twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆధారం బాలయ్య ఇమేజ్‌ మాత్రమే!

    By Staff
    |

     Veerabhadra
    -జోశ్యుల సూర్యప్రకాష్‌
    సినిమా: వీరభద్ర
    విడుదల తేదీ: 29-04-2006
    నటీనటులు: బాలకృష్ణ, సదా, తనుశ్రీ దత్తా, సాయజీ షిండే,
    ప్రకాశ్‌ రాజ్‌, పొన్నాంబల, రాజన్‌ పి. దేవ్‌, సుత్తి వేలు, అజయ్‌,
    రాళ్లపల్లి, సోనీ, రమాప్రభ, బ్రహ్మానందం, వేణుమాధవ్‌ తదితరులు
    కథ: ఆంజనేయ పుష్పానంద్‌
    సంగీతం: మణిశర్మ
    మాటలు: మరుదూరి రాజా
    ఎడిటింగ్‌: గౌతమ్‌ రాజు
    కమెరా: రాంప్రసాద్‌
    ఫైట్స్‌: పీటర్‌ హేన్స్‌, విజయన్‌
    స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : ఎ. ఎస్‌. రవికుమార్‌ చౌదరి
    నిర్మాత: అంబికా బ్రదర్స్‌

    బాలయ్యకు మళ్లీ బాక్సాఫీసు వద్ద విజయం మొహం చాటేసే అవకాశాలే వున్నాయి. కథ, కథనంలో ఫార్ములాను మాత్రమే దృష్టిలో పెట్టుకుని మిగతా అంశాలను విస్మరించడం వల్ల 'సమరసిహారెడ్డి'లా ప్రత్యేకమైన సినిమాగా 'వీరభద్ర' నిలువలేకపోయింది. బాలకృష్ణ ఎప్పటిలాగే కష్టపడి నటించినా ఆశించిన విజయాన్ని అందించే పరిస్థితి లేదు.

    వైజాగ్‌ నుంచి వచ్చిన మురళీకృష్ణ (బాలకృష్ణ) తన చెల్లిని పెద్దిరాజు (సాయజీ షిండే) కాలేజీలో చేర్పిస్తాడు. ఆమె వికలాంగురాలు. చెల్లెనే ప్రాణంగా అతను బతుకుతుంటాడు. కాలేజీలో ఆమె ఇబ్బందులు ఎదుర్కుంటూ వుంటుంది. ఆమెను మురళీకృష్ణ ఎప్పటికప్పుడు కాపాడుతూ అండగా నిలబడుతూ వుంటాడు. అంతేగాక, నివాసం ఉండే కాలనీలో స్థానిక గుండాలతో (పొన్నాంబల) పోరాడి వాళ్లకు దేవుడవుతాడు. అక్కడ ఉండే చిల్లర దొంగ (సదా) అతడ్ని ఇష్టపడి పాటలు పాడుకుంటూ వుంటుంది. మరో పక్క జైల్లో ఉన్న పెద్దిరాజు తన మనుషులతో మురళీకృష్ణ కోసం తీవ్రంగా గాలిస్తూ వుంటాడు. వాళ్లు అతని చెల్లెల్ని కాలేజీలో గుర్తించి దాడి చేస్తారు. ఆ సమయంలో మురళీకృష్ణ రక్షిస్తాడు. దానితో కాలనీలో పెద్దిరాజు మనుషులతో పోరాటం తప్పదు. దాంతో భయపడిన కాలనీవాసులు అక్కడి నుంచి వెళ్లిపోవాల్సింగా మురళీకృష్ణను కోరుతారు. అప్పుడు ఆ పరిస్థితుల్లో అతని చెల్లెలు మురళీకృష్ణకు చెందిన నిజాన్ని ఫ్లాష్‌బ్యాక్‌గా చెబుతుంది. మురళీకృష్ణ వైజాగ్‌లో స్మగ్లింగ్‌ చేస్తూ వచ్చిన డబ్బును పేద ప్రజలకు పంచుతూ ఉండేవాడు. ఈ సమయంలోనే పెద్దిరాజు చెల్లెలు (తనూశ్రీ దత్తా) మురళీకృష్ణ ప్రేమలో పడుతుంది. పుట్టింది డబ్బున్న కుటుంబంలో అయినా పరిస్థితుల దృష్ట్యా కుటుంబ నిరాదరణకు గురై ఓ తాగుబోతు (ప్రకాశ్‌రాజ్‌) వద్ద పెరిగి పెద్దవుతాడు. అనుకోని పరిస్థితుల్లో తన తాత (రాజన్‌ పి. దేవ్‌)ను కలుస్తాడు. ఆయనను వేధిస్తున్న పెద్దిరాజుపై పగబట్టి బయలుదేరుతాడు. చివరికి మురళీకృష్ణ ఎలా విజయం సాధించాడు, వీరభద్రుడై వారి భరతం ఎలా పట్టాడనేది తెరపై చూడాల్సిందే. ఇద్దరు హీరోయిన్లలో ఎవరు మురళీకృష్ణ మనసు దోచుకున్నారనేది కూడా సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

