twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వీధి - పెద్ద సోది

    By Staff
    |

    Veedhi - The Street
    -జోశ్యుల సూర్యప్రకాష్‌
    సినిమా: వీధి - ది స్ట్రీట్‌
    విడుదల తేదీ: 04-08-2006
    నటీనటులు: గోపిక, శర్వానంద్‌, వినోద్‌కుమార్‌, బ్రహ్మానందం,
    జయలలిత, సంతోష్‌, నటరాజ్‌, చరణ్‌, ఎం.ఎస్‌.నారాయణ,
    రాళ్లపల్లి, బాలయ్య, పిళ్లా ప్రసాద్‌, ఢిల్లీ రాజేశ్వరి తదితరులు
    కెమెరా: భరణి కె ధరన్‌
    సంగీతం: అనూప్‌ రూబెన్స్‌
    మాటలు: పృథ్వీతేజ
    కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దొరైరాజ్‌
    నిర్మాణం: ఉషాకిరణ్‌ మూవీస్‌

    ఫ్లాపు సినిమా 'ధమ్‌' దర్శకుడు పేరు మార్చుకుని ఉషాకిరణ్‌ సంస్థ ద్వారా 'వీధి' చిత్రం ద్వారా తిరిగి జనం ముందుకు వచ్చారు. శుక్రవారం (ఆగస్టు 4) నాడు అఖిలాంధ్రా అంతటా విడుదలైన వీధి - ది స్ట్రీట్‌ - చిత్రంలో దర్శకుడు దొరైరాజ్‌ తన తొలి చిత్రం ధమ్‌లో చేసిన పొరపాట్లనే మళ్లీ రిపీట్‌ చేశారు. సాధారణంగా టైటిల్‌కి విరుద్ధంగా ట్యాగ్‌ లైన్‌ ఉన్నప్పుడే ఆసక్తి రేకెత్తిస్తుంది. కానీ ఈ సినిమాకి సంబంధించి వీధి అనే టైటిల్‌కి ఆంగ్లానువాదం ది స్ట్రీట్‌ అని పెట్టడంలోనే దర్శకుని సృజనాత్మకత కొంచెం తేటతెల్లమవుతుంది.

    పాసివ్‌ పాత్రలు, బోర్‌ స్క్రీన్‌ప్లే, పసలేని కథాంశం.. వెరసి వీధి ప్రేక్షకుల సహనాన్ని పూర్తిస్థాయిలో పరీక్షిస్తుంది. ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించిన ఉషాకిరణ్‌ సంస్థ చాలాకాలం గ్యాప్‌ తరువాత వీధి చిత్రం రూపొందించడంతో ఎన్నో అంచనాలతో థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకుడికి ఆశాభంగమే అయ్యింది.

    క్లుప్తంగా కథాంశంలోకి వెళితే.. హైదరాబాద్‌లో డూప్లికేట్‌ వస్తువులకి పేరుపడ్డ ఓ వీధి అది. దాని నాయకుడు శివన్న. ఆయనది పెద్ద నెట్‌వర్క్‌. అయితే శివన్న ఎవరో, ఎలా ఉంటాడో ఎవ్వరికీ తెలియదు. తెల్సుకోలేరు! .. అంటూ తొలిగా వాయిస్‌ ఓవర్‌లో వినిపించే మాటలు శివన్నని పరిచయం చేస్తాయి. అక్కడి నుండి సినిమా ప్రారంభం అవుతుంది. మరో చోట ఒక అపార్ట్‌మెంట్‌లో అల్లరి చిల్లరి బ్యాచ్‌ (శర్వానంద్‌, సంతోష్‌, నటరాజ్‌, చరణ్‌) ఉంటారు. శర్వానంద్‌ తండ్రి పోలీస్‌ ఆఫీసర్‌ (వినోద్‌ కుమార్‌) కాగా అతడిని శివన్నే చంపేస్తాడు. ఈ వీధి రహస్యం తెలుసుకోవడానికి సిఎన్‌ఎన్‌ టీవీ ఛానెల్‌ జర్నలిస్టుగా గోపిక రంగప్రవేశం చేస్తుంది. మెల్లగా ఈ కుర్రాళ్లతో పరిచయం పెంచుకుంటుంది. డబ్బు ఆశ చూపి శివన్న రహస్యం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇలా కథ ఒక గాడిలో పడేసరికి ఇంటర్వెల్‌ కూడా దాటిపోయి అరగంట అయిపోతుంది. చివరికి వాళ్లంతా కలిసి శివన్న రహస్యాన్ని ఎలా చేధించారు అన్నది క్లైమాక్స్‌.

