ఘన విజయేంద్ర వర్మ

చిత్రం: విజయేంద్ర వర్మ
క్యాప్షన్: పవర్ ఆఫ్ యాన్ ఇండియన్
నటీనటులు: బాలకృష్ణ, లయ, అంకిత, సంగీత, ముఖేష్ రుషి,
ఆశిశ్ విద్యార్ధి, బ్రహ్మానందం, సుధాకర్, చలపతిరావు, శోభారాజ్,
ఎమ్మెస్ నారాయణ, సూర్య మోహన్‌రాజ్, మనోరమ, రాజ్యలక్ష్మి,
భూపేంద్ర సింగ్, ఆహుతి ప్రసాద్ తదితరులు
కథ: విజయేంద్ర ప్రసాద్
రచన: రత్నం
పాటలు: వేటూరి, సిరివెన్నెల, భువనచంద్ర, సుద్దాల అశోక్‌తేజ
సంగీతం: కోటి
కెమెరా: విఎస్‌ఆర్ స్వామి, పివివి జగన్మోహనరావు
కళ: రాజు
స్క్రీన్‌ప్లే: విజయేంద్ర ప్రసాద్, రత్నం, సాయి విద్యార్ధి
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాత: కొండా కృష్ణంరాజు
దర్శకత్వం: స్వర్ణ సుబ్బారావు
ఎట్టకేలకు బాలకృష్ణ బాక్సాఫీసును ఆదుకున్నాడు. ముప్పై నెలలపాటు నిర్మాణ కార్యక్రమాలు జరిగిన 'విజయేంద్ర వర్మ' సినిమా కృషికి తగిన ఫలితాన్ని ఇవ్వబోతోంది. హిట్ కోసం ఎదురు చూస్తున్న తెలుగు సినిమా పరిశ్రమ హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. బి.గోపాల్ శిష్యుడు, సీనియర్ కో-డైరెక్టర్ స్వర్ణ సుబ్బారావు బాలకృష్ణ, ముగ్గురు హీరోయిన్లతో తీసిన ఈ భారీ చిత్రం అంచనాలకు తగ్గట్టే ఉంది. సినిమాలో అన్నీ సమపాళ్ళలో పడడంతో ఈ సినిమా ప్రేక్షకులకు కనువిందు చేస్తుంది. ఈ విజయానికి ప్రధాన కారణం పకడ్బందీ స్క్రీన్‌ప్లే. ఈ సినిమా విజయం సాధించడం ఖాయం.
కథ: విజయేంద్ర వర్మ (బాలకృష్ణ) భారత సైన్యంలో కర్నల్ స్ధాయి అధికారి. పాకిస్ధాన్ తీవ్రవాది అస్లాం ఖాన్ (ముఖేష్ రుషి) ముస్లిం యువకులను జీహాదీలుగా మార్చుతుంటాడు. దేశాన్ని తీవ్రవాదుల నుంచి రక్షించే ప్రయత్నంలో బాలకృష్ణ అతని ప్రయత్నాలను తిప్పికొడుతుంటాడు. ఎంతో సాహసంతో పోరాడి తలకు దెబ్బ తగిలి ఒక గిరిజన గూడెం చేరుకుని అక్కడ మెమెరీ కోల్పోతాడు. గతమంతా మర్చిపోయి 'లయ'ను పెళ్ళాడి కొత్త జీవితం ప్రారంభిస్తాడు. వారికో పాప పుడుతుంది. ఏడు సంవత్సరాలు గడిచిన తర్వాత.... బాలకృష్ణకు తన గతమేమిటో తెలుసుకోవాలన్పిస్తుంది. హైదరాబాద్ చేరుకుంటాడు. ఆయనను నగరంలో చాలామంది గుర్తు పడతారు. వారి సాయంతో తానెవరో తెలుసుకుని, ప్రమాదంలో పడనున్న దేశ రక్షణ వ్యవస్ధను తీవ్రవాదుల బారి నుండి రక్షిస్తాడు. ఆ క్రమంలో కథ మంచి గ్రిప్‌తో నడుస్తుంది.
