఆ అమ్మాయికి మాత్రం ఇవన్నీ నచ్చవు. సో హీరోగారికి వేరే ఛాన్స్ లేకపోవడంతో సెల్ ఫోన్ లో ఆమెకు ఫోన్ చేసి మాట్లాడుతాడు-వేరే పేరుతో. మొత్తానికి ఆ అమ్మాయి మనసు దోచుకుంటాడు.
ఇద్దరు పాటలు పాడుకుంటారు. ఫోన్ చేసిన వ్యక్తి, తరుణ్ ఒక్కరేనని తెలిసి కూడా ఆ అమ్మాయి ఒప్పుకుంటుందా అని అడగకండి. ఎందుకంటే సినిమాలో ఆ ప్రస్తావన ఎక్కడా లేదు. ఇక ఏవీఎస్ కథ ఏమిటంటే ఫ్యూన్ గా పనిచేస్తున్న ఏవీఎస్ ఒకప్పుడు చాలా గొప్పవాడన్న మాట. ధనవంతుడు కూడా. కానీ నమ్మకమైన మిత్రుడు మోసం చేస్తాడు. భార్యను చంపాడన్న అభియోగంపై జైలు పాలవుతాడు. తన కూతురు బావ దగ్గరి పెరుగుతుంది. ఇలా...సెంటిమెంట్ దృశ్యాలతో సెకండ్ హాఫ్ నడుస్తుంది. ఆ తర్వాత క్లైమాక్స్ లో తేలేదేమింటంటే పల్లవి ఎవరో కాదు ఏవీఎస్ కూతురని. చివరికి తండ్రికూతుళ్ళు కలిసి కంచికి వెళ్ళడంతో మనం ఇంటికి పయనించాల్సి వస్తుంది. అమ్మయ్య కథ అయిపోయిందండి.
తరుణ్ నటన ఫర్వాలేదు. పల్లవి కూడా ఓకే. ఏవీఎస్ నటనలో డ్రామా ఎక్కువగా ఉంది. రాజశేఖర్ దర్శకత్వం గురించి చెప్పుకోవాల్సిన స్థాయిలో లేదు. వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అంతంతమాత్రమే.


Click it and Unblock the Notifications