    గతంలో వచ్చిన 'మధురానగరిలో..' చిత్రానికి ఈ సినిమాకి దగ్గర పోలిక ఉంది. బీహార్‌లో జరిగిన ఓ యధార్థ సంఘటన ఈ చిత్రానికి బేస్‌ అన్నారు. కానీ కథాకథనంలో ఎక్కడా ఆ సహజత్వం మచ్చుకైనా కనపడకపోవడం వెరైటీ. స్టోరీ లైన్‌ సరిగ్గా అనుకోకపోవడంతో కథ ఎక్కడ మొదలై ఎక్కడకుపోతుందో అంతుచిక్కని పజిల్‌గా తయారవుతుంది. తండ్రిన చంపిన శివన్నపై కొడుకు ప్రతీకారం తీర్చుకునే కథో, ఒక జర్నలిస్టు ఇన్వెస్టిగేషన్‌ ద్వారా ఒక విలన్‌ని బయటపెట్టే కథో ఎంత పరిశోధించినా మనకి అంతుచిక్కదు. సాధారణంగా థ్రిల్లర్‌ ఫార్ములా అనగానే కథలో టెన్షన్‌ పెంచుతూ చూసేవారిలో గుబులు పుట్టించడం పరిపాటి. కానీ ఈ సినిమాలో అనూహ్యమైనదేమీ ఉందనిపించదు. ప్రతి సీన్‌లోనూ తరువాత వచ్చే సన్నివేశం వూహించే విధంగానే ఉంటుంది. స్క్రీనింగ్‌ సమయంతో పోటీగా కథ వేగంగా పరుగుపెట్టాలన్న బేసిక్‌ ప్రిన్సిపుల్‌ని మర్చిపోయి కథనం వండారు. కథలో ఎలాంటి కాంప్లెక్స్‌ అంశాలు లేకుండా సీన్లు తయారు చేయడం మరో లోపం. ఇంటర్వెల్‌లో అంత విలన్‌కి హీరోయిన్‌ గురించి తెలిసినా పట్టించుకోడు ఎందుకో అర్థం కాదు. నీ తండ్రిని చంపింది శివన్నే అని హీరోయిన్‌ చెప్పేదాకా హీరో పట్టించుకోడు. ఇలా అన్ని ద్వారాలూ మూసేసి కామెడీ సీన్లు, పాటలపై ఆధారపడటం స్క్రీన్‌ప్లేలో కనిపించే ప్రధానలోపం.

    జర్నలిస్టు గోపిక క్యారెక్టర్‌కి మోటివేషన్‌ సహజమైన ఆసక్తి మచ్చుకైనా ఉండవు. అన్ని ప్యాసివ్‌ క్యారెక్టర్లు కథను నడిపించడంతో కథ ముందుకు వెళ్లకుండా అక్కడక్కడే సాగుతుంది. ఇక మిగిలిన విభాగాల్లో దర్శకత్వం టెక్నికల్‌ హంగామాతో నడిచింది. ఎడిటింగ్‌ కొన్ని చోట్ల చికాకు పెట్టింది. అనూప్‌ రూబెన్స్‌ అందించిన సంగీతం ఇటీవలి హిట్స్‌ని గుర్తుచేయడం సృజనాత్మక లోపం. నటీనటుల్లో గోపిక, శర్వానంద్‌ ఫర్వాలేదు. రీరికార్డింగ్‌ కొద్దిగా మేలు. కెమెరా కొన్ని చోట్ల బాగుంది.

    బ్రహ్మానందం, ఎం.ఎస్‌. నారాయణ కామెడీ కథలో కొద్దిగా కూడ కలవకపోయినా మంచి రిలీఫ్‌. అమృతం ఫేమ్‌ హర్షవర్ధన్‌ బాగా చేశాడు. ఏదేమయినా పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించిన సంస్థ నుండి రాదగ్గ చిత్రం కాదిది.

    గమనిక: వినోదం, అసభ్యత లేకపోవడం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్‌ ఉంటుంది. సినిమా జయాపజయాలకు రేటింగ్‌కు సంబంధం ఉండనవసరం లేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X