For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Virata Parvam review.. సాయి పల్లవి మ్యాజిక్.. వేణు ఊడుగుల వండర్‌ఫుల్ టేకింగ్

  |

  Rating:
  3.0/5

  తెలంగాణలో 90వ దశకం ఆరంభంలో నక్సలైట్ ఉద్యమ చరిత్రలో చెరగని మరకలుగా మారిన సంఘటనల్లో తూము సరళ ఘటన భావోద్వేగాలకు గురిచేసింది. అలాంటి ఎమోషనల్ కథను ఆధారంగా చేసుకొని దర్శకుడు వేణు ఊడుగుల రూపొందించిన చిత్రం విరాట పర్వం. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలను సాయిపల్లవి, రానా దగ్గుబాటి, నవీన్ చంద్ర, ప్రియమణి, సాయిచంద్, ఈశ్వరీ రావు, నందితా దాస్ లాంటి వాళ్లు పోషించారు. అయితే అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అలాగే పీపుల్స్ వార్; మావోయిస్ట్ పార్టీల్లో అతిపెద్ద చర్చకు దారి తీసిన సంఘటన వెండి తెర మీద ఎలాంటి అనుభూతిని పంచిందనే విషయం వెళ్లితే..

  విరాట పర్వం కథ ఏమిటంటే?

  విరాట పర్వం కథ ఏమిటంటే?

  రవన్న అలియాస్ అరణ్య (రానా దగ్గుబాటి) రాసిన విప్లవ సాహిత్యానికి వెన్నెల (సాయి పల్లవి) ప్రభావితం కావడమే కాకుండా ఆయనపై ప్రేమను పెంచుకొంటుంది. రవన్నను స్పూర్తిగా తీసుకొని నక్సలైట్ దళంలో చేరాలని ప్రయత్నిస్తుంటుంది. మేన బావ (రాహుల్ రామకృష్ణ)ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఇంట్లో ఎవరికి చెప్పకుండా రవన్న దళాన్ని కలిసేందుకు అడవుల్లోకి వెళ్తుంది.

  కథలో ట్విస్టులు ఇలా..

  కథలో ట్విస్టులు ఇలా..


  తన ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన రవన్నను కలుసుకొనేందుకు వెన్నెల ఎలాంటి కష్టాలు పడింది. రవన్నను కలుసుకొనే క్రమంలో వెన్నెలకు ఎదురైన చేదు అనుభవాలు ఏంటి? వెన్నెల ప్రేమను రవన్న ఆమోదించాడా? ఒకవేళ రవన్న ప్రేమను గెలుచుకొంటే.. ఆమె దళంలో చేరిందా? దళంలో చేరిన తర్వాత వెన్నెలకు ఎదురైన సమస్యలు ఏమిటి? రవన్న, వెన్నెల ప్రేమ కథకు ముగింపు ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే విరాటపర్వం కథ.

  ఫస్టాఫ్ ఎలా ఉందంటే?

  ఫస్టాఫ్ ఎలా ఉందంటే?


  విరాట పర్వం ఫస్టాఫ్ విషయానికి వస్తే.. వెన్నెల పుట్టుకకు సంబంధించి ఓ భారీ యాక్షన్ సీన్‌తో చాలా ఎమోషనల్‌గా సినిమా ప్రారంభమవుతుంది. తొలి భాగంలో భావోద్వేగంగా, సహజంగా ఉండే సీన్లతో కథ ముందుకు వెళ్తుంది. రవన్నను కలిసేందుకు సాయి పల్లవి చేసిన ప్రయత్నాలు ఎమోషనల్‌గా కట్టిపడేస్తాయి. అయితే వెన్నెల పాత్రలో ఇంకాస్త.. పెయిన్ చూపించగలిగితే.. ప్రేక్షకుడి గుండె మరింత భారంగా మారడానికి అవకాశం ఉండేదనిపిస్తుంది. తొలి భాగంగా పాత్రల పరిచయంతోపాటు కథ గ్రిప్పింగ్‌గా సాగుతుంది. సాయి పల్లవి తన నటన కారణంగా ఫస్టాఫ్ ఎమోషనల్‌గా ముగిడయమే కాకుండా సెకండాఫ్‌పై క్యూరియాసిటీ పెంచుతుంది.

  సెకండాఫ్‌లో క్లైమాక్స్..

  సెకండాఫ్‌లో క్లైమాక్స్..

