Vinaro Bhagyamu Vishnu Katha Review ట్విస్టులతో సాగే ఎమోషనల్ డ్రామా.. కిరణ్ అబ్బవరం హిట్టు కొట్టాడా?
నటీనటులు: కిరణ్ అబ్బవరం, కశ్మీరా పరదేశి, మురళీ శర్మ, శుభలేఖ సుధాకర్, పమ్మీ సాయి, దయానంద్ రెడ్డి తదితరులు
రచన, దర్శకత్వం: మురశీ కిషోర్ అబ్బురు
నిర్మాతలు: బన్నీవాసు
సినిమాటోగ్రఫి: డేనియల్ విశ్వాస్
మ్యూజిక్: చైతన్ భరద్వాజ్
ఎడిటింగ్: మార్తాండ్ వెంకటేష్
బ్యానర్: జీఏ2
రిలీజ్ డేట్: 2022-02-18

వినరో భాగ్యం కథ ఏమిటంటే?
బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో తాత (శుభలేఖ సుధాకర్) పెంపకంలో పెరిగిన విష్ణు (కిరణ్ అబ్బవరం) ఎదుటి వారికి చేతనైన సహాయం చేస్తుంటాడు. య్యూట్యూబర్ దర్శన ( కశ్మీరి పరదేశీ) నంబర్ నైబరింగ్ అనే కాన్సెప్ట్‌తో విష్ణుతోపాటు శర్మ (మురళీ శర్మ) పరిచయం పెంచుకొంటుంది. వారి మధ్య పరిచయం ప్రేమగా మారుతుంది. తన యూట్యూబ్‌ను పాపులర్ చేయడానికి లైవ్ మర్డర్‌ను ప్రాంక్‌గా ప్లాన్ చేస్తుంది. ఆ ప్రాంక్ లైవ్ మర్డర్ కారణంగా దర్శన జైలుకు వెళ్తుంది.

విష్ణు కథలో ట్విస్టులు
విష్ణు తల్లిదండ్రులు మరణం వెనుక కారణం ఏమిటి? ఎదుటి వారికి సహాయం చేయడానికి ఎంతవరకైనా వెళ్లే విష్ణు జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకొన్నాయి? ప్రాంక్ లైవ్ మర్డర్ విషయంలో దర్శన జైలుకు ఎందుకు వెళ్లింది? దర్శన జైలుకు వెళ్లడానికి వెనుక అసలు కుట్ర ఏమిటి? దర్శనను జైలుకు పంపించాలని మురళీ శర్మ ఎలా ప్లాన్ వేశాడు? దర్శన నిర్ధోషి అని చెప్పడానికి విష్ణు ఎలాంటి రిస్క్ తీసుకొన్నాడు? చివరకు దర్శనను జైలు నుంచి విడిపించాడా? దేశం కోసం విష్ణు చేసిన ఘనకార్యం ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే వినరో భాగ్యం విష్ణు కథ సినిమా కథ.

ఫస్టాఫ్ ఎలా సాగిందంటే?
విష్ణు తల్లిదండ్రుల మరణంతో విష్ణు కథ చాలా ఎమోషనల్‌గా ప్రారంభమవుతుంది. ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా అనుకొంటుండగానే.. జాతీయ భద్రతా అధికారుల (ఎన్ఐఏ) ఎపిసోడ్‌తో ట్విస్టు మొదలవుతుంది. నంబర్ నైబరింగ్ కాన్సెప్ట్‌ను పరిచయం చేసి.. కథలో జోష్, ఫన్‌ను జనరేట్ చేసి.. ఒక డిఫరెంట్ సినిమాను చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. ఇంటర్వెల్‌లో లైవ్ మర్డర్ ఎపిసోడ్ థ్రిల్లింగ్‌గా ఉండటంతోపాటు సెకండాఫ్‌పై క్యూరియాసిటిని పెంచుతుంది. ఫస్టాఫ్‌లో మురళీ శర్మతో దర్శన రీల్స్ ఫన్ క్రియేట్ చేస్తే.. పమ్మీ సాయి విలనిజం క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది.

సెకండాఫ్ పరిస్థితి ఏమిటంటే?
అయితే ఫస్టాఫ్ ముగింపులో ఇచ్చిన ట్విస్టుతో సెకండాఫ్‌లో ఏముంటుందనే అతృతతో కూర్చున్న వారికి.. బోధనలు, సందేశాలతో కొంత సాగదీసినట్టు అనిపిస్తుంది. నంబర్, వీడియో షేరింగ్ ఐడియా కథకు బలంగా ఉన్నప్పటికీ.. థ్రిల్లింగ్‌గా అనిపించదు. కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు దర్శకుడు కథను డీల్ చేసిన విధానం చూస్తే.. కొత్త దర్శకుడు అని ఏ మాత్రం అనిపించదు. ఎంతో అనుభవం, పరిణితి చెందిన దర్శకుడిగా ప్రతీ సీన్‌ను అల్లుకొంటూ వెళ్లిన విధానం ఆకట్టుకొనేలా ఉంటుంది. అలాగే రెండు మూడు లేయర్లను మిక్స్ చేసిన విధానం దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టింది. ఓవరాల్‌గా మంచి సినిమా చూశామనే అనుభూతి కలుగుతుంది.