    గత చిత్రాల మాదిరిగానే డైరెక్టర్‌ పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో కథ నడిపి, ఇంటర్వెల్‌ తర్వాత ఫ్లాష్‌బ్యాక్‌ నెరేషేన్‌తో స్క్రీన్‌ప్లే చేశాడు. కానీ కథ ఓ పాయింట్‌తో ముందుకు వెళ్లక రకరకాల మలుపులు తిరుగుతూ సహనానికి పరీక్ష పెడుతుంది. జామీందార్లు, ఆస్తి, వారసుడు అంటూ కాలాతీతంగా, అవాస్తవిక సంఘటనలతో నడపడం వల్ల అటూ ఫాంటసీ కాక, ఇటు సాంఘిక చిత్రమూ కాకపోవడం మైనస్‌ పాయింట్‌ అవకాశాలే ఎక్కువగా వున్నాయి. ఎక్కడా ఎమోషన్స్‌ లిస్టు కాకుండా కథ కడవరకూ పరుగెత్తుతుంది. దాంతో తెరపై జరిగేవాటిని ఐడెంటిఫై చేసుకుని ప్రేక్షకులు తాదాత్మ్యం చెందడం కొంత కష్టమే. బాలకృష్ణ మాస్‌ అప్పీల్‌కు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమాను తీయడానికి చేసిన కృషి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. గత ఫాక్షన్‌ కథ కాదు గానీ, ఆ మాస్‌ మార్కు తగ్గకుండా దర్శకుడు ప్రయత్నించాడు. 'సమరసింహారెడ్డి' వంటి బాలకృష్ణ నటించిన ఫాక్షన్‌ చిత్రాల్లో కొంత వాస్తవికత, బాలకృష్ణ చూపిన నటన ప్రేక్షకులను ఆకట్టుకోవడం వల్ల, కథలు పూర్తిగా ఆ కాలంలో కొత్తది కావడం వల్ల కూడా ఆ సినిమాల విజయానికి దోహదపడ్డాయి. బాలకృష్ణ హీరోయిజాన్ని ఏ మాత్రం తగ్గించకుండా సంఘటన కల్పనలో కొంత వాస్తవికత ప్రదర్శించి ఉంటే సినిమా విజయాన్ని అంది పుచ్చుకుని ఉండేదని చెప్పాల్సిన పని లేదు.

    బాలకృష్ణకే సొంతమైన డైలాగ్‌ డెలివరీలు ఈ సినిమాలోనూ చూడవచ్చు. సంగీతం కూడా మాస్‌ మెరుపులతో ఉర్రూతలూగించే ప్రయత్నం చేసింది. సదా, తనూశ్రీ దత్తా గ్లామర్‌ చిందిస్తే, రాజన్‌ పి. దేవ్‌ పెద్దాయనగా పాత్రలో జీవించాడు. ఫస్టాఫ్‌లో అలరించిన కామెడీ సెకండాఫ్‌ వచ్చే సరికి కాస్తా తగ్గింది. డైలాగ్‌లు బిసి సెంటర్లలో పేలేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎడిటింగ్‌ బాగుంది. ఫైట్స్‌లో, నృత్యాల్లో బాలకృష్ణ మార్కు కొట్టిచ్చినట్లు కనిపించింది. చాలా రోజుల తర్వాత బాలకృష్ణ సినిమా వచ్చినందున ఆయన అభిమానులకు 'వీరభద్ర' విడుదల ఆనందం కలిగించే విషయమే.

    గమనిక: వినోదం, అసభ్యత లేకపోవడం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్‌ ఉంటుంది. సినిమా జయాపజయాలకు రేటింగ్‌కు సంబంధం ఉండనవసరం లేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X