  విరాట పర్వం సెకండాఫ్‌ విషయానికి వస్తే.. కొంత రొటీన్ డ్రామా కారణంగా కాస్త స్లో అయినట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్ కోసం గ్రౌండ్ ప్రిపేర్ చేసేందుకు కొన్ని సీన్లను తప్పనిసరి పరిస్థితుల్లో ఎస్టాబ్లిష్ చేయాల్సి వచ్చిందనే అభిప్రాయం కలుగుతుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు కథను నడిపిన విధానం దర్శకుడు వేణు ఊడుగుల ప్రతిభకు అద్దం పట్టింది. నక్సలైట్ కథను బలంగా చెప్పడానికి అనుసరించిన స్క్రీన్ ప్లే ఆకట్టుకోవడం వల్ల విరాటపర్వం ఫీల్‌గుడ్‌ నోట్‌తో ముగుస్తుంది.

  వేణు ఊడుగుల కథ, కథనాలు హైలెట్

  వేణు ఊడుగుల కథ, కథనాలు హైలెట్


  తూము సరళ జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా కథను దర్శకుడు వేణు ఊడుగుల అల్లుకొన్న విధానమే సినిమాకు సక్సెస్‌గా మారిందని చెప్పవచ్చు. సన్నివేశాలకు అనుగుణంగా రాసుకొన్న డైలాగ్స్.. తెలంగాణ ప్రాంతంలోని ఆచారాలు, సంప్రదాయాలు, భాషను అత్యంత సహజసిద్దంగా, సున్నితమైన విధానంలో తెరపైకి తీసుకు రావడంలో సఫలమయ్యారు. అత్యంత వివాదాస్పద అంశాలను కూడా మెప్పించే విధంగా కథను రాసుకోవడం మరింత పాజిటివ్‌గా మారింది. చివరి 20 నిమిషాల్లో వేణు నడిపిన డ్రామానే విరాట పర్వం సినిమాకు హైలెట్ అని చెప్పవచ్చు.

  సాయి పల్లవి ఫెర్ఫార్మెన్స్ పీక్స్

  సాయి పల్లవి ఫెర్ఫార్మెన్స్ పీక్స్


  ఇక వెన్నెల పాత్ర తప్ప మరో పాత్రను తన దారిదాపులకు రానివ్వనంతగా సాయి పల్లవి వన్ ఉమెన్ షోగా తన ఫెర్మార్మెన్స్‌ను పండించింది. వెన్నెల పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిందా అనే ఫీలింగ్‌ను కల్పిస్తుంది. తల్లిదండ్రులతో సీన్లు గానీ.. పౌర హక్కుల సంఘం ఇంటిలో జరిగిన సంభాషణ తర్వాత సాయిపల్లవి ఫైర్ బ్రాండ్‌గా కనిపిస్తుంది. సెకండాఫ్‌లో రానా తన తల్లిని కలిసిన సన్నివేశం గుండెను పిండేసేలా ఉంటుంది. దాదాపు 25 నిమిషాలపాటు సాయిపల్లవి తన నటనతో మ్యాజిక్ చేసిందనే చెప్పాలి. సాయి పల్లవి తప్ప వెన్నెల పాత్ర మరొకరు చేయడం కష్టమనే అభిప్రాయాన్ని చేయడంలో సక్సెస్ అయ్యారు.

  రవన్నగా రానా ఎలా చేశాడంటే..

  రవన్నగా రానా ఎలా చేశాడంటే..


  రవన్నగా రానా దగ్గుబాటి పాత్ర పెద్దగా ప్రభావితం చేయలేకపోయిందనే చెప్పాలి. ఒకవైపు సాయి పల్లవి ఓ రేంజ్‌లో దూసుకెళ్తుంటే.. పక్కన ఉండే పాత్రలు మరుగుజ్జులుగా మారాయా అనిపిస్తుంది. రానా గెటప్ గానీ.. తన ఆహార్యం, బాడీ లాంగ్వేజ్ గానీ అంతగా ఆకట్టుకొలేకపోయాయని చెప్పవచ్చు. గతంలో రానాలో ఉండే ఫైర్ రవన్న పాత్రలో ఎక్కడా కనిపించలేదని చెప్పవచ్చు.

