twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పోయెట్రీ సినిమా: వాడ్రేవు చిన వీరభద్రుడి వాక్య సంపద

    Poetry (2010) సినిమా చూసేటప్పటికి అర్థరాత్రి దాటిపోయింది.కొన్నాళ్ళ కిందట ఒక మిత్రురాలు చెప్పినప్పణ్ణుంచీ చూడాలనుకుంటున్నది నిన్నటికి చూడగలిగాను.

    By Pratap
    |

    పోయెట్రీ అనే అర్థవంతమైన సినిమా గురించి ప్రముఖ సాహితీవేత్త తన అభిప్రాయాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. ఆయన రాసిన రివ్యూ మరింత మందికి అందాలనే తలంపుతో ఇక్కడ ఇస్తున్నాం....

    Poetry (2010) సినిమా చూసేటప్పటికి అర్థరాత్రి దాటిపోయింది.కొన్నాళ్ళ కిందట ఒక మిత్రురాలు చెప్పినప్పణ్ణుంచీ చూడాలనుకుంటున్నది నిన్నటికి చూడగలిగాను. సినిమా పూర్తయ్యేటప్పటికి, చెప్పలేని సంతాపమేదో హృదయాన్ని చుట్టుకుపోయింది. సినిమా అదృశ్యమైపోయింది. అప్పటిదాకా చూసిన దృశ్యాలన్నీ కలగలిసి ఒక బూడిదరంగు పొరలాగా మనసుమీద పరుచుకుపోయేయి. ఎవరో నీకు బాగా కావలసినవారు చాలా పెద్ద విపత్తులో ఉన్నారని తెలిసినప్పుడు, నీకేమి చెయ్యాలో తెలీక, అలాగని నువ్వు మామూలుగా ఉండిపోలేక, గొప్ప నిస్సహాయతని అనుభవిస్తావే అట్లాంటిదేదో భావన మధ్య, ఎప్పటికో నిద్రపట్టింది.

    Vadrevu China Veerabadhrdu on Poetry movie

    సినిమాలో కథ- ఆ కథ చుట్టూ ఉన్న సమాజం, అది కొరియా కావచ్చు, ఇండియా కావచ్చు, పడుతున్న అంతర్గత సంక్షోభానికి అంతిమంగా మూల్యం చెల్లించేది స్త్రీలే అన్నది ఈ కథాసారాంశమని చెప్పెయ్యవచ్చు. కాని, ఈ సినిమాకి 'కవిత్వం' అని పేరు పెట్టాడు దర్శకుడు. ఇందులో ప్రధాన పాత్రధారి, 60 ఏళ్ళు దాటిన వయసులో కవిత్వపాఠశాలలో చేరి కవిత్వమెట్లా రాయడమెట్లానో నేర్చుకోడానికి ప్రయత్నించడం కథలో ఆద్యంతాల పొడుగునా పరుచుకున్న విషయం. అదే, కవిత్వంతో ఈ కథ ముడిపడి ఉండటమే, ఈ సినిమాను అసాధారణ సృజనగా మార్చేసింది. అదే ఎక్కడో మన హృదయం లోపల ఆరని చిచ్చు ఒకటి రగిలించిపెడుతుంది.

    లీ చాంగ్ డాంగ్ అనే దర్శకుడు తీసిన ఈ సినిమాలో కథ సంగ్రహంగా ఇది: దక్షిణ కొరియా లో ఒక పట్టణం శివార్లలో ఉండే యాంగ్ మీ-జా అరవయ్యో పడిలో పడ్డ ఒక అమ్మమ్మ. ఆమె కూతురు తన భర్తనుంచి విడాకులు తీసుకోవడంతో, తన కొడుకుని తల్లి దగ్గర వదిలిపెడుతుంది. జోంగ్ -వూక్ అనే ఆ హైస్కూలు పిల్లవాడు బాధ్యతారహితంగా పెరుగుతుంటాడు. ఆమె ఒక సంపన్నుడి గృహంలో పరిచారికగా, పక్షవాతం తో బాధపడుతున్న ఆ సంపన్నుడికి సేవచేస్తూ పొట్టపోషించుకుంటూ ఉంటుంది. మీ-జా తనకి ఒంట్లో బాగాలేదని డాక్టరికి చూపించుకుంటే,ఆమెకి ఆల్జీమర్స్ వ్యాథి సంక్రమించిందనీ, త్వరలోనే ఆమె తన జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదముందనీ చెప్తారు.

