For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వెంకటాపురం మూవీ రివ్యూ

  By Rajababu
  |

  ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యాపీడేస్ చిత్రం అనగానే అందులో టైసన్ పాత్ర గుర్తుకువస్తుంది. రాహుల్‌కు తొలిచిత్రమైనా టైసన్ పాత్రలో ప్రేక్షకులను, విమర్శకులను మెప్పించాడు. చాలా కాలం తర్వాత తన లుక్‌ను మార్చుకొని సిక్స్‌ప్యాక్‌తో వెంకటాపురం చిత్రంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వెంకటాపురం సినిమా ఫస్ట్‌లుక్, టీజర్‌ రిలీజ్ తర్వాత ఇది ఓ విభిన్నమైన చిత్రమనే భావన ప్రేక్షకుల్లో కల్పించింది. అలా రాహుల్ నటించిన రివేంజ్ థ్రిల్లర్ వెంకటాపురం చిత్రం మే 12న విడుదలైంది. లవ్, యాక్షన్, రివేంజ్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకొన్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథ గురించి తెలుసుకొందాం.

  కథ ఇలా..

  కథ ఇలా..

  ఆనంద్ (రాహుల్) పిజ్జా కార్నర్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తుంటాడు. చైత్ర (మహిమ మఖ్వానా) కాలేజీ స్టూడెంట్. వీరిద్దరూ ఒకే అపార్ట్‌మెంట్‌లో నివసిస్తుంటారు. చైత్ర కుటుంబం వైజాగ్‌కు షిఫ్ట్ అవుతుంది. తొలిచూపులోనే ఆనంద్ అంటే చైత్రకు అయిష్టం ఏర్పడుతుంది. కానీ ఓ పరిస్థితి కారణంగా ఆనంద్ అంటే ఇష్టం ఏర్పడుతుంది. అలా సంతోషంగా సాగిపోతున్న వారి జీవితంలో అనుకొని సంఘటనలు చోటుచేసుకుంటాయి.

  చిక్కుముడులకు సమాధానం..

  చిక్కుముడులకు సమాధానం..

  ఎగ్జామ్స్‌కు ముందు రోజు చైత్ర హాల్ టికెట్ తీసుకోవడానికి వెళ్తే అనుహ్యమైన సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ఆనంద్, చైత్ర జీవితంలో భయంకరమైన ఘటనగా మిగిలిపోతుంది. ఆ సంఘటన కారణంగా ఆనంద్, చైత్ర విడిపోతారు. ఆ ఘటనకు కారణమైన వారిపై ఆనంద్ పగ తీర్చుకోవాలనుకొంటాడు. ఆనంద్ ప్రతీకారం తీర్చుకోవాలనుకొంటున్న వారు ఎవరు? చైత్రకు ఎదురైన సంఘటన ఏంటీ? దానికి ఆనంద్‌కు సంబంధమేమిటి? విడిపోయిన ఆనంద్, చైత్ర ఎలా కలుసుకొంటారు. ఈ కథకు ముగింపు ఏమిటి? ఇలా అనేక ప్రశ్నలకు సమాధానమే వెంకటాపురం సినిమా.

  విశ్లేషణ..

  విశ్లేషణ..

  వెంకటాపురం కథ విశాఖ సముద్ర తీరంలోని భీమిలి వద్ద ప్రారంభమవుతుంది. ఎంజాయ్ చేయడానికి వచ్చిన ఓ ప్రేమ జంటపై ముగ్గురు రౌడీలు దాడిచేస్తారు. యువకుడిని కొట్టి, అమ్మాయిని దారుణంగా రేప్ చేస్తారు. అంతలోనే ఆనంద్ (రాహుల్) కత్తి పట్టుకొని ఓ వ్యక్తిని వేటు వేస్తాడు. ఇలాంటి సన్నివేశాల ఆరంభంతో దర్శకుడు వేణు మాదికంటి ఆసక్తిని రేపేందుకు ప్రయత్నించారు. కథ రెండో భాగంలో ఉండటంతో తొలి భాగంలో చైత్ర కుటుంబం, చైత్ర కాలేజీ సీన్లు, పోలీసులు, రౌడీలకు సంబంధించిన సీన్లతో ఇంటర్వెల్ వరకు నెట్టుకొచ్చాడు. చిత్ర తొలిభాగంలో ఎంటర్‌టైన్‌మెంట్ లేకపోవడం, సన్నివేశాలు బలంగా లేవనే ఫీలింగ్ ప్రేక్షకుడికి కలిగిస్తాయి. తొలి భాగంగా చాలా నాసిరకంగా, పరిపక్వత లేని సంభాషణలతో కాస్త బోర్‌ అనిపిస్తుంది. కాలేజీలో సీన్లు చాలా చెత్తగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో పలు విభాగాలపై దర్శకుడికి అవగాహన లేదా అనిపించే స్థాయిలో ఉన్నాయి.

