Yakshini OTT Review: యక్షిణి వెబ్ సిరీస్ రివ్యూ అండ్ రేటింగ్.. వేదిక, మంచు లక్ష్మీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే?
Rating: 2.75/5
నటీనటులు: మంచు లక్ష్మీ, వేదిక, అజయ్, రాహుల్ విజయ్, దయానంద్ రెడ్డి, జెమినీ సురేస్, ప్రణిత, సత్యశ్రీ, తేజ కాకుమాని, తెనాలి శకుంతల తదితరులు
దర్శకత్వం: తేజా మార్ని
రచన: రామ్ వంశీ కృష్ణ
నిర్మాత: శోభు యార్లగడ్డ
సినిమాటోగ్రఫి: జగదీష్ చీకటి
మ్యూజిక్: ప్రియదర్శన్ బాలసుబ్రమణ్యం
ఎడిటర్: కార్తీకేయ రోహిణి
ఓటీటీ రిలీజ్: డిస్నీ హాట్ స్టార్
ఓటీటీ రిలీజ్ డేట్: 2024-06-14
మాయ( వేదిక) యక్ష లోకానికి చెందిన ఒక స్త్రీ. ఆమె భూమి మీద ఉన్న ఒక ఆలయంలో ఉన్న నిధులకు కాపలా కాస్తూ ఉంటుంది. అయితే నాగలోకానికి చెందిన మహాకాళ్ (అజయ్) ఆమెను ప్రేమ పేరుతో వంచించడంతో యక్ష లోకం.. మాయకు శాపం పెడుతుంది. తిరిగి యక్ష లోకం రావాలంటే.. 100 మంది బ్రహ్మచారులను కామించి, మోహించిన తరువాత వారిని చంపి శాప విమోచనం పొందాలి. అది కూడా 100 వ మగాడు.. కచ్చితంగా శుద్ధబ్రహ్మణుడు, బ్రహ్మచారై ఉండాలని, అంతేకాకుండా చావడానికి సిద్ధంగా ఉండాలని కండీషన్ పెడతారు.

ఇక అప్పటికే 99 మందిని చంపిన మాయ .. 100 వ మగవాడు అయిన శుద్ధబ్రహ్మణుడు కృష్ణ(రాహుల్ విజయ్) దగ్గరకు చేరుతోంది. తల్లికి ఇచ్చిన మాట కోసం కృష్ణ.. మాయను పెళ్లాడితే తప్ప ముట్టుకోను చెప్పడంతో.. చివరికి మానవుడుతో యక్షిణి పెళ్ళికి సిద్ధపడుతుంది. ప్రకృతికి విరుద్ధంగా జరిగిన వీరి పెళ్లి తరువాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.
మహాకాళ్ ఎందుకు మాయను వశం చేసుకోవాలని చూస్తున్నాడు? మధ్య జ్వాలాముఖి( మంచు లక్ష్మీ)ఎవరు? చివరికి మాయ.. యక్ష లోకానికి వెళ్లిందా? ఎంతగానో ప్రేమించిన మాయ .. యక్షిణి అని తెలుసుకున్న కృష్ణ ఏంచేసాడు? యక్షిణి లోకంలో ఏం జరిగింది? అక్కడ వారు చేసే పనులేంటి? యక్షిణి లోకానికి, నాగ లోకానికి మధ్య ఉన్న వైరం ఏమిటి? ఈ వైరంలో ఒక సామాన్యుడు ఎలా బలయ్యాడు? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.
నిజం చెప్పాలంటే యక్షిణి కథలు బయట చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. కానీ, ఈ సిరీస్ లో మాత్రం యావరేజ్ గా చూపించారు. పోనీ, వీఎఫ్ఎక్స్, విజువల్స్ అయినా ఆసక్తికరంగా ఉంటాయా? అంటే అవి కూడా సోసోగానే అనిపిస్తాయి. యక్షిణి లు అంటే అందాన్నికి ప్రతి రూపాలు.. వేదికను యక్షిణిగా చూపించి అదొక్కటి మాత్రం న్యాయం చేశారు. ఆమె తన అందంతో మంత్రముగ్దులనుచేసింది. కానీ, కథలో అంత పట్టు లేకపోవడంతో ఆమె కూడా తేలిపోయినట్లు కనిపిస్తుంది. యక్ష లోకం, నాగ లోకం ను గ్రాఫిక్స్ లో ఎంతో అందంగా చూపించొచ్చు.. అది చేయలేకపోయారు. అసలు కాన్సెప్ట్ ఏంటన్నది సరిగ్గా బిల్డ్ చేయలేకపోయారు అనేది చూసిన ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది.

మహాకాళ్‌గా అజయ్‌ను సరిగ్గా వాడలేకపోయారు. నాగలోక మాంత్రికుడు ఎంత క్రూరంగా ఉంటాడో దాన్నిచూపించలేదు. అప్పట్లో దేవి సినిమాలో విలన్‌ను చూస్తే ఇప్పటికీ వెన్నులో వణుకు పుడుతుంది. కనీసం.. ఇప్పుడు అందులో 1 శాతం కూడా డైరెక్టర్ చూపించలేదు. మాయ , మహాకాళ్ ప్రేమ కథను కట్టే కొట్టే తెచ్చే అన్నట్లు చూపించారు. ఒక చిన్న స్పర్శకే మాయ ప్రేమలో పడిందా.. ? అనేది కన్విన్స్ గా అనిపించలేదు.
సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ఈ వెబ్ సిరీస్‌కు మ్యూజిక్, సినిమాటోగ్రఫి, వీఎఫ్ఎక్స్ ప్లస్ పాయింట్స్. సన్నివేశాలను జగదీష్ చీకటి మంచి ఫీల్ ఉండేలా చిత్రీకరించారు. యక్ష లోకం సెటప్ అంతా బాగుంది. ప్రియదర్శన్ బాలసుబ్రమణ్యం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను ఎలివేట్ చేసింది. కార్తీకేయ రోహిణి ఎడిటర్‌గా తన వంతు సహకారాన్ని అందిచారు. బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
కొంచెం ప్రేక్షకులను రిలీఫ్ చేసింది ఏదైనా ఉంది అంటే అది రాహుల్ విజయ్ మాత్రమే. అతడి క్యారెక్టర్.. వాళ్ళ కుటుంబం, ఫ్రెండ్స్ కామెడీతో అదరగొట్టారు. పెళ్లి కోసం అతడు పడే తపన.. యక్షిణి అని తెలియకుండా మాయతో ముద్దులు.. తన నటన సిరీస్ కు ప్లస్ అని చెప్పాలి. ఆరు ఎపిసోడ్స్ ఏమంత థ్రిల్లింగ్‌గా అనిపించవు కానీ, అక్కడక్కడ కామెడీ పండింది. క్లైమాక్స్ కూడా అంతా చిటికెలో అయిపోయినట్లు అనిపిస్తుంది. టోటల్ గా యక్షిణి ఒక సాధారణమైన సిరీస్ ఫీల్ ఇస్తుంది కానీ, సోషియో ఫాంటసీ కథ చూస్తున్న ఫీల్ రాదు. వేరే లోకానికి తీసుకెళ్లడం పక్కన పెడితే ఉన్న లోకంలోనే ఏంట్రా బాబు ఇది అని అనిపిస్తుంది . వీకెండ్ లో చూడాలి అనిపిస్తే ఒకసారి చూడొచ్చు.


Click it and Unblock the Notifications











