Vidudala Review ఉద్వేగంతో సాగే వెట్రిమారన్ మార్క్ కథ.. సూరి, విజయ్ సేతుపతి ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే?
నటీనటులు: సూరి, విజయ్ సేతుపతి, భవానీ స్రే, గౌతమ్ వాసుదేవన్ మీనన్, రాజీవ్ మీనన్, చేతన్, ఇలవరసు, బాలాజీ శక్తివేల్ తదితరులు
దర్శకత్వం: వెట్రిమారన్
స్క్రీన్ ప్లే: వెట్రిమారన్, బీ జెయమోహన్
నిర్మాత: ఎల్‌రెడ్ కుమార్
సినిమాటోగ్రఫి: ఆర్ వెల్‌రాజ్
మ్యూజిక్: ఇళయరాజా
బ్యానర్: ఆర్ఎస్ ఇన్ఫోటైయిన్‌మెంట్, గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ
రిలీజ్ డేట్: 2023-04-15
విడుదల కథేమిటంటే?: కుమరేషన్ అనే గ్రామీణ ప్రాంత యువకుడు పోలీస్ డిపార్ట్‌మెంట్ క్యాంపులో డ్రైవర్‌గా చేరుతాడు. నిజాయితీ, ముక్కుసూటితనం వల్ల ఉన్నత అధికారుల ఆగ్రహానికి గురవుతాడు. క్షమాపణ చెబితే తిప్పలు పెట్టమని చెబితే.. తప్పు చేయనప్పుడు సారీ చెప్పనని మొండికేస్తాడు. అలాంటి పరిస్థితుల్లో తమిళసై (భవానీ శ్రీ) అనే గ్రామీణ యువతితో ప్రేమలో పడుతాడు.
ఆ సమయంలోనే పెరుమాల్ అలియాస్ వాతియార్ అనే తీవ్రవాద నాయకుడు (విజయ్ సేతుపతి) ఆచూకీ కోసం తమిళసైతోపాటు మరికొందరు మహిళలను నగ్నంగా నిలబెట్టి పోలీసులు హింసిస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో పెరుమాల్ ఆచూకీ తనకు తెలుసని, కొంత మంది సిబ్బందిని ఇస్తే తాను పట్టుకొంటానని ఉన్నతాధికారి మీనన్ (గౌతమ్ వాసుదేవ్ మీనన్)ను కోరడంతో అందుకు సదరు అధికారి సమ్మతించి కుమరేషన్‌కు అధికారాలిస్తాడు.

విడుదల కథలో ట్విస్టులు: కుమరేషన్‌కు పై అధికారులతో విభేదాలకు కారణం ఏమిటి? నిజాయితీ, నిబద్దతతో ఉద్యోగం చేసే కుమరేషన్‌కు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? ప్రేయసితో కుమరేషన్ ప్రేమ ఎలా సాగింది? పెరుమాల్‌ను పట్టుకోవడానికి గ్రామస్థులను పోలీసులు హింసించారు?
పెరుమాల్‌ను పట్టుకోవడానికి కుమరేషన్ ఎలాంటి ప్రయత్నం చేశాడు? పెరుమాల్‌ను కుమరేషన్ ఎందుకు పట్టించాలని అనుకొన్నాడు? ఇంతకు పెరుమాల్‌ను కుమరేషన్ పట్టించాడా? అనే ప్రశ్నలకు సమాధానమే విడుదల సినిమా కథ.
ఫస్టాఫ్‌లో కీలక ఎలిమెంట్స్: ప్రభుత్వానికి సవాల్ విసురుతూ ఓ ప్రాంతంలో ట్రైన్‌ను పేల్చివేసిన సంఘటనతో విడుదల కథ ఆసక్తికరంగా మొదలవుతుంది. ట్రైన్ ఎపిసోడ్ చాలా సహజసిద్దంగా ఉన్నప్పటికీ.. కాస్త ఎక్కువగానే ఆ ఎపిసోడ్‌పై ఫోకస్ చేశారనిపిస్తుంది. కాకపోతే ఆ సంఘటన ఆధారంగానే కథ ముడిపడి ఉండటంతో ఆ సీన్‌ను ఎస్టాబ్లిష్ చేయడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకొన్నారా? అనే ఫీలింగ్ కలుగుతుంది.
ఆ తర్వాత ట్రైన్ పేల్చివేతకు తీవ్రవాదులే కారణమని భావించిన పోలీసులు ఆ ప్రాంతంలోని గ్రామాలపై పోలీసులు ఉక్కుపాదం మోపేందుకు స్పెషల్ టీమ్ రంగంలోకి దిగుతుంది. ఆ క్రమంలో కుమరేషన్ క్యారెక్టర్‌ను ఎస్టాబ్లిష్‌ను చేసేందుకు దర్శకుడు కాస్త ఎక్కువగానే తీసుకొన్నాడనే ఫీలింగ్ కలుగుతుంది. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉండే ఇగోలను, కిందిస్థాయి ఉద్యోగులపై ఉన్నతాధికారుల వేధింపులను ఈ సినిమాలో చాలా ఎఫెక్టివ్‌గా చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.

