Upendra Gadi Adda Review అమ్మాయిల అక్రమ రవాణా నేపథ్యంతో.. ఉపేంద్ర గాడి అడ్డా సమీక్ష
నటీనటులు: కంచర్ల ఉపేంద్ర, సావిత్రి కృష్ణ, ప్రభావతి, జబర్దస్త్ అప్పారావు, బలగం మురళీధర్ గౌడ్, కిరిటి దామరాజు, సంధ్య జనక్, బస్టాప్ కొటేశ్వరరావు తదితరులు
దర్శకత్వం: ఆర్యన్ సుభాన్ ఎస్ కే
నిర్మాత: కంచర్ల అచ్యుతరావు
మ్యూజిక్: రాము అద్దంకి
ఎడిటర్: మెనగ శ్రీనివాసరావు
సినిమాటోగ్రఫి: రవీంద్ర సన్
బ్యానర్: ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్
రిలీజ్ డేట్: 2023-12-01
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌కు చెందిన బస్తీ కుర్రాడు ఉపేంద్ర (కంచర్ల ఉపేంద్ర). కష్టపడకుండా సులభంగా డబ్బు సంపాదించి ఉన్నట్టుండి ధనవంతుడు కావాలని కలలు కంటుంటాడు. ఈ క్రమంలో సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయిని ప్రేమ పేరుతో తన బుట్టలో వేసుకొని సెటిల్ కావాలని ప్లాన్ చేస్తాడు. ఆ క్రమంలో సావిత్రి (సావిత్రి కృష్ణ) అనే అమ్మాయితో పబ్‌లో పరిచయం ఏర్పడుతుంది. అయితే సావిత్రి కూడా ధనవంతురాలిని అని ఉపేంద్రను బురిడి కొట్టిస్తుంది. అలా ఇద్దరు ప్రేమలో పడిన తర్వాత ఉపేంద్ర తాను డబ్బు ఉన్న యువకుడిని కాదు.. బస్తీ అబ్బాయినని నిజం చెప్పేస్తాడు. అదే సమయంలో అమ్మాయిల అక్రమ రవాణా కేసులో ఇరుక్కొంటాడు.
సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయిని ప్రేమ పేరుతో తన బుట్టలో వేసుకోవడానికి ఉపేంద్ర ఏం చేశాడు? తాను ధనవంతుడిని కాదని చెప్నిన తర్వాత సావిత్రి రియాక్షన్ ఏమిటి? అమ్మాయిల అక్రమ రవాణా కేసులో ఇరుకొన్న తర్వాత ఉపేంద్రకు ఎదురైన సమస్యలు ఏమిటి? ఉపేంద్ర ప్రేమను సావిత్రి అంగీకరించిందా? ఉపేంద్ర కేసు నుంచి ఎలా బయటపడ్డాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఉపేంద్ర గాడి అడ్డా సినిమా కథ.

అమ్మాయిల అక్రమ రవాణా లాంటి నేపథ్యంగా దర్శకుడు ఆర్యన్ సుభాన్ ఎస్ కే రాసుకొన్న లవ్ స్టోరీ కథ బాగుంది. అలాగే కొత్త నటీనటులతో సినిమాను రూపొందించడమే కాకుండా వారి నుంచి మంచి ఫెర్పార్మెన్స్‌ను రాబట్టుకోవడం అతడి ప్రతిభకు అద్దం పట్టింది. ఫస్టాఫ్‌లో కొన్ని పేలవమైన సీన్లను కరెక్ట్ చేసుకోంటే బాగుండేదనిపిస్తుంది. కథ, కథనాలపై మరింత కసరత్తు చేసి ఉంటే మంచి సందేశాత్మక చిత్రమై ఉండేదనే ఫీలింగ్ కలుగుతుంది. ఓవరాల్‌గా దర్శకుడి ప్రయత్నంలో ఎలాంటి లోపాలు కనిపించకపోవడం ఈ సినిమాకు పాజిటివ్‌గా మారింది.
ఇక నటీనటులు విషయానికి వస్తే.. ఉపేంద్ర కంచెర్ల సినిమా రంగానికి కొత్తవాడైనా.. మంచి ఈజ్‌తో నటించాడు. డైలాగ్స్ పరంగా, డ్యాన్సులు, ఫైట్స్ పరంగా ఆకట్టుకొన్నాడు. ఊర మాస్ సీన్లలో తన టాలెంట్‌ను ప్రదర్శించేందుకు ప్రయత్నించాడు. హీరోయిన్‌గా సావిత్రి కృష్ణ గ్లామర్‌పరంగా, యాక్టింగ్ పరంగా తన పాత్ర పరిధిమేరకు మెప్పించింది. బబర్దస్త్ కమెడియన్లు అప్పారావు తదితరులు కామెడీతో ఎంటర్‌టైన్ చేశారు. ప్రభావతి, మురళీధర్ గౌడ్, కిరిటీ దామరాజు, సంధ్య జనక్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు.
సాంకేతిక అంశాల విభాగాల విషయానికి వస్తే.. రాము అద్దంకి అందించిన మ్యూజిక్ పలు సీన్లను ఎలివేట్ చేసింది. రవీంద్ర సన్ సినిమాటోగ్రఫి బాగుంది. మెనగ శ్రీనివాసరావు ఎడిటింగ్ పనితీరు ఫర్వాలేదనిపిస్తుంది. అక్కడక్కడా కొన్ని సీన్లపై కత్తెర వేయాల్సి ఉందనిపిస్తుంది. నిర్మాత కంచర్ల అచ్యుతరావు క్వాలిటీకి ప్రాధాన్యం ఇస్తూ రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. చిన్న చిత్రాలను, కామెడీ తరహా ప్రేమ కథలను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











