twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిరాశ మిగిల్చే 'యువరాజు'

    By Staff
    |

    Yuvaraju
    -సౌమిత్‌
    నటీనటులు: మహేష్‌ బాబు, సాక్షి శివానంద్‌, సిమ్రాన్‌
    సంగీతం: రమణ గోగుల‌
    దర్శకత్వం: వై.వి.ఎన్‌. చౌదరి‌
    నిర్మాత: బూరుగుపల్లి శివరామకృష్ణ‌

    కధకు, టైటిల్‌ కు సంబంధం లేని చిత్రాలు గతంలో అనేకం వచ్చాయి. అదే కోవకు చెందిన చిత్రంగా యువరాజును చెప్పుకోవచ్చు. గతంలో కనీసం సినిమా క్లైమాక్స్‌ లో అయినా సినిమా టైటిల్‌ ను ఏదో ఒక క్యారెక్టర్‌ చేత అనిపించి అయినా న్యాయం చేసేందుకు ప్రయత్నించే వారు. మహేష్‌ బాబు కథా నాయకుడుగా, వైవిఎన్‌ చౌదరి దర్శకత్వంలో రూపొంది ఈ నెల 14న విడుదలైన యువరాజు చిత్రంలో ఆ ప్రయత్నం కూడా లేదు. కృష్ణ కుమారునిగానే కాకుండా బాలనటుడిగా, రాజకుమారుడు చిత్ర హీరోగో మహేష్‌ సంపాదించుకున్న ఇమేజ్‌ కు ఈ చిత్రం కధ ఏ మాత్రం సరితూగదు.

    సినిమా చూసిన వారికి ఎవరికైనా 'కుచ్‌ కుచ్‌ హోతా హై', 'జబ్‌ కిసీ సే ప్యార్‌ హోతా హై'చిత్రాల్ని కలిపి పాకం పడుతున్నట్లు తెలిసిపోతుంది. నూనూగు మీసాల కుర్రాడిని ఒక బాబుకి తండ్రిగా చూపించి దర్శకుడు వైవిఎస్‌ చౌదరి పెద్ద తప్పు చేశారని పిస్తుంది. నటుడిగా ఏ పాత్రనైనా చేసి మెప్పించాలనే తపన వున్న మహేష్‌ బాబు ఇమేజ్‌ గాని లేకుంటే ఈ చిత్రం బొక్కబోర్లా పడివుండేది. యువరాజు కనీసం ఏవరేజ్‌ హోదా సంపాదించిందనుకున్నా అది మహేష్‌ బాబు చలవే.

    శ్రీనివాస్‌ (మహేష్‌) అందమైన కుర్రాడు. కాలేజీలో శ్రీ వల్లి ( సాక్షిశివానంద్‌) ను ఇష్టపడతాడు. వారి ప్రేమ పెళ్ళి దాకా వస్తుంది. చిన్నప్పుడే తల్లి దండ్రుల్ని కోల్పోయిన శ్రీవల్లి ఒక అనాధాశ్రమాన్ని నడుపుతూ వుంటుంది. అక్కడకు రెడ్‌ క్రాస్‌ సంస్థ ప్రతినిధిగా వస్తుంది శ్రీలత (సిమ్రాన్‌). శ్రీనివాస్‌ ను శ్రీలతకు పరిచయం చేస్తుంది శ్రీవల్లి. అయితే వారిద్దరికీ గతంలోనే పరిచయం వున్నట్లు చెబుతారు. శ్రీనివాస్‌ యూరప్‌ వెళ్ళడం...అతనికి గైడ్‌ గా శ్రీలత వ్యవహరించడం, ఆమె శ్రీనివాస్‌ ను మూగగా ఆరాధించడం ఫ్లాష్‌ బ్యాక్‌ లో చూపిస్తారు.