  ప్రియమణి, నవీన్ చంద్ర, ఇతరుల గురించి

  ప్రియమణి, నవీన్ చంద్ర, ఇతరుల గురించి


  విరాట పర్వం సినిమాలో మిగితా పాత్రల్లో పాత్రల నిడివి చిన్నవైనప్పటికీ.. ఈశ్వరీ రావు, సాయి చంద్, రాహుల్ రామకృష్ణ, ఆనంద చక్రపాణి పాత్రలు గుర్తుండి పోతారు. రానా తల్లిగా నటించిన జరీనా వాహెబ్ రెండు మూడు సీన్లలో కనిపించినా.. ఆ పాత్ర ప్రేక్షకుడిని ఉద్వేగానికి గురిచేసేలా ఉంటుంది. సినిమా అంతా చూస్తే.. నవీన్ చంద్ర, ప్రియమణి పాత్రలు ఎందుకున్నాయా అనే అనుమానం కలుగుతుంది. కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సన్నివేశం వరకు నవీన్ చంద్ర, ప్రియమణి సినిమాకు, కథకు అత్యంత బలంగా కనిపిస్తారు. వీరిద్దరి కారణంగానే క్లైమాక్స్ అద్బుతంగా పండటానికి అవకాశం ఏర్పడింది.

  టెక్నికల్‌ విభాగాల పనితీరు..

  టెక్నికల్‌ విభాగాల పనితీరు..


  ఇక సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. డానీ సాంచెజ్ లోపెజ్, దివాకర్ మణి ద్వయం అందించిన సినిమాటోగ్రఫి సినిమాను మంచి క్యాన్వాస్‌గా మార్చింది. లైటింగ్, కలర్ ప్యాటర్న్ సినిమాకు కావాల్సిన మూడ్‌ను క్రియేట్ చేశాయి. ఇక సురేష్ బొబ్బిలి ఈ సినిమా ముందు వరకు అండర్ డాగ్.. ఈ సినిమాలోని బీజీఎంతో మంచి సంగీత దర్శకుడు అనే బ్రాండ్‌ను క్రియేట్ చేసుకొన్నాడని చెప్పవచ్చు. రీరికార్డింగ్‌ను పక్కన పెడితే.. తెర మీద పాటలు అంతగా ఆకట్టుకొన్నట్టు కనిపించలేదని చెప్పవచ్చు. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. డైలాగ్స్ కొన్ని చోట్ల భావోద్వేగానికి గురిచేస్తాయి. మరికొన్ని చోట్ల ఆలోచింప చేస్తాయి. నిర్మాతలు రాజీ పడకుండా అద్బుతమైన క్వాలిటీతో కూడిన సినిమాను అందించడంలో సఫలమయ్యారని చెప్పవచ్చు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

  ఫైనల్‌గా

  ఫైనల్‌గా


  సిల్వర్ స్క్రీన్ మీద మరోసారి సాయిపల్లవి యాక్టింగ్ మ్యాజిక్‌తోపాటు వేణు ఊడుగుల ప్రతిభకు విరాట పర్వం ఓ నిలువుటద్దం. ప్రతీ ఫ్రేమ్‌ను వేణు అద్బుతంగా రాసుకొంటే.. అంతకంటే అద్భుతంగా సాయిపల్లవి సన్నివేశాలను ఎలివేట్ చేసింది. బలమైన కథ, కథనాలు, నటీనటులు ఫెర్ఫార్మెన్స్ ఈ సినిమాను ఫీల్‌గుడ్‌గా మార్చారు. ప్రేమే దైవం అనే విధంగానే విరాట పర్వం తెరకెక్కించబడింది. అశ్లీలత, అసభ్యత, వివాదాలకు తావు లేకుండా రూపొందిన ఈ సినిమాను థియేటర్‌కు వెళ్లి చూస్తే గొప్ప అనుభూతి, ఆర్ధతతో, భారమైన హృధయంతో బయటకు వచ్చే పరిస్థితి మాత్రం కచ్చితంగా ఉంటుంది. ఎలాంటి ఆలోచనలు, అంచనాలు లేకుండా థియేటర్‌కు వెళ్తే.. పక్కా పైసా వసూల్ సినిమా..

  విరాటపర్వంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు

  విరాటపర్వంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు


  నటీనటులు: సాయిపల్లవి, రానా దగ్గుబాటి, ప్రియమణి, నందితాదాస్, నవీన్ చంద్ర, జరీనా వాహెబ్, ఈశ్వరి రావు, సాయిచంద్, నివేదా పేతురాజ్
  రచన, దర్శకత్వం: వేణు ఊడుగుల
  నిర్మాత: సుధాకర్ చెరుకూరి, డీ సురేష్ బాబు
  సినిమాటోగ్రఫి: డానీ సాంచెజ్ లోపెజ్, దివాకర్ మణి
  ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
  మ్యూజిక్: సురేష్ బొబ్బిలి
  బ్యానర్: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్
  రిలీజ్ డేట్: 2022-06-17

  English summary
  Sai Pallavi and Rana Daggubati's Virata Parvam movie hits the theatres on June 17th. Here is the exclusive review from Filmibeat.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X