'పరమ బోర్ చక్ర' వైజయంతి

చిత్రం: వైజయంతి
నటీనటులు: విజయశాంతి, పృథ్వీరాజ్, అలీ, వడివక్కరసు, సుజాత
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
నిర్మాత: వజ్జా శ్రీనివాస రావు
దర్శకత్వం: కె.ఎస్.నాగేశ్వరరావు
తెలుగు దర్శకుల సామాజిక, రాజకీయ అవగాహన రాహిత్యానికి ఈ చిత్రం దర్పణం. న్యూస్ పేపర్ లలో నిత్యం వచ్చే వార్తలను ఆధారంగా తీసుకొని దానికి ఓ అర్థం పర్థంలేని కథను అల్లి తీసిన చిత్రమే- వైజయంతి. అన్ని యాక్షన్ చిత్రాలకు మూలం- తీవ్రవాదం. అదీ కూడా పాక్ తీవ్రవాదులు దేశంలో సృష్టిస్తోన్న అల్లకల్లోలం యాక్షన్ చిత్రాలకు సరకు. సో...డైరక్టర్ కె.ఎస్.నాగేశ్వరరావు, రచయిత విజయేంద్రప్రసాద్ లు కలిసి తెలుగు ప్రేక్షకులకు వైజయంతి రూపంలో మరో ఇడియాటిక్ చిత్రం అందించారు. ఈ చిత్రంలో నిజమైన హీరో ఎవరంటే ఫైట్ మాస్టర్ సూపర్ సుబ్బరాయన్. ఎందుకంటే ప్రతి పది నిమిషాలకు ఓ ఫైట్ సీన్.
కథ విషయానికి వస్తే......వైజయంతి(విజయశాంతి) తండ్రి ఆర్మీ ఆఫీసర్. పాకిస్తాన్ యుద్దంలో చనిపోతాడు. దాంతో తల్లితో కలిసి విసునూరు అనే గ్రామానికి వస్తుంది. విసునూరు మహారాణి (వడివక్కరసు) చెప్పిందే అక్కడ వేదం. ఆమె మాట ఎదిరించినవారికి అధోగతే. ఆ నేల మీద నూకలు చెల్లినట్టే. విసునూరు మహారాణి అనే ఈ పాత్ర పైశాచికత్వానికి పరాకాష్ట(నిజానికి విసునూరు అనే ఈ గ్రామం వరంగల్ జిల్లాలో ఉంది. రజాకార్ల కాలంలో విసునూరు దేశ్ ముఖ్ అనే జమీందారు ఉండేవాడు. నిజంగా కూడా అతను చాలా క్రూరమైన పనులు చేశాడు. ఎన్నో అకృత్యాలకు పాల్పడ్డాడు. కానీ ఈ కాలంలో కూడా అలాంటి దేశ్ ముఖ్ తరహా మహారాణి ఓ మండలాన్ని పాలిస్తుందనేది రచయిత విజయేంద్రప్రసాద్ అమోఘమైన సామాజిక అవగాహనకు నిదర్శనం).
అలాంటి పైశాచిక రాణిని చిన్నప్పుడే వైజయంతి ఎదురిస్తుంది. అంతే విసునూరు మహారాణి గారికి కోపమొస్తుంది. వీరి కుటుంబాన్ని నాశనం చేసేందుకు పూనుకుంటుంది. కానీ అదృష్టవశాత్తు వీరు ఓ నదిలో (విసునూర్ లో నది అనేది ఉందా?) పడి పోతారు. కుటుంబమంతా చెల్లాచెదురు అవుతుంది.
వైజయంతి పెరిగి పెద్దదై ఆర్మీ ఆఫీసర్ అవుతుంది. ఐఎస్ ఐ తీవ్రవాదులను పట్టుకొని ఎఫీసియంట్ అధికారి అని పేరు తెచ్చుకుంటుంది. ఢిల్లీ నుంచి స్పెషలాఫీసర్ గా హైదరాబాద్ వస్తుంది. చనిపోయారనుకున్న తన అమ్మ, చెల్లెలు, తమ్ముడు బతికి ఉన్నారని తెలుసుకుంటుంది. వారిని కలుసుకునేందుకు ప్రయత్నిస్తుంది. అలాగే ఐఎస్‌ఐ తీవ్రవాదులకు, విసునూరు మహారాణికిసంబంధాలున్నాయని విషయాన్ని కనుగొంటుంది. ఇంకేముంది, తీవ్రవాదులతో సహా మహారాణిని మట్టుపెట్టి ప్రేక్షకులను రక్షిస్తుంది. సినిమా ఖతం.
విజయశాంతి ఈ వయసులోనూ ఫైట్ లు బాగానే చేసింది. పైశాచికమైన, క్రూరమైన పాత్రను వడివక్కరసు సమర్ధంగా పోషించారు. దర్శకుడి పనితీరు గురించి చెప్పుకోవడం శుద్ద దండగ. పాటలు కూడా లేని ఈ చిత్రంలో ప్రేక్షకులకు రిలీఫ్ అనేది ఉండదు-ఫైట్ సీన్ లు చూస్తూ కూర్చోవడం తప్ప.


Click it and Unblock the Notifications