  చాలా గ్రిప్పింగ్‌గా సెకండాఫ్

  చాలా గ్రిప్పింగ్‌గా సెకండాఫ్

  కానీ ఒకసారి రెండో భాగం ప్రారంభమైన తర్వాత సీన్లు చకచక పరుగెడుతూ వివిధ రకాల ట్విస్టులతో సినిమా ఆసక్తికరంగా మారుతుంది. తొమ్మిది నెలల జైలు జీవితం గడిపిన ఆనంద్.. నేరుగా పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి పోలీసులను చంపడం, అక్కడి నుంచి సరాసరి ఎస్ఐ దుర్గాప్రసాద్ (అజయ్ ఘోష్) ఇంటికి వెళ్లి దారుణంగా నరికి చంపడం లాంటివి ఆ సమయంలో లాజిక్ లేనట్లు కనిపిస్తాయి. కానీ కథలోకి వెళ్లిన తర్వాత రాహుల్ చేసిన హత్యలు చాలా సమంజసంగా అనిపిస్తాయి. అక్కడే దర్శకుడు వేణు ప్రతిభ బయటపడుతుంది. రెండో భాగంలో పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అజయ్ వర్మ (అజయ్) ఎంట్రీ తర్వాత సినిమా వేగం పుంజుకొని ప్రేక్షకుడికి మరింత ఆసక్తిగా మారుతుంది. ప్రేక్షకుడికి సంతృప్తి కలిగించే విధంగా సెకండాఫ్‌ చాలా ఆసక్తికరంగా ఉండటం, లాజిక్‌‌గా క్లైమాక్స్ ముగియడం సినిమాకు అదనపు బలంగా మారిందని చెప్పవచ్చు. ఫస్టాఫ్‌పై సరైన దృష్టి పెట్టి ఉంటే హీరో రాహుల్‌కు, దర్శకుడు వేణుకు డిఫరెంట్‌ సినిమాగా కావడమే కాకుండా బంపర్ హిట్ ఖాతాలో చేరేది. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులను ఆదరణను బట్టి ఈ సినిమా సక్సెస్, రేంజ్ ఆధారపడి ఉంటుంది.

  రాహుల్ డిఫరెంట్‌గా

  రాహుల్ డిఫరెంట్‌గా

  గతంలో నటించిన సినిమాల్లో రాహుల్ చాలా సాఫ్ట్‌గా కనిపించేవారు. గత చిత్రాల్లో కనిపించిన రాహుల్‌కు ఈ సినిమాలో కనిపించిన ఆనంద్‌కు చాలా అంటే చాలా తేడా కనిపిస్తుంది. నటనపరంగాను, యాక్షన్, ఎమోషన్స్ పరంగా చాలా ఇంప్రూవ్ అయ్యాడు. పోలీస్ స్టేషన్ ఫైట్ సీన్లలో సిక్స్ ప్యాక్‌తో థ్రిల్ గురిచేశాడని చెప్పవచ్చు. నటుడిగా రాహుల్ ప్రూవ్ చేసుకోవడానికి వెంకటాపురం మంచి అవకాశంగా మారింది. తదుపరి చిత్రాల ఎంపికలో తగిన జాగ్రత్త వహిస్తే భవిష్యత్ బాగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ చిత్రాన్ని వందశాతం తన భుజాలపై మోసాడు. మెప్పించాడు కూడా.

  పాత్ర పరిధి మేరకు

  పాత్ర పరిధి మేరకు


  హీరోయిన్‌గా టాలీవుడ్ తొలి చిత్రమైనా మహిమా మఖ్వానా మంచి నటనను కనబరిచింది. చైత్రగా తన పాత్ర పరిధి మేరకు పర్వాలేదనిపించింది. పాటలకు, డ్యాన్స్‌లకు పెద్దగా స్కోప్ లేకపోవడంతో మహిహ ప్రతిభపై పెద్దగా అంచనా వేయడానికి అవకాశం లేకపోయింది. కీలకమైన, భావోద్వేగ సన్నివేశాల్లో మంచి ఎమోషన్స్‌తో ఆకట్టుకొన్నది.

  అజయ్ ఘోష్ మరోసారి విలన్‌గా

  అజయ్ ఘోష్ మరోసారి విలన్‌గా

  వెంకటాపురం సినిమాలో హీరో,హీరోయిన్ల తర్వాత బాగా చెప్పుకోవాల్సిన వారెవరైనా ఉన్నారంటే ఎస్ఐ దుర్గాప్రసాద్ (అజయ్ ఘోష్) పాత్ర. ఈ పాత్ర చాలా సీరియస్‌, రఫ్‌గా ఉండటం అజయ్ ఘోష్‌కు అతికినట్టు సరిపోయింది. కొన్ని సన్నివేశాల్లో ఇంకా బాగా చేయడానికి అవకాశం ఉందని అనిపించినా అజయ్ సరిగా చేయలేకపోయాడేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. అది అజయ్ లోపామా లేక వేరే కారణాలేమైనా ఉన్నాయా అనేది ఇప్పుడు అప్రస్తుతం. తన పాత్ర పరిధి మేరకు దుర్గాప్రసాద్ రోల్‌కు అజయ్ న్యాయం చేకూర్చాడు.