మాస్‌కి నచ్చే మాటలు, పాటలతో ముస్తాబైన ఈ చిత్రం స్క్రీన్ ప్లే చక్కగా ఉండి ప్రేక్షకుడికి కథలోని ఒక్కోక్లూ అందిస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. అంకిత ఎపిసోడ్ తూర్పు గోదావరి జిల్లా యాసతో అద్భుతంగా పండింది. సంగీత, సుధాకర్‌లు కొంత సేపు కన్పించినా ప్రేక్షకులను బాగా నవ్వించారు. బ్రహ్మానందం- లక్ష్మీపతి- వేణుమాధవ్‌ల త్రయం మరో ట్రాక్‌లో హాస్యాన్ని బాగా పండించారు. బిగిసడలని కథనం, ఆర్మీ అధికారిగా బాలకృష్ణ ఆవేశ పూరిత హావభావాలు సినిమాను విజయబాటలో నడిపించాయి. 'లయ' విన్యాసం గ్లామర్ పరంగా సాగింది. సినిమా ఫస్టాఫ్ అద్భుతంగా ఉండి ప్రేక్షకుడికి మంచి ఉత్కంఠ కలిగిస్తుంది. సెకండాఫ్ ఫ్లాష్ బ్యాక్ అంతా ఆర్మీ అధికారిగా విజయేంద్ర వర్మ విన్యాసాలు ఉంటాయి. క్లెయిమాక్స్‌లో పెట్టిన దేశభక్తి గీతం ప్రేక్షకులను కదిలిస్తుంది. ఎన్టీఆర్ 'పుణ్యభూమి నా దేశం' పాటను తలపించింది. ఈ పాటలో బాలకృష్ణ భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు గెటప్‌లలో కన్పించడంతో ప్రేక్షకుల కరతాళ ధ్వనులు విన్పిస్తాయి. ఆశిశ్ విద్యార్ధి, ముఖేష్ రుషిలు తమ పాత్రలకు నూరు శాతం న్యాయం చేశారు.
హాలీవుడ్ సినిమా 'బార్న్ ఐడెంటిటీ' ఈ సినిమాకు మూలకథ. అయినా భారతీయ వాతావరణంలోకి మార్చడంలో రచయిత అభినందనీయుడు. అనాధ అయిన బాలకృష్ణ ముస్లింల ఇంట్లో పెరుగుతాడు. అయితే అతనికి విజయేంద్ర వర్మ పేరు ఎలా వచ్చిందని కొందరు ప్రశ్నించవచ్చు. లయ గిరిజన ప్రాంతం నుంచి హైదరాబాద్ వచ్చిన సన్నివేశం కృతకంగా సినిమా మాయలా కన్పిస్తుంది. 'మనోరమ'ను ముస్లిం తల్లిలా చూపడం మిస్ కాస్టింగ్. ఆ పాత్రకు మరో నటిని తీసుకుంటే బాగుండేది. భారీ వ్యయంతో రూపొందించిన గ్రాఫిక్స్ సినిమాకు అతకలేదు. దేశభక్తిని హైలైట్ చేస్తూ సాగిన జెండా సన్నివేశాలు బాగున్నాయి. రత్నం మాటలు పరుచూరి బ్రదర్స్ స్టైల్‌ను అనుకరించాయి. ఇన్నాళ్ళు 'రెడ్డి' టైటిళ్ళతో నడిచిన తెలుగు యాక్షన్ చిత్రాల ట్రెండ్‌కు 'వర్మ' టైటిల్ ఒక రిలీఫ్. చిత్ర పరిశ్రమలోకి ఫ్రెష్ డైరెక్టరుగా కాకుండా సీనియారిటీతో దర్శకుడైన స్వర్ణ సుబ్బారావులో క్రియేటివిటీ పెద్దగా కన్పించకపోయినా అనుభవంతో అన్ని శాఖలను సమర్ధంగా ఉపయోగించుకోవడంతో సినిమాలో నవరసాలు పండాయి. ఈ సినిమా హిట్ అవుతుందనడంలో సందేహం లేదు.


Click it and Unblock the Notifications