    అనాధాశ్రమంలో వున్న శ్రీలత కుమారుడికి, శ్రీనివాస్‌ కు మధ్య అనుబంధం పెరుగుతుంది. తాను శ్రీలతకు నేర్పించిన మౌత్‌ ఆర్గాన్‌ ని శ్రీలత కొడుకు ప్లే చేయడం, అది తన తండ్రి తన తల్లికి నేర్పిందని చెప్పడంతో శ్రీనివాస్‌ నిర్ఘాంత పోతాడు. బాబు తండ్రి ఎవరో చెప్పమని శ్రీలతను నిలదీస్తాడు శ్రీనివాస్‌. బాబు నీ బిడ్డేనని చెబుతుంది శ్రీలత. యూరప్‌ టూర్‌ లో ఆటవికుల మధ్య గడిపిన రోజు వారిచ్చిన ప్రసాదం తిని మత్తులో పడిపోయామని, ఆమత్తులో ఇద్దరం చేరువయ్యామని శ్రీలత చెబుతుంది. ఈ విషయం ఎవరికీ చెప్పనని శ్రీనివాస్‌ చేత ప్రమాణం కూడా చేయించుకుంటుంది. ఈ లోగా శ్రీనివాస్‌, శ్రీవల్లి పెళ్ళి రోజు చేరువ అవుతుండడం, శ్రీనివాస్‌ సంఘర్షణకు లోను కావడం చూసిన శ్రీలత ఫారిన్‌ ప్రయాణం అవుతుంది. బిడ్డను మాత్రం వదలి వెళ్ళుతూ ఎయిర్‌ పోర్టులో ప్రాణత్యాగానికి సిద్ధ పడుతుంది. సమయానికి అక్కడకు వెళ్ళిన శ్రీనివాస్‌ అమెను కాపాడడం..చివరకు వారిద్దరూ ఒకటి కావడం స్థూలంగా కధ.

    సినిమా మొత్తాన్ని మహేష్‌ బాబు తన భుజస్కంధాలపై మోశాడని చెప్పాలి. నటనలో ఈజ్‌, హావభావ ప్రకటన, డ్యాన్స్‌, ఫైట్స్‌ లో రిచ్‌ నెస్‌ చూపాడు. కేవలం రెండో సినిమాలోనే ఇంతటి పరిపక్వత సాధించడం అమోఘం. తనకున్న ఇమేజ్‌ ని, ముఖ్యంగా మాస్‌ ను దృష్టిలో పెట్టుకొని కథలను ఎంపిక చేసుకుంటే మహేష్‌ బాబు అగ్రశ్రేణి నటునిగా ఎదగడం తధ్యం అనిపిస్తుంది. హీరో తరువాత చెప్పుకోవలసింది అజయ్‌ విన్సెంట్‌ పనితనాన్ని. ప్రతి ఫ్రేమ్‌ ను కళ్లకు కట్టినట్లు చూపడంలో ఆయన కృతకృత్యులయ్యారు. సంగీత దర్శకుడు రమణ గోగుల రీరికార్డింగ్‌ పరంగా చూపిన నైపుణ్యాన్ని పాటల్లో చూపించ లేక పోయారు.'ఓ రామచిలకా'వంటి ఒకటి రెండు పాటలు మాత్రం ప్రేక్షకులకు గుర్తుండే విధంగా వున్నాయి.

    ఎం.ఎస్‌. నారాయణ, ఎవిఎస్‌ ల క్యామిడీ ట్రాక్‌ బాగానే వున్నప్పటికీ ఆలి, వేణుమాధవ్‌, ప్రసాద్‌ బాబు, భరణి ట్రాక్‌ మాత్రం సహనాన్ని పరిక్షించేదిగా వుంది. కథానాయికలు సాక్షిశివానంద్‌, సిమ్రాన్‌ లు వారి పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా నిర్మాత ఎక్కడా రాజీ పడలేదనే అంశం సినిమాలోని ప్రతి ఫ్రేములో కనిపిస్తుంది. ఒక ఎక్స్‌ పెక్టేషన్‌ తో వెళ్ళే వారికి మాత్రం ఈ చిత్రం నిరాశనే మిగులుస్తుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X