    Vadrevu China Veerabadhrdu on Poetry movie

    ముందు నామవాచకాలూ, ఆ తర్వాత క్రియాపదాలూ, అట్లా ఒక్కొక్కటే మర్చిపోయే పరిస్థితి వస్తుందని చెప్తారు. ఆమె చిన్నతనంలో ఒక ఉపాధ్యాయిని ఆమెను కవివి అవుతావని చెప్పింది గుర్తొస్తుంది. కవిత్వం రాయడమెట్లానో నేర్పే శిక్షణా తరగతుల ప్రకటన ఒకటి చూస్తుంది. అందులో చేరుతుంది. కవిసమ్మేళనాలకి హాజరవడం మొదలుపెడుతుంది. కాని కవిత రాయడమెట్లానో, ఏంచేస్తే కవిత్వం వస్తుందో ఆమెకి అర్థం కాదు. 'కవిత రాయాలంటే నువ్వు ముందు చూడటం నేర్చుకోవాలి, వెతకాలి, యాచించాలి, ప్రార్థించాలి' అంటాడు కవితాగురువు. 'కవిత బయట ఉండదు, అది నీలోనే ఉంది, అది ఎప్పుడో వచ్చేది కాదు, నువ్వు కనుక్కోగలిగితే ఇప్పుడే కనిపిస్తుంది ' అని కూడా అంటాడు. ఆమె కవిత్వం గురించి వెతకడం మొదలుపెడుతుంది.

    Recommended Video

    Ramajogayya Sastry @Shamanthakamani Pre Release Event | Filmibeat Telugu

    ఇంతలో హటాత్తుగా తెలుస్తుంది ఆమెకి. తన మనమడు చదువుతున్న పాఠశాలలో ఒక పదహారేళ్ళ బాలిక ఆత్మహత్య చేసుకుందనీ, ఆ బాలికను ఆరునెలలుగా ఆమె సహాధ్యాయులు ఆరుగురు పిల్లలు రేప్ చేస్తూ వచ్చారనీ. ఆ పిల్లల్లో తన మనమడు కూడా ఒకడనీ. ఆ పిల్లల తల్లిదండ్రులు ఒక రహస్య సమావేశం ఏర్పాటు చేసుకుని ఆమెని కూడా పిలుస్తారు. ఈ వార్త బయటికి పొక్కేలోపు ఏదో ఒక విధంగా సమస్య పరిష్కరించుకోవాలనుకుంటారు. ఆ పిల్ల తల్లిదండ్రులకి పెద్ద ఎత్తున నష్టపరిహారం చెల్లించడమొక్కటే మార్గమనుకుంటారు.

    Vadrevu China Veerabadhrdu on Poetry movie

    పాఠశాల యాజమాన్యం, పోలీసులూ, చివరికి ఒక పత్రికావిలేఖరి-అందరూ ఇందులో భాగస్వాములే. అందులో మీ-జా చెల్లించవలసిన సొమ్ము చిన్నమొత్తమేమీ కాదు. కాని ఆమె చివరికి తనని తాను చెల్లించుకుని ఆ మొత్తాన్ని సంపాదించి వాళ్ళ చేతుల్లో పెడుతుంది. తన మనవణ్ణి చూసిపొమ్మని కూతురికి కబురు చేస్తుంది. కాని కూతురు వచ్చేటప్పటికి ఆమె ఇంట్లో ఉండదు. ఆ రోజు వాళ్ళ కవిత్వతరగతుల్లో చివరి రోజు. పాఠాలు పూర్తయ్యే రోజుకి ప్రతి ఒక్కరూ కనీసం ఒక పద్యమేనా రాయాలని ఉపాధ్యాయుడు చెప్పి ఉంటాడు. ఆ చివరి రోజు, తక్కిన వాళ్ళెవ్వరూ కవిత తేలేదు కాని, మీ-జా అక్కడ ఒక పూలగుత్తితో పాటు తాను రాసిన ఒక కవిత కూడా పెట్టి వెళ్ళిపోయి ఉంటుంది. రేప్ కి గురయి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న బాలిక మీద రాసిన కవిత అది. ఆ ఉపాధ్యాయుడు ఆ కవిత చదివివినిపిస్తూండగా చిత్రం ముగిసిపోతుంది.

    టాల్ స్టాయి రాసిన 'ఫోర్జెడ్ కూపన్' లాంటి కథ. కాని దీన్ని దర్శకుడు ఒక సామాజిక విమర్శగానో, లేదా కుటుంబ బంధాలమధ్య సంఘర్షణగానో లేదా బాధ్యతారహితంగా రూపుదిద్దుకుంటున్న యువతకు హెచ్చరికగానో చిత్రించలేదు. చాలా బిగ్గరగానూ, తీవ్రంగానూ మాట్లాడటానికి అవకాశమున్న ఈ కథని దర్శకుడు తనని తాను ఎంతో అదుపు చేసుకుంటూ ఎంతో సంయమనంతో చెప్పడానికి ప్రయత్నించాడు. కేన్స్ ఫెస్టివల్ లో ఈ సినిమా ఉత్తమ స్క్రీన్ ప్లే గా ఎంపికయ్యిందంటే, నిగ్రహంతో కూడిన ఆ కథనమే కారణమని అర్థమవుతుంది.

    Vadrevu China Veerabadhrdu on Poetry movie

    కాని,ఇంతకీ దర్శకుడు మనతో పంచుకుంటున్నదేమిటి? ఇది సామాజిక హింస గురించిన చిత్రమా లేక కవిత్వం గురించిన చిత్రమా?