కిరణ్ అబ్బవరం ఫెర్ఫార్మెన్స్ గురించి
వరుస పరాజయాలతో సతమతమవుతున్న కిరణ్ అబ్బవరం జాగ్రత్తగానే కథను ఎంచుకోవడంలో తన టేస్ట్‌ను మరోసారి రుచి చూపించాడు. విష్ణు పాత్రలో పలు రకాల షేడ్స్ ఉన్న పాత్రలో ఫర్‌ఫెక్షన్ చూపించాడని చెప్పవచ్చు. గత సినిమాలతో పోల్చి చూస్తే.. కిరణ్ యాక్టింగ్, ఫెర్ఫార్మెన్స్‌లో మెచ్యురిటీ కనిపిస్తుంది. ఇక కశ్మీరా పరదేశీ దర్శన పాత్రలో ఒదిగిపోయింది. యూట్యూబర్ పాత్రతో మెప్పించడమే కాకుండా, ఇంటర్వెల్ సీన్‌లో మంచి ఫెర్ఫార్మెన్స్ ప్రదర్శించింది. గ్లామర్ పరంగా కూడా ఆకట్టుకొన్నది.

పమ్మిసాయి, మురళీ శర్మ, ఇతరుల గురించి
ఇక క్యారెక్టర్ ఆర్టిస్టుల విషయానికి వస్తే.. ఈ కథలో మురళీ శర్మ, శుభలేఖ సుధాకర్, పమ్మీ సాయి మూడు ప్రధాన పాత్రలు కీలకంగా కనిపిస్తాయి. మురళీ వర్మ, శుభలేఖ సుధాకర్ తమ అనుభవంతో పాత్రలను ఎమోషనల్‌గా పండించారు. అయితే పమ్మీ సాయి విషయానికి వస్తే.. చిన్న చితకా పాత్రలతో గెస్ట్ ఆర్టిస్టుగా ముద్ర వేసుకొన్న ఆయన.. ఫుల్ లెంగ్త్ విలనిజంతో ఈ సినిమాకు సర్‌ప్రైజ్ ఎలిమెంట్‌గా మారారు. ఇప్పటి వరకు కమెడియన్‌గా మెప్పించడానికి ప్రయత్నించిన పమ్మీ సాయి.. విభిన్నమైన పాత్ర, విలక్షణమైన నటనతో సినిమాలో పూర్తిస్థాయి విలనిజాన్ని పండించారు. సినిమాలో రెండు విలన్ పాత్రలు ఉన్నప్పటికీ.. ఫుల్ మార్కులు కొట్టేయడమే కాకుండా ఏకాంతం పాత్రతో గుర్తుండిపోతారు. కమెడియన్‌గానే కాకుండా పూర్తిస్థాయి విలన్ పాత్రలకు తానేమీ తక్కువ కాదని ప్రమోషన్ సాధించారని చెప్పవచ్చు. మిగితా పాత్రల్లో నటించిన వారు వారివారి పాత్రలకు న్యాయం చేశారు.

VBVKలో సాంకేతిక విభాగాల పనితీరు
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. తిరుపతి దివ్య క్షేత్రం నేపథ్యంగా సాగే ఈ కథకు డేనియల్ సినిమాటోగ్రఫి స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. తెర మీద తిరుపతిని చాలా పవిత్రంగా, అందంగా కెమెరాలో బంధించారు. ఇక చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ సినిమా మూడ్‌ను మరో రేంజ్‌కు తీసుకెళ్లిందని చెప్పవచ్చు. మిగితా విభాగాల పనితనం చాలా బాగుంది. జీఏ2 ప్రొడక్షన్ విలువలు బాగున్నాయి. నిర్మాతగా బన్నీ వాసు కథను నమ్మిన తీరు సినిమాపై ఆయనకు ఉన్న అభిరుచిని తెలియజెప్పింది.

ఫైనల్‌గా VBVK ఎలా ఉందంటే?
దేశభక్తి, లవ్, ఫ్యామిలీ, క్రైమ్, యాక్షన్, ఫన్ తదితర ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన చిత్రం వినరో భాగ్యం విష్ణు కథ. ఈ సినిమా అందర్నీ మెప్పించిందంటే అందుకు కారణం దర్శకుడు మురళీ కిషోర్ ప్రతిభ మాత్రమే అని చెప్పవచ్చు. కిరణ్ అబ్బవరం ఫెర్ఫార్మెన్స్, మురళీ శర్మ వెర్సటైల్ యాక్టింగ్, పమ్మీ సాయి ఫెర్ఫార్మెన్స్ కొత్తగా అనిపిస్తాయి. ఊహించని మలుపులతో సాగే సినిమా ఆద్యంతం గ్రిప్పింగ్‌గా కొనసాగుతూ మంచి అనుభూతిని పంచుతుంది. వారాంతంలో మంచి ఎమోషన్స్, అన్ని రకాల హంగులు ఉన్న సినిమా చూడాలనుకొనే వారికి ఈ సినిమా కేరాఫ్ అడ్రస్. కమర్షియల్‌గా ఏ రేంజ్ హిట్ అనేది కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది. ఎలాంటి అంచనాలతో వెళ్లినా నిరాశపరచదు.


Click it and Unblock the Notifications











