Vishnu Vinyasam Movie Review: విష్ణు విన్యాసం మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: హీరో శ్రీవిష్ణు, హీరోయిన్ నయన్, కమెడియన్ సత్య, మురళీశర్మ, బ్రహ్మజీ, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ తదితరులు
దర్శకత్వం: యదునాథ్ మారుతీ రావు
నిర్మాత: సుమంత్ నాయుడు
మ్యూజిక్: రధన్
సినిమాటోగ్రాఫర్: సాయి శ్రీరామ్
ఎడిటర్: కార్తీకేయన్ రోహిణి
ఆర్ట్ డైరెక్టర్: ఏ రామాంజనేయులు
బ్యానర్: శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్
రిలీజ్ డేట్: 2026-02-27
ఒంగోలులోని ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసే విష్ణు (శ్రీ విష్ణు)కు న్యూమరాలజీ, జాతకాలంటే పిచ్చి. జ్యోతిష్కులను పూర్తిగా నమ్మడం, వారు చెప్పే జాతకాల కారణంగా 30 ఏళ్లు వచ్చినా వివాహం జరగకపోవడంతో ఆందోళనగా ఉంటాడు. ఆ పరిస్థితుల్లో సంపన్న కుటుంబానికి చెందిన మనీషా (నయన్ సారిక)తో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్తుంది. అయితే మనీషాను పెళ్లి చేసుకొంటే తన ప్రాణాలకు ముప్పు అని విష్ణుకు తెలుస్తుంది.
జాతకాల పిచ్చి, న్యూమరాలజీ విష్ణు జీవితంతో ఎలా ఆడుకొన్నాయి? విష్ణును జ్యోతిష్కుడు (శ్రీనివాసరెడ్డి) ఎలా తప్పు దారి పట్టించాడు? పెళ్లి కోసం ఎలాంటి తంటాలు పడ్డాడు? మనీషా జీవితంలోకి వచ్చిన తర్వాత విష్ణు పరిస్థితి ఎలా మారింది? మనీషా విచిత్ర ప్రవర్తన విష్ణును ఎలా కంగారు పెట్టించింది? మనీషాకు ఉన్న జాతక దోషం ఏమిటి? మనీషా జాతక దోషం వల్ల విష్ణుకు ఎలాంటి ముప్పు ఏర్పడుతుంది? చివరకు విష్ణు, మనీషా ప్రేమ కథకు ఎలాంటి ముగింపు లభించింది అనేది విష్ణు విన్యాసం సినిమా కథ.

జాతకాల పిచ్చి, మూఢ నమ్మకాల కథా నేపథ్యంగా గతంలో సినిమాలు వచ్చి మంచి విజయాలు అందుకొన్నాయి. ఇలాంటి సబ్జెక్ట్‌లు సినిమాకు ఎప్పుడూ ఎవర్ గ్రీన్ ముడిసరకే. అలాంటి కథతో వచ్చిన విష్ణు విన్యాసం సినిమా కథలో కూడా వినోదానికి బోలెడంత స్కోప్ ఉన్న స్టోరీలైన్ అనిపిస్తుంది. కాకపోతే బలమైన కామెడీ సీన్లు, ఎమోషనల్ ఎలిమెంట్స్ సరిగా పండకపోవడంతో బలమైన పాయింట్ కూడా తేలిపోయిందనిపిస్తుంది. అయితే పేలవమైన సన్నివేశాలతో సాగే సినిమాను కూడా శ్రీ విష్ణు తనదైన శైలిలో కామెడీని పండిస్తూ సినిమాను నిలబడే ప్రయత్నం చేశాడు. కానీ అంతగా వర్కవుట్ కాకపోవడం ఈ సినిమాకు మైనస్. దర్శకుడు మారుతీరావు ఎంచుకొన్న సబ్జెక్ట్ బాగానే ఉంది కానీ దానిని రైట్ ట్రాక్‌లో పెట్టకపోవడమే ఈ సినిమా భారీ విజయానికి అడ్డుకట్టగా మారిందని చెప్పాలి.
ఇక విష్ణు పాత్రలో శ్రీ విష్ణు ఒదిగిపోయాడు. చాలా సన్నివేశాల్లో తన హావభావాలు, డైలాగ్ డెలివరీ చాలా క్రేజీగా ఉందనిపిస్తుంది. రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా చాలా ఈజ్‌తో కనిపించాడు. నయన్ సారికతో కలిసి మంచి కెమిస్ట్రీని పండించాడు. శ్రీవిష్ణుకు జోడిగా నయన్ సారిక కూడా అదే జోష్‌ను చూపించింది. గ్లామర్ పరంగానే కాకుండా నటన పరంగా కూడా మంచి మార్కులు కొట్టేసింది. మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస్ రెడ్డి పాత్రలు కథలో కీలకంగా కనిపిస్తాయి. ఇక సత్య కామెడీ ఈ సినిమాలో పెద్దగా వర్కవుట్ కాకపోవడం షాకింగ్'గానే అనిపిస్తుంది. నాసిరకమైన సీన్ల కారణంగా సత్య కామెడీ బ్రహ్మండంగా పేలలేదని ఫీలింగ్ కలుగుతుంది.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి, మ్యూజిక్ ఈ సినిమాకు బలంగా కనిపిస్తాయి. సాయి శ్రీరామ్ సన్నివేశాలను చాలా రిచ్‌గా చూపించారు. ఒంగోలు సిటీ వాతావరణాన్ని, ప్రీ క్లైమాక్స్‌లో యాక్షన్ ఎపిసోడ్‌ను బాగా షూట్ చేశాడనిపిస్తుంది. రధన్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఎడిటర్, ఆర్ట్ విభాగాలు పర్వాలేదనిపిస్తాయి. సుమంత్ నాయుడు అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. కానీ కథ, కథనాలపై కాస్త దృష్టి పెట్టి ఉంటే మంచి కామెడీ సినిమా అయి ఉండేది.


Click it and Unblock the Notifications