    సినిమా గురించి నెట్ లో కొంత సేపు శోధిస్తే, 2011 లో గార్డియన్ పత్రికలో వచ్చిన రివ్యూ ఒకటి కనబడింది. అందులో సమీక్షకుడు రాసిన చివరి వాక్యాలిలా ఉన్నాయి:

    'ఒక వృద్ధురాలు ఆల్జీమర్స్ వ్యాథి తన జ్ఞాపకశక్తిని పూర్తిగా తుడిచిపెట్టెయ్యకముందే ఒక కవిత రాయాలని కోరుకోవడం గురించిన సినిమానే అయిఉంటే ఇది బాగానే ఉండిఉండేది. సినిమా మొదటిసారి చూసినప్పుడు నేనిట్లానే అనుకున్నాను. ఇంతమాత్రమే తీసి ఉంటే బాగుండేది అనుకున్నాను. కాని, సినిమాలో ఆ బాలిక ఉదంతమే లేకపోతే, ఈ సినిమా ఇప్పుడున్న సినిమా అయి ఉండేది కాదు.ఆ దారుణ సంఘటన, దాని పట్ల మీ-జా స్పందిస్తూ వచ్చిన తీరు, ఆ నష్టబాలిక జీవితంలో తన నష్టయవ్వనాన్ని ఆమె పునర్దర్శించిన విధానం ఈ సినిమాతాలూకు విషాదాత్మకతని నిర్దేశిస్తున్నాయి.

    వెర్రిది, మీజా తాను కవిత రాయలేకపోతున్నానని పదే పదే బాధపడుతూ ఉండింది, కాని ఆమెకి తెలియకుండానే ఆమె కవిగా మారుతూ వచ్చింది. ఒక మృత్యువు నీడన తన ఆంతరంగిక చైతన్యాన్ని శుభ్రపరుచుకుంటూ వచ్చింది. అది మాటల్లోకి ప్రవహించనివ్వు, ప్రవహించకపోనివ్వు. ఆమెకి తన జీవితమంటే ఏమిటో అర్థమవుతున్నది. నిముష నిముషానికీ, దృశ్యంనుంచి దృశ్యానికి మన కళ్ళముందు రూపొందుతూ వచ్చిన 'కవిత్వం ' ఆ జీవితస్పృహనే.'
    ఈ వాక్యాలు చదవగానే నాకు ప్రసిద్ధ కొరియా కవి సో చోంగ్-జూ రాసిన ఒక కవిత గుర్తొచ్చింది. 'విచ్చుకుంటున్న ఒక చామంతి పువ్వు' అని అతడు రాసిన కవిత:

    Vadrevu China Veerabadhrdu on Poetry movie

    ఒక చామంతి పువ్వుపుయ్యడంకోసం
    కోకిల ఈ వసంతకాలమంతా
    ఘోషిస్తూనే ఉంది.
    ఒక చామంతి పువ్వు పుయ్యడంకోసం
    కారుమబ్బులమీంచి
    ఉరుము దద్దరిల్లుతూనే ఉంది.
    సుదూర యవ్వనకాల జ్ఞాపకాల్తో
    గొంతుపట్టేసిన బెంగతో
    అద్దం ముందు నిలబడ్డ
    నా చెల్లెల్లాంటి
    ఓ చామంతి పువ్వా,
    నీ పసుపు రేకలు విప్పారడానికి
    రాత్రంతా ఎంత మంచు కురిసిందంటే,
    నేనసలు నిద్రపోలేకపోయాను.
    సో చోంగ్-జూ ఈ మాటలు కూడా అన్నాడట:

    ' తన దగ్గర తిరిగి ఇవ్వడానికేమీ లేకపోయినా, విషయాల పట్ల, జీవితసంగతుల పట్ల తనలో అపారమైన లోతైన ఆరాటమొకటి మేల్కొంటున్నట్టుగా కవి గుర్తిస్తాడు. ఆ ఆరాటాన్ని ఏకైక దారిదీపంగా మార్చుకుని తన హృదయంలో వెలిగించిపెట్టుకుంటాడు. ఆ వెలుగులో తన లోపల్లోపల సంచలించే భావోద్వేగాల్ని పొరలుపొరలుగా తడుముకుంటూ వాటికి పేర్లు పెట్టడం మొదలుపెడతాడు. అట్లా పేర్లు పెట్టుకుంటూ పోతూ, ఆ వ్యాపకమంతటితోనూ శక్తి పుంజుకుంటాడు. అప్పుడు తిరిగి, ఎట్లాంటి ఆసక్తీ లేని, ఈ ఉదాసీన ప్రపంచానికి ఆరాటపడటమెట్లానో నేర్పడం మొదలుపెడతాడు..'

    బహుశా ఈ వాక్యాలు ఈ సినిమాను అర్థం చేసుకోవడానికే రాసినట్టున్నాయి.శోకం శ్లోకంగా మారుతుందని ఈ సారి ఒక కొరియా దర్శకుడి ద్వారా విన్నాననుకుంటున్నాను.

    English summary
    A Telugu literary personality Vadrevu China Veerabhdrudu expressed his opinion on Poetry movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X