Utsavam Review: ఉత్సవం సినిమా రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: దిలీప్ ప్రకాశ్, రెజీనా కసండ్రా, ప్రకాశ్ రాజ్, నాజర్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మనందం, ప్రియదర్శి, అనిష్ కురువిల్లా, ఆమని, సుధా, ప్రేమ తదితరులు
దర్శకత్వం: అర్జున్ సాయి
నిర్మాత: సురేష్ పాటిల్
సమర్పణ: హోంబలే ఫిలింస్
సినిమాటోగ్రఫి: రసూల్ ఎల్లోర్
మ్యూజిక్: అనూప్ రూబెన్స్
ఎడిటర్:కోటగిరి వెంకటేశ్వరరావు
రిలీజ్ డేట్: 2024-09-24
నాటక రంగమే శ్వాసగా, జీవితంగా అభిమన్యు నారాయణ (ప్రకాశ్ రాజ్), మహాదేవ్ నాయుడు (నాజర్) బతికుతుంటారు. తమకు జీవనోపాధిగా మారిన కళ అంతరించి పోవడంపై ఆందోళన చెందుతుంటారు. అలాంటి లెజెండ్ అభిమన్యు కుమారుడు కృష్ణ (దిలీప్ ప్రకాశ్), మహాదేవ్ కూతురు రమ (రెజీనా కసాండ్ర) ఒకరినొకరు వారు ఎవరో తెలియకుండానే ఇష్టపడుతారు. తాము పెళ్లాడేది ఎవరిని అనే విషయం తెలియకుండానే తల్లిదండ్రుల కోరిక మేరకు ఇద్దరు పెళ్లికి ఒప్పుకొంటారు. అయితే పెళ్లి జరుగుతుండగా పెళ్లి కూతురు రమ పీటల మీద నుంచి పరిపోతుంది.

నాటక రంగంలో కళాకారులు జీవితం ఎలాంటి దుర్బర పరిస్థితులకు లోనైంది? నాటక రంగాన్ని నమ్ముకొన్న వారి కష్టాలు ఎలా ఉంటాయి? కృష్ణ, రమ మధ్య అఫైర్ ఎలా కొనసాగింది? వారిద్దరికి ఎలా పరిచయం జరిగింది? వారిద్దరి మధ్య అపోహలు ఎలా చోటు చేసుకొన్నాయి? చివరకు వారిద్దరి పెళ్లి జరిగిందా? నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకు రావడానికి రమ, కృష్ణ చేసిన ప్రయత్నం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఉత్సవం సినిమా కథ.
నాటక రంగం బ్యాక్ డ్రాప్‌గా మొదలయ్యే ఎపిసోడ్స్ అద్బుతంగా చిత్రీకరించి తెర మీద మంచి ఫీల్‌ను క్రియేట్ చేశారు. బ్రహ్మనందం, ప్రకాశ్ రాజ్, నాజర్, ఆలీ, ఇంకా తెలుగు నటులందరూ నాటక పద్యాలు పాడుతూ మంచి ఫీల్‌ను క్రియేట్ చేశారు. కానీ నేటి జనరేషన్‌కు ఇలాంటి కంటెంట్ ఎక్కుతుందా? అనేది చిన్న అనుమానంగా ఉంటుంది. ఫస్టాఫ్‌ను ఇలా మొదలుపెట్టి.. సమాంతరంగా దిలీప్, రెజీనా కసాండ్రా మధ్య నడిపిన క్లీన్ లవ్ స్టోరి బాగుంది.

ఇక సెకండాఫ్‌లోను నాటక రంగానికి ప్రాచుర్యం తెచ్చే అంశం.. అలాగే పెళ్లికి ముందు రమ, కృష్ణ జీవితంలో చోటు చేసుకొన్న సంఘటనలను సున్నితమైన భావాలతో దర్శకుడు ఆవిష్కరించేందుకు చేసిన ప్రయత్నం బాగుంది. క్లైమాక్స్‌లో దక్షయజ్ఞం నాటకాన్ని వెండితెరపై రక్తి కట్టించిన విధానం బాగుంది. కానీ కథలో వైవిధ్యం లేకపోవడం, చాలా స్లోగా సాగడం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది.
ప్రకాష్ రాజ్, నాజర్, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్, అలీ, ఎల్పీ శ్రీరామ్, ప్రేమ పాత్రలు చాలా బాగున్నాయి. వారి చేత చెప్పించిన డైలాగ్స్ కూడా ఆకట్టుకొనేలా ఉన్నాయి. దిలీప్, రెజీనా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశాడు. దిలీప్ ప్రకాశ్ హీరోగా కొత్తవాడైనప్పటికీ.. సినిమా భారాన్ని తన భుజాలపై మోశాడనే చెప్పాలి. డ్యాన్స్, ఫైట్స్, ఎమోషనల్ సీన్లలో ఇరగదీశాడు. మంచి పాత్రలు, కథలు ఎంచుకొంటే భవిష్యత్‌లో హీరోగా రాణించడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. లాభ నష్టాలతో సంబంధం లేకుండా కేవలం నిజాయితీగా కథను చెప్పడానికి పెట్టిన ప్రతీ పైసా తెరపైన కనిపిస్తుంది. నిర్మాత సురేష్ పాటిల్‌కు సినిమాపై ఉన్న అభిరుచి ప్రతీ ఫ్రేమ్‌లో కనిపించింది. అనూప్ రెబె్స్, రసూల్ ఎల్లోర్, కోటగిరి లాంటి టాప్ టెక్నిషియన్‌తో సినిమా చేయడంతో క్వాలిటీ మరింతగా ఎలివేట్ అయింది. కేరళ అందాలను చక్కగా రసూల్ చిత్రీకరించారు. అనూప్ రూబెన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎడిటింగ్, ఆర్ట్ష్ ఇతర విభాగాల పనితీరు క్వాలిటీని చూపించింది.
అంతరించి పోతున్న నాటక రంగం కథను బేస్ చేసుకొని ప్రేమ, మానవ సంబంధాలు, ఫ్యామిలీ భావోద్వేగాలుతో రూపొందించిన చిత్రం ఉత్సవం. దిలీప్ ప్రకాశ్, రెజీనా కసాండ్ర కెమిస్ట్రీ, టాప్ యాక్టర్ల పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్. ఎలాంటి అసభ్య, అశ్లీలత లేకుండా నిజాయితీగా చెప్పిన మంచి కథ. ఇలాంటి సినిమాలకు ఆదరిస్తే మంచి చిత్రాలను అందించడానికి నిర్మాతలు ముందుకు వస్తారు. కొత్తగా కథలు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఫీల్ గుడ్ మూమెంట్స్ ఎంజాయ్ చేయాలనుకొంటే.. ఉత్సవం సినిమాను ఓసారి థియేటర్లలో చూడొచ్చు.


Click it and Unblock the Notifications