సెకండాఫ్ సాగిన తీరు: ఇక సెకండాఫ్‌లో పెరుమాల్ ఆచూకీ చెప్పడానికి కుమరేషన్ చేసిన ప్రయత్నాలతో కథ ముందుకు వెళ్తుంది. ఆ తర్వాత పెరుమాల్‌ను పట్టుకొనేందుకు గ్రామాల్లోని ప్రజలను హింసించడం, మహిళలను భారీ సంఖ్యలో అరెస్ట్ చేసే సన్నివేశాలు చాలా ఇంటెన్స్‌తో ఉంటాయి.
మహిళలపై పోలీసుల థర్డ్ డిగ్రీ చాలా నేచురల్‌గా చూపించడం దర్శకుడి గట్స్‌కు అద్దం పట్టాయి. పెరుమాల్‌ను పట్టుకొనేందుకు గ్రామంలో పోలీసులకు, తీవ్రవాదులకు జరిగిన ఎన్‌కౌంటర్‌ను సినిమాటిక్‌గా కాకుండా సహజసిద్దంగా చూపించేందుకు ప్రయత్నించడంతో సన్నివేశాలు ఆకట్టుకొంటాయి.
విడుదల మూవీలో నటీనటులు ఫెర్ఫార్మెన్స్: విడుదల సినిమా విషయానికి వస్తే.. పార్ట్ 1లో ప్రధానంగా కుమరేషన్ క్యారెక్టర్‌ను ఎస్టాబ్లిష్ చేయడానికే ఫోకస్ చేశారనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకొన్న సూరిని ఒక సీరియస్ రోల్‌ను చేయించడం వెట్రిమారన్ చేసిన అతిపెద్ద ప్రయోగంగా చెప్పవచ్చు. అయితే వెట్రిమారన్ పెట్టుకొన్న నమ్మకానికి 200 శాతం అవుట్‌పుట్‌ను సూరి ఇవ్వడంలో సక్సెస్ అయ్యాడు. సూరి కాకుండా కుమరేషన్ కనిపించడంటే.. ఆ పాత్రను ఎంతగా ఎలివేట్ చేశాడో అనేది స్క్రీన్ మీద చూస్తే అర్ధమవుతుంది.
తమిళసైగా భవానీ శ్రీ నటించిన తీరు ప్రతీ సన్నివేశంలో ఆకట్టుకొంటుంది. ముతక పాత్రలో చాలా అద్బుతంగా అభినయించింది. గౌతమ్ మీనన్ సీరియస్ కాప్ రోల్‌లో మరోసారి ఆకట్టుకొన్నాడు. పార్ట్ 1లో విజయ్ సేతుపతి అతిథి పాత్రకే పరిమితమయ్యాడు. కనిపించినంత సేపు విజయ్ సేతుపతి తన మార్క్ చూపించాడు.

ఇళయ రాజా మ్యూజిక్ గురించి: సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. ఇళయరాజా మ్యూజిక్ విడుదల సినిమాకు ప్రాణంగా నిలిచింది. అద్బుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను ఎలివేట్ చేసింది. పాటలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక సినిమాటోగ్రఫి, ఇతర విభాగాలు పనితీరు చక్కగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కథకు తగినట్టుగా ఉన్నాయి. కథపైనే ఫోకస్ పెట్టి.. కమర్షియల్ హంగుల జోలికి పోకపోవడం నిర్మాత అభిరుచికి అద్దం పట్టింది.

విడుదల సినిమా గురించి ఫైనల్‌గా: సినిమా తెర మీద తీవ్రవాదులకు, పోలీసులకు మధ్య జరిగిన కథలు ఎన్నో వచ్చాయి. ఒక్కో సినిమా ఒక్కో కోణంలో కథను చెప్పాయి. అయితే ఈ సినిమాలో పోలీసు డిపార్ట్‌మెంట్‌లో ఉండే వివక్షను చక్కగా చూపించాయి. ప్రతీ రంగంలోను కింది ఉద్యోగులపై పైఉద్యోగుల అధిపత్య ధోరణి, వివక్ష ఉండటం సహజం.. ఇందుకు పోలీస్ రంగం మినహాయింపు కాదని దర్శకుడు చెప్పిన తీరు బాగుంది. కథకు తగినట్టుగా పాత్రల డిజైన్ బాగుంది.
సినిమా చూసినంత సేపు ఓ భావోద్వేగం, కొత్త అనుభూతిని కలిగిస్తుంది. సినిమా కాస్త స్లోగా సాగినట్టు అనిపిస్తుంది. కానీ కథ డిమాండ్ చేయడం వల్లే అలాంటి స్క్రీన్ ప్లే అనుసరించారనే విషయం ఇక్కడ చెప్పుకోవాల్సిన పాయింట్. నక్సల్స్, పోలీసుల మధ్య ఎన్‌కౌంటర్లు, గ్రామీణ నేటివిటితో వచ్చే సినిమాలు ఇష్టపడే వారు ఈ సినిమా తప్పకుండా నచ్చే అంశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