  అజయ్ లేటైనా లేటెస్ట్‌గా

  అజయ్ లేటైనా లేటెస్ట్‌గా

  ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌ అజయ్ వర్మగా అజయ్ కనిపించాడు. అజయ్‌కి ఉన్నవి కొన్ని సీన్లైనా ఎఫెక్టివ్‌గా చేశాడు. క్లైమాక్స్‌లో అజయ్ చేసిన పెర్ఫార్మెన్స్‌తో సినిమా సంతృప్తికరంగా ముగుస్తుంది. చైత్ర తండ్రి కాశీ విశ్వనాథ్, ఇతర పాత్రలు అంతగా గుర్తుండిపోయే పాత్రలు కావు.

  దర్శకుడి పనితీరు..

  దర్శకుడి పనితీరు..

  దర్శకుడు వేణు ఎంచుకొన్న కథ బాగుంది. కానీ దానికి తగినట్టు స్క్రీన్‌ప్లే లేకపోవడం సినిమాలో కొట్టొచ్చినట్టు కనిపించింది. ఆ లోపాన్ని సెకండాఫ్ దిద్దుకోవడం ద్వారా తన ప్రతిభను బయటపెట్టుకొన్నాడు. సెకండాఫ్ ప్రీ క్లైమాక్స్ వరకు కథను సాగదీయడం వల్ల ప్రేక్షకుడు కథపై పట్టు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి సమయంలో ఫస్టాఫ్‌ను కొంత ఎంటర్‌టైన్‌మెంట్‌గా మలిస్తే చిన్న సినిమాతో భారీ సక్సెస్ సొంతమయ్యేది. అయితే ఫస్టాఫ్‌లో ఉన్న లోపాలను సెకండాఫ్‌లో సరిదిద్దుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని రాబట్టుకొన్నాడు. పాత్రల ఎంపికలో సరైన జాగ్రత్త వహిస్తే ఇంకా మంచిగా ఉండేది.

  సాంకేతిక విభాగం తీరుతెన్నులు

  సాంకేతిక విభాగం తీరుతెన్నులు

  రివేంజ్ డ్రామా, థ్రిల్లర్‌ సినిమాకు సరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను సంగీత దర్శకుడు అచ్చు అందించడంలో నూరుశాతం సఫలమయ్యాడు. కానీ పాటలు, రొమాన్స్, లవ్ సీన్లకు సరిపోయే పాటలు లేకపోవడం ఓ మైనస్ అని చెప్పవచ్చు. మెలోడియస్ పాటలకు కాస్తా చోటుంటే బాగుండేది అనిపించింది. ఎడిటింగ్ విభాగం పనితీరు ఇంకా మెరుగ్గా ఉండాల్సింది. సాంకేతిక విభాగంలో సినిమాటోగ్రఫీ సినిమాకు అదనపు ఆకర్షణ. సీరియస్ సీన్లలో, ఉద్వేగభరితమైన సన్నివేశాలు చక్కగా ఉన్నాయి. శ్రేయాస్ శ్రీనివాస్ నిర్మాణ విలువలు బాగున్నాయి. చిన్న చిత్రమైనా భారీ చిత్రమనే రేంజ్‌ను కలిగించడంలో సక్సెస్ అయ్యాడు.

  బలం, బలహీనతలు

  బలం, బలహీనతలు

  పాజిటివ్ పాయింట్స్

  రాహుల్, మహిమా, అజయ్ ఘాష్ యాక్టింగ్
  సెకండాఫ్
  కథ
  రీరికార్డింగ్
  డైరెక్షన్
  సినిమాటోగ్రఫి

  నెగిటివ్ పాయింట్స్
  ఫస్టాఫ్
  స్క్రీన్‌ప్లే
  పాటలు
  డైలాగ్స్
  ఎడిటింగ్

  తెరవెనుక.. తెర ముందు..

  తెరవెనుక.. తెర ముందు..

  సినిమా: వెంకటాపురం

  నటీనటులు : రాహుల్, మహిమా మఖ్వానా, అజయ్
  సంగీతంః అచ్చు
  దర్శకుడు : వేణు మాదికంటి
  నిర్మాత : శ్రేయాస్ శ్రీనివాస్
  రిలీజ్ డేట్: మే 12, 2017
  నిడివిః 109 నిమిషాలు
  బ్యానర్ః గుడ్ సినిమా గ్రూప్

  English summary
  Venkatapuram movie is a revenge thriller. Happy Days fame Rahul tried in diffrent look. This picture released on May 12. This movie directed Venu madikanti. Atchi given music. This movie is made with good commercial element too.